Tuesday, February 26, 2013

భారీ విజయంతో భారత్ సిరీస్‌లో బోణీ

చెన్నై,ఫిబ్రవరి 26: భారీ విజయంతో భారత్ సిరీస్‌లో బోణీ చేసింది. చిదంబరం స్టేడియంలో మంగళవారం ముగిసిన తొలి టెస్టులో ధోనిసేన 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. 50 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్... 11.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి నెగ్గింది. ఓపెనర్లు విజయ్ (6), సెహ్వాగ్ (23 బంతుల్లో 19; 3 ఫోర్లు) మరోసారి విఫలమయ్యారు. పుజారా (8 నాటౌట్), సచిన్ (10 బంతుల్లో 13 నాటౌట్; 2 సిక్సర్లు) అజేయంగా నిలిచారు. ఆసీస్ బౌలర్లలో ప్యాటిన్సన్, లియోన్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. అంతకుముందు ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 93 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటయింది.  భారత బౌలర్లలో అశ్విన్ ఐదు వికెట్లు సాధించగా... జడేజా మూడు, హర్భజన్ రెండు వికెట్లు తీశారు. సంచలన ఇన్నింగ్స్ ఆడి డబుల్ సెంచరీ చేసిన భారత కెప్టెన్ ధోనికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో టెస్టు శనివారం (మార్చి 2) నుంచి హైదరాబాద్‌లో జరుగుతుంది. 

Monday, February 25, 2013

పీఎస్ఎల్వీ-సీ 20 ప్రయోగం సక్సెస్...

శ్రీహరికోట,ఫిబ్రవరి 25: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ   సోమవారం జరిపిన  పీఎస్ఎల్వీ-సీ 20 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది.  పీఎస్ఎల్వీ-సీ 20 రాకెట్ ద్వారా  భారత్- ఫ్రాన్స్ సమ్యుక్త ఉపగ్రహం సరళ్‌తోపాటు 6 విదేశీ ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశ పెట్టారు. రాకెట్ ప్రయోగాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, గవర్నర్ నరసింహన్, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి షార్ నుంచి వీక్షించారు. సోమవారం సాయంత్రం 5.56 నిముషాలకు జరగల్సిన ప్రయోగం  ఐదు నిముషాలు ఆలస్యంగా అంటే 6.01 గంటలకు  జరిగింది. 44.4 మీటర్ల ఎత్తు కలిగిన పీఎస్ఎల్‌వీ-సీ20 రాకెట్ ప్రయోగ సమయంలో 229.7 టన్నుల బరువుకలిగి ఉంది. పీఎస్ఎల్‌వీ రాకెట్‌లను గతంలో స్ప్రాపాన్ బూస్టర్ల సాయంతో ప్రయోగించేవారు. అయితే  పీఎస్ఎల్‌వీ-సీ20 ని స్ప్రాపాన్ బూస్టర్లు లేకుండానే ప్రయోగించడం విశేషం.  పీఎస్ఎల్‌వీ-సీ20రాకెట్ ప్రయోగానికి 240 కోట్లు ఖర్చు చేశారు.  రాకెట్ తయారీకి రూ. 80 కోట్లు, సరళ్ ఉపగ్రహం తయారీకి రూ. 100 కోట్లు వినియోగించారు. ప్రయోగంలో ఇతర ఖర్చులకు రూ. 60 కోట్లు అయినట్టు సమాచారం. 

Sunday, February 24, 2013

ధోనీ డబుల్ ధమాకా...

 చెన్నై, ఫిబ్రవరి 24:  ఆస్ట్రేలియాతో చెన్నైలో జరుగుతున్న మొదటి టెస్టులో  మహేంద్ర సింగ్ ధోనీ డబుల్‌తో, విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగటంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి  భారత్ ఎనిమిది వికెట్లు కోల్పోయి 515 పరుగులు చేసింది. దీంతో భారత్ కు 135 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.  ధోనీ(206), భువనేశ్వర కుమార్(16) క్రీజ్ లో ఉన్నారు. కోహ్లీతో కలిసి బ్యాటింగ్ ప్రారంభించిన సచిన్ టెండూల్కర్ 81 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లోయిన్ బౌలింగులో అవుటయ్యాడు.  పుజారా44, విజయ్ 10, జడేజా 16, సెహ్వాగ్ 2, అశ్విన్ 3, హర్భజన్ 11 పరుగులకు అవుటయ్యారు. ఆసీస్ బౌలర్లలో పాటిస్సన్ 4, లియాన్ 3 వికెట్లు పడగొట్టారు. హెన్రీక్విస్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. ధోని  ఈ టెస్టు లో వ్యక్తిగత స్కోరు 117 పరుగుల వద్ద 4 వేల పరుగులు పూర్తి చేశాడు. 74వ టెస్టులో అతడు 4 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.

లష్కరే తోయిబా హస్తం...?

హైదరాబాద్, ఫిబ్రవరి 24:  హైదరాబాదు దిల్‌సుఖ్ నగర్ పేలుళ్లు తమ పనేనంటూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, అంబర్‌పేట నియోజకవర్గ శాసనసభ్యుడు కిషన్ రెడ్డికి లష్కరే తోయిబా పేరుతో  లేఖ వచ్చింది. లష్కరే తోయిబా పేరుతో బిజెపి కార్యాలయానికి ఓ బెదిరింపు లేఖ వచ్చిందని, బాంబు పేలుడు తమ పనేనని ఆ లేఖలో పేర్కొన్నట్లుగా ఆయన చెప్పారు. బాంబు పేలుడు తమ పనేనని, తర్వాత తమ టార్గెట్ బేగంబజార్ అని,  అక్కడ కూడా త్వరలో దాడి చేస్తామని లేఖలో హెచ్చరించారని కిషన్ రెడ్డి చెప్పారు. తమకు వచ్చిన లేఖ పైన అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. కాగా,దిల్‌సుఖ్ నగర్ పేలుళ్ల ఘటన నిందితులు కర్నాటకలో తలదాచుకున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.   దీంతో రెండు ఎన్ఐఏ బృందాలు బెంగళూరులో దర్యాఫ్తు కొనసాగిస్తున్నాయి.
దిల్‌సుఖ్ నగర్ చౌరస్తాలో  పేలుడు జరిగిన ప్రాంతంలో  ప్రధాని....

Saturday, February 16, 2013

తెలంగాణపై అధ్యయనానికి రాహుల్ కు మూడు నెలలు కావాలిట...


న్యూఢిల్లీ,ఫిబ్రవరి 16: తెలంగాణ అంశాన్ని లోతుగా అధ్యయనం చేయటానికి, ప్రాధమికంగా ఒక అభిప్రాయానికి రావటానికి మూడు నెలల సమయం కావాలని కాంగ్రెస్ యువనేత, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పేర్కొన్నట్లు సమాచారం. పీసీసీ చీఫ్‌లు, సీఎల్‌పీ నేతలతో రాహుల్  భేటీ సందర్భంగా తెలంగాణ అంశం చర్చకు వచ్చింది. ఈ అంశాన్ని త్వరగా తేల్చాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. కాగా,  పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ నాయకులు కూడా  తెలంగాణ అంశంపై ఆచితూచి అడుగులు వేయాలని రాహుల్‌కు సూచించినట్లు తెలిసింది. దీనిపై నెమ్మదిగా ముందుకు సాగాలని, లేదంటే తమ రాష్ట్రాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశముందని వారు హెచ్చరించినట్లు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ అంశాన్ని లోతుగా అధ్యయనం చేసి, ఒక ప్రాధమిక అభిప్రాయానికి రావటానికి తనకు మూడు నెలల సమయం కావాలని రాహుల్ పేర్కొన్నట్లు సమాచారం.
 

1.25 లక్షల కొత్త వీసాలు...


వాషింగ్టన్,ఫిబ్రవరి 16:  భారత్, చైనాల నుంచి నిపుణులైన యువతను మరింతగా ఆకర్షించడమే లక్ష్యంగా ‘స్టార్టప్ 3.0’ పేరుతో కొత్త ఇమిగ్రేషన్ బిల్లును అమెరికా తెరపైకి తీసుకొస్తోంది. ఏకంగా 1.25 లక్షల పై చిలుకు షరతులతో కూడిన కొత్త వీసాలను జారీ చేసేందుకు వీలు కల్పించే ఈ బిల్లును తాజాగా అమెరికా సెనేట్, కాంగ్రెస్‌లలో ప్రవేశపెట్టారు. 75 వేల మంది వలస వచ్చిన పారిశ్రామికవేత్తలతో పాటు 50 వేల దాకా స్టెమ్ (ఎస్‌టీఈఎం- సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) పట్టభద్రులకు ఈ వీసాలను జారీ చేయాలని ప్రతిపాదించారు. స్టెమ్ రంగాల్లో ప్రపంచంలోని అత్యుత్తమ ప్రతిభావంతులైన భారత్, చైనా తదితర దేశాల విద్యార్థులు అమెరికాలో విద్యాభ్యాసం, శిక్షణ అనంతరం స్వదేశాలకు వెళ్లి వ్యాపార సంస్థలను నిర్మించి అమెరికాకే పోటీగా మారే ధోరణికి ఈ బిల్లుతో అడ్డుకట్ట పడుతుందని కాంగ్రెస్ సభ్యుడు మైకేల్ జి.గ్రిమ్ అభిప్రాయపడ్డారు. అందులో ప్రతిపాదించిన పలు ఆకర్షణీయమైన ప్రోత్సాహకాల నేపథ్యంలో వారంతా అమెరికాలోనే వ్యాపార సంస్థలు స్థాపించేందుకు మొగ్గు చూపుతారని, వాటిలో స్థానికులకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. ఇలా దేశీయంగా కనీసం 5 లక్షల కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని అమెరికా భావిస్తోంది.  

Monday, February 11, 2013

తెలంగాణాపై చర్చలు 'సాగా'ల్సిందే...షిండే

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11:  తెలంగాణపై సంప్రదింపులు అవసరమని, వాటిని తాము కొనసాగిస్తున్నామని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే సోమవారం చెప్పారు. ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ,  తెలంగాణపై చర్చలకు ఎలాంటి తుది గడువు లేదని  తేల్చి చెప్పారు. తెలంగాణపై ఇప్పుడప్పుడే నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదన్నారు. తెలంగాణపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని తమకూ  ఉందని,  కానీ, ఈ అంశం ఇంకా ముగిసిపోలేదని అన్నారు. అఫ్జల్ ఉరి గురించి  అతని కుటుంబానికి  ముందే సమాచారమందించామని,   సమాచారం అందలేదని ఆయన కుటుంబ సభ్యులు చెప్పడం సరికాదని షిండే అన్నారు. జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా వ్యాఖ్యలను షిండే ఖండించారు.  అఫ్జల్ ఉరి విషయాన్ని తానే స్వయంగా ఈ నెల 8వ తేదిన ఓమర్‌కు చెప్పానని షిండే చెప్పారు.  రాజీవ్, పంజాబ్ మాజీ సిఎంల కేసులు సుప్రీం కోర్టులో ఉన్నాయని చెప్పారు. అలాంటప్పుడు ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుంటుందని అభిప్రాయపడ్డారు. అఫ్జల్ గురు, అజ్మల్ కసబ్‌ల ఉరి రాజకీయపరమైన నిర్ణయాలు కావన్నారు. చట్టం సూచనల మేరకు, నిబంధనల ప్రకారమే ఉరి అమలు  జరిగిందన్నారు. 

బిఎస్ ఎన్ ఎల్ వీడియో టెలీఫోన్


హైదరాబాద్, ఫిబ్రవరి 11:  దక్షిణ భారతదేశంలో బిఎస్ ఎన్ ఎల్ వీడియో టెలీఫోన్ సేవలు ప్రారంభమయ్యాయి. న్యూఢిల్లీ నుంచి కేంద్రమంత్రి  కపిల్ సిబల్ నాంపల్లి బిఎస్ ఎన్ ఎల్ కార్యాలయానికి మొదటి కాల్ చేశారు. సిబల్ తో లో కేంద్ర సహాయమంత్రి కిల్లీ కృపారాణి మాట్లాడారు.










Saturday, February 9, 2013

అఫ్జల్‌ గురుకు ఎట్టకేలకు ఉరి....

