Thursday, September 30, 2010

అయోధ్యలో కొంత భాగమే రాముడికి...

లక్నో,సెప్టెంబర్ 30: : అయోధ్యలో వివాదస్పద స్థలాన్ని మూడు భాగాలు చేయాలని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ స్పష్టం చేసింది. ఇందులో ఒక భాగం హిందూ మహాసభకు, మరో భాగం సున్నీ వక్ఫ్ బోర్డ్ కు , మురో భాగం నిర్మోహీ అఖాడాకు చెందుతాయని పేర్కొంది. హిందూ విశ్వాసాల ప్రకారం అయోధ్య రామజన్మభూమేనని న్యాయమూర్తులు డీవీ శర్మ, సుధీర్ అగర్వాల్, ఎస్‌యూ ఖాన్ నేతృత్వంలోని బెంచ్ తీర్పు వెలువరించింది. అయితే ఈ తీర్పుతో ఒక జడ్జి విభేదించినట్టు సమాచారం. మూడు నె లల పాటు అక్కడ యథాత థ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. మూడు నెలల తర్వాతే ఏ కార్యకలాపామైనా చేపట్టేందుకు అనుమతిస్తామని తెలిపింది. హిందూ విశ్వాసాల ప్రకారం రాముడి విగ్రహాలు యధాస్థానంలో ఉంటాయని పేర్కొంది.జాతి యావత్తు ఉత్కంఠగా ఎదురు చూసిన వివాదస్పద అయోధ్య అంశం పై అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ తన తీర్పు పాఠాన్ని 8,189 పేజీల్లో పొందు పరిచారు. న్యాయమూర్తులు డీవీ శర్మ, సుధీర్ అగర్వాల్, ఎస్‌యూ ఖాన్ విడివిడిగా తీర్పులిచ్చారు. జస్టిస్ అగర్వాల్ వెలువరించిన తీర్పును 5,238 పేజీల్లో 21 సంపుటాలుగా పొందుపరిచారు. జస్టిస్ డీవీ శర్మ 2,666 పేజీల్లో తీర్పు పాఠాన్ని ఉంచారు. జస్టిస్ ఎస్‌యూ ఖాన్ తన తీర్పును 285 పేజీల్లో నిక్షిప్తం చేశారు.కాగా, వివాస్పద అయోధ్య స్థలంపై అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ వెలువరించిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళతామని సున్నీ వక్ఫ్ బోర్డ్ తరపు న్యాయవాది తెలిపారు. వివాదస్పద స్థలాన్ని మూడు భాగాలుగా విభజించాలన్న కోర్టు తీర్పుపై తాము పూర్తిగా సంతృప్తి చెందడం లేదన్నారు.

Wednesday, September 29, 2010

బాలకృష్ణ రాముడుగా,నయనతార సీతగా బాపు దర్శకత్వంలో శ్రీరామరాజ్యం

హైదరాబాద్,సెప్టెంబర్ 29: సంపూర్ణరామాయణం, శ్రీరామాంజనేయయుద్ధం, సీతాకళ్యాణం వంటి అద్భుత పౌరాణిక చిత్రరాజాలను ప్రేక్షకులకు అందించిన మిత్ర ద్వయం- బాపు, రమణ మరో పౌరాణిక యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. ‘శ్రీరామరాజ్యం’ ఈ చిత్రం పేరు. బాలకృష్ణ ‘రాముడు’గా, నయనతార ‘సీత’గా ఇందులో నటిస్తారు. ఈ పౌరాణిక చిత్రానికి యలమంచిలి సాయిబాబు నిర్మాత. ఈ చిత్రానికి రచన, స్క్రీన్‌ప్లే ముళ్లపూడి వెంకటరమణ సమకూరుస్తున్నారు. ఇళయరాజా ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఈ చిత్రానికి ఆర్ట్: రవీంద్ర, గ్రాఫిక్స్: కమల్‌కణ్ణన్, ఎడిటింగ్: జి.జి.కృష్ణారావు, కెమెరా: పి.ఆర్.కె.రాజు, కో-ఆర్డినేటర్: సి.ద్వారకానాథ్‌బాబు, అసోసియేట్ డెరైక్టర్: శ్రీనివాస్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: తాండవకృష్ణ.

Tuesday, September 28, 2010

ఆస్ట్రేలియాలో మరో భారతీయుడిపై దాడి

మెల్‌బోర్న్,సెప్టెంబర్ 28 : ఆస్ట్రేలియాలో భారతీయుడిపై మళ్లీ జాత్యహంకార దాడి జరిగింది. "ఒరేయ్.. నువ్వు భారతీయుడివా?'' అని అడిగి మరీ బేస్‌బాల్ బ్యాట్లతో దారుణంగా కొట్టిన వైనమిది. శాన్‌డౌన్ పార్కు రైల్వేస్టేషన్‌కు నడిచి వెళ్తున్న 21 ఏళ్ల భారతీయుడిని నలుగురు కుర్రాళ్లు బైకుల మీద వచ్చి కొట్టినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడికి మోకాళ్లు పగిలిపోవడంతో పాటు ముక్కు మీద పెద్ద గాయమైంది. దాడి చేసినవారంతా 15-16 ఏళ్ల మధ్యవారేనన్న పోలీసులు.. బాధితుడి పేరు మాత్రం వెల్లడించలేదు. పలు సంస్కృతుల సమ్మేళనంగా ఉన్న తూర్పు శివార్లలో ఇలాంటి సంఘటన జరగడం ఆశ్చర్యకరమని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ విక్టోరియా (ఎఫ్ఐఏవీ) అధ్యక్షుడు వాసన్ శ్రీనివాసన్ వ్యాఖ్యానించారు.

ఆయుధ సాయంపై పాక్‌కు ఒబామా చురక

వాషింగ్టన్,సెప్టెంబర్ 28:  భారత్ ప్రయోజనాలకు భంగం కల్గించే రీతిలో పాకిస్థాన్‌కు ఆయుధ సాయం చేసే ప్రసక్తే లేదని అమెరికా పాకిస్థాన్‌కు స్పష్టం చేసింది. అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టగానే బరాక్ ఒబామా ఈ విషయాన్ని పాక్‌కు తెలియచేశారు. పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీతో 2009 మే 7న జరిపిన భేటీలో ఒబామా ఈ అంశాన్ని స్పష్టం చేసిన విషయం ఇటీవలే విడుదలైన ఓ పుస్తకం ద్వారా వెల్లడైంది. తమ ఆయుధ సాయాన్ని దుర్వినియోగపర్చరాదని ఒబాబా నిర్మొహమాటంగా తెలిపారు. పాక్‌కు అందే సాయంతో భారత్ ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడకుండా చూడాల్సి ఉందని ఒబామా ఈ భేటీలో సూచించారు. అమెరికా జర్నలిస్టు బాబ్ ఉడ్‌వార్డ్ రాసిన తాజా పుస్తకం 'ఒబామాస్ వార్'లో ఇరువురు నేతల భేటీ అంశం చోటుచేసుకుంది. ఇరువురు నేతల భేటీ సమయంలో జర్దారీ కుమారుడు బిలావల్ కూడా ఉన్నారని పుస్తకంలో తెలిపారు.

అమెరికా కాన్సులేట్ స్కాలర్‌షిప్‌లు

హైదరాబాద్,సెప్టెంబర్ 28 : అమెరికాలోని కమ్యూనిటీ కాలేజీ ప్రోత్సాహక కార్యక్రమాల్లో చేరేందుకు అర్హత కలిగిన అభ్యర్థులకు అమెరికా దేశ విద్య-సాంస్కృతిక వ్యవహారాల శాఖ స్కాలర్‌షిప్‌లను అందజేస్తోంది. హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ కార్యాలయం సంబంధిత వివరాలను వెల్లడించింది. అమెరికాలోని ఏదైనా ఒక కమ్యూనిటీ కాలేజీలో చేరి వృత్తిపరమైన నైపుణ్యాలను పెంచే ఏడాది వ్యవధి కోర్సు పూర్తి చేసేందుకు విశ్వవిద్యాలయం నేపథ్యం లేని ఆంధ్రప్రదేశ్ యువత ఎవరైనా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.హైదరాబాద్ యుఎస్ కాన్సులేట్ ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టడం ఇది రెండవ సారి. ఎంపికైన అభ్యర్థులకు అమెరికా ప్రభుత్వమే రాను, పోను విమాన ఛార్జీలు, ట్యూషన్ ఫీజులు భరించి, ఆరోగ్య ప్రయోజనాలను కల్పిస్తుందని పేర్కొన్నారు. పదవ తరగతి చదవి, వారు ఎంచుకున్న రంగంలో రెండేళ్ల పాటు పనిచేసిన అనుభవం ఉండాలని, రెండు నెలల పాటు అందించే ఇంగ్లీష్ శిక్షణను అర్థం చేసుకునే పరిజ్ఞానం ఉండాలన్నారు. ఆర్థికంగా వెనుకబడిన నేపథ్యం ఉన్న వారికి ప్రాధాన్యతనిస్తామన్నారు. వ్యవసాయం, అప్లయిడ్ ఇంజనీరింగ్, బిజినెస్ మేనేజ్‌మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్, నర్సింగ్‌తో సహా కొన్ని ఆరోగ్య రంగాలు, హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ రంగాలను ఎంచుకోవచ్చని తెలిపారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను అక్టోబర్ 22 లోగా హైదరాబాద్ యుఎస్ కాన్సులేట్ కార్యాలయం, పబ్లిక్ డిప్లొమసీ, మీడియా ఆఫీస్, పైగా ప్యాలెస్, 1-8-323, చిరాన్ ఫోర్ట్ లేన్; బేగంపేట, సికింద్రాబాద్-3 చిరునామాకు పంపాలన్నారు.

అయోధ్య వివాదంపై 30న లక్నో బెంచ్ తీర్పు

లక్నో, సెప్టెంబర్ 28 : అయోధ్య వివాదం తీర్పు ప్రకటనపై దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు స్టే కొట్టివేయడంతో, ఆగిపోయిన తీర్పును ఈ నెల 30 వ తేదీన ప్రకటించనున్నట్టు అలహాబాద్ హైకోర్టు లక్నోబెంచ్ మంగళవారంనాడు ప్రకటించింది. గురువారం (30వ తేదీ) సాయంత్రం 3-30 గంటలకు తీర్పు వెలువడనుంది. మంగళవారం అయోధ్య వివాదంపై సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.హెచ్. కపాడియా నేతృత్వంలో వారం రోజుల క్రితం ఇచ్చిన మధ్యంతర స్టేను ఎత్తివేస్తూ సుప్రీమ్ కోర్టు ఆదేశాలు జారీ చేయడం పట్ల అన్ని రాజకీయ పార్టీలు హర్షం వ్యక్తం చేశాయి.అరవైఏళ్లుగా అపరిష్కతంగా ఉన్న అయోధ్య వివాదంపై తీర్పు వాయిదా వేయడంవల్ల ఒరిగేది ఏమీలేదని హిందూ మహాసభ నేతలు పేర్కొన్నారు. ఎంత త్వరగా తీర్పు వస్తే అంత మంచిదని వారన్నారు. కాగా 30న తీర్పు వెలువడనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశం అంతటా అప్రమత్తత ప్రకటించింది. తీర్పు ఎలా వచ్చినా అన్ని వర్గాల ప్రజలు సంయమనం పాటించాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. అన్ని మతాలవారూ సంయమనం పాటించాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను ఇప్పటికే కట్టుదిట్టం చేశారు. ఎవరు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసినా తీవ్రంగా పరిగణిస్తామని కూడా కేంద్రం హెచ్చరించింది. మంగళవారంనాడు అయోధ్యలో బంద్ వాతావరణం నెలకొంది. రవాణా వ్యవస్థ స్తంభించింది. వ్యాపార సముదాయాలు మూసివేశారు. మరో 48 గంటలు ఇదే వాతావరణం కొనసాగే అవకాశం ఉంది.

Monday, September 27, 2010

బ్రిటన్ లేబర్ పార్టీ నేతగా మిలిబాండ్

మాంచెస్టర్, సెప్టెంబర్ 27: బ్రిటన్‌లో లేబర్ పార్టీ అధ్యక్ష పదవి కోసం అన్నదమ్ముల పోరులో తమ్ముడే విజయం సాధించాడు. గత ప్రభుత్వంలో వాతావరణ శాఖను పర్యవేక్షించిన ఎడ్ మిలిబాండ్.. లేబర్ పార్టీ నూతన నేతగా ఎన్నికయ్యారు. మిలిబాండ్‌కు చివరి వరకు గట్టిగా పోటీనిచ్చిన ఆయన అన్నయ్య డేవిడ్ ఎట్టకేలకు ఓటమి అంగీకరించాడు. చివరి వరకు ఉత్కంఠ రేపిన ఈ పార్టీ ఎన్నికల్లో మిలిబాండ్‌కు 50.65 శాతం ఓట్లు లభించగా, డేవిడ్‌కు 49.35 శాతం మద్దతు లభించింది.

78వ ఏట అడుగిడిన మన్మోహన్

న్యూఢిల్లీ,సెప్టెంబర్ 27: ప్రధాని మన్మోహన్ సింగ్ 78వ ఏట అడుగుపెట్టారు. ఆదివారం ఆయన నిరాడంబరంగా తన జన్మదినం జరుపుకొన్నారు. రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ ప్రధానికి పుష్ప గుచ్ఛాలు పంపించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, విపక్ష నేత సుష్మా స్వరాజ్ తదితరులు మన్మోహన్‌కు ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

పదేళ్ళ తర్వాత ఖరీఫ్ లో అత్యధిక సాగు

హైదరాబాద్, సెప్టెంబర్ 27: రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్ సాగు, రికార్డులు సృష్టించింది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా కురిసిన వర్షాలతో సర్కారు అంచనాలకు మించి సాగు విస్తీర్ణం నమోదైంది. గత పదేళ్లలో ఎన్నడూ లేనట్లు ఈ సీజన్‌లో అత్యధిక స్థాయిలో పంటలు సాగయ్యాయి. ఆహార పంటలతోపాటు పప్పు ధాన్యాలు, ఇతర వాణిజ్య పైరుల సాగు సాధారణాన్ని మించి నమోదైంది. నూనె గింజల విస్తీర్ణం మాత్రం క్షీణించింది. రాష్ట్రంలో ఖరీఫ్‌లో సగటు సాగు విస్తీర్ణం 78.23 లక్షల హెక్టార్లు. గత ఖరీఫ్‌లో తీవ్ర దుర్భిక్షం మూలంగా 69.66 లక్షల హెక్టార్లలోనే రైతులు పైర్లు వేశారు. పంటల దిగుబడి, ఉత్పత్తి సైతం దారుణంగా క్షీణించింది. ఈ నేపథ్యంలో ఈ ఖరీఫ్‌లో 82.22 లక్షల హెక్టార్లలో పైర్లు సాగు చేయాలని వ్యవసాయ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సారి నైరుతి రుతుపవనాలు కరుణించడం, అదనులో వర్షాలు కురియడంతో వ్యవసాయ శాఖ అంచనాలకు మించి సాగు విస్తీర్ణం నమోదైంది. ప్రస్తుతం రెండు, మూడు జిల్లాల్లో అక్కడక్కడా వరి నాట్లు మినహా.. ఖరీఫ్ సీజన్ దాదాపు ముగిసినట్లే! ఇప్పటికి 82.38 లక్షల హెక్టార్లలో వివిధ పైర్లు సాగయ్యాయి. ఖరీఫ్‌లో అత్యధికంగా సాగు విస్తీర్ణం నమోదవడం గత పదేళ్లలో ఇదే ప్రథమం. ప్రధాన ఆహార పంట వరి సాగు విస్తీర్ణం ఖరీఫ్ సగటును మించి నమోదైంది. ఖరీఫ్‌లో వరి సగటు విస్తీర్ణం 25.22 లక్షల హెక్టార్లు. ఇప్పటికే 25.87 లక్షల హెక్టార్లలో రైతులు వరి వేశారు. ప్రస్తుతం గోదావరి, కృష్ణా డెల్టాల్లో అక్కడక్కడా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇంకా నాట్లు వేయాల్సి ఉంది. ఈ నెలాఖరులోగా అక్కడ కూడా సాగు పూర్తవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ సారి మొక్కజొన్న, జొన్న, ఆముదాలు, పొద్దుతిరుగుడు మినహా ఇతర అన్ని ప్రధాన పంటల సాగు సగటును మించి నమోదైంది.

కృష్ణాజిల్లా టీడీపీ నేత దారుణ హత్య

హైదరాబాద్, సెప్టెంబర్ 27 : కృష్ణాజిల్లాకు చెందిన తెలుగుదేశంపార్టీ నేత చలసాని వెంకటేశ్వరరావు (పండు) దారుణ హత్యకు గురయ్యారు. యూసుఫ్‌గూడ, మధురానగర్‌లో స్వప్నిక అపార్టుమెంట్‌లో ఉన్న ఆయనపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి హత్య చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని, పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని గాంధీఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.భూ వివాదమే హత్యకు కారణమని తెలియవచ్చింది. పండు ప్రైవేటుగా ఆస్తులు సెటిల్‌మెంట్ వ్యవహారాలు చేస్తుంటారు. గతంలో కూడా విజయవాడ ఓ డాక్టర్, ఆయన కుమారుడికి సంబంధించిన ఆస్తి తగాదా విషయంలో జోక్యం చేసుకోగా పండుపై కేసు నమోదు అయింది.అప్పుడు విజయవాడ నగర కమిషనర్ సీతా రామాంజనేయులు పండును అరెస్టు చేసి, అనంతరం విడిచిపెట్టిన విషయం విదితమే.ఉయ్యూరు నుంచి టీడీపీ తరఫున శాసనసభ్యునిగా రెండు సార్లు పోటీ చేసి ఓటమిపాలయ్యారు. గత ఎన్నికల్లో పెనమలూరు నుంచి మంత్రి పార్ధసారధిపై పోటీచేసి ఓడిపోయారు. కృష్ణాజిల్లా, పెదపారుపూడి మండలం, వెంట్రప్రగడకి చెందిన పండు రెండు రోజుల క్రితమే హైదరాబాద్‌కు వచ్చి హత్యకు గురయ్యారు.

Sunday, September 26, 2010

కల్లోల కాశ్మీరానికి కాసింత ఊరట

న్యూఢిల్లీ,సెప్టెంబర్ 26: కల్లోల కాశ్మీరాన్ని కుదుటపడేసేందుకు కేంద్రం ఎనిమిది అంశాలతో 'కాశ్మీర్ ఫార్ములా'ను ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్‌లోని అన్ని వర్గాల ప్రజానీకంతో చర్చలు జరిపేందుకు మధ్యవర్తుల బృందాన్ని ఏర్పాటు చేయడంతో పాటు.. కాశ్మీర్‌లోయలో ప్రత్యేకించి శ్రీనగర్‌లో భద్రతా దళాల మోహరింపు అంశాన్ని సమీక్షించనున్నట్లు పేర్కొంది. ఫార్ములా లోని అంశాలు: 1. రాష్ట్రంలోని అన్ని వర్గాలతో చర్చల కోసం ప్రముఖ వ్యక్తి సారథ్యాన మధ్యవర్తుల బృందం.2. అల్లర్ల సందర్భంగా అరెస్టయిన విద్యార్థులు, యువతపై కేసులు ఎత్తివేత, జైళ్ల నుంచి విడుదల.3. ప్రజా భద్రతా చట్ట కేసులపై సమీక్ష, బందీల విడుదల.4. తక్షణమే యునిఫైడ్ కమాండ్ సమావేశం, కాశ్మీర్‌లోయలో దళాల మోహరింపుపై సమీక్ష.5. అల్లర్లలో చనిపోయినవారి కుటుంబాలకు ఐదేసి లక్షలు.6. జమ్మూ, లడఖ్ ప్రాంతాల అభివృద్ధి అవసరాలను పరిశీలించేందుకు రెండు టాస్క్‌ఫోర్స్‌లు.7. తక్షణమే అన్ని విద్యాసంస్థల తెరవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి, ప్రత్యేక తరగతుల నిర్వహణకు సూచన.8. వంద కోట్లతో స్కూళ్లు, కాలేజీల్లో మౌలిక సదుపా యాల అభివృద్ధి. కాశ్మీర్ లోయలో పరిస్థితిని, ఇటీవల 36 మంది సభ్యులతో కూడిన అఖిలపక్ష బృందం సమర్పించిన నివేదికను సమీక్షించిన అనంతరం సీసీఎస్ ఈ నిర్ణయాలు తీసుకుంది.

చికాగో ఇన్‌స్టిట్యూట్‌లో గణేశ్ పాఠాలు

నెవాడా (అమెరికా), సెప్టెంబర్ 26: ప్రపంచంలోనే ప్రముఖ కళా పీఠం 'ఆర్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ చికాగో' హిందూ దేవుడు గణేశుని తమ పాఠ్యాంశంగా చేర్చింది. కిం డర్‌గార్డెన్ నుంచి 12వ తరగతి వరకూ వివిధ స్థాయిలలో గణేషుని చిత్ర వి చిత్ర కళారూపాలపై విద్యార్థులకు బో ధించనున్నారు. గణేషుని ఆకృతులు, వివిధ ముద్రలు, నాట్య భంగిమలతో పాటు శివ, పార్వతి, ఏనుగు రూపం, భారతీయ సంస్కృతిపై పాఠాలుంటాయి. ఇందుకోసం హిందూ కళాకృతులను సమకూర్చుకుని, గణేషుని ఘన చరిత్రను కూడా ఈ ఆర్ట్ ఇన్‌స్టిట్యూట్ వారు సిద్ధం చేసుకున్నారు. ఈ నిర్ణయం పట్ల ప్ర ముఖ హిందూ మేధావి రాజన్ జెడ్ హర్షం వ్యక్తం చేశారు. భారతీయ హిందూ ధర్మంలో కళకు ఎల్లవేళలా పెద్దపీట ఉందని, సంస్కృత సాహిత్యంలో దేవతల చిత్రీకరణపై ప్రస్తావన ఉందని తెలిపారు.

సూపర్ హెర్క్యులస్ వచ్చేస్తోంది...

వాషింగ్టన్, సెప్టెంబర్ 26: ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన రవాణా విమానం సి-130జె సూపర్ హెర్క్యులస్ త్వరలోనే భారత గగనతలం నుంచి ఎగరబోతోంది. మనకు రావల్సిన ఈ తరహాలోని ఆరు విమానాల్లో మొదటిది వచ్చేనెల మొదట్లోనే వస్తోంది. జూన్‌లోనే భారత వైమానిక దళం రంగులతో సిద్ధమైన ఈ సూపర్ హెర్క్యులస్ ఇంజన్లను ఇటీవలే పరీక్షించినట్లు ఈ విమానాల ఉత్పాదక సంస్థ లాక్‌హీడ్ మార్టిన్ తెలిపింది. ఆరు విమానాలను కలిపి రూ. 4,600 కోట్లకు కొనే ఒప్పందం భారత్ - అమెరికాల మధ్య కుదిరింది. ఇవి వస్తే భారత సైన్యానికి, భారత వైమానిక దళానికి ప్రత్యేక ఆపరేషన్లు చేపట్టే సామర్థ్యం మరింత మెరుగవుతుందని లాక్‌హీడ్ తెలిపింది. ఇన్‌ఫ్రారెడ్ డిటెక్షన్ సెట్ (ఐడీఎస్) సహా మనకు కావల్సిన అన్ని పరికరాలను ఇందులో అమర్చారు. తక్కువ ఎత్తులో చేసే ఆపరేషన్లు, గగనతలం నుంచి బలగాలను కిందకు వదలడం వంటివి మరింత సులభతరమవుతాయి. ఈ విమానాలు అమెరికా వైమానిక దళంతో పాటు ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా వైమానిక దళాలకు కూడా అందుబాటులోకి రాగానే తాము వీటి నిర్వహణ కాంట్రాక్టు కూడా తీసుకుంటామని లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ ప్రతిపాదించింది. దుమ్ముతో కూడిన, ఎత్తుపల్లాలతో ఉన్న ఎయిర్‌స్ట్రిప్‌ల మీద నుంచి కూడా అత్యంత సులభంగా టేకాఫ్ తీసుకోగల సామర్థ్యం ఈ సీ-130జె విమానాలకు ఉంటుంది. మారుమూల ప్రాంతాలకు కూడా పరికరాలు, దళాలను ఇది తరలించగలదు. పలు విమానాలు చేయగలిగే పనులను ఇదొక్కటే ఒకే సమయంలో చేయగలదు. ఇందులో నాలుగు ఇంజన్లుంటాయి. ఇందులోని కార్గో కంపార్ట్‌మెంట్ 41 అడుగుల పొడవు, 9 అడుగుల ఎత్తు, పది అడుగుల వెడల్పు ఉంటుంది.

