Sunday, September 29, 2013

తెలంగాణ జన భేరీ-సమైక్య గర్జన విజయవంతం

హైదరాబాద్/కర్నూలు,సెప్టెంబర్ 29: : తెలంగాణవాదులు హైదరాబాద్ లో  సకల జన భేరీ పేరుతో, సమైక్యవాదులు కర్నూలు సమైక్య గర్జన పేరుతో  ఆదివారం నిర్వహించిన రెండు భారీ బహిరంగ సభలు విజయవంతంగా ముగిశాయి. హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో తెలంగాణ సకల జనభేరి సభకు, కర్నూలు  ఎస్టీబీసీ కళాశాల మైదానంలో సమైక్య గర్జన సభకు జనం భారీగా తరలి వచ్చారు. రెండు ప్రాంతాలలో పోటాపోటీగా నిర్వహించిన రెండు సభల ప్రాంగణాలు జనంతో కిక్కిరిసిపోయాయి.

సకల జనభేరీలో  టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని తీవ్రస్థాయిలో విమర్శించారు.  ఆంధ్రా వాళ్లు అందరూ తెలంగాణ ద్రోహులే అని అన్నారు.ఆంధ్రా ప్రజలు.. ఆంధ్రా వారే.  తెలంగాణ ప్రజలు.. తెలంగాణే వారే.  ఇక కలిసుండటం అనేది కలలో కూడా జరుగుతాదా ? అని సీమాంధ్ర నాయకులపై  నిప్పులు చెరిగారు. ఆంధ్రాలో పుట్టిన వాడు ఆంధ్రా వాడే కానీ తెలంగాణలో లెక్కరాడని తెలిపారు. రాష్ట్ర విభజనపై సీఎం కిరణ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. కిరణ్ కుమార్ రెడ్డి ఇంకా రాష్ట్రాన్ని ఆపాలని యత్నిస్తున్నారన్నారు. అక్టోబర్ 7వ తేదీ దాటిన తర్వాత సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పని ముగిసినట్లేనని ఆయన తెలిపారు.
ఢిల్లీ పీఠం దద్దరిల్లేలా ఉద్యమ కార్యాచరణ 
 సమైక్య గర్జనలో మాట్లాడిన నేతలు  రాష్ట్రాన్ని విడగొట్టవద్దని కోరారు.  ఏపీఎన్జీఓ సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు మాట్లాడుతూ ఢిల్లీ పీఠం దద్దరిల్లేలా ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు.  కేసీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. హైదరాబాద్ లో సీమాంధ్రులు పెట్టుబడులు పెట్టి అభివృద్ధికి దోహద పడితే..  హైదరాబాద్ నగరంలో సీమాంధ్రులకు భాగస్వామ్యం లేదనడం భావ్యం కాదని అశోక్ బాబు సూచించారు. సమైక్య ఉద్యమాన్ని చులకనగా చేసి మాట్లాడటం సరికాదన్నారు.

Monday, September 23, 2013

జగన్ కు బెయిల్ ఇచ్చేశారు...

హైదరాబాద్, సెప్టెంబర్ 23:  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్ సభ సభ్యుడు జగన్మోహన రెడ్డి కి ఎలాగైతెనే  ఎట్టకేలకు బెయిల్ లభించింది.  నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు జగన్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. జగన్ హైదరాబాద్ వదిలి వెళ్లరాదని కోర్టు షరతు విధించింది. అలాగే  రెండు లక్షల రూపాయల విలువైన రెండు పూచీకత్తులు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. జగన్ తరపు న్యాయవాదులు  పూచీకత్తులను సమర్పించిన అనంతరం రేపు మధ్యాహ్నం జగన్ విడుదల కాగలరని భావిస్తున్నారు. 2012 మే 27న అక్రమాస్తుల కేసులో అరెస్టయిన జగన్ 16 నెలల నుంచి హైదరాబాద్ చంచల్గుడా జైలులో ఉన్నారు. ఈ మధ్యలో పలు సార్లు ఆయన బెయిల్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. ఇటు తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం, అటు సీమాంధ్రలో సమైక్య ఉద్యమం నేపథ్యంలో జగన్ విడుదల ప్రాధాన్యతను సంతరించుకుంది. 

