రాజినామాలు చేసి వెళ్ళండి !

జగన్ వర్గం ఎమ్మెల్యేలకు సి.ఎం. చురక

న్యూఢిల్లీ,జనవరి 22‌: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌పై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. పార్టీ నుంచి వెళ్లిపోయినవారు గెలిచిన తర్వాత చూద్దామని ఆయన అన్నారు. పార్టీ నుంచి వెళ్లిపోదలుచుకున్నవాళ్లు రాజీనామాలు చేసి మళ్లీ గెలవాలని ఆయన సూచించారు. రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం, తమ కాంగ్రెసు పార్టీ నిర్ణయం తీసుకుంటాయని, సరైన సమయంలో ఆ నిర్ణయం వెలువడుతుందని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. రాష్ట్ర విభజన అంశం చాలా జఠిలమైందని, అందుకే సమయం తీసుకుంటున్నారని ఆయన అన్నారు. 2014 వరకు తాము అధికారంలో ఉంటామని, 2014 ఎన్నికల్లో కూడా తామే గెలుస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కోరడానికి తాను ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, ఎకె ఆంటోనీ, చిదంబరం, వీరప్ప మొయిలీ, మమతా బెనర్జీలను కలిసినట్లు ఆయన తెలిపారు.  రాష్ట్రానికి 19 కొత్త రైళ్లు ఇవ్వాలని, ఇతర ప్రాజెక్టుల పూర్తికి నిధులు కేటాయించాలని తాను మమతా బెనర్జీని కోరినట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని కూడా మమతను కోరినట్లు ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని తాను ప్రధానిని కోరానని ఆయన చెప్పారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుపై పూర్తి స్థాయి నివేదికను పంపాల్సి ఉందని  చెప్పారు. ఉపాధ్యాయుల ఏకీకృత నిబంధనల సమస్యను పరిష్కారించాలని తాను ప్రధానిని కోరినట్లు ఆయన తెలిపారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల ప్రత్యేక అభివృద్ధి ప్రణాళిక కింద ఇప్పటికే ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలున్నాయని, ఈ ప్రణాళిక కిందికి వరంగల్, కరీంనగర్, శ్రీకాకుళం  , విజయనగరం, విశాఖపట్నం  , తూర్పు గోదావరి జిల్లాలను తేవాలని కోరానని ఆయన చెప్పారు. వరద, తుఫాను తాకిడి ప్రాంతాల్లో సహాయానికి ప్రత్యేక ప్యాకేజీ అందించాలని కోరినట్లు ముఖ్యమంత్రి  తెలిపారు. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు