Saturday, November 28, 2015

బాలుని మింగేసిన బోరుబావి.

హైదరాబాద్, నవంబర్ 29; మెదక్‌ జిల్లా పుల్కల్‌ మండలం బొమ్మారెడ్డిగూడెంలో బోరు బావిలో పడిన మూడేళ్ల బాలుడు రాకేశ్‌ మృతదేహం గా బయటకు వచ్చాడు.  రైతుకూలీ బైరు సాయిలు, మొగులమ్మ దంపతుల ఇద్దరు కుమారుల్లో ఒకడు రాకేశ్(3). అన్న బాలేష్(5)తో కలిసి బోరుబావిని తవ్వగా వచ్చిన రాతిపిండితో ఆడుకున్నాడు. అక్కడ తవ్వి ఉన్న బోరు గుంతలోకి తొంగిచూశాడు. ప్రమాదవశాత్తు అమాంతం అందులోకి జారిపోయాడు. తమ్ముడిని పట్టుకునేందుకు పక్కనే ఉన్న అతడి అన్న బాలేశ్ ప్రయత్నించాడు. తమ్ముడి కాలు పట్టుకుని లాగబోయాడు. కానీ అదుపు తప్పడంతో రాకేశ్ తలకిందులుగా లోనికి పడిపోయాడు. ..బోరుబావిలో పడ్డ బాలుడిని ప్రాణాలతో రక్షించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసులు సహాయక చర్యలను ముమ్మరం చేసినప్పటికి ఫలితం లేకుండా పోయింది. సహాయకచర్యల్లో అధికశక్తిగల మూడు పొక్లెయిన్లను, మూడు జేసీబీలు, రెండు చిన్న హిటాచీలు, మూడు పెద్ద హిటాచీలు పాల్గొన్నాయి.బాలుడిని రక్షించేందుకు అధికారయంత్రాంగం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.  బోరు బావి లోతు 150 అడుగులు కాగా బాలుడు 31 అడుగుల లోతున చిక్కుకున్నాడు. బండరాళ్లు ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటకం ఏర్పడింది. దీంతో అధికారులు నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఏజెన్సీ, డిజాస్టార్ మేనేజ్‌మెంట్ బృందాలను రంగంలోకి దించారు. అయినా బాలుడిని రక్షించేందుకు 24 గంటల పాటు శ్రమించిన ఫలితం వృథా అయింది. ఎన్డీఆర్‌ఎఫ్ బృందం బాలుడిని  ఆదివారం ఉదయం బోరుబావి నుంచి వెలుపలికి తీశారు. 

.. 

Friday, November 27, 2015

అమెరికాలో దుండుగుని కాల్పులలో ఇద్దరు మృతి

న్యూయార్క్, నవంబర్ 28; అమెరికాలోని కొలరాడోలో ఓ ఆసుపత్రి వద్ద దుండుగుడు కాల్పులకు తెగబడ్డాడు. కాల్పుల్లో ఇద్దరు మృతిచెందగా, ఐదుగురు పోలీసులు సహా 9మందికి గాయాలయ్యాయి. కాల్పులు జరిపిన  నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 


Thursday, November 26, 2015

టి.డి.పి. లోకి ఆనం బ్రదర్స్..

హైదరాబాద్‌,నవంబర్ 26; కాంగ్రెస్‌ పార్టీ నేత, మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి, ఆయన సోదరుడు ఆనం వివేకానందరెడ్డి తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకు రంగం సిద్ధమైంది. పలు నియోజవర్గాల కార్యకర్తలతో రాంనారాయణరెడ్డి సమావేశమయ్యారు. ఉదయగిరి, కావలి, ఆత్మకూరు, సర్వేపల్లి నియోజకవర్గాల కార్యకర్తల నుంచి అభిప్రాయసేకరణ చేస్తున్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో రాంనారాయణరెడ్డి ఆర్థికశాఖ మంత్రిగా పనిచేశారు.త్వరలో తెదేపాలో చేరుతున్నట్లు రాంనారాయణరెడ్డి ప్రకటించారు. 

సాలీళ్ళ ముట్టడి లో యు.ఎస్.. నగరం!

న్యూయార్క్, నవంబర్ 26; అమెరికాలోని తెన్నెస్సీ రాష్ట్ర పరిధిలోని నార్త్ మెంఫిస్ నగరాన్ని కోట్లాది సంఖ్యలో స్పైడర్ లు చుట్టుముట్టగా, వేలాది మంది ఊరు ఖాళీ చేసి వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైంది. దాదాపు కిలోమీటరు పొడవైన సాలెగూడును ఈ ఎనిమిది కాళ్ల పురుగులు గంటల వ్యవధిలో నిర్మించుకోగా, మెంఫిస్ వాసులకు హారర్ సినిమా కళ్లముందు కనిపించినట్లయింది."గాలిలో, నేలపై, ఇళ్లల్లో , కారుల్లో ఎక్కడ చూసినా స్పైడర్లు కనిపించాయి అని సీఎన్ఎన్ తెలిపింది. 
అయితే, ఇలా సాలీళ్లు ఒక్కసారిగా బయటకు రావడం వల్ల ప్రమాదమేమీ లేదని నిపుణులు అంటున్నారు. ఇవన్నీ క్షేమంగా తిరిగి వెళ్లేందుకు చర్యలు చేపట్టినట్టు మెంఫిస్ జూ క్యూరేటర్ స్టీవ్ రిచెలింగ్ వెల్లడించారు. . కాగా, గత నెలలో వేలాది స్పైడర్ లు ఓహియో బ్రిడ్జిని చుట్టుముట్టగా, గత సంవత్సరంలో మిస్సోరీలోని ఓ గృహంపై సాలీళ్ల సైన్యం దాడి జరిపింది.



బీమా స్టాఫ్ కు ధీమా..

హైదరాబాద్, నవంబర్ 26; భారత జీవిత బీమా సంస్థ -ఎల్ఐసీ ఉద్యోగులకు  15 శాతం వేతన పెంపుతో పాటు బ్యాంకుల తరహాలోనే నెలలోని రెండు వారాల్లో ఐదు పనిదినాల విధానాన్ని  ఖరారు చేసారు. ఎల్ఐసీ యాజమాన్యం, ఉద్యోగ సంఘాల మధ్య జరిగిన చర్చలు ఫలవంతం కాగా, వేతన పెంపును ఆగస్టు 2012 నుంచి అమలు చేయాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. పెరిగే 15 శాతం వేతనంలో 13.5 శాతం బేసిక్ పే పెంపు రూపంలో, 1.5 శాతం హెచ్ఆర్ఏ రూపంలో ఉద్యోగులకు అందుతాయి. 


ఎం.పి . గా పసునూరి ప్రమాణం

న్యూఢిల్లీ , నవంబర్ 26; : వరంగల్‌ ఎంపీగా గెలుపొందిన పసునూరి దయాకర్‌ గురువారం లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రామహాజన్‌ .... పసునూరి దయాకర్‌తో ప్రమాణం చేయించారు. పసునూరి దయాకర్‌ వరంగల్‌ ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. 


Wednesday, November 25, 2015

యాగానికి బాబునూ పిలుస్తున్నా ..కె.సి.ఆర్.

హైదరాబాద్, నవంబర్ 25; టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్వహించతలపెట్టిన అయుత చండీయాగానికి సమయం సమీపిస్తోంది. వచ్చే నెల 23న మెదక్ జిల్లా జగదేవపూర్ మండలం ఎరవలిలోని తన సొంత వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించనున్న చండీయాగానికి టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడును కూడా ఆహ్వానిస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. సొంత ఖర్చులతోనే యాగం నిర్వహిస్తున్నానని ఆయన స్పష్టం చేసారు.  రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఏపీ సీఎంను కూడా ఆహ్వానిస్తున్నానని  కేసీఆర్ ప్రకటించారు. 


Tuesday, November 24, 2015

సగానికి పైగా మండలాలో కరువు ..

హైదరాబాద్,నవంబర్ 25:  రాష్ట్రంలో 231 మండలాలను  కరువు మండలాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మండలాలను ఆదుకోవటానికి తక్షణ సహాయం కింద వెయ్యి కోట్ల రూపాయలు అందించాలని ముఖ్యమంత్రి  చంద్రశేఖర్‌రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.రాష్ట్రం లోని కరువు పరిస్థితులపై ఈ మేరకు ఒక ప్రాథమిక నివేదికను అధికారులు కేంద్రానికి పంపించారు.   అదిలాబాద్, ఖమ్మం జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాలు పూర్తిగా కరువులోనే ఉన్నాయి.నిజామాబాద్ జిల్లాలోని 36 మండలాల్లో దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది.  రంగారెడ్డి జిల్లాలో మొత్తం 37 మండలాలకు 33 మండలాలు కరువులోనే ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలో 57 మండలాలకు 19 మండలాలు, నల్లగొండ జిల్లాలో 59 మండలాలకు 22 మండలాలు, వరంగల్ జిల్లాలో 51 మండలాలకుగాను 11 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది. 

ప్రసూతి సెలవు 12 వారాల నుంచి 26 వారాలకు పెంపు ..

న్యూఢిల్లీ, నవంబరు 24: ఉద్యోగినులకు ప్రస్తుతం ఇస్తున్న ప్రసూతి సెలవును 12 వారాల నుంచి 26 వారాలకు పెంచే ప్రతిపాదనకు కేంద్ర ఆమోదముద్ర వేసింది. అంతేకాకుండా సరగసీ ద్వారా పిల్లలను పొందే మహిళలకూ, దత్తత చేసుకునే ఉద్యోగినులకూ 12 వారాలపాటు మెటర్నటీ లీవ్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.  1961 నాటి ప్రసూతి చట్టంలో సవరణ తీసుకువచ్చేందుకు ఒక ముసాయిదాపై కార్మిక శాఖ కార్మిక సంఘాలు, ప్రైవేటు కంపెనీల యాజమాన్యాలతో చర్చలు జరిపింది. ప్రస్తుత ప్రసూతి చట్టం ప్రకారం ఒక ఉద్యోగినికి డెలివరీ అంచనా తేదీకి ఆరు వారాల ముందు....ప్రసవానంతరం మరో ఆరు వారాలపాటు సెలవు మంజూరు చేస్తున్నారు. అయితే ఈ  సమావేశంలో నవమాసాలు మోసి సహజంగా కనే తల్లులకు మెటర్నటీ లీవ్‌ను పెంచేందుకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. 

గ్రేటరూ మాదే...కె.సి.ఆర్.

 హైదరాబాద్, నవంబర్ 25: గ్రేటర్‌ హైదరాబాద్ ఎన్నికలలోనూ , త్వరలో  నారాయణ్‌ఖేడ్‌ ఉప ఎన్నికలోనూ కూడా  వరంగల్ ఉప ఎన్నిక ఫలితం పునరావృత్తమవుతుందని  ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్  కు అనూహ్యమైన రీతిలో విజయాన్ని అందించి వరంగల్‌ ప్రజలు చారిత్రక తీర్పునిచ్చారని కొనియాడారు. తెలంగాణవ్యాప్తంగా 17 ఎంపీ స్థానాల్లో ఇప్పటి వరకూ ఎవరికీ రానంత భారీ మెజార్టీ ఇచ్చారన్నారు. వరంగల్‌ ఎన్నిక అపురూపమైనదని, ప్రభుత్వంపైనా, పార్టీపైనా ప్రజలు మరింత బాధ్యత మోపారని అన్నారు. అధికార పార్టీ గెలుపు సహజమేనన్న దానిపై స్పందిస్తూ మరి బిహార్‌, ఢిల్లీలోనూ బీజేపీ ఎందుకు ఓడిపోయిందని ప్రశ్నించారు.  ఇప్పటికైనా ప్రతి పక్షాలు బుద్ధి తెచ్చుకుని ప్రజల సమస్యలపై సహేతుకమైన, నిర్మాణాత్మకమైన సూచనలు చేయాలని హితవు పలికారు.  కాంట్రాక్టు ఉద్యోగులను రెండు నెలల్లోనే క్రమబద్ధీకరిస్తామని,  త్వరలోనే డీఎస్సీ ద్వారా 20 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు.    

ఆంధ్రకు మరో 700 కోట్లు విడుదల చేసిన కేంద్రం ..

న్యూఢిల్లీ, నవంబరు 25 విభజన హామీల్లో భాగంగా ఏపీకి రూ.700 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. ఈ నెల 23న ఈ నిధుల్ని మంజూరు చేసినట్లు  వెల్లడించింది. ఈ మొత్తంలో రాజధాని నిర్మాణానికి రూ.350 కోట్లు, ఏపీలో వెనుకబడిన ఏడు జిల్లాల అభివృద్ధికి రూ.50 కోట్ల చొప్పున రూ.350 కోట్లు ఇచ్చినట్లు కేంద్రం ప్రకటించింది. మరోవైపు పోలవరం జాతీయ ప్రాజెక్టుకు రూ.300 కోట్లు విడుదల చేస్తున్నట్లు రెండు నెలల కిందటే కేంద్రం ప్రకటించింది. కానీ, ఆ నిధులు విడుదల కాలేదు. ఈ ప్రాజెక్టు అమలు బాధ్యతను చూడాల్సిన కేంద్ర జల వనరుల శాఖ రివైజ్డ్‌ బడ్జెట్‌ ప్రతిపాదనలు రూపొందించి ఆర్థికశాఖకు పంపించింది. కానీ, పార్లమెంటు ఆమోదం పొందిన తర్వాతనే నిధులు విడుదలయ్యే అవకాశ ఉంటుందని ఆర్థికశాఖ అధికారులు తెలిపారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో రివైజ్డ్‌ బడ్జెట్‌ ప్రతిపాదనలన్నింటికీ ఆమోదం లభిస్తుందని, ఆ వెంటనే నిధులు విడుదల చేస్తామని వివరించారు.

టి.ఆర్. ఎస్. కే వరంగల్ పట్టం..

పసునూరి దయాకర్‌కు 4, 59,092 ఓట్ల భారీ మెజారిటీ
వరంగల్ ,నవంబర్ 24; వరంగల్ పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. ఆపార్టీ అభ్యర్ధి పసునూరి దయాకర్ భారీ మెజారిటీతో గెలుపొందారు. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీని మించి ప్రస్తుత అభ్యర్ధి మరో 60 వేల ఓట్లు ఎక్కువ మెజారిటీ రావడం విశేషం. టీఆర్ఎస్ అభ్యర్ధి దయాకర్ మొత్తం 4, 59,092 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఓవైపు ప్రతిపక్ష పార్టీలు ఎన్ని విమర్శలకు పాల్పడినా... ఓరుగల్లు ఓటర్లు మాత్రం టీఆర్ఎస్‌కే పట్టం కట్టారు. ఓరుగల్లు టీఆర్ఎస్ పార్టీకి కంచుకోట అని మరోమారు నిరూపించారు. టీఆర్ఎస్ అభ్యర్ధి పసునూరి దయాకర్‌కు 6,15,403 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్ధి సర్వే సత్యనారాయణకు 1, 56,310 ఓట్లు, బీజేపీ అభ్యర్ధి దేవయ్యకు 1,30,178 ఓట్లు వచ్చాయి. అలాగే ఇతరులకు 63,230 ఓట్లు వచ్చాయి. కాగా... 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో పోటీ చేసిన టీఆర్ఎస్ అభ్యర్ధి కడియం శ్రీహరికి మూడు లక్షల తొంభై వేలకు పైగా మెజారిటీ రాగా... ప్రస్తుతం పోటీచేసిన పసునూరి దయాకర్‌కు 4, 59,092 ఓట్ల మెజారిటీ రావడం విశేషం. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంలో ఓ సామాన్య కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన పసునూరి దయాకర్ అంచెలంచెలుగా ఎంపీ అయ్యారు. ప్రస్తుతం ఆయన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు. స్వతహాగా కళాకారుడు అయిన దయాకర్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించి పార్టీ అధినేత కేసీఆర్ దృష్టిలో పడ్డారు.

Saturday, November 14, 2015

10 లక్షల ఆదాయం ఉంటె గ్యాస్ సబ్సిడీ కట్ ...?

హైదరాబాద్, నవంబర్ 14: వార్షిక ఆదాయం పది లక్షలున్న వారు ఇక ఎల్పీజీ సబ్సిడీ వదులుకోవాల్సిందేనని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు  స్పష్టం చేశారు. పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఈ దిశగా కసరత్తు చేస్తోందని ఆయన వివరించారు. ఇప్పటి వరకు 30 లక్షల మంది వినియోగదారులు గ్యాస్ రాయితీని వదులుకున్నారని ఆయన తెలిపారు. పేదలకు సబ్సిడీతో గ్యాస్ కనెక్షన్ ఇచ్చేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. ఎఫ్‌డీఐ పాలసీలోని 15 విభాగాల్లో కేంద్రం 35 మార్పులు చేసిందని వెంకయ్యనాయుడు అన్నారు. 


.

Friday, November 13, 2015

పారిస్ పై ఉగ్రవాద పంజా .... 150 మందికి పైగా బలి

పారిస్‌,నవంబర్ 14;  పారిస్‌ నగరంలో ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. నగరంలోని పలు చోట్ల ఉగ్రవాదులు విచక్షణారహితంగా పేలుళ్లు, కాల్పులకు తెగబడ్డారు. ఉగ్రదాడిలో దాదాపు 150 మంది  పైగా ప్రాణాలు కోల్పోయారు. 100 మందికి పైగాగాయపడ్డారు. 100మందిని ఒకేచోట బంధించి బాంబులతో పేల్చేశారు. ఫ్రాన్స్‌ జాతీయ స్టేడియం సహా పలు రెస్టారెంట్లు, షాపింగ్‌ మాల్‌లలో ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. ఉగ్రవాదుల దాడిని తిప్పికొట్టేందుకు పోలీసులు కూడా తీవ్రంగాప్రయత్నించారు. పారిస్‌ బతక్లాన్‌ సమావేశ మందిరం వద్ద పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు ఫ్రెంచి మీడియా పేర్కొంది. పారిస్‌ స్టేడియం వద్ద రెండు ఆత్మాహతి దాడులు, ఒక బాంబు పేలుడు జరిపినట్టు పోలీసులు  వెల్లడించారు.ఉగ్రవాదుల దాడి ఘటన అనంతరం ఫ్రాన్స్‌ అధ్యక్షుడు హోలాండ్‌ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. పారిస్‌లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో హొలాండ్‌ తన టర్కీ పర్యటనను రద్దు చేసుకున్నారు.పారిస్‌లో జరిగిన కాల్పులు మానవత్వంపై జరిగిన దాడులుగా అమెరికా అధ్యక్షుడు ఒబామా అభివర్ణించారు. ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్‌కీమూన్‌ కాల్పుల ఘటనను తీవ్రంగా ఖండించారు. పారిస్‌లో జరిగిన ఉగ్రదాడిని రష్యా అధ్యక్షుడు వ్లాద్‌మిర్‌ పుతిన్‌ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదుల దాడిని అమానవీయ చర్యగా వ్యాఖ్యానించారు. జర్మన్‌ ఛాన్స్‌లర్‌ ఎంజెలా మెర్కల్‌ కూడా ఉగ్రవాదుల చర్యలను ఖండించారు. 
భారత్ దిగ్భ్రాంతి ....
బ్రిటన్‌ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్రమోదీ ... పారిస్‌లో ఉగ్రదాడుల ఘటనను తీవ్రంగా ఖండించారు. ఉగ్రదాడి ఘటన తీవ్ర మనోవేదన, క్షోభకు గురి చేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. పేలుళ్లలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాక్షించారు.


Thursday, November 12, 2015

అనర్హత పై తలసానికి హైకోర్ట్ నోటిస్ ..

హైదరాబాద్, నవంబర్ 12; టీడీపీ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలిచి, ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరి కేసీఆర్ కేబినెట్ లో కీలక మంత్రిగా వ్యవహరిస్తున్న తలసాని శ్రీనివాసయాదవ్ కు హైకోర్టు షాకిచ్చింది. మంత్రి పదవికి తలసాని అనర్హుడని ఆరోపిస్తూ తంగెళ్ల శివప్రసాదరెడ్డి అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టు, దీనిపై స్పందించాలని ఆదేశాలు జారీ చేస్తూ మంత్రికి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని కూడా కోర్టు తలసానికి సూచించింది. ఇప్పటికే ఇదే విషయంపై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలకు ఘాటుగా బదులిస్తున్న మంత్రి తలసాని హైకోర్టు నోటీసులకు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి...