Thursday, September 23, 2010

దర్శక నిర్మాత తిలక్ ఇకలేరు

హైదరాబాద్,సెప్టెంబర్ 23: ప్రముఖ సినీ దర్శకుడు, నిర్మాత కె.బి.తిలక్ కన్నుమూశారు. ఆయన వయసు 85 సంవత్సరాలు. సామాజిక స్ప్రుహతో  కుదిన పలు చిత్రాలను ఆయన నిర్మించారు. ఈడు-జోడూ,భూమికోసం వంటి  ప్రజాదరణ  పొందిన పలు చిత్రాలను తిలక్ నిర్మించారు.

కొవ్వును కరిగించే కొత్త మిషన్

లండన్, సెప్టెంబర్ 23:శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వును  వదిలించుకునే ఓకొత్త మిషన్‌ను కనుగొన్నారు. శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉన్న ప్రాతం మీద ఓ జెల్ ప్యాచ్‌ని అతికించుకుంటే చాలు.. కొవ్వుకణాలను అది కరిగించేస్తుంది. తర్వా త కొద్దికాలంలోనే ఈ మృతకణాలు శరీరం నుంచి బయటకు పోతాయి. దాంతో సదరు వ్యక్తులు సన్నగా రివటల్లా కనిపిస్తా రు. ద జెల్‌టిక్ సంస్థ తయారుచేసిన ఈ మిషన్ ధర అర కోటికి పైమాటే.. అంటే, రూ. 56. 95 లక్షలన్న మాట! కొవ్వును తీసేయడానికి చేసే లిపోసక్షన్ అయితే చాలా బాధాకరంగా ఉం టుందని, ఇది ఏమాత్రం నొప్పి లేకుండా సన్నబరుస్తుందని శా స్త్రవేత్తలు చెబుతున్నారు. పైగా, మొత్తం చికిత్సకు గంట నుంచి మూడుగంటల సమయం మాత్రమే పడుతుందట. 

కెనడాలో తొలి ఎన్ఆర్ఐ మహిళా మంత్రి మృతి

వాన్‌కొవర్ ( కెనడా), సెప్టెంబర్ 23 : కెనడాలోభారతీయ సంతతికి చెందిన తొలి మహిళా మంత్రి సిందీ హాకిన్స్ అనారోగ్యంతో మ రణించారు. సుదీర్ఘకాలంగా లుకేమియాతో బాధపడుతున్న హాకిన్స్(52).. ఢిల్లీలో జన్మించి.. కెనడాలో స్థిరపడిన ఈ సిక్కు మహిళ అసలు పేరు సతిందర్ కౌర్ అహ్లూవాలియా. కెనడాలో 12 ఏళ్ల పాటు నర్సుగా సేవలు అందించిన హాకిన్స్.. ఆ తరువాత బ్రిటిష్ కొలంబియా ప్రావెన్స్ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించారు. 1996లో అసెంబ్లీకి ఎన్నికై..కెనడా చరిత్రలో చట్టసభలకు ఎన్నికయిన తొలి ఎన్ఆర్ఐ మహిళగా కూడా ఆమె రికార్డు సృష్టించారు. అప్పటి నుంచి సుదీర్ఘ కాలం అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించిన హాకిన్స్.. అనారోగ్యం కారణంగా గత ఏడాది స్వచ్ఛందంగానే పోటీ నుంచి తప్పుకొన్నారు. గోర్డాన్ కాంబెల్ మంత్రివర్గంలో మంత్రిగా పని చేసిన హాకిన్స్.. అంతకు ముందు సభాపతి కూడా సేవలు అందించారు. ప్రజల సేవకు అంకితమైన విశేష రాజకీయ వ్యక్తిత్వం గల నాయకురాలిగా.. ప్రధానమంత్రి గోర్డాన్ కాంబెల్ తన సందేశంలో కొనియాడారు.

అయోధ్య తీర్పుపై సుప్రీంకోర్టు మధ్యంతర స్టే

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23 : అయోధ్యపై అహమ్మదాబాద్ హైకోర్టు శుక్రవారంనాడు వెలువరించవలసిన తీర్పుపై సుప్రీమ్ కోర్టు తాత్కాలిక స్టే విధించింది. ఈ తీర్పును వారం రోజుల పాటు వాయిదా వేయవలసిందిగా గురువారం నాడు కోర్టు ఆదేశించింది. జస్టిస్ రవీంద్రన్, జస్టిస్ గోఖలే నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు స్టే ఇచ్చింది. అయోధ్య వివాదంతో సంబంధం ఉన్న అందరికీ సుప్రీమ్ కోర్టు గురువారమే నోటీసులు జారీ చేసింది. శుక్రవారంనాడు అహమ్మదాబాద్ హైకోర్టు ఇచ్చే తీర్పు ఎలా ఉన్నా అందరూ సంయమనం పాటించాలని దేశవ్యాప్తంగా ఇటు హిందూ మత పెద్దలు, అటు ముస్లిం మత పెద్దలు, రాజకీయ నాయకులు తమ అనుయాయులకు విజ్ఞప్తి చేయగా, ఇదే సమయంలో ఆ తీర్పు ప్రకటనను వారం రోజులు వాయిదా వేయవలసిందిగా సుప్రీమ్ కోర్టు ఆదేశించింది.అయోధ్యపై తీర్పును వాయిదా వేయవలసిందిగా గతంలో అహమ్మదాబాద్ హైకోర్టును ఆశ్రయించిన రమేష్ చంద్ర త్రిపాఠే ఈసారి కూడా సుప్రీమ్ కోర్టును కూడా ప్రజాప్రయోజనాల వాజ్యం రూపంలో ఆశ్రయించారు. అహమ్మదాబాద్ హైకోర్టు అయోధ్యపై తీర్పు ఇచ్చిన తర్వాత ఆ తీర్పు పర్యవసానంగా దేశంలో ఏమైనా అవాంఛనీయమైన సంఘటనలు జరిగితే అది ప్రపంచం దృష్టిని విధిగా ఆకర్షిస్తుందని, మరీ ముఖ్యంగా త్వరలో ఢిల్లీలో కామన్‌వెల్త్ క్రీజలు జరుగనున్న సందర్భంలో ఇటువంటి పరిణామాలు దేశానికి చెడ్డ పేరు తీసుకువస్తాయని పిటిషనర్ వాదించారు. అలాగే అసలు వివాదంపై ఉభయపక్షాల మధ్య కోర్టు వెలుపల పరిష్కారం అయ్యే అవకాశం కూడా లేకపోలేదని, అందువల్ల ఈ తీర్పును వాయిదా వేయవలసిందిగా అహమ్మదాబాద్ హైకోర్టుకు సూచించాలని పిటిషనర్ కోరారు.పిటిషనర్ వాదన విన్న సుప్రీమ్ కోర్టు వారం రోజుల పాటు తీర్పు ప్రకటనను వాయిదా వేయాలని అహమ్మదాబాద్ హైకోర్టుకు సూచించింది. ఈ పిటిషన్‌పై ఈ నెల 28 వ తేదీన సుప్రీమ్ కోర్టు విచారణ చేపట్టనున్నది.