తీహార్,ఫిబ్రవరి 9:  పార్లమెంట్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడైన అఫ్జల్‌ గురుకు ఎట్టకేలకు కేంద్రం ఉరిశిక్ష అమలు చేసింది. అత్యంత గోప్యంగా శనివారం  ఉదయం ఎనిమిది గంటలకు తీహార్‌ జైలులో అఫ్జల్‌ ను ఉరి తీశారు. ఉరిశిక్షను కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ధ్రువీకరించారు.   అఫ్జల్‌ కు క్షమాభిక్షను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ  తిరస్కరించటంతో కేంద్రం శిక్షను అమలు చేసింది.  2001 డిసెంబర్ 13 న ఉగ్రవాదులు పార్లమెంటుపై దాడి చేశారు. ఈ దాడిలో ఏడుగురు భద్రతా సిబ్బంది మరణించగా మరి కొందరు గాయపడ్డారు. ఈ దాడిలో అఫ్జల్‌గురు ప్రధాన సూత్రధారి. 2001 డిసెంబర్ 15న అఫ్జల్‌గురును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో అఫ్జల్‌గురుకు 2004లో సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించింది. 2006లో అఫ్జల్‌గురు క్షమాభిక్ష పిటిషన్‌ను పెట్టుకోవడంతో ఉరిశిక్ష నిలిచిపోయింది. తరవాత  కేసు ఇప్పటిదాకా వాయిదా పడుతూ వచ్చింది. శనివారం ఉదయం ఉరిశిక్ష అమలు నేపథ్యంలో శుక్రవారం రాత్రే అఫ్జల్‌గురును తీహార్ జైలుకు తీసుకువచ్చారు. అఫ్జల్‌గురుకు ఉరిశిక్ష అమలు చేయడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జమ్మూ కాశ్మీర్ అంతటా కర్ఫ్యూ విధించారు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో కూడా హై అలర్ట్ విధించారు.

Friday, February 1, 2013

షిర్డీ సంస్థాన్ ట్రస్ట్ కు 225 కోట్ల విరాళాలు

షిర్డీ, ఫిబ్రవరి 1: 2012 సంవత్సరంలో షిర్డిలోని సాయిబాబా షిర్డీ సంస్థాన్ ట్రస్ట్ కు భక్తులు భారీగా విరాళాలు అందించారు. గత సంవత్సరంలో భక్తులు సమర్పించిన విరాళాలు 225 కోట్ల విరాళాలు నగదు రూపంలోను,  మరో 11 కోట్ల రూపాయల విలువైన బంగారం (36 కేజీలు), 373 కేజీల వెండి, ఇతర లోహాల రూపంలో మొత్తం 275 కోట్లు అందినట్టు సంస్థాన్ కార్యవర్గ అధికారి కిశోర్ మోరే తెలిపారు.  ఇది 2011 సంవత్సరంతో పోల్చితే 20 శాతం అధికమని వెల్లడించారు.

15 నుంచి ఎంసెట్ ఆన్‌లైన్ దరఖాస్తులు

హైదరాబాద్, జనవరి 31: ఇంజనీరింగ్, వ్యవసాయ, వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే  ‘ఎంసెట్’(ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ సెట్)ను స్వల్పమార్పులు మినహా యథాతథంగా నిర్వహించాలని ఎంసెట్ కమిటీ నిర్ణయించింది. ఈ పరీక్ష నోటిఫికేషన్ ఈ నెల 8న విడుదల కానుంది. ఇప్పటివరకు ఓఎంఆర్(ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్) షీట్లలో పెన్సిల్ ద్వారా సమాధానాలను పూరించాల్సి ఉండేది. ఈ సారి  నుంచి నీలం లేదా నలుపు రంగు పెన్నుతో మాత్రమే వాటిని పూరించాల్సి ఉంటుంది.  అలాగే  దరఖాస్తు పత్రంలో తల్లి పేరు కూడా రాయాల్సి ఉంటుంది. పదో తరగతి వివరాలను హాల్‌టికెట్ నెంబరుతో సహా ఉత్తీర్ణత నెల, సంవత్సరం పూరించాలి. తల్లిదండ్రుల వార్షికాదాయం: రూ. లక్ష వరకు; రూ. 2 లక్షల వరకు; రెండు లక్షలకు పైబడి అనే గడులు ఉంటాయి. సరైన గడిని గుర్తించాలి. పదోతరగతిలో చదివిన మాధ్యమం రాయాలి. హైదరాబాద్‌లో పరీక్ష రాసేవారికి  హైదరాబాద్‌ను నాలుగు జోన్లుగా విభజించి  ప్రయోజనకరంగా మార్చారు. హైదరాబాద్ వెస్ట్, హైదరాబాద్ నార్త్, హైదరాబాద్ సెంట్రల్, హైదరాబాద్ సౌత్ జోన్లుగా విభజించారు. ప్రతి జోన్‌లో 6 నియోజకవర్గాలను ప్రాంతీయ కేంద్రాలుగా వ్యవహరించనున్నారు. దరఖాస్తు చేసుకునేటప్పుడు ఈ జోన్‌ను గుర్తిస్తే అభ్యర్థికి పరీక్షా కేంద్రం ఆ జోన్ పరిధిలోనే కేటాయిస్తారు. ఇవికాక ఇప్పటివరకున్న 26 ప్రాంతీయ కేంద్రాలకు తోడుగా కొత్తగా భీమవరం, చిత్తూరు, జనగామ, వనపర్తి పట్టణాల్లో నాలుగు ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటుచేశారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌లోనే సమర్పించాల్సి ఉంటుంది. ఫీజు రూ. 250. డెబిట్ కార్డు ద్వారా గానీ, నెట్‌బ్యాంకింగ్ ద్వారా గానీ, క్రెడిట్ కార్డు ద్వారా గానీ, ఏపీఆన్‌లైన్, మీ-సేవ, ఈ-సేవ కేంద్రాల్లో  చెల్లించవచ్చు. ఈ నెల 15 నుంచి మార్చి 27 వరకు ఆన్‌లైన్లో  దరఖాస్తులను  స్వీకరిస్తారు. ఏప్రిల్ 25 నుంచి మే 8 వరకు హాల్ టికెట్లను  డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 10న ఎంసెట్ పరీక్ష జరుగుతుంది.  12న కీ.. జూన్ 2న ర్యాంకులు ప్రకటిస్తారు. 


' తొలి ' సహకారం కాంగ్రెస్ కే...

హైదరాబాద్, జనవరి 31:సహకార సంఘాల మొదటిదశ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అత్యధిక సంఖ్యలో సొసైటీలను సొంతం చేసుకుంది. గురువారం తొలిదశ ఎన్నికల్లో  ఏకగ్రీవాలు, ఎన్నికలు జరిగినవి  కలిపి 1365 ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. కాంగ్రెస్‌కు 595 స్థానాలు  దక్కగా.. టీడీపీకి 349,   వైసీపీకి  218 స్థానాలు లభించాయి.  టీఆర్ఎస్ ఒక్క జిల్లాలో ఆధిక్యత నిలుపుకొని.. మొత్తమ్మీద 61 స్థానాలు దక్కించుకోగలిగింది.  జిల్లాల వారీగా చూస్తే.. ఉత్తరాంధ్రలో  మూడు జిల్లాలు, ఉభయ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, తెలంగాణలో ఖమ్మం తప్ప ఏడు జిల్లాలలో  కాంగ్రెస్ ఆధిక్యత చాటింది. కృష్ణా, గుంటూరు, ఖమ్మం జిల్లాల్లో టీడీపీ స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. మెదక్ జిల్లా మాత్రం టీఆర్ఎస్‌కు దక్కింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా గట్టి పోటీ ఇస్తుందని భావించిన వైసీపీ.. కేవలం చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో మాత్రమే ఆధిక్యం కనబరిచింది.   

సవరణల లోక్ పాల్ బిల్లు రెడీ..