Monday, September 16, 2013

అమెరికా సుందరి...నీనా దావులూరి

న్యూజెర్సీసెప్టెంబర్ 16: ప్రతిష్టాత్మకమైన మిస్ అమెరికా పోటీలో ప్రవాసాంధ్ర సంతతికి చెందిన నీనా దావులూరి గెలుపొంది చరిత్ర సృష్టించారు. అమెరికా సుందరిగా ఒక భారత సంతతి యువతి గెలుపొందటం ఇదే తొలిసారి. అంతేకాదు.. స్థూలకాయంతో ఇబ్బంది పడుతూ  దానిని అధిగమించి మరీ అమెరికా సుందరి కిరీటాన్ని కైవసం చేసుకోవటం 24 ఏళ్ల నీనా సాధించిన మరో ఘనవిజయం. న్యూజెర్సీలోని అట్లాంటిక్ సిటీలో సోమవారం జరిగిన మిస్ అమెరికా పోటీలో.. 53 రాష్ట్రాల నుంచి 53 మంది సుందరీమణులు పాల్గొనగా.. మిస్ న్యూయార్క్‌గా నీనా బరిలోకి దిగారు. తమ కుటుంబ స్వస్థలమైన కృష్ణా జిల్లాలో చిన్నప్పటి నుంచీ అభ్యసించిన కూచిపూడి నృత్యం, బాలీవుడ్ నృత్యాన్ని మేళవించి ప్రదర్శన ఇచ్చిన నీనా న్యాయనిర్ణేతలను ఆకట్టుకుని అమెరికా సుందరి కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ఈ విజయం ద్వారా ఆమెకు దాదాపు 50,000 డాలర్ల (సుమారు 35 లక్షల రూపాయలు) మేర స్కాలర్‌షిప్‌ల రూపంలో అందనున్నాయి. నీనా తండ్రి దావులూరి ధనకోటేశ్వర చౌదరి అమెరికాలో సెయింట్ జోసెఫ్స్ ఆస్పత్రిలో ప్రసూతి వైద్యుడిగా పనిచేస్తున్నారు. ఆమె తల్లి షీలారంజని వెబ్ డిజైనర్. నీనా అమ్మమ్మ వేగె కోటేశ్వరమ్మ విజయవాడలో ప్రముఖ విద్యావేత్త, మాంటిస్సోరీ విద్యాసంస్థల అధినేత. డాక్టర్ చౌదరి కుటుంబం 1970లలోనే అమెరికాలో ప్రవాసం వెళ్లి అక్కడ స్థిరపడింది. నీనా 1989 ఏప్రిల్ 20న అమెరికాలోని సెర్క్యూస్‌లో జన్మించారు. 

నిర్మాత, రవీంధ్ర ఆర్ట్స్ అధినేత తమ్మారెడ్డి కృష్ణమూర్తి మృతి...

హైదరాబాద్, సెప్టెంబర్ 16:  ప్రముఖ నిర్మాత, రవీంధ్ర ఆర్ట్స్ అధినేత తమ్మారెడ్డి కృష్ణమూర్తి (92) సోమవారం ఉదయం మృతి చెందారు. 2007లో రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. లక్షాధికారి, ధర్మదాత, బంగారుగాజులు, దత్తతపుత్రుడు, డాక్టర్ బాబు, ఇద్దరుకొడుకులు వంటి చిత్రాలను తమ్మారెడ్డి నిర్మించారు. లెనిన్‌బాబు, భరద్వాజ ఆయనకుమారులు.

మోపిదేవి వెంకటరమణకు 45రోజుల తాత్కాలిక బెయిల్‌

హైదరాబాద్, సెప్టెంబర్ 16: మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు నాంపల్లి సీబీఐ కోర్టు  45 రోజుల తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేసింది. తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్న మోపిదేవి వెంకట రమణారావుకు వైద్య చికిత్సల కోసం మూడు నెలల తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాది సురేందర్‌రావు సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. ఈ మేరకు మోపిదేవి దాఖలు చేసుకున్న పిటిషన్‌ను ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు విచారించారు.  వాదనలు విన్న న్యాయమూర్తి-  వెంకటరమణకు బెయిల్ మంజూరు చేశారు.

Friday, September 13, 2013

రేపిస్టులు నలుగురికీ ఉరి...

న్యూఢిల్లీ,సెప్టెంబర్ 13:  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నిర్భయ’ దారుణ సామూహిక అత్యాచారం కేసులో నలుగురు నిందితులు.. ముఖేశ్, పవన్ గుప్తా, వినయ్‌శర్మ, అక్షయ్ ఠాకూర్‌లకు ఉరిశిక్ష విధించారు. వీరు నలుగురిని మంగళవారమే దోషులుగా నిర్ధారించినా, శిక్షను శుక్రవారం ప్రకటించారు.  కిక్కిరిసిన కోర్టు హాల్లో అత్యంత ఉత్కంఠ నడుమ వీరు నలుగురికి ఉరిశిక్ష విధిస్తూ.. అదనపు సెషన్స్ జడ్జి యోగేశ్ ఖన్నా తీర్పు వెలువరించారు. నిందితులు నలుగురిపై 13 సెక్షన్ల కింద అభియోగాలు నమోదయ్యాయి. 84 మంది సాక్షులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపారు. వీరిపై హత్య, అత్యాచారం, కిడ్నాప్ నేరాలు నిర్ధారణ అయ్యాయి. కాగ, , తీర్పుపై హైకోర్టులో సవాలుచేస్తామని దోషుల తరఫు న్యాయవాది తెలిపారు. దేశ రాజదాని ఢిల్లీలో గత డిసెంబర్ 16 రాత్రి జరిగిన ఈ ఘటనలో ప్రధాన నిందితుడు రాంసింగ్ (బస్సు డ్రైవర్) తీహార్ జైల్లోని తన సెల్‌లో గత మార్చి 11న ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో మైనర్ అయిన మరో నిందితునికి మూడేళ్లు స్పెషల్ హోంలో గడపాలంటూ ఆగస్టు 31న జువెనైల్ జస్టిస్ బోర్డు తీర్పు చెప్పింది. దీంతో మొత్తం జీవించి ఉన్న ఐదుగురు నిందితులకు శిక్ష పడినట్లయింది.

బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ

న్యూఢిల్లీ,సెప్టెంబర్ 13:  అందరి ఏకాభిప్రాయంతో నరేంద్ర మోడీని బీజేపీ తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేసినట్టు  బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు.  నరేంద్ర మోడీ మాట్లాడుతూ,  ''దేశం సంక్షోభంలో ఉంది.. ఇలాంటి సమయంలో ఈ సంక్షోభం నుంచి దేశాన్ని బయటపడేసేందుకు బీజేపీ తరఫున పోరాటం చేస్తాం. చిన్న కుగ్రామం నుంచి.. అతి చిన్న కుటుంబం నుంచి.. ఓ కార్యకర్త స్థాయి నుంచి వచ్చిన నాలాంటి సాధారణ వ్యక్తికి పార్టీ జాతీయ నాయకత్వం అతిపెద్ద బాధ్యత అప్పగించింది. 2014 ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించాలంటే ప్రజల మనోభావాలను, కార్యకర్తలు, నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ముందుకెళ్లాలి. వాజ్ పేయి, అద్వానీ లాంటి పెద్దల కృషితో వటవృక్షంలా ఎదిగిన ఈ పార్టీ నీడన ఉన్న కార్యకర్తలందరికీ వినమ్రంగా నమస్కరిస్తున్నా. పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు శ్రమించడానికి ఏమాత్రం వెనకాడను. సామాన్యుల ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తాను. ఇక్కడున్న అందరి ద్వారా కోట్లాది మంది భారతీయుల ఆశీస్సులు కోరుతున్నాను.  కష్టాల్లో ఉన్న ఈ దేశాన్ని కాపాడేందుకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి భారతీయుడు బీజేపీ కమలాన్ని తీసుకుని, ఒక కొత్త ఆశతో బీజేపీకి పూర్తిగా సమర్థిస్తారని ఆశిస్తున్నాను. '' అని  మోడీ తెలిపారు.

Thursday, September 12, 2013

సినీ నటి అంజలి పై అరెస్టు వారెంటు

చెన్నై,సెప్టెంబర్ 12 : సినీ నటి అంజలి పై  చెన్నైలోని సైదాపేట కోర్టు  అరెస్టు వారెంటు జారీచేసింది. తమిళ సినీ దర్శకుడు కళంజియం దాఖలుచేసిన పరువు నష్టం కేసు విచారణకు హాజరు కావాల్సిన అంజలి.. పదే పదే ఆ కేసు విచారణకు హాజరు కాకపోవడంతో ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు జారీచేసిన కోర్టు, ఈసారి ఏకంగా అరెస్టు వారెంటు జారీ చేసింది.

Wednesday, September 11, 2013

86 రోజుల అనంతరం తెరుచుకున్న కేదార్ నాథ్ గుడి ద్వారాలు...

కేదార్‌నాథ్,సెప్టెంబర్ 11:  ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వరద బీభత్సం వల్ల కేదార్‌నాథ్ ఆలయంలో  నిలచి పోయిన పూజలు  86 రోజుల అనంతరం బుధవారం తిరిగి  ప్రారంభం అయ్యాయి.  24మంది పురోహితుల బృందం ఆలయ కమిటీ సమక్షంలో పూజలు నిర్వహించింది.  ఆరు దశాబ్దాల చరిత్ర కలిగిన ఆలయ తలుపులను 86రోజుల తర్వాత తీశారు. పురోహితుడు రావల్ భీమా శంకర్ లింగ్ శివాచార్య పూజా కార్యక్రమాలను పున:ప్రారంభించేందుకు ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది. శుద్ధికరణ్, ప్రయాచిత్తీకరణ్‌లతో పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి.   ఆలయ దర్శనకు భక్తులను అనుమతించడం పై  ఈ నెల  30న జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు.


 

Tuesday, September 10, 2013

ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో నలుగురు నిందితులను దోషులుగా తేల్చిన కోర్టు...

 న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10 : ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో నలుగురు నిందితులు వినయ్‌శర్మ, ముఖేష్ సింగ్, అక్షయ్ కుమార్ సింగ్, పవన్‌గుప్తాలను సాకేత్ కోర్టు దోషులుగా నిర్ధారిస్తూ మంగళవారం తీర్పునిచ్చింది. న్యాయమూర్తి యోగేష్‌కన్నా ఈ తీర్పును వెలువడించారు.వీరికి  బుధవారం కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. తీర్పు అనంతరం దోషులను తీహార్ జైలుకు తరలించారు. 2012 డిసెంబర్ 16న ఢిల్లీలో 23 ఏళ్ల వైద్య విద్యార్థినిపై అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారానికి పాల్పడిని ఆరుగురు నిందితుల్లో ప్రధాన నిందితుడు రామ్‌సింగ్ తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకోగా, మైనర్ నిందితుడికి జువైనల్ కోర్టు మూడేళ్ల శిక్ష విధించిన విషయం తెలిసిందే.

జగన్‌ కేసులో పొన్నాల, సబితలకు ఊరట

హైదరాబాద్,సెప్టెంబర్ 10:  వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డికి ఇండియా సిమెంట్స్ అంశంలో, మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు పెన్నా సిమెంట్స్ అంశాలలో క్లీన్ చిట్ లభించింది. సిబిఐ మంగళవారం జగన్ ఆస్తుల కేసులో భారతి, ఇండియా, పెన్నా సిమెంట్స్ కేసులతో పాటు మూడు ఛార్జీషీట్స్ దాఖలు చేసింది.   ఇండియా సిమెంట్ అంశంలో సిబిఐ గతంలో పొన్నాల లక్ష్మయ్యను ప్రశ్నించింది. దీంతో ఆయన పేరు నిందితుల జాబితాలో ఉంటుందని భావించారు. ఆయన పేరును సిబిఐ సాక్షుల జాబితాలో చేర్చడంతో ఊరట లభించింది. గతంలో సబితా ఇంద్రా రెడ్డి, ధర్మాన ప్రసాద రావుల పేర్లను ఛార్జీషీటులో పేర్కొనడంతో వారు రాజీనామా చేయాల్సి వచ్చింది. పెన్నా సిమెంట్ అంశంలో సబితకు తాజాగా క్లీన్ చిట్ లభించింది. 

