Saturday, April 25, 2015

1500 కి చేరిన నేపాల్ భూకంపం మృతులు...

ఖట్మండూ,ఏప్రిల్ 25; : నేపాల్‌లో సంభవించిన భారీ భూకంపం పెను విధ్వంసాన్ని సృష్టించింది. రాజధాని నగరం కాఠ్‌మాండూకు 77 కిలోమీటర్ల దూరంలో రిక్టర్‌ స్కేల్‌పై 7.9గా నమోదైన ఈ భూకంప తీవ్రతకు ఎత్త్తెన భవనాలు, చారిత్రక కట్టడాలు నేలమట్టమయ్యాయి. శిథిలాల నుంచి భారీ సంఖ్యలో మృతదేహాలు బయటపడుతున్నాయి. మృతుల సంఖ్య 1500కు చేరినట్లు సమాచారం. కాఠ్‌మాండూ వీధులన్నీ ఆర్తనాదాలు, హాహాకారాలతో దద్దరిల్లుతున్నాయి. ఆసుపత్రులన్నీ క్షతగాత్రులతో పూర్తిగా నిండిపోయాయి. అపార ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. విద్యుత్తు, సమాచార, రవాణా సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ఆ దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. శనివారం ఉదయం 11.41 నిమిషాలకు సుమారుగా నిమిషం 8 సెకన్లపాటు భూమి కంపించినట్లు గుర్తించారు. భూప్రకంపనల కారణంగా ప్రజలు తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. నేపాల్‌లో సంభవించిన భూకంప ప్రభావం భారత్‌, బంగ్లాదేశ్‌, మలేసియాల్లోనూ కన్పించింది.. కాగా భారీ భూకంపం నుంచి 25మంది తెలుగు యాత్రికులు సురక్షితంగా బయటపడ్డారు.  భారత ప్రధాని నరేంద్రమోదీ ఆ దేశ అధినేతలతో మాట్లాడారు. కావాల్సిన సహాయాన్ని అందజేస్తామని హామీ ఇచ్చారు. భారత్‌ నుంచి నాలుగు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాల్ని ఆ దేశానికి పంపింది. 

Tuesday, April 21, 2015

ఒడిశా మాజీ ముఖ్యమంత్రి పట్నాయక్‌ మృతి



తిరుపతి, ఏప్రిల్‌ 21: అసోం మాజీ గవర్నర్‌, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి జాకీ బల్లభ పట్నాయక్‌(88) కన్నుమూశారు. మంగళవారం అర్థరాత్రి 2 గంటల సమయంలో గుండెపోటుకు గురైన పట్నాయక్‌ తిరుపతిలోని స్విమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తిరుపతిలోని రాష్ర్టీయ సంస్కృత వర్సిటీ 18వ స్నాతకోత్సవంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన సోమవారం రాత్రి సంస్కృత విద్యాపీఠంలో బస చేశారు.

1927 జనవరి 3న పూరి జిల్లాలోని రామేశ్వర్‌లో జన్మించిన జేబీ పట్నాయక్‌ 1947లో ఉత్కల్‌ విశ్వవిద్యాలయం నుంచి సంస్కృతంలో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. 1949లో బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం నుంచి రాజకీయ శాస్త్రంలో ఎంఏ పట్టా పొందారు. కాంగ్రెస్‌ పార్టీతో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన జేబీ 1980-89, 1995-99 మధ్య కాలంలో ఒడిశా ముఖ్యమంత్రిగా పనిచేశారు. అనంతరం 2009లో అస్సాం గవర్నర్‌గా చేశారు.పట్నాయక్ భౌతిక కాయాన్ని మంగళవారం ఉదయం ప్రత్యేక విమానంలో భువనేశ్వర్‌కు తరలించారు.  



Thursday, April 16, 2015

రాహుల్ బ్యాక్ ....

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎట్టకేలకు ఢిల్లీకి చేరుకున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు ఉన్నట్టుండి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారు. ఆ తరువాత రాహుల్ గాంధీ తప్పిపోయాడంటూ, రాహుల్ గాంధీ తప్పిపోయిన విమానం లాంటి వాడు, అంటూ ఎంతో మంది ఆయన పై విమర్శలు చేశారు. రాజస్థాన్ లో అయితే ఏకంగా కొంత మంది పోస్టర్లు కూడా అంటించారు. రెండునెలలు తరువాత ఇప్పుడు రాహుల్ ఇంటికి చేరుకున్నారు. ఆయనను చూసేందుకు తల్లి సోనియాగాంధీ రాహుల్ ఇంటికి వెళ్లారు. ఈనెల 19వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రతిపక్షాలతో కలిపి భారీ ఎత్తున రైతు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టాలని తలపెట్టింది. ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టడానికి ముందుగానే రాహుల్ను రప్పించాలనుకున్న ప్రయత్నాలు సఫలమయ్యాయి.
... 

అమెరికా రోడ్డు ప్రమాదం లో ప్రకాశం విద్యార్ధి దుర్మరణం

న్యూయార్క్ , ఏప్రిల్‌ 16 : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థి శైలేంద్రహర్ష మృతి చెందాడు. ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన శైలేంద్ర అమెరికాలోని లామార్‌ యూనివర్సిటీలో సివిల్‌ ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు. శైలేంద్ర తండ్రి పంచాయతీరాజ్‌ శాఖలో ఏఈగా పనిచేస్తున్నారు. శైలేంద్ర నడుపుతున్న కారు అదుపుతప్పి పక్కనే ఉన్న స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శైలేంద్ర ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.  మరో నాలుగు రోజుల్లో శైలేంద్ర మృతదేహం ఒంగోలుకు వచ్చే అవకాశం ఉంది. ప్రమాదంలో శైలేంద్రతో పాటు మరో విద్యార్థి దీపక్‌కు తీవ్రంగా గాయాలయ్యాయి. ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. దీపక్‌ స్వస్థలం పామూరుగా తెలుస్తోంది.


Thursday, April 9, 2015

సత్యం రాజు సహా దోషులందరికీ ఏడేళ్ళ జైలు ....

హైదరాబాద్‌, ఏప్రిల్ 9; సత్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రామలింగరాజుతో పాటు దోషులందరికీ న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. రామలింగరాజు, రామరాజులకు రూ. 5 కోట్లు చొప్పున జరిమానా విధించింది. మిగతా దోషులకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున జరిమానా విధించింది. రామలింగరాజు సహా దోషులందరినీ జైలుకు తరలిస్తున్నారు. 
 2009 జనవరి 7న సత్యం కుంభకోణం వెలుగులోకి వచ్చింది.* 2009 జనవరి 9న సీఐడీ కేసు నమోదు, రామలింగరాజు అరెస్ట్‌* నిందితులుగా రామరాజు, సూర్యనారాయణరాజు, వడ్లమాని శ్రీనివాస్‌, ఆడిటర్లు గోపాలకృష్ణన్‌, తాళ్లూరి శ్రీనివాస్‌, మాజీ ఉద్యోగులు రామకృష్ణ, వెంకటపతిరాజు, శ్రీశైలం, అంతర్గత ఆడిటర్‌ ప్రభాకర్‌ గుప్తాలపై ఐపీసీ 120బీ, 420, 409, 419, 467, 471, 477ఏ, 201 సెక్షన్ల కింద కేసు నమోదు * 2009 ఫిబ్రవరి 16న సీబీఐ రంగప్రవేశం * ప్రత్యేక కోర్టు ఏర్పాటు, న్యాయమూర్తిగా బీవీఎల్‌ఎన్‌ చక్రవర్తి నియామకం* 3 అభియోగపత్రాలను కలిపి ప్రత్యేక న్యాయస్థానం విచారణ .* 2011 నవంబరు 4న రామలింగరాజుకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు .* మదుపుదారుల నష్టంతో కలిపి కుంభకోణం విలువ రూ.14వేల కోట్లుగా లెక్క తేల్చిన సి.బి.ఐ. * కుంభకోణంలో రామలింగరాజు, ఇతర నిందితులు కలిసి రూ.2743కోట్లు అక్రమంగా సంపాదించినట్లు సీబీఐ నిర్ధారణ .* ఈ కేసులో 226 మందిని విచారించిన కోర్ట్ ...3115 దస్త్రాలను పరిశీలన.... 




Wednesday, April 8, 2015

కొత్తూరు లో అమెజాన్ గిడ్డంగి ...