థాంక్స్ చెప్పేందుకే బాబును కలిశా ...పవన్

విజయవాడ,నవంబర్ 12; నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు తాను రాలేకపోయానని, అందుకు సీఎంకు శుభాకాంక్షలు తెలిపేందుకు ఇవాళ వచ్చానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. అంతేగాక రాజధాని భూముల కోసం భూసేకరణ చేపట్టకూడదని తీసుకున్న నిర్ణయానికి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపినట్టు పవన్ చెప్పారు. విజయవాడలో సీఎంతో రెండు గంటల పాటు చర్చ అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో రాజధానిలో పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లానన్నారు. ప్రభుత్వం దృష్టి మొత్తం రాజధానిపైనే కాకుండా మిగతా ప్రాంతాల వైపూ చూడాలని ప్రస్తావించానన్నారు. ఇందుకు స్పందించిన సీఎం... ఎవరినీ బలవంతపెట్టి భూమిని తీసుకోబోమని చెప్పారన్నారు. అందరితో చర్చించాలకే భూములు సమీకరిస్తామని చెప్పారని తెలిపారు. ప్రధానంగా విశాఖ బాక్సైట్ తవ్వకాలపై ప్రధానంగా చర్చించామని పవన్ వెల్లడించారు. గనులపై ప్రభుత్వం ఇచ్చిన జీవోను కూడా పునరాలోచించుకోవాలని చంద్రబాబుకు సూచించినట్టు పేర్కొన్నారు. గిరిజనుల జీవితాలు దెబ్బతినకుండా చూడాలని కోరానని, చర్చించిన తరువాతే బాక్సైట్ పై ముందుకెళతామని చంద్రబాబు చెప్పినట్టు వివరించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రస్తావన వచ్చిందని, ప్రధాని నుంచి తుది ప్రకటన వచ్చాకే నిర్ణయం తీసుకుంటామన్నారని తెలిపారు.

Tuesday, November 10, 2015

మోడీ ని రావద్దంటున్న ఆవాజ్ యూకే...

లండన్, నవంబర్ 10: బిహార్‌లో బీజేపీ ఓటమితో ప్రధాని మోదీ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. నిన్నటి వరకు ఆయనను ఆకాశాన్నేత్తేసిన ఎన్నారైలు ఇప్పుడు విదేశీ పర్యటనకు రావద్దంటున్నారు. ప్రధాని మోదీ ఈ నెల 12 నుంచి యూకేలో పర్యటించనున్నారు. బ్రిటన్ పార్లమెంట్‌లో ప్రసంగించడంతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. క్వీన్ ఎలిజబెత్ అతిథ్యం కూడా పొందే అవకాశముంది. అయితే బ్రిటన్ ఇండో అసోసియేషన్ అయిన అవాజ్ యూకే మోదీ పర్యటనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మోదీ రావద్దంటూ యూకే పార్లమెంట్ వద్ద భారీ కటౌట్ ప్రదర్శించింది. అంతేకాదు ఆయనను నియంత హిట్లర్‌తో పోల్చింది. ఫ్లెక్సీని  గమనించిన అధికారులు వెంటనే దాన్ని తొలగించారు. అయితే తన ఆక్రోశాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లగక్కిన ఆవాజ్ యూకే,  2002 గుజరాత్ అల్లర్లకు మోదీనే కారణమని మండిపడింది.


Sunday, November 8, 2015

రిజర్వేషన్ అస్త్రమే మహాకూటమికి కలసి వచ్చిందా ....

న్యూఢిల్లీ, నవంబర్ 8; వెలువడిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీకి గట్టి షాక్ తగిలింది. లాలూ, నితీష్‌ల మహాకూటమి దెబ్బకు బీజేపీ నేతలు ఖంగు తిన్నారు. తమ పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని ఎదురు చూసిన కమలనాథుల ఆశలు గల్లంతయ్యాయి. దేశంలో అమల్లో ఉన్న రిజర్వేషన్ వ్యవస్థను పునఃసమీక్షించాలని గతంలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలతోపాటు దాద్రీ ఘటన, ఆవు మాంసం, పప్పుల ధరలు, బీహార్‌కు ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ, మత రాజకీయాలు, అసహనం వంటి అంశాలు కూడా ఈ ఎన్నికల్లో బీజేపీ అవకాశాలను తీవ్రంగా దెబ్బ తీశాయని చెప్పక తప్పదు.  రిజర్వేషన్లను సమీక్షించాలని మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు మహాకూటమి నేతలకు మహా అస్త్రంగా మారాయి.  దీన్ని లాలూ, నితీష్‌లు ఎన్నికల ప్రచారంలో భాగంగా తమకు అనుకూలంగా మలుచుకున్నారు. ఎన్నికల ప్రచారం లో భాగంగా రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను తీసివేస్తుందనే విషయాన్ని వీరు ఓటర్లలో బాగా ప్రచారం చేసారు.స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వచ్చి రిజర్వేషన్లను రద్దు చేయబోమని  చెప్పినా ఓటర్లు మాత్రం మహాకూటమి వైపే మొగ్గు చూపారు. 


మహాకూటమి కే బీ'హారం'...

పట్నా, నవంబర్  8;  బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం నితీష్ కుమార్, లాలూ ప్రసాద్‌ల మహా కూటమి అఖండ విజయం సాధించింది. మొత్తం 243 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మహా కూటమి 178 సీట్లను కైవసం చేసుకుంది. ఎన్డీఏ కూటమి 58 సీట్లను దక్కించుకుంది. ఇతరులు ఏడు స్థానాల్లో విజయం సాధించారు. ఎన్నో ఏళ్లుగా ప్రత్యర్థులుగా ఉన్న ఆర్జేడీ, జేడీయూ  ఈ  ఎన్నికలలో మిత్రపక్షాలుగా మారాయి. ముఖ్యంగా ఓబీసీ వర్గాల ఓటర్లపై  మహా కూటమి ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు ఫలితాలు సూచిస్తున్నాయి.  70శాతం ఓబీసీ ఓటర్లు మహాకూటమికి మద్దతు తెలపగా.. కేవలం 20శాతం ఓటర్లు మాత్రమే ఎన్డీయే కూటమికి ఓటు వేసినట్లు తేలింది. మిగిలిన 10శాతం ఓబీసీ ఓటర్లు స్వతంత్ర అభ్యర్థులకు తమ మద్దతు ప్రకటించారు. .మండల్‌ ప్రకటన అనంతరం దేశంలోని ఓబీసీ వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం పెరిగింది. ఓబీసీ నేతయైన లాలూ ప్రసాద్‌ బిహార్‌ ఓబీసీ వర్గాలకు ప్రతినిధిగా మారారు. రిజర్వేషన్లపై కొందరు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించడంతో దళితవర్గాలు కూడా ఆయనను అభిమానించాయి. దీంతో వారు తమ ప్రతినిధులుగా చెప్పుకునే మాంఝీ, పాస్‌వాన్‌ పార్టీలకు ఓటేయకుండా మహాకూటమి వైపు మళ్లినట్టు తెలుస్తోంది. 
మళ్లీ లాలూ ప్రభంజనం ... 
బిహార్ ఎన్నికల్లో లాలు ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ పడిలేచిన కెరటంలా అనూహ్యంగా పుంజుకుంది. 80 స్థానాలు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ నిలువడంతో నితీశ్ ప్రభుత్వంలో లాలూ కింగ్‌ మేకర్ పాత్ర పోషించనున్నారు. ఈ నేపథ్యంలో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్న లాలు తనయులు తేజస్వి (26), తేజ్ ప్రతాప్ (27)పైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. తేజస్వి రాఘోపూర్, తేజ్ ప్రతాప్ మహువా నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వీరిలో చిన్నవాడైన తేజస్వినే లాలు రాజకీయ వారసుడిగా భావిస్తున్నారు.నితీశ్ ప్రభుత్వంలో ఈ ఇద్దరు యువనేతలు కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తున్నది. జేడీయూ కన్నా అత్యధిక స్థానాలు సాధించినప్పటికీ సీఎం పీఠాన్ని నితీశ్‌కు విడిచిపెడుతున్న నేపథ్యంలో ఆర్జేడీ అత్యధిక క్యాబినెట్‌ బెర్తులను కోరే అవకాశముంది. ఈ నేపథ్యంలో లాలు తనయులు ఇద్దరికి కూడా మంత్రి పదవులు లభిస్తాయా అన్నది చూడాల్సి ఉంది.

15 ఏళ్ల తర్వాత ఆర్జేడీ మళ్లీ బిహార్ ఎన్నికల్లో సత్తా చాటింది. బిహార్ రాజకీయాల్లో చక్రం తిప్పే స్థితికి ఎదిగింది. అయితే, దాణా కుంభకోణంలో శిక్షపడటంతో లాలూ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఆయన నేరుగా పదవులు చేపట్టే అవకాశం లేకపోవడంతో లాలు తనయులే ప్రభుత్వంలో కీలకంగా ఉంటూ చక్రం తిప్పుతారని భావిస్తున్నారు.

Saturday, November 7, 2015

తొలి టెస్ట్ గెలిచాం ......

మొహాలి ,నవంబర్ 7; దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు లో భారత్‌ 108 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో 17 పరుగుల ఆధిక్యంతో కలిపి భారత్‌ నిర్దేశించిన 218 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 109 పరుగులకే ఆలౌట్‌ అయింది. దీంతో 5 రోజుల మ్యాచ్‌ మూడు రోజుల్లోనే ముగిసింది. ఈ విజయంతో 4 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యాన్ని సాధించింది.. జడేజా 5, అశ్విన్‌ 3 వికెట్లు తీసి సఫారీల పతనానికి కారణమయ్యారు. అమిత్‌ మిశ్రా, వరుణ్‌ ఆరోన్‌ చెరో వికెట్‌ తీశారు. 5 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర వహించిన రవీంద్ర జడేజా మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. 


కాశ్మీర్ కు కాసుల వర్షం కురిపించిన మోడీ

శ్రీనగర్ , నవంబర్ 7; జమ్మూకశ్మీర్‌కు ప్రధాని మోదీ భారీ ప్యాకేజీని ప్రకటించారు. అభివృద్ధి కోసం రూ.80వేల కోట్లు మంజూరు చేశారు. ఇది ఆరంభం మాత్రమే అని అన్నారు. కశ్మీర్‌కు పూర్వ వైభవం తీసుకువస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. దేశంలోని ఏ ప్రాంతం అభివృద్ధికి దూరంగా ఉన్నా తన స్వప్నం నెరవేరదని ఆయన స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్ ప్రజలు తన పట్ల చూపిన ప్రేమాభిమానాలు ఎప్పటికీ మరచిపోలేనని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్రంలో పీడీపీ, బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఆయన శ్రీనగర్‌లోని భారీ బహిరంగ సభలో ప్రసంగించారు.


వరంగల్ బరిలో 23 మంది ....

వరంగల్, నవంబరు 07: వరంగల్‌ ఉప ఎన్నికకు 38 నామినేషన్లు వచ్చినట్టు ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. వీటిలో ఏడు నామినేషన్లను తిరస్కరించామని, 8 మంది విత్‌డ్రా చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. మొత్తంగా వరంగల్‌ బరిలో 23 మంది అభ్యర్థులు ఉన్నట్టు చెప్పారు. 21న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందని భన్వర్‌లాల్ తెలిపారు.