Monday, September 9, 2013

హైదరాబాద్ కేంద్రపాలిత రాష్ట్రం...?

హైదరాబాద్, సెప్టెంబర్ 9: ఆంధ్రప్రదేశ్ విభజనలో కీలకాంశంగా మారిన హైదరాబాద్ సమస్యను పరిష్కరించేందుకు హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ పరిధికి జాతీయ రాజధాని ప్రాంతం పేరిట ప్రత్యేక హోదా కల్పించి మూడు రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్‌ను విభజించే ప్రతిపాదనను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ  చురుకుగా పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదన అమలైతే హైదరాబాద్ కేంద్రపాలిత రాష్ట్రం, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు అవతరిస్తాయి. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు శాశ్వత ఉమ్మడి రాజధానిగా హెచ్‌ఎండిఏలోని నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సిఆర్)గా ఉంటుంది.కాగా,  కాంగ్రెస్ హైకమాండ్ సూచించిన హైదరాబాద్ పదేళ్ల ఉమ్మడి రాజధాని ప్రతిపాదన ఇంకా సజీవంగానే ఉంది. దీనినిఅవసరమైతే మరో ఏడేళ్ల వరకూ పెంచేందుకూ అవకాశం ఉంది. ఇకో  ప్రతిపాదన గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు వేరేచోట తమ ప్రాంతాల్లో సొంతంగా రాజధానులను నిర్మించుకోవడం. అయితే ఈ ప్రతిపాదనకు తెలంగాణ ప్రజలు అంగీకరించే అవకాశం లేనందున మూడు రాష్ట్రాల ప్రతిపాదన వైపే  కేంద్రం మొగ్గు చూపుతున్నట్టు సమాచారం ఢిల్లీ తరహాలో హైదరాబాద్ కు హెచ్‌ఎండిఏగా నేషనల్ క్యాపిటల్ రీజియన్ హోదా కల్పిస్తారు. ఇందువల్ల  హైదరాబాద్ ను శాశ్వత ఉమ్మడి రాజధానిగా నిర్ణయించేందుకు అవకాశం ఉంటుంది. ఢిల్లీ తరహాలో పరిమిత అధికారాలతో కూడిన అసెంబ్లీ ఏర్పాటు చేస్తారు. 32 అసెంబ్లీ సీట్లు ఉంటాయి. శాంతి భద్రతలు, భూమి, పబ్లిక్ ఆర్డర్, కోర్టులు, ఫీజులుపై కేంద్రానికి అధికారం ఉంటుంది. రాయలసీమ, ఆంధ్రాకు భౌగోళిక అనుసంధానం ఉంటుంది. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నాల్గవ సిఫార్సు మేరకు హెచ్‌ఎండిఏను యుటి రాష్ట్రంగా చేసే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తున్నట్టు అధికార వర్గాల భోగట్టా...