Sunday, September 19, 2010

న్యూఢిల్లీలో జమా మసీదు వద్ద కాల్పులు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19 : న్యూఢిల్లీలోని జమా మసీదు గేట్-3 సమీపంలో ఆదివారం ఉదయం 11-30 గంటలకు ఓ టూరిస్టు బస్సుపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు విదేశీయులు గాయపడ్డారు. ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి కాల్పులు జరిపి పారిపోయారు. దీంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయి దుండగులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక లోకనాయక్ జయప్రకాష్ నారాయణ్ ఆస్పత్రికి తరలించారు.కామన్వెల్త్ క్రీడలు సమీపిస్తున్న తరుణంలో ఈ కాల్పుల ఘటన కలకలం రేపింది. అయితే ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షత్ మాట్లాడుతూ ప్రజలు ఆందోళన చెందనవసరం లేదని, కాల్పులు జరిపింది టెర్రరిస్టులు కాదని, స్థానికులు చేసిన పనేనని పేర్కొన్నారు. కామన్వెల్త్ క్రీడలు జరుగుతాయని, దీనిపై ఎలాంటి సందేహాలు పెట్టుకోనవసరం లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఢిల్లీలో మరింత నిఘా పెంచేందుకు, అదనంగా భద్రతా బలగాలను రంగంలోకి దింపేందుకు పోలీసు అధికారులు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కాగా ఢిల్లీలో కాల్పుల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో పోలీస్ అధికారులు హై అలర్ట్‌ను ప్రకటించి, తనిఖీలు ముమ్మరం చేశారు. అలాగే ఈనెల 22న వినాయక నిమజ్జనం, 24న అయోధ్య భూ వివాదంపై తీర్పు వెలువడనున్న నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 36వేల మంది జవాన్లను ఏర్పాటు చేశారు.

Thursday, September 16, 2010

గాయని స్వర్ణలత ఆకస్మిక మృతి

చెన్నై,సెప్టెంబర్ 16: ప్రఖ్యాత గాయని, జాతీయ అవార్డు గ్రహీత స్వర్ణలత (37) చెన్నైలో మృతిచెందారు. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆమె ఓ ప్రైవేట్ హాస్పటల్‌తో తుదిశ్వాస విడిచారు. కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో 1973లో జన్మించిన ఆమె దక్షిణాది నాలుగు భాషలు - తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు పలు హిందీ సినిమాల్లోనూ పాటలు పాడారు.తమిళ చిత్రం 'కరుత్తమ్మ' (1994)లో పాడిన 'పోరలే పొన్నుత్తాయి' పాటతో ఆమెకి ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డు లభించింది. దీనికి ఎ.ఆర్. రెహమాన్ సంగీత దర్శకుడు. అంతకంటే మునుపు 'చిన్నతంబి' (1991)లో పాడిన 'పోవొమ్మ ఊర్కోలమ్' పాటకి తమిళనాడు ఉత్తమ గాయని అవార్డుని ఆమె అందుకున్నారు.అలాగే తమిళనాడు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అందజేసే 'కలైమామణి' అవార్డును సైతం ఆమె అందుకున్నారు.స్వర్ణలత తండ్రి కె.సి. చేరుకుట్టి పేరుపొందిన హార్మోనియం వాద్యగాడే గాక చక్కని గాయకుడు కూడా. తొలిగా కె.జె. ఏసుదాస్‌తో తమిళంలో ఓ డ్యూయెట్ పాడటం ద్వారా ఆమె సినీ రంగంలో గాయకురాలిగా అడుగుపెట్టారు. ఆ పాటకు స్వర కల్పన చేసింది విఖ్యాత సంగీత దర్శకుడు ఎం.ఎస్. విశ్వనాథన్. అనంతర కాలంలో ఆమె ఇళయరాజా,ఎ.ఆర్. రెహమాన్ వంటి గొప్ప సంగీతకారులు కూర్చిన బాణీలకు పాటలు ఆలపించారు. తెలుగులో 'ఓ పాపలు పాపలు ఐ లవ్ యూ' (నిర్ణయం), (ముక్కాలా ముకాబ్‌లా' (ప్రేమికుడు), 'రామ్మా చిలకమ్మా ప్రేమా మొలకమ్మా' (చూడాలని ఉంది), 'చికుబుక్ రైలే' (జంటిల్‌మన్), 'పాటకు ప్రాణం పల్లవి ఐతే' (వాసు) తరితర హిట్ గీతాలు ఆమె పాడారు.

బెంగళూరు, బీజింగ్‌ విద్యార్థులతో పోటీ పడండి: అమెరికా విద్యార్థులకు ఒబామా పిలుపు

వాషింగ్టన్,సెప్టెంబర్ 16 : భారత్, చైనా విద్యార్థులతో పోటీ పడేందుకు కష్టపడి చదవాలని తన దేశ విద్యార్థులకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఉద్భోదించారు. భారత్‌లోని బెంగళూరు, చైనాలోని బీజీంగ్ విద్యార్థుల నుంచి కనీవినీ ఎరగని స్థాయిలో పోటీ ఎదురవుతున్నదన్నారు. 21వ శతాబ్దంలో అమెరికా విజయగాధను విద్యార్థులే లిఖించాల్సి ఉన్నదని ఆశాభావం వ్యక్తం చేశారు. పన్సిల్వేనియాలో జరిగిన 'బ్యాక్ టూ స్కూలు' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ' మీ బాధ్యతలను మీరు ఏర్పరుచుకున్నారు. మీకు వీలైనంత మంచి విద్యను అందించడం అమెరికా బాధ్యత' అని పేర్కొన్నారు. 'గతంలో ఎన్నడూ లేని విధంగా ఇతర దేశాలు మనతో పోటీ పడుతున్నాయి. భారత్‌లోని బెంగళూరు నగరం, చైనా రాజధాని బీజింగ్‌లకు చెందిన విద్యార్థులు తీవ్రంగా కష్టపడుతున్నప్పుడు.. మీరు సాధించే విజయం మీ ఒక్కరిదే కాబోదు.. అది 21వ శతాబ్దంలో అమెరికా విజయాలను అది దృఢతరం చేస్తుంది' అని తెలిపారు.

Wednesday, September 15, 2010

హైకోర్టులో యుద్ధకాండ:42% కోటాపై ఉధృతమైన ఉద్యమం

హైదరాబాద్, సెప్టెంబర్ 15: ప్రభుత్వ న్యాయవాదుల పోస్టుల్లో కోటా కోసం ఆందోళన చేస్తున్న తెలంగాణ లాయర్లు బుధవారం కూడా కోర్టుల బహిష్కారానికి పిలుపునిచ్చారు. ఉదయం కోర్టులు ప్రారంభం అయిన కొద్ది సేపటికే ఆందోళనకారుల డిమాండ్ మేరకు అధిక శాతం న్యాయమూర్తులు బెంచ్‌లు దిగి తమ చాంబర్స్‌లోకి వెళ్లిపోయారు. బెంచ్‌లు దిగని న్యాయమూర్తులపై లాయర్లు ఆగ్రహించారు. వారి కోర్టు హాళ్లలో ఫర్నీచర్ ధ్వంసం చేశారు.అసభ్య పదజాలంతో దూషించారు. పోడియంలను తోసివేశారు. కాజ్‌లిస్టులు, న్యాయ గ్రంథాలను బెంచ్‌లపైకి విసిరి కొట్టారు. జస్టిస్ నూతి రామ్మోహనరావు ఉన్న కోర్టు హాల్‌లో ట్యూబులైట్లు ధ్వంసం చేశారు. లాయర్లు విసిరిన పుస్తకాలు తలకు తగలడంతో ఒక మహిళా కోర్టు ఆఫీసర్ స్వల్పంగా గాయపడ్డారు. ఆందోళనకారులు జస్టిస్ ఈశ్వరయ్య కోర్టు హాల్‌లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. పుస్తకాల అల్మరా అద్దాలు ధ్వంసం చేశారు.జస్టిస్ రఘురాం కోర్టు హాల్‌లో వాదనలు వినిపించడానికి సిద్ధమవుతున్న ఓ వృద్ధ న్యాయవాది సహా పలువురు న్యాయవాదులపై ఆందోళన చేస్తున్న లాయర్లు చేయిచేసుకున్నారు. జ్యుడీషియల్ రిజిస్ట్రార్ చాంబర్ కిటికీ అద్దాలు కూడా వారిచేతిలో పగిలిపోయాయి. 17 - 30 వరకు కోర్టు హాళ్లు, కారిడార్లలో అద్దాల పెంకులు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఆందోళన చేస్తున్న న్యాయవాదులు తెలంగాణేతర న్యాయమూర్తులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోర్టు సమయం పూర్తయిన తర్వాత జడ్జిలు బయటికి వెళుతున్నప్పుడు 'జై తెలంగాణ' అంటూ పెద్దపెట్టున నినదించారు. మరికొందరు లాయర్లు హైకోర్టు గేటు ముందు రోడ్పౖ బైఠాయించడంతో ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు కోర్టుగేటుకు తాళాలువేసి, గుర్తింపుకార్డులు చూపిన తర్వాతే న్యాయవాదులను లోపలికి పంపించారు.మరికొందరు న్యాయవాదులు కోర్టు గేటు ఎక్కి లోనికి ప్రవేశించారు. ఈ క్రమంలో పోలీసులకు, న్యాయవాదులకు మధ్య తోపులాట జరిగింది. హైకోర్టు ప్రాంగణంలో పోలీసులను మోహరించినా, కోర్టు హాళ్లలో జరుగుతున్న అవాంఛనీయ పరిణామాలను అడ్డుకోలేక పోయారు. అదేసమయంలో, ఆందోళన చేస్తున్న న్యాయవాదులపై చేయి చేసుకోవద్దని, కోర్టు హాళ్ల నుంచి వెళ్లిపోవాలని సీనియర్ న్యాయమూర్తి పోలీసులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. కాగా ఆందోళనకు దిగిన న్యాయవాదుల ప్రతినిధులతో ప్రభుత్వచర్చలు విఫలయ్యాయి. సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ టి. మీనాకుమారి, జస్టిస్ ప్రకాశరావు, జస్టిస్ ఏ. గోపాల్ రెడ్డి, జస్టిస్ రఘురాం సమక్షంలో ఏజీ సీతారామమూర్తి, అదనపు ఏజీ సత్యప్రకాశ్, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ప్రకాశ్‌రెడ్డి, తెలంగాణ న్యాయవాదుల జేఏసీ కన్వీనర్ రాజేందర్ రెడ్డి, న్యాయవాది వి. రఘునాథ్ తదితరులు చర్చలు జరిపారు. మంత్రి గీతారెడ్డి ప్రభుత్వం తరఫున సందేశం పంపారు."ఆరువారాల్లోపు ప్రభుత్వ న్యాయవాదుల్లో తెలంగాణ లాయర్లకు 42% కేటాయిస్తాం. దీక్షలు విరమించండి'' అని మంత్రి కోరారు. తెలంగాణ న్యాయవాదులు ఇందుకు నిరాకరించారు. సచివాలయానికి వెళ్లిన ఏజీ, అదనపు ఏజీ దీక్ష చేస్తున్న న్యాయవాదుల ప్రతినిధులతో ఫోన్‌ద్వారా మాట్లాడారు. "మీరు కోరిన విధంగా 42% పోస్టుల కేటాయింపునకు ప్రభుత్వం సిద్ధం. కావాలంటే మీతో మంత్రి గీతారెడ్డి ఫోన్‌లో మాట్లాడతారు'' అని తెలిపారు.అయితే, గీతారెడ్డి హైకోర్టుకు వచ్చి స్పష్టమైన హామీని.. లిఖిత పూర్వకంగా ఇవ్వాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఏజీ రాజీనామా డిమాండ్‌ను నెరవేర్చాల్సిందేనని... అప్పటిదాకా దీక్ష కొనసాగిస్తామని స్పష్టంచేశారు. తర్వాత టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, కేటీఆర్, కొప్పుల ఈశ్వర్ తదితరులు సచివాలయంలో మంత్రులు గీతారెడ్డి, వెంకటరమణలతో భేటీ అయ్యారు.రెండు గంటలపాటు వీరి మధ్య చర్చలు జరిగినా ఫలితం లభించలేదు. కోర్టు నియామకాల్లో ప్రభుత్వం ఇప్పటికే అన్ని నిబంధనలు పాటిస్తోందని, తెలంగాణ వారికి పెద్దపీట వేస్తుందని గీతారెడ్డి చెప్పారు. 42% వాటా ఇవ్వాల్సిందేనని ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. ఇలా వుండగా మంగళవారం జస్టిస్ నాగార్జునరెడ్డి కోర్టు హాల్లో జరిగిన విధ్వంసంపై కోర్టు ఆఫీసర్ ఫిర్యాదుపై చార్మినార్ పోలీసులు కేసు నమోదుచేశారు. 'గుర్తు తెలియని న్యాయవాదుల'ను నిందితులుగా పేర్కొన్నారు. ఐపీసీలోని 147 (దాడి చేయడం), 506 (నేరపూరితమైన చర్యలు/ క్రిమినల్ ఇంటిమిడేషన్), 323 (స్వల్పంగా గాయపరచడం) 186 (విధి నిర్వహణలోని ప్రభుత్వ అధికారిని అడ్డుకోవడం), 149 (అక్రమంగా గుమిగూడటం) తదితర సెక్షన్ల కింద నమోదు చేశారు.

అమితాబ్ కు మూడవసారి ఉత్తమ జాతీయ నటుని అవార్డ్


న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: 57వ జాతీయ చలన చిత్ర అవార్డ్ లను ప్రకటించారు. కలెక్షన్ల రికార్డులను తుత్తునియలు చేసిన తెలుగు 'మగధీర' రెండు జాతీయ అవార్డులు సాధించింది. ఈ సినిమాకు స్పెషల్ ఎఫెక్ట్స్ అందించిన కమల్ కణ్నన్, కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించిన శివశంకర్ జాతీయ అవార్డులు అందుకున్నారు. మలయాళ చిత్రం 'కుట్టి శ్రాంక్' జాతీయ ఉత్తమ చిత్రంతోపాటు మొత్తం ఐదు అవార్డులను సొంతం చేసుకుంది. మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం సినిమాటోగ్రఫీ, స్క్రీన్‌ప్లే, దుస్తుల అవార్డులతోపాటు న్యాయ నిర్ణేతల ప్రత్యేక గుర్తింపు పురస్కారాన్ని కూడా సాధించింది. 'పా' చిత్రంలో శారీరక, మానసిక వికలాంగుడి పాత్రలో ఒదిగిపోయి ప్రేక్షకులను అచ్చెరువొందించిన బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఈ అవార్డును అందుకోవడం అమితాబ్‌కు ఇది మూడోసారి. గతంలో అగ్నిపథ్, బ్లాక్ సినిమాలు ఆయనకు ఈ అవార్డును అందించాయి. ఉత్తమ హిందీ చిత్రంగా కూడా 'పా' ఎన్నికైంది.బెంగాలీలో 'అబోహోమన్' చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించిన రీతూపర్ణా ఘోష్ ఉత్తమ దర్శకుడిగా అవార్డు సాధించారు. ఇదే చిత్రంలో అసమాన్య ప్రతిభ కనబరచిన నటి అనన్యా ఛటర్జీ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. కడుపుబ్బ నవ్వించే కామెడీ, కన్నీళ్లు తెప్పించే భావోద్వేగం, ఆలోచింపచేసే నేపథ్యంతో ఆబాలగోపాలాన్ని అలరించిన 'త్రీ ఈడియట్స్' అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రంగా విజయ కేతనం ఎగురవేసింది. శ్యామ్ బెగనల్ రూపొందించిన 'వెల్‌డన్ అబ్బా' ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రంగా ఎంపికైంది. అభిషేక్ బచ్చన్ హీరోగా నటించిన 'ఢిల్లీ 6' ఉత్తమ సామాజిక సమైక్యతా చిత్రం అవార్డు గెలుచుకుంది.

Tuesday, September 14, 2010

ప్రభుదేవాకు మహిళా న్యాయవాదుల హెచ్చరిక

చెన్నై,సెప్టెంబర్14: సినీ తార నయనతారను వివాహమాడేందుకు సిద్ధమవుతున్న ప్రముఖ నృత్య దర్శకుడు ప్రభుదేవాకు న్యాయ చిక్కులు తప్పేట్టు లేవు. మళ్లీ పెళ్లాడాలనే ఆయన నిర్ణయాన్ని రాష్ట్రంలోని మహిళా న్యాయవాదులు తప్పుబడుతున్నారు. ప్రభుదేవా భార్య రమలత్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ఒక భార్య ఉండగానే.. మరొకరిని వివాహమాడటం చట్టరీత్యా నేరమని.. దానికి గాను ఐదేళ్ల శిక్ష అనుభవించాల్సి ఉంటుందని వారు ప్రభుదేవాను హెచ్చరిస్తున్నారు. ఆయన వెంట నడిస్తే.. నయనతారకు కూడా శిక్ష తప్పదని తేల్చి చెబుతున్నారు. రమలత్‌కు విడాకులు ఇవ్వకుండా నయనతారను వివాహం చేసుకుంటే.. చట్టరీత్యా ఆ పెళ్లి చెల్లదని మద్రాస్ హైకోర్టు న్యాయవాది విజయతారణి పేర్కొన్నారు.రమలత్‌తో జరిగిన వివాహానికి సంబంధించిన రికార్డులు లేకున్నా, తాళి కట్టడాన్ని నలుగురు చూసినా అది పెళ్లి కిందకే వస్తుందని వివరించారు. అంతేగాక తన పాస్‌పోర్టులోభార్య స్థానంలో రమలత్ పేరును, ఇద్దరు పిల్లల పేర్లను కూడా ప్రభుదేవా నమోదు చేశారన్నారు. ప్రభుదేవా తన భార్య రమలత్ పేరును లతగా మార్చారని, అది గెజిట్‌లో వుందని చెప్పారు. ఇండియాలోని భార్యకు తెలియకుండా అమెరికాలో మరో పెళ్లి చేసుకున్న వ్యక్తిని అరెస్టు చేసిన విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ప్రధాని పదవి ఒక్కటే కా దు. చేయగలిగిన పనులు చాలా ఉన్నాయి:రాహుల్