Friday, November 6, 2015

లుఫ్తాన్సా విమానాలు రద్దు...

ఫ్రాంక్‌ఫర్ట్, నవంబరు 6; క్యాబిన్ సిబ్బంది సమ్మెతో జర్మనీ విమానయాన సంస్థ లుఫ్తాన్సా శుక్రవారం 290 విమానాలను రద్దు చేసింది. దీంతో 37,500 మంది ప్రయాణికులు అవస్థలు పడాల్సి వచ్చింది. రద్దు చేసిన 290 విమానాల్లో 23 ఖండాంతర విమానాలు కూడా ఉన్నట్టు లుఫ్తాన్సా అధికారులు పేర్కొన్నారు. ఖర్చు ఆదా విషయంలో క్యాబిన్ సిబ్బందికి, లుఫ్తాన్సా సంస్థకు మధ్య కొన్ని రోజులుగా వివాదం నెలకొంది. సమ్మె గురించి ముందుగా తమకు ఎటువంటి నోటీసులు లేకపోవడంతో ప్రయాణికులకు సమాచారం ఇవ్వలేకపోయామని, అసౌకర్యానికి క్షమించాలని లుఫ్తాన్సా కోరింది. 


జనం పై స్వచ్ఛభారత్‌ పన్ను ....

హైదరాబాద్‌, నవంబర్ 6; స్వచ్ఛభారత్‌ సేవా పన్ను విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని రకాల సేవలపై 0.5శాతం సేవా పన్ను విధించనున్నారు. ఈ నెల 15 నుంచి పన్ను అమలులోకి వస్తుంది. 

' చిరు ' కు సంకటం....

హైదరాబాద్,నవంబర్06: చిరంజీవి పెద్ద కొడుకును నేనేనంటూ సుజిత్ అలియాస్ రవీందర్ అనే యువకుడు సంచలనానికి తెరతీశాడు. చిరంజీవికి తానే పెద్ద కొడుకునని , కావాలంటే డీఎన్‌ఏ టెస్టులు చేసుకోవాలంటూ శుక్రవారం హెచ్‌ఆర్సీని ఆశ్రయించాడు. చిరంజీవి నటించిన పసివాడి ప్రాణం సినిమాలో తాను నటించానంటూ చెబుతున్నాడు. అయితే...ఇదంతా బోగస్‌ అంటూ మెగా అభిమానులు కొట్టిపారేశారు. పసివాడి ప్రాణంలో చిరంజీవి కొడుకుగా నటించింది అమ్మాయని వారు వివరణ ఇచ్చారు. 28 ఏళ్ల కిందట సినిమా రాగా..కొడుకునంటూ ఇప్పుడు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని చిరంజీవి అభిమానులు మండిపడ్డారు. ప్రచారం కోసమే రవీందర్‌ డ్రామా ఆడుతున్నారని మెగా అభిమానుల విమర్శించారు. రవీందర్‌కు మతిభ్రమించిందని ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇక రైలు టిక్కెట్ రద్దు అతి భారం...

న్యూఢిల్లీ, నవంబర్ 6: ఇకపై రైలు టిక్కెట్ రద్దు  చాలా భారమే.  క్యాన్సిలేషన్ ఛార్జీలు రెండింతలు కానున్నాయి. రైల్వే శాఖ ఈ నెల 12 నుంచి కొత్త క్యాన్సిలేషన్ ఛార్జీలు అమలు చేయనుంది. ప్రయాణానికి 48 గంటలకు ముందు టిక్కెట్ రద్దు చేసుకుంటే ఇకపై డబుల్ క్యాన్సిలేషన్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఏసీ ఫస్ట్ క్లాస్ తరగతికి రూ.240, ఏసీ టూ టైర్‌కు రూ.200, ఏసీ త్రిటైర్‌కు రూ.180, స్లీపర్ క్లాస్‌కు రూ.120, సెకెండ్ క్లాస్ టిక్కెట్‌పై రూ.60 మేర రద్దు ఛార్జీలు వసూలు చేస్తారు. వెయిట్ లిస్ట్, ఆర్‌ఏసీ టిక్కెట్లను ట్రైన్ షెడ్యూల్‌కు అరగంట ముందుగానే క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది. రైలు వెళ్ళిన తర్వాత ఇకపై ఎలాంటి టిక్కెట్లైనా క్యాన్సిల్ చేసుకోవడం కుదరదు. స్టేషన్ మాస్టారుకు కూడా టిక్కెట్ క్యాన్సిల్ అధికారం కల్పించనున్నారు. కౌంటర్‌లో రిఫండ్ ఇవ్వని పక్షంలో ఆయనను సంప్రదించవచ్చు. అయితే రిజర్వేషన్ చార్ట్ ప్రిపేర్ కాకముందు మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుంది.

ఖైదీ నెంబర్...2971

వరంగల్,నవంబర్ 6: మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు, ముగ్గురు మనువల అనుమానాస్పద మృతి కేసులో ఆయన కుటుంబ సభ్యులకు వరంగల్ సెంట్రల్ జైలు అధికారులు ఖైదీ నంబర్లు కేటాయించారు. రాజయ్య కు -2971, భార్య మాధవి కి  -7856, కుమారుడు అనిల్ కు  -2970 ఖైదీ నంబర్లు కేటాయించారు.  ఈ కేసులో రాజయ్య కుటుంబ సభ్యులకు కోర్టు రాజయ్య కుటుంబ సభ్యులకు14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం వారిని వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. ఇక అనిల్ రెండో భార్య సన కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రత్యేక పోలీసు బృందం హైదరబాద్‌లో కూడా గాలింపు చర్యలు చేపట్టింది.