హైదరాబాద్‌,ఏప్రిల్ 8; మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తూరులో వేర్‌హౌస్‌ నిర్మాణానికి అమెజాన్‌ సంస్థ, తెలంగాణ ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. తెలంగాణలో అమెజాన్ సంస్థ అతిపెద్ద గిడ్డంగిని నిర్మించాలనుకోవడం సంతోషకరంగా ఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ నూతన పారిశ్రామిక విధానంలో రాష్ట్రంలో కంపెనీలు భారీగా ఏర్పాటు అవుతున్నాయని సీఎం తెలిపారు. కొత్తూరులో 2 లక్షల 80 వేల  చదరపు గజాల విస్తీర్ణం లో అమెజాన్ సంస్థ వేర్‌హౌస్‌ను నిర్మిస్తుంది. 


బంపర్ లాటరీఫై బాబు సర్కార్ ఆశ .?

విజయవాడ ,ఏప్రిల్ 8; నిధుల కొరతను తీర్చుకునే చర్యలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  అనేక మార్గాలను ,అవకాశాలను పరిశీలీస్తోంది .. ఇందులో భాగంగా గతంలో ఉన్న భాగ్యలక్ష్మీ బంపర్ లాటరీ టికెట్లను ప్రవేశ పెట్టడంపై బాబు సర్కార్ ద్రష్టి  పెట్టినట్టు సమాచారం . గతంలో నడిచిన ఈ లాటరీ ప్రజల నుండి వ్యతిరేకత రావడంతో నిలిచిపోయింది .అయితే  ఇప్పుడు కొత్త రాష్ట్రం కావడంతో ఆదాయం  చాలా అవసరం. రుణమాఫీ, రాజధాని నిర్మాణం వంటి విషయాలకు పెద్ద ఎత్తున నిధులు కావాలి. ఇందుకోసం లాటరీ ని కూడా ఒక ఆదాయ వనరుగా ప్రభుత్వం భావిస్తున్నట్టు చెబుతున్నారు  ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాలలో లాటరీలు నడుస్తున్నాయి. కాగా,  చట్ట సవరణ  ద్వారా మాత్రమే  తిరిగి లాటరీ తేవలసి వుంటుంది .

Tuesday, April 7, 2015

అమెరికాలో గుంటూరు యువకుని హత్య ...

గుంటూరు, ఏప్రిల్ 7:  గుంటూరు జిల్లాకు చెందిన ఓ యువకుడిని అమెరికాలో కొందరు దుండగులు హత్య చేశారు. తుళ్లూరు మండలం, దొండపాడుకు చెందిన రాజేష్ అనే యువకుడు వివాహం అనంతరం అమెరికాలో స్థిరపడ్డాడు. అమెరికాలో డబ్బు కోసం కొందరు దుండగులు రాజేష్‌ను కాల్చిచంపినట్లు తెలిసింది. నల్లజాతీయుఈ దుశ్చర్యకు పాల్పడినట్లు సమాచారం..ఇలినాయి రాష్ట్రంలోని పియోరియా ప్రదేశంలో ఓ గ్యాస్‌కంపెనీలో రాజేష్‌ ఉద్యోగం చేస్తున్నాడు. సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో కొంతమంది నల్లజాతీయులు గ్యాస్‌ కంపెనీ వద్దకు వచ్చి డబ్బులు డిమాండ్‌ చేయగా రాజేష్‌ అందుకు నిరాకరించడంతో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో రాజేష్‌పై నల్లజాతీయులు కాల్పులు జరిపారు. 

సంగీత చికిత్సలో గణపతి సచ్చిదానంద గిన్నిస్‌ రికార్డు ...

హైదరాబాద్,ఏప్రిల్ 7; అవధూత దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి గిన్నిస్‌ రికార్డు నెలకొల్పారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఒపేరా హౌస్‌లో అతిపెద్ద సంగీత చికిత్సా బోధనకు నేతృత్వం వహించినందుకు ఆయనకు ఈ  రికార్డు దక్కింది. అనేక దశాబ్దాలుగా సంగీత చికిత్సా రంగంలో ఆయన ప్రయోగాలు చేస్తున్నారు. 


దక్కని సిద్దయ్య..