శాంతినికేతన్ (పశ్చిమ బెంగాల్),సెప్టెంబర్ 14 : 'నేనే కనుక దేశ ప్రధానినైతే..' అని అంటూనే ఒక్క క్షణం ఆగి.. 'అయినా ప్రపంచంలో ప్రధాని పదవి ఒక్కటే కా దు. మనిషి చేయగలిగిన పనులు చాలా ఉన్నాయి' అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ అన్నారు. దేశ ప్రధాని అయ్యే అంశంపై శాంతినికేతన్ విద్యార్థులు తనను అడిగిన ప్రశ్నకు.. 40 ఏళ్ల రాహుల్ సమాధానాన్ని చెప్పినట్లే చెప్పి.. అంతలోనే దాటవేశారు. యువతతో మమేకమయ్యేందుకు దేశవ్యాప్తంగా తాను చేపడుతున్న పర్యటనల్లో భాగంగా రాజీవ్‌గాంధీ తనయు డు శాంతినికేతన్‌కు తొలిసారిగా వచ్చారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన విశ్వభారతి యూనివర్సిటీలోని విద్యార్థులతో ఆయన ముచ్చటించారు. ప్రపంచంలో ప్రధాని పదవి ఒక్కటే లేదని.. వ్యక్తులు చేయగలిగిన పనులు చాలా ఉన్నాయని ఈ సందర్భంగా అన్నారు.'ప్రధాని కావడమే ఏకైక లక్ష్యంగా ఉండ కూడదు. దేశానికి మరెన్నో రకాలుగా కూడా మనం సేవ చేయవచ్చు' అని చెప్పారు. శాంతినికేతన్ పర్యటన సందర్భంగా రాహుల్ ఎంతో ఉల్లాసంగా కనిపించారు. బ్యారికేడ్లను దాటుకొని.. విశ్వభారతి విద్యార్థినులను సాదరంగా పలుకరించారు. వర్సిటీ భద్రతా సిబ్బంది యో గక్షేమాలూ తెలుసుకొన్నారు. కొందరు విద్యార్థుల భుజాలు చరుస్తూ.. వారి లో ఉత్సాహం నింపేందుకు యత్నించారు. నెహ్రూ-గాంధీ కుటుంబ వారసు డి ఆటోగ్రాఫ్‌ల కోసం విద్యార్థులు పెద్ద సంఖ్యలో పోటీపడ్డారు. కాగా.. తన పర్యటన సందర్భంగా.. నెహ్రూ, ఇందిర, రాజీవ్‌లకు సంబంధించి ఓ ఎగ్జిబిషన్‌ను రాహుల్ ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో ఉంచిన తన తాత, నాయనమ్మ, తండ్రికి సంబంధించిన అరుదైన ఫోటోలను చూసి మురిసిపోయారు.

చంద్రబాబుకు తెలంగాణా సెగ

మహబూబ్‌నగర్‌,సెప్టెంబర్ 14: ఎరువుల కొరతపై ఉద్యమ శంఖం పూరించి, మహబూబ్‌నగర్‌లో ధర్నాకు బయలుదేరిన తెలుగుదేశం అధ్యక్షుడికి టీఆర్ఎస్ శ్రేణులు, ఏబీవీపీ నుంచి తీవ్ర నిరసనలు ఎదురయ్యాయి.రంగారెడ్డి జిల్లాలో మొదలైన అడ్డంకులు మహబూబ్‌నగర్ కలెక్టరేట్ చేరేదాకా కొనసాగాయి. రంగారెడ్డి జిల్లా పరిగి రణరంగంగా మారింది. చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్ల వర్షం కురిసింది. దీంతో కాన్వాయ్‌లోని కొన్ని వాహనాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లాలోనూ పలుచోట్ల బాబు వాహనాలపై రాళ్లు పడ్డాయి. బాబు కాన్వాయ్‌పై దాడికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో టీడీపీ నేతలు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు.

'అండమాన్'లో టీడీపీ ప్రచారం

హైదారబాద్, సెప్టెంబర్ 24: అండమాన్, నికోబార్ దీవుల్లో ఈ నెల 19 న జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధుల గెలుపును కోరుతూ ఉత్తరాంధ్రాకు చెందిన ఆ పార్టీ నేతల బృందం అక్కడ ప్రచారాన్ని నిర్వహించింది. ఉత్తరాంధ్రా జిల్లాలకు చెందిన ప్రజలు అక్కడ పెద్ద సంఖ్యలో స్థిరపడడంతో ఈ నేతలు ప్రచారానికి వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్ బయట టీడీపీ అధికారికంగా తమ అభ్యర్ధులను నిలబెట్టడం ఇదే ప్రధమం. అండమాన్, నికోబార్ పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులు పోటీ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రచారం నిమిత్తం టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యులు కె. ఎర్రన్నాయుడు, శాసనమండలిలో ప్రతిపక్ష నేత దాడి వీరభద్రరావులు మంగళవారం పోర్ట్‌బ్లెయిర్ చేరుకున్నారు. టీడీపీ కార్యకర్తలు సహా తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాలకు చెందినవారు కూడా విమానాశ్రయంలో ఎర్రన్నాయుడు బృందానికి ఘనస్వాగతం పలికారు. పోర్ట్‌బ్లెయిర్‌లోని 8, 9, 10 వార్డుల్లో పర్యటించిన అనంతరం డైరీ ఫాం సమావేశంలో పాల్గొన్న ఎర్రన్నాయుడు ప్రసంగిస్తూ... బతుకుదెరువు కోసం అండమాన్ వచ్చిన తెలుగు ప్రజలకు పాలకులు ఒరగబెట్టిందేమీ లేదని ధ్వజమెత్తారు. డ్రైజేజీలు, రోడ్లు అస్తవ్యస్థంగా ఉన్నాయని దుయ్యబట్టారు. 100 గజాల నివాసస్థలాల కోసం తెలుగు ప్రజలు మొరపెట్టుకుంటున్నా కాంగ్రెస్ నాయకులు కోటి అడ్డంకులు చెబుతున్నారని విమర్శించారు. టీడీపీని గెలిపిస్తే తెలుగు ప్రజలు సహా అండమాన్ ప్రజల సమస్యలను పార్లమెంటులో ప్రస్తావిస్తామని, పరిష్కారం కోసం పోరాడతామని చెప్పారు.అండమాన్ వాసుల వెసులుబాటుకోసం విశాఖపట్నంలో ప్యాసింజర్ హాలు, అతిధి గృహాల ఏర్పాటుతోపాటు టిక్కెట్ల విక్రయం, అండమాన్ నుంచి విశాఖపట్నం మీదుగా హైదరాబాద్‌కు విమాన సర్వీసు కోసం ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అండమాన్ శాఖ అధ్యక్షుడు ఎన్. మాణిక్యరావు, ఉపాధ్యక్షుడు ఆర్. నర్సింహారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ సీహెచ్ సుబ్బయ్య, జాయింట్ సెక్రటరీ ఎం. వెంకటేశ్వరరావు, సీహెచ్ బాబ్జీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Sunday, September 12, 2010

దారుణ విషాదానికి తొమ్మిదేళ్లు

వాషింగ్టన్‌,సెప్టెంబర్ 12: సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం.. సెప్టెంబర్ 11 న అదో భయానక వాస్తవం! అగ్రరాజ్యం అమెరికాలో ప్రపంచ వాణిజ్యానికే తలమానికంగా ఉన్న వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట భవనాలు ఉగ్రవాద పంజా దెబ్బకు నిట్టనిలువునా కుప్పకూలిన సమ యం! సుమారు 3వేల మంది శిధిలాల్లో సమాధై డీఎన్ఏ పరీక్షలతో తప్ప ఆనవాళ్లు తెలుసుకోలేనంత బీభత్స మరణాల ఘాతుకం! 9/11 దాడులు.. న్యూయార్క్‌లోని ట్విన్‌టవర్స్, వాషింగ్టన్‌లో పెంటగాన్, పెన్సిల్వేనియాలోని మరో లక్ష్యంపై విమానాలతో దాడులు చేసిన ఉగ్రవాదులు..3,000మందిని బలిగొన్నారు! ఈ మూడిం టిలో అత్యంత భీతావహ సన్నివేశం డబ్ల్యూటీసీదే! విమానాలు టవర్లను ఢీకొనడంతో ఆ ఆకాశ హర్మ్యం కూలింది. కొద్ది వ్యవధిలోనే నేలమట్టమైంది!