ఛోటా ఆగయా...

న్యూఢిల్లీ, నవంబర్ 6; మాఫియా డాన్ ఛోటా రాజన్ ను సీబీఐ అధికారులు.  భారీ భద్రత మధ్య  బాలి నుంచి భారత్ కు తీసుకొచ్చారు.   ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ప్రత్యేక విమానం లో లో దాదాపు 27 ఏళ్ల తర్వాత స్వదేశంలో అడుగుపెట్టాడు రాజన్. దీంతో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అతడిని విచారించనున్న ఢిల్లీ సీబీఐ ఆఫీస్ ఏరియా పూర్తిగా పోలీసుల  ఆధీనమ్ లోకి వెళ్లిపోయింది. మొదట ఢిల్లీలో రాజన్ ను విచారించనున్న సీబీఐ.. తర్వాత ముంబైకి తరలించనుంది.  ముంబైలో  రాజన్ పై 70 కేసులు నమోదయ్యాయి. అయితే.. రాజన్ ను దేశానికి తీసుకురావడానికి ఒక రోజు ముందే… అతడిపై ఉన్న కేసులన్నింటిని సీబీఐకి బదిలీ చేసారు.    ఛోటా రాజన్ రెండు కిడ్నీలు ప్రస్తుతం పనిచేయడంలేదు. ప్రతిరోజు డయాలసిస్ చేయాల్సి ఉంటుంది. దీంతో అన్నింటికి అనుకూలంగా, భద్రత ఉండే విధంగా  ఢిల్లీ పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.  ఆర్థర్ రోడ్ జైళ్లోని బ్యారక్ నంబర్ 12 లో మాఫియా డాన్ ను ఉంచేందుకు ప్లాన్ చేస్తున్నారు. బుల్లెట్ ప్రూఫ్, బాంబ్, కెమికల్ ప్రూఫ్ అయిన ఈ బ్యారక్ లో గతంలో పాకిస్థాన్ తీవ్రవాది అజ్మల్ కసబ్ ను ఉంచారు.చిన్న చిన్న నేరాలతో మొదలై నేర ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగిన చోటా రాజన్ .. 1988 లో దేశం వదిలిపారిపోయాడు. అప్పటి నుంచి అతనిపై నిఘా పెట్టిన పోలీసులకు ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో చిక్కాడు. 

అంధుల ఫ్రెండ్లీ రైల్వే స్టేషన్‌గా మైసూర్...

మైసూర్ ,నవంబర్ 6; ఇండియాలోనే మొదటి అంధుల ఫ్రెండ్లీ రైల్వే స్టేషన్‌గా  మైసూర్ రికార్డుల్లోకెక్కింది. అంధుల లిపి అయిన బ్రెయిలీలో రైళ్ల రాకపోకల షెడ్యూల్‌ను తయారు చేసి ఈ స్టేషన్‌లో పెట్టారు. అనుప్రయాస్ అనే స్వచ్ఛంద  సంస్థ  ఈ ప్రాజెక్ట్ ను మొదటి విడతగా మైసూర్ రైల్వే స్టేషన్‌లో ప్రారంభించింది. ఈ షెడ్యూల్ బోర్డులో రైళ్ల రాకపోకల వివరాలతో పాటు.. రైల్వే స్టేషన్‌లోని ఎంట్రీలు, ఎగ్జిట్‌లు, ప్లాట్‌ఫాములు, కౌంటర్లు, మరుగుదొడ్లు ఎటువైపు ఉన్నాయో సూచిస్తాయి. ప్రతి ప్లాట్‌ఫామ్ పైన 400 మెటాలిక్ బ్రెయిలీ గుర్తులు బిగించారు.అనుప్రయాస్ సంస్థను 27 ఏళ్ల పంచం అనే యువకుడు నడిపిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌ను పంచం తన ఐదుగురు స్నేహితులతో కలిసి చేపట్టాడు. 


జి.హెచ్.ఎం.సి. ఎన్నికల బరిలో జనసేన?

హైదరాబాద్ , నవంబర్ 6; పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల బరి  లోకి దిగబోతున్నట్టు సమాచారం.   టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి  కలసి పోటి చేస్తాయని ప్రచారం జరుగుతోంది.  తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ  ఎన్నికలకు ముందే పవన్‌కళ్యాణ్‌ జనసేన పార్టీ ఆవిర్భవించినా.. ఆ ఎన్నికల్లో ప్రత్యక్ష పోటీకి దిగకుండా టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చారు. జనసేన పార్టీని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవలే రిజిస్టర్‌ చేసింది. అయితే ఎన్నికల గుర్తును కేటాయించలేదు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేయదలిస్తే స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించే గుర్తుల్లో  ఏదో ఒకటి కేటాయిస్తారు. ఇటీవల పవన్‌కళ్యాణ్‌ను కలిసిన పలువురు రాష్ట్ర స్థాయి బీజేపీ నేతలు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూటమిగా బరిలోకి  దిగుదామని ప్రతిపాదించగా పవన్‌ సానుకూలంగా స్పందించారని బీజేపీ వర్గాల భోగట్టా. 


బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...