హైదరాబాద్‌,ఏప్రిల్ 7: నల్గొండ జిల్లా జానకీపురం ఎన్‌కౌంటర్‌లో తీవ్రంగా గాయపడిన ఎస్‌ఐ సిద్ధయ్య మంగళవారం సాయంత్రం మృతి చెందారు. ఆయన హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్‌ కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం చింతలచెర్వుకు చెందిన సిద్ధయ్య కుటుంబం ఇరవై ఏళ్ల క్రితమే మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో స్థిరపడింది. అక్కడే పదోతరగతి చదివిన సిద్ధయ్య వెంటనే పోలీసు ఉద్యోగం కోసం ప్రయత్నించినా వయసు చాలలేదు. తర్వాత హైదరాబాద్‌కు వచ్చి ఇంటర్‌, డిగ్రీ చదువుతూనే శిక్షణ తీసుకున్నారు. 2012 బ్యాచ్‌ ఎస్సైగా ఎంపికై నల్గొండ జిల్లా మోత్కూరులో విధుల్లో చేరారు. ప్రస్తుతం ఆత్మకూర్‌ (ఎం) ఎస్సైగా పనిచేస్తున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం రామేశ్వరానికి చెందిన ధరణీషతో గతేడాది వివాహమైంది. తన భార్య గర్భిణి అని, ప్రసవసమయం దగ్గరపడినందున ఇంటికి వెళతానని సిద్ధయ్య ఉన్నతాధికారులను కోరాడు. అయితే సూర్యాపేట ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో సెలవు దొరకలేదు. 

వికారుద్దిన్ సామాన్యుడు కాదు...

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 07 : వరంగల్‌ జిల్లా ఆలేరు వద్ద జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన వికారుద్దీన్‌ దోడిపీల ద్వారా డబ్బు సంపాదించే వాడు. పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్‌ఐతో సంబంధాలున్నాయి. 2008లో తొలిసారిగా వికారుద్దీన్‌ పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు. మక్కామసీదులో బాంబు పేలుడుకు నిరసనగా ప్రతిఏటా దాడులకు దిగుతానని ప్రకటించి పోలీసులకు సవాలు విసిరాడు. మూడేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఆరుగురు పోలీసులను కాల్చి చంపాడు. గతంలో గుజరాత్‌ హోంమంత్రిపై దాడి కేసులో వికారుద్దీన్‌ నిందితుడు. అంతేకాదు గతంలో నరేంద్రమోదీని కూడా చంపేందుకు యత్నించాడు. ఐఎస్‌ఐతో సంబంధాలున్న వికారుద్దీన్‌ భారీగా ఆయుధ సంపత్తిని పెంచుకున్నాడు. వికారుద్దీన్‌ ముఠా డీజేఎస్‌లో క్రియాశీలకంగా పనిచేసింది. ఇంతటి కరుడుగట్టిన ఉగ్రవాదిని పోలీసులు ప్రాణాలకు తెగించి పట్టుకున్నారు. పలు కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న వికారుద్దీన్‌ను ఇటీవల విశాఖపట్నం జైలు నుంచి వరంగల్‌కు తరలించారు. ఈ ఉదయం పోలీసు వాహనంలో వికారుద్దీన్‌ సహా వికార్‌ అహ్మద్‌, సయ్యద్‌ అంజాద్‌ అలియాస్‌ సులేమాన్‌, ఇజార్‌ఖాన్‌, మహ్మద్‌ అనీఫ్‌, మహ్మద్‌ జకీర్‌లను హైదరాబాద్‌ తరలిస్తుండగా మూత్రం కోసం వాహనం ఆపి పోలీసులపై దాడికి దిగారు. పోలీసుల వద్దనున్న ఆయుధాన్ని తీసుకుని కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పుల్లో వీరిని మట్టుబెట్టారు. 

ఎన్ కౌంటర్లతో హొరెత్తిన తెలుగు రాష్ట్రాలు...చిత్తూరు జిల్లాలో 20 మంది ఎర్రచందనం స్మగ్లర్ల హతం ....తెలంగాణలో వికారుద్దిన్ సహా ఐదుగురు ఉగ్రవాదుల కాల్చివేత

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 07 : చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో మంగళవారం ఉదయం 20మంది ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు మట్టుబెట్టారు. ఇటీవల ఎర్రచందనం స్మగ్లింగ్‌ పెరగడంతో స్మగ్లర్లపై దృష్టిసారించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో శేషాచలం అడవులను ఫారెస్ట్‌ అధికారులు జల్లెడపడ్డారు. ఈ ఉదయం అడవుల్లో కూంబింగ్‌ నిర్వహిస్తుండగా తారసపడ్డ స్మగ్లర్లను లొంగిపోవాల్సిందిగా పోలీసులు కోరారు. అయితే వారు రాళ్ల వర్షం కురిపిస్తూ పోలీసులపై దాడికి దిగారు. దీంతో ఎదురుకాల్పులు ప్రారంభించిన పోలీసులు 20మంది ఎర్రచందనం స్మగ్లర్లను హతమార్చారు. . 