అర్జున్ ముండా ప్రమాణ స్వీకారానికి అద్వానీ గైర్హాజర్

రాంచీ,సెప్టెంబర్ 12 : ముచ్చటగా మూడోసారి జార్ఖండ్ సీఎంగా బీజేపీ నేత అర్జున్ ముండా ప్రమాణ స్వీకారం చేశారు. మరోసారి బీజేపీ- జేఎంఎం సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేశారు. మరో ఇద్దరు మంత్రులతో కలిసి ముఖ్యమంత్రిగా ముండా ప్రమాణ స్వీకారం చేశారు.వారం రోజుల్లో ఆయన తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ తనయుడు, జేఎంఎం నేత హేమంత్ సోరెన్, ఏజేఎస్‌యూ అధ్యక్షుడు సుదేశ్ మహతో తదితరులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైనా.. ఊహించినట్లే.. జేఎంఎంతో పొత్తుపై ఇప్పటికే అసంతృప్తితో ఉన్న ఎల్‌కే అద్వానీతో సహా బీజేపీ అగ్రనేతలు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ తదితరులు ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. వినాయక చవితి కారణంగానే అద్వానీ ఈ కార్యక్రమానికి రాలేదని బీజేపీ నేతలు చెబుతున్నా.. జేఎంఎంతో పొత్తుకు సంబంధించి మిగిలిన నేతలతో సంప్రదించకుండా బీజేపీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ, మాజీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌లే నిర్ణయం తీసేసుకున్నారని, తాజా పరిణామాలతో అద్వానీ ఆగ్రహంగా ఉన్నారని, అందుకే గైర్హాజరయ్యారని సమాచారం.

గ్రహాంతర సముద్రాలను గుర్తించడానికి టెలిస్కోప్

వాషింగ్టన్,సెప్టెంబర్ 12: ఇకపై ఆయా గ్రహాల్లో సముద్రాలేమైనా ఉన్నాయేమో పరిశోధించేందుకు రంగం సిద్ధమవుతోంది. 2014లో ప్రయోగించేందుకు ఉద్దేశించిన అమెరికా టెలిస్కోపుతో భూమి వంటి గ్రహాల్లో నీటి ఉనికిని గుర్తించాలని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. అలా గుర్తిస్తే భూమికి సోదరిని గుర్తించినట్లేనని వారి భావన. దీని కోసం వారు భూమికి సమానమైన పరిమాణంలో ఉండే గ్రహాలను వాటి కేంద్ర నక్షత్రాలకు భూమి ఉన్న దూరంలోనే ఉన్న వాటిని పరిశీలిస్తారు. మొత్తానికి ముమ్మూర్తులా భూమిని పోలి ఉన్న గ్రహాలను కనుగొనడం వారి లక్ష్యంగా ఉంది.

కార్మిక చైనా...

బీజింగ్,సెప్టెంబర్ 12: చైనా శ్రామికలోకపు శక్తిగా మారింది. అక్కడ శ్రామిక వర్గపు జనాభా సంఖ్య వందకోట్ల కీలక మైలురాయిని దాటింది. 2000 గణాంకాలతో పోలిస్తే ఇది పదికోట్ల ఇరవై లక్షలు ఎక్కువ అని చైనా ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. దేశ మానవ వనరులపై విడుదల చేసిన శ్వేతప్రతంలో శ్రామిక జనాభా వివరాలు పొందుపర్చారు. మానవ వనరుల అభివృద్ధికి అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు, ప్రతి వ్యక్తి సమర్థతను సద్వినియోగపర్చుకుంటూ, ప్రజల సర్వతోముఖాభివృద్ధికి కృషి జరుగుతోందని పేర్కొన్నారు.

మరో వివాదంలో రెహ్మాన్ కామన్‌వెల్త్ పాట

న్యూఢిల్లీ,సెప్టెంబర్ 12: : కామన్‌వెల్త్ క్రీడలకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ స్వరపరచిన సంగీతాన్ని వివాదాలు వీడడం లేదు. తాజాగా, ఆయన స్వరపరచిన గీతాలకు ప్రదర్శన ఇచ్చేందుకు భారతీయ శాస్త్రీయ నృత్యంలోని కొందరు లబ్ధప్రతిష్టులైన నాట్యకారులు తిరస్కరించారు. వాస్తవానికి, భారతీయ శాస్త్రీయ నృత్యం గొప్పదనాన్ని వివరిస్తూ రెహ్మాన్ రూపొందించిన గీతానికి కామన్‌వెల్త్ గేమ్స్ ప్రారంభోత్సవాల్లో 11 నిమిషాలపాటు ప్రదర్శన ఇవ్వాలని తొలుత నిర్ణయించారు. దీనికి సుమారు 500 మంది డ్యాన్సర్లతోపాటు పండిట్ బిర్జూ మహరాజ్, సరోజ్ వైద్యనాథన్, రాజారెడ్డి, సోనాల్ మాన్‌సింగ్, గురు సింఘాజిత్, భారతీ శివాజీలు ప్రదర్శన ఇస్తారని భావించారు. కానీ, తాజాగా, తమ ట్యూన్‌ను తామే స్వరపరచుకుంటామని వారు స్పష్టం చేస్తున్నారు. "మేమిచ్చే సందేశం భిన్నంగా ఉంటుంది. అందుకని మా పాటను మేమే స్వరపరచుకుంటాం'' అని రాజారెడ్డి తెలిపారు. ఇప్పటికే కామన్‌వెల్త్ గేమ్స్ థీమ్ సాంగ్ పలు వివాదాల్లో కూరుకుంది.

Friday, September 10, 2010

సురేష్ రామానాయుడుకు ఫాల్కే పురస్కారం

హైదరాబాద్,సెప్టెంబర్ 10: శతాధిక చిత్ర నిర్మాత, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత, మాజీ లోక్‌సభ సభ్యుడు దగ్గుబాటి రామానాయుడు 2009 సంవత్సరానికిగాను ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపికయ్యారు. భారతీయ సినిమారంగానికి అత్యుత్తమ సేవలందించినందుకు ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు కేంద్రం ప్రకటించింది. ఈ అవార్డు తెలుగువారికి దక్కడం ఇది ఐదోసారి.చివరి సారిగా ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వరరావుకు 19 ఏళ్ల క్రితం ఈ అవార్డు లభించింది. ఆ తర్వాత దీన్ని అందుకోనున్న తెలుగు వ్యక్తి రామానాయుడు కావడం విశేషం. అక్టోబరులో గోవాలో జరిగే అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో రాష్ట్రపతి ప్రతిభాపాటిల్.. రామానాయుడుకి ఈ అవార్డు అందజేస్తారు. స్వర్ణకమలంతో పాటు పది లక్షల రూపాయల నగదు, శాలువాతో ఆయనను సత్కరిస్తారు.తన 47 ఏళ్ల సినీరంగ చరిత్రలో అనేక మంది తారలను వెలుగులోకి తెచ్చిన రామానాయుడు తెలుగుతో పాటు.. తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, ఒరియా, అస్సామీ, గుజరాతీ, మరాఠీ, భోజ్