Saturday, September 7, 2013

అంతం కాదు...ఆరంభం: ఏపి ఎన్జీఓ

హైదరాబాద్ ,సెప్టెంబర్ 7 : ఏపి ఎన్జీఓల ఆధ్వర్యంలో 'సేవ్ ఆంధ్రప్రదేశ్' పేరుతో ఎల్ బి స్టేడియంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ ప్రశాంతంగా ముగిసింది.   మూడు గంటల కు పైగా సాగిన    సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ సభకు సీమాంధ్ర జిల్లాల నుంచి  వేల సంఖ్యలో  ఉద్యోగులు  తరలివచ్చారు. మహిళా ఉద్యోగులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఇది అంతం కాదు ఆరంభమని ఏపి ఎన్ జిఓ నేతలు  ప్రకటించారు. విభజన ప్రకటన వెనక్కి తీసుకోవాలి డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో సికింద్రాబాద్‌లో మిలియన్‌ మార్చ్‌ నిర్వహిస్తామని హెచ్చరించారు. ప్రైవేట్‌ ఉద్యోగులు కూడా సభకు  పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అయితే వారిని స్టేడియం లోపలకు అనుమతించకపోవడంతో  వారు బయటే ఉండి నిరసన తెలిపారు.  ఎల్ బి స్టేడియంలో నిర్వహించిన ఈ  సమైక్య సభ విజయవంతం అయిందని ఏపీఎన్జీవోలు పేర్కొన్నారు. ఈ  స‌భ‌లో తాము సమైక్యవాదాన్ని బలంగా వినిపించామ‌ని చెప్పారు. తాము ఏర్పాటుచేసిన ఈ స‌భ ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. విభ‌న‌పై గ‌త కొన్నిరోజులుగా సాగుతున్న సమ్మెను విరమించే ప్రసక్తే లేదని తెలిపారు. విభ‌జ‌న విష‌య‌మై టీఎన్జీవోలతో చ‌ర్చలు జ‌రిపేందుకు ఏపీఎన్జీవోలు సిద్ధమేన‌ని చెప్పారు. తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లోనూ సదస్సులు నిర్వహిస్తామ‌ని అన్నారు. తెలంగాణ ఉద్యోగులు ఆంధ్రాలో సదస్సు నిర్వహిస్తే స్వాగతిస్తామ‌ని ఏపీఎన్జీవోలు స్పష్టం చేశారు.
తెలంగాణా బంద్ సంపూర్ణం...
కాగా, ఏపి ఎన్జీఓల స‌మైక్య స‌భకు వ్యతిరేకంగా టి.జె.ఎ.సి. నిర్వహించిన  తెలంగాణ బంద్ కూడా విజ‌య‌వంత‌మైంది. తెలంగాణ బంద్‌ 100 శాతం విజయవంతమయిందని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ చెప్పారు. తెలంగాణ జిల్లాల ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారని తెలిపారు. 500 మందికి పైగా తెలంగాణావాదులను అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు.  నిజాం కాలేజ్‌లో 200మందిని అరెస్ట్‌ చేసి గోషామహల్‌కు తరలించినట్లు తెలిపారు.మరో రెండు మూడు రోజుల్లో భవిష్యత్‌ కార్యచరణను ప్రకటిస్తామని కోదండరామ్ చెప్పారు.

హైదరాబాద్ పైనే పునరాలోచన: షిండే

న్యూఢిల్లీ,సెప్టెంబర్ 7 : హైదరాబాద్ కు సంబంధించి తమ వద్ద రెండు మూడు ప్రతిపాదనలున్నట్లు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే సూచనప్రాయంగా వెల్లడించారు. న్యూఢిల్లీలో శనివారం విలేకరులతో మాట్లాడిన ఆయన.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై హోం శాఖ కేబినెట్‌ నోట్‌ తయారు చేస్తోందని,  త్వరలోనే ఈ నోట్ పూర్తవుతుందని తెలిపారు. ఆంటోనీ కమిటీ చెప్పిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని వివరించారు. ఆంద్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించే ప్రసక్తి లేదని, ప్రస్తుతానికి అక్కడ శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని అన్నారు. తెలంగాణపై కేబినెట్‌ నోట్‌ తయారైతే అన్ని అంశాలూ పరిష్కారం అవుతాయని తెలిపారు. ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారంటూ వస్తున్న వార్తలన్నీ  వదంతులేనని  షిండే స్పష్టం చేశారు. దేశంలో ప్రత్యేక రాష్ట్రాలకోసం చాలా డిమాండ్లు ఉన్నాయి గానీ, వాటన్నింటినీ అంగీకరించలేమని  షిండే తెలిపారు. గూర్ఖాలాండ్, విదర్భ సహా అనేక కొత్త రాష్ట్రాల ఏర్పాటు కోసం పలు విజ్ఞప్తులున్నాయని, కానీ వాటి ని ఇప్పట్లో పరిశీలించలేమని షిండే అన్నారు.