వికారుద్దిన్ సహా ఐదుగురు ఐఎస్‌ఐ ఉగ్రవాదులు కాల్చివేత 

మరోవైపు తెలంగాణ రాష్ట్రం కూడా ఎదురుకాల్పులతో హోరెత్తుతోంది. రెండు రోజుల క్రితం నల్లగొండ జిల్లా అర్వపల్లిలో జరిగిన ఎన్‌కౌంటర్‌ను, అంతకుముందు సూర్యాపేటలో పోలీసులపై ఇద్దరు ఉగ్రవాదుల కాల్పుల ఘటనను మర్చిపోకముందే వరంగల్‌ జిల్లా ఆలేరు వద్ద మరో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ఐదుగురు ఐఎస్‌ఐ ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో మోస్ట్‌వాంటెడ్‌ ఉగ్రవాది వికారుద్దీన్‌ కూడా ఉన్నాడు. పలు కేసులతోపాటు గతేడాది హైదరాబాద్‌లో ఆరుగురు పోలీసులను హతమార్చిన కేసులో వికారుద్దీన్‌ నిందితుడు. దోపిడీలతో డబ్బు సంపాదించే వికారుద్దీన్‌ను ఇటీవలే విశాఖపట్నం జైలు నుంచి వరంగల్‌ సెంట్రల్‌ జైలుకు తరలించారు. కోర్టులో హాజరుపర్చేందుకు హైదరాబాద్‌ తీసుకొస్తుండగా ఆలేరు దాటి మూడు కిలోమీటర్లు రాగానే టాయిలెట్‌ వస్తుందని చెప్పి వాహనం ఆపించారు. పోలీసులు వాహనం దిగగానే లోపలున్న నలుగురు ఉగ్రవాదులు కానిస్టేబుల్‌ వద్దనున్న తుపాకీ లాక్కొని కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఫైర్‌ ఓపెన్‌ చేశారు. ఎదురుకాల్పుల తర్వాత వికారుద్దీన్‌ సహా నలుగురు ఉగ్రవాదులు మరణించారు. 

Saturday, April 4, 2015


అమెరికాలో గుంటూరు యువతి అనుమానాస్పద మృతి ...

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 04 : అమెరికా లోని అలబామా ఏ అండ్‌ ఎం వర్సిటీలో గుంటూరు జిల్లాకు చెందిన యువతి అనుమానాస్పదం గా మరణించింది. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పెదరెడ్డిపాలెంకు చెందిన అబ్బూరి హజరత్‌ బాబు, శివమ్మ దంపతుల మూడో కుమార్తె లావణ్య (27) 2014లో ప్లాంట్‌ అండ్‌ సాయిల్‌ సైన్స్ లో పరిశోధన చేయటానికి అలబామా ఏ అండ్‌ ఎం వర్సిటీలో చేరింది. గత  బుధవారం ఉదయం వర్సిటీ ఆవరణలో లావణ్య మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. ఆమె మృతికి కారణాలు తెలియరాలేదు. దర్యాప్తు జరుగుతోంది. 


సూర్యాపేట దుండగులు హతం...?