న్యూఢిల్లీ, జనవరి 31:  లోక్‌పాల్ బిల్లుకు రాజ్యసభ సెలెక్ట్ కమిటీ ప్రతిపాదించిన 16 సవరణలలో  14 సవరణలను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. కేసులు నమోదైన వారిని విచారించే అధికారం లోక్‌పాల్‌కు ఇవ్వడానికి ఆమోదించిన మంత్రివర్గం.. ఆయా కేసులను విచారించే సీబీఐ అధికారులను మధ్యలో బదిలీ చేయాలంటే లోక్‌పాల్ అనుమతి తీసుకోవాలన్న అంశానికి మాత్రం ఆమోదం తెలపలేదు. అలాగే లోక్‌పాల్ విచారణ ఎదుర్కొంటున్న అధికారి ప్రాథమిక విచారణ సమయంలో తన వాదన వినిపించడానికి వీలుండకూడదన్న కీలక సూచనను కూడా మాత్రం ప్రభుత్వం ఆమోదించలేదు. లోకాయుక్తల నియామకాన్ని లోక్‌పాల్ బిల్లు పరిధి నుంచి తప్పించాలన్న ని సెలెక్ట్ కమిటీ సూచనకు ఆమోదం లభించింది. . లోక్‌పాల్ చట్టం వచ్చిన ఏడాదిలోగా రాష్ట్ర ప్రభుత్వాలు లోకాయుక్తలను ఏర్పాటు చేయాల్సి  ఉంటుంది. ప్రభుత్వం నుంచి నిధులు పొందకుండా సాయాన్ని మాత్రం పొందే సొసైటీలు, ట్రస్టులను లోక్‌పాల్ పరిధి నుంచి తప్పించాలన్న సెలెక్ట్ కమిటీ సూచనను కూడా  కేబినెట్ ఆమోదించింది. ప్రభుత్వం నుంచి భారీగా నిధులు పొందే సంస్థలను దీని పరిధిలో చేర్చారు. ఈ సవరణలతో కూడిన లోక్‌పాల్ బిల్లును రాజ్యసభలో ఓటింగ్‌కు పెడతారు. రాజ్యసభ ఆమోదం పొందితే అప్పుడు మళ్లీ బిల్లు లోక్‌సభకు వెళ్తుంది.
మళ్లీ ఆందోళన: అన్నాహజారే
కాగ, లోక్‌పాల్‌బిల్లు కొత్త ముసాయిదాను అన్నా హజారే తిరస్కరించారు. బలహీనమైన చట్టాన్ని చేయడాన్ని వ్యతిరేకిస్తూ తాను త్వరలో ఆందోళన ప్రారంభిస్తానని పాట్నాలో వెల్లడించారు. అవినీతి అంతానికి ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా కఠినమైన బిల్లు తెస్తారన్న నమ్మకం తనకు లేదన్నారు.

పవార్ కీ కావాలి తెలంగాణ...

న్యూఢిల్లీ, జనవరి 31:  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎన్సీపీ అధినేత, కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్‌పవార్ తన మద్దతును పునరుద్ఘాటించారు.‘తెలంగాణపై నిర్ణయ ప్రకటనలో జాప్యం యూపీఏ ప్రభుత్వానికి ఏమాత్రం మంచిది కాదని,  కేంద్రం మరింత తాత్సారం చేయకుండా తక్షణం తెలంగాణకు అనుకూలంగా  నిర్ణయం తీసుకోవాలని తమ పాటీ కోరుతున్నట్టు  శరద్‌పవార్ చెప్పారు.తెలంగాణ విషయంలో  సత్వర నిర్ణయం తీసుకోవాలని ప్రధాని మన్మోహన్‌సింగ్ కు విజ్ఞప్తి చేసినట్టు వివరించారు.  ‘‘ తెలంగాణ అంశాన్ని  కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టి,  రాష్ట్రపతి ప్రసంగంలో చేర్చి,  తెలంగాణకు అనుకూలంగా డిసెంబర్ 9న  ప్రకటన చేసి కూడా ఇంకా  నాంపుడు  ధోరణి పార్టీకి, ప్రభుత్వానికి మంచిది కాదని,  త్వరగా సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని  ప్రధానికి వివరించినట్లు  పవార్ తెలిపారు. తెలంగాణకు కేంద్రం అంగీకరిస్తే మహారాష్ట్రలో ప్రత్యేక విదర్భ డిమాండ్ తెరపైకి రాదా అని ప్రశ్నించగా, విదర్భ రాష్ట్రం ఏర్పడినా తమకెలాంటి అభ్యంతరాలూ లేవని ఆయన స్పష్టం చేశారు. 

మిథాలీసేన శుభారంభం...

ముంబై, జనవరి 31: వన్డే ప్రపంచకప్‌ను భారత మహిళల జట్టు ఘనంగా ప్రారంభించింది. గ్రూప్ ఎ లో భాగంగా గురువారం బ్రబౌర్న్ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో మిథాలీసేన 105 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది.   టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకోగా... భారత్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 284 పరుగుల భారీస్కోరు సాధించింది. ఓపెనర్ తిరుష్ కామిని  కెరీర్‌లో తొలి సెంచరీ సాధించింది. మరో ఓపెనర్ పూనమ్ రౌత్  అర్ధసెంచరీ చేసింది. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు 175 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తరువాత వెస్టిండీస్ జట్టు 44.3 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటయింది.  సెంచరీతో రాణించిన కామినికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో భారత్ ఖాతాలో రెండు పాయింట్లు చేరాయి. 

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...