Friday, September 6, 2013

పునరాలోచనలో కేంద్రం: కావూరి

హైదరాబాద్, సెప్టెంబర్ 6:  హైదరాబాద్‌ను వదులు కోవడానికి సీమాంధ్రులు సిద్ధంగా లేరని కేంద్ర జౌళిశాఖ మంత్రి, కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం నేపథ్యంలో కేంద్రం పునరాలోచనలో పడిందని చెప్పారు. తెలంగాణ నోట్ కేబినెట్ ముందుకు ఇప్పట్లో రాదని, వైద్యం కోసం విదేశాలకు వెళ్లిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ దేశానికి వచ్చాక సీమాంధ్ర ఉద్యమానికి అనుకూలంగా ప్రకటన వస్తుందని తెలిపారు. సీమాంధ్ర ఉద్యమ్మ్మ న్యాయమైనదని, సీమాంధ్ర ప్రజల సెంటిమెంటును కాంగ్రెస్ అధిష్టానం అర్థం చేసుకుంటోందని తెలిపారు. సీమాంధ్ర ప్రాంత ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా ఆ ప్రాంత కేంద్రమంత్రులు, ఎంపీలతో కలిసి కాంగ్రెస్ అధిష్టానం ముందు సమైక్యవాదం వినిపించినట్లు కావూరి తెలిపారు. త్వరలో ఆంటోని కమిటీ హైదరాబాదుకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

అమెరికాలో ఇద్దరు భారతీయుల కాల్చివేత..

వాషింగ్టన్,సెప్టెంబర్ 6: అమెరికాలో ఇద్దరు భారతీయులను ముసుగు ధరించి వచ్చిన ఇద్దరు దుండగులు కాల్చిచంపారు. మృతులను  జగ్తర్ భట్టి(55), పవన్ సింగ్(20) గా గురించారు. ఉత్తర ఇండియానా నగరంలోని మిడిల్ బరీ స్ట్రీట్ లో ఈ సంఘటన జరిగింది. 400 బ్లాకులు ఉన్న కన్వీనియన్స్ స్టోర్ లో ఈ ఘాతుకం చోటుచేసుకుంది. ఈ జంట హత్యలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  దుండగుల కాల్పుల్లో మృతి చెందిన భట్టి, పవన్ అందరితో ఎంతో స్నేహంగా మెలిగేవారని పొరుగున ఉంటున్న ఓ మహిళ తెలిపింది.

Thursday, September 5, 2013

సి.ఎం. తీరుకు నిరసనగా 7న తెలంగాణా బంద్... కోదండరామ్

హైదరాబాద్,సెప్టెంబర్ 5:  ఈ నెల 7వ తేదీ తెలంగాణ బంద్ కు తెలంగాణ రాజకీయ జెఎసి పిలుపు ఇచ్చింది. జెఎసి  స్టీరింగ్ కమిటీ సమావేశం ముగిసిన తరువాత చైర్మన్ కోదండరామ్ విలేకరులతో మాట్లాడుతూ,  శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు 24 గంటలపాటు బంద్ కు పిలుపు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 7వ తేదీన హైదరాబాద్ లో జరప తలపెట్టిన శాంతి ర్యాలీని రద్దు చేసినట్లు చెప్పారు. శాంతి ర్యాలీకీ బదులుగానే బంద్‌ నిర్వహిస్తున్నామని, ఇది   సీమాంధ్ర సభకు వ్యతిరేకంగా  కాదని కోదండరామ్ స్పష్టం చేశారు.  ప్రభుత్వం తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, అందుకు నిరసనగానే బంద్ కు పిలుపు ఇచ్చినట్లు తెలిపారు. మొత్తం వ్యవస్థను నిలిపివేస్తామని హెచ్చరించారు. ఎక్కడికక్కడే శాంతి ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహిస్తామని చెప్పారు. విభజనకు సహకరిస్తే ఏపీఎన్జీవోల సభను తామే విజయవంతం చేస్తామన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కావాలనే  విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు. ఆయన వ్యవహార శైలికి వ్యతిరేకంగానే బంద్ కు పిలుపు ఇస్తున్నట్లు తెలిపారు. శాంతి ర్యాలీకి అనుమతి ఇవ్వకుండా సీమాంధ్రుల సభకు అనుమతి ఇచ్చారన్నారు.
కాగా,  తెలంగాణ పొలిటికల్ జేఏసీ  ప్రకటించిన బంద్ కు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ మద్దతు ప్రకటించారు.  బంద్ ను విజయవంతం చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.

Wednesday, September 4, 2013

రాజన్ రాక తో రుపీ పై కొత్త ఆశలు...

ముంబై, సెప్టెంబర్ 4:  రోజురోజుకు దిగజారిపోతున్న రూపాయి  బుధవారం కాస్త పుంజుకుంది.   రిజర్వ్‌ బ్యాంకు కొత్త గవర్నర్‌గా రఘురామ్‌ రాజన్‌ బాధ్యతలు చేపట్టిన నాడే  రూపాయి బలపడటం కొత్త ఆశలు రేపింది. ప్రపంచ ఆర్థిక మేధావుల్లో ఒకరిగా పేరు పొందిన రాజన్‌.. మన దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు.     మంగళవారం తో  పోల్చితే బుధవారం  ఉదయం కూడా  ట్రేడింగ్ లో  బుధవారం నాడు రిజర్వ్‌ బ్యాంకు కొత్త గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన  రఘురామ్‌ రాజన్‌ డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ 92 పైసలు పడిపోయి 68.55 స్థాయికి చేరుకుంది.  అయితే  సాయంత్రానికి  66.82 రూపాయలకు బలపడింది.
కాగా,  రూపాయి విలువ బలపడటంతో   బంగారం ధర  తగ్గింది. 10 గ్రాముల బంగారం   ధర 1084 రూపాయలు తగ్గి 33,355 రూపాయలకు చేరింది. కిలో  వెండి ధర 2,778 రూపాయలు తగ్గి 54,530 రూపాయలకు చేరింది.
మరోవైపు ఈరోజు స్టాక్‌ మార్కెట్లు  కూడా బుధవారం భారీ లాభాలు నమోదు చేశాయి.  సెన్సెక్స్‌ 333 పాయింట్ల లాభంతో 18,567 పాయింట్లుగా, నిఫ్టీ 106 పాయింట్ల లాభంతో 5,448 పాయింట్లుగా ఉంది.

ఆంధ్రకు అన్యాయం చెయ్యం: దిగ్విజయ్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4 : ఆంధ్రాకు అన్యాయం జరగదని రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం దిగ్విజయ్‌ను కలుసుకున్న సందర్భంగా  దిగ్విజయ్ మీడియాతో మాట్లాడుతూ,   రెండుసార్లు కాంగ్రెసు పార్టీని గెలిపించిన ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్రానికి తాము అన్యాయం చేయబోమని చెప్పారు.  కాగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, దిగ్విజయ్ సింగ్‌ల మధ్య రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు చర్చకు వచ్చినట్లు సమాచారం.  కాంగ్రెసు పార్టీ విభజన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఎన్నికల తర్వాత ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చునని సి.ఎం. సూచించారని సమాచారం.  కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేతో కూడా కిరణ్  భేటీ ఆయ్యారు.

ఆశారాం బాపు కు బెయిల్ నిరాకరణ

జోధ్‌పూర్,సెప్టెంబర్ 4:  బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో నిందితుడు, ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు (72) కు కోర్టు బెయిల్ నిరాకరించింది. ఈ కేసులో ఇద్దరు అనుమానితులు ఇంకా పట్టుబడనందున ఆశారాంకు బెయిల్ ఇవ్వడం కుదరదని కోర్టు స్పష్టం చేసింది. కోర్టు ఈ నెల 15 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో ఆశారాం బాపు జోధ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉన్నారు. జోధ్‌పూర్‌లోని తన ఆశ్రమంలో ఆశారాం ఓ పదహారేళ్ల బాలికను లైంగికంగా వేధించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...