హైదరాబాద్‌,ఏప్రిల్ 4; నల్గొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురంలో పోలీసులు, దుండగులుకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు దుండగులు హతమయ్యారు. దుండగుల కాల్పుల్లో నాగరాజు అనే కానిస్టేబుల్‌ మృతిచెందగా, ఎస్‌.ఐ సిద్దయ్య , సీఐ గంగిరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు సూర్యాపేట కాల్పుల ఘటనలో నిందితులుగా భావిస్తున్నారు.నల్గొండ జిల్లా సీతారాంపురంలో దోపిడీ దొంగలు సంచరిస్తున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దుండగులు పోలీసులపై కాల్పులకు దిగడంతో పోలీసులు- దొంగల మధ్య 6 రౌండ్లు కాల్పులు జరిగాయి. కాల్పుల తర్వాత మండల కేంద్రమైన అర్వపల్లి చేరుకున్న ఇద్దరు దుండగులు లింగమల్లు అనే వ్యక్తిని తుపాకీతో బెదిరించి అతని ద్విచక్రవాహనం లాక్కుని జనగాం వైపు పరారయ్యారు. పోలీసులు వెంబడించడం గమనించిన దుండగులు డి.కొత్తపల్లి గుట్టల్లోకి పరారయ్యారు. పోలీసులు డి.కొత్తపల్లి చేరుకోవడంతో అక్కడి నుంచి మోత్కూరు మండలం జానకీపురం వెళ్లారు. జానకీపురంలో పోలీసులు, దుండగుల మధ్య కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఇద్దరు దుండగులు, కానిస్టేబుల్‌ నాగరాజు మృతిచెందారు.  కాగా నల్లగొండ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన దుండగులు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారని భువనగిరి డీఎస్పీ తెలిపారు. అంజద్‌ రంజాన్‌, అస్లాం ఆయూబ్‌గా వీరిని గుర్తించినట్టు చెప్పారు. గతంలో వీరికి నేర చరిత్ర ఉందని, ఇద్దరూ షార్ప్‌ షూటర్లని డీఎస్పీ పేర్కొన్నారు. సూర్యాపేట కాల్పుల అనంతరం తప్పించుకు తిరుగుతున్న వీరిని  48గంటల తర్వాత పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమార్చి నట్టు  ఆయన తెలిపారు. 



Wednesday, April 1, 2015

ప్రజారాజధానిగా అమరావతి...

హైదరాబాద్‌,ఏప్రిల్ 1; అమరావతిని ప్రజారాజధానిగా నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ప్రజారాజధాని నిర్మాణానికి సింగపూర్‌ ప్రభుత్వం ముందుకొచ్చిందని, మే 15 లోపు రాజధాని బృహత్‌ ప్రణాళిక నివేదిక అందుతుందని ఆయన తెలిపారు. రాజధాని ప్రాంతాన్ని రేడియల్‌ రోడ్లతో అనుసంధానం చేస్తామన్నారు. విజయవాడ- గుంటూరు కలుపుతూ 200 కి.మీ. మేర రింగ్‌రోడ్‌ నిర్మిస్తామని, ఎన్‌హెచ్‌ 5,9,214 జాతీయ రహదారులకు అనుసంధానంగా ఈ రింగ్‌రోడ్‌ ఉంటుందన్నారు. కృష్ణానదిపై 5 వంతెనలు నిర్మిస్తామన్నారు. అభివృద్ధి కారిడార్లుగా విశాఖ- చెన్నై, మచిలీపట్నం- కాకినాడలను తీర్చిదిద్దుతామన్నారు. రాజమండ్రి నుంచి భద్రాచలం వరకు జలరవాణా మార్గం ఏర్పాటుచేస్తామన్నారు. గుడివాడ కారిడార్‌లో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పుతామన్నారు. గన్నవరంలో ఐటీ కారిడార్‌, నందిగామలో ఫార్మా కారిడార్‌ ఏర్పాటుచేస్తామన్నారు. 
పారిశ్రామిక విధానం ..
ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలకు 24 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తామని చంద్రబాబునాయుడు తెలిపారు. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడిస్తూ, * పారిశ్రామిక అనుమతులకు సింగిల్‌ డెస్క్‌ విధానం* రూ.50 కోట్ల వరకు పెట్టుబడి పెట్టే పారిశ్రామికవేత్తలకు 25 శాతం రాయితీ* ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా పారిశ్రామికవేత్తలకు వంద శాతం స్టాంపు డ్యూటీ మినహాయింపు* కొత్త పరిశ్రమలకు రోడ్లు, విద్యుత్‌, భూమి , భోగాపురం నుంచి కాకినాడ వరకు 3 ఎయిర్‌పోర్టులు, 2 పోర్టుల ఏర్పాటు ...కొత్త పారిశ్రామిక విధానంలోని ముఖ్య అంశాలని సి.ఎం చెప్పారు. 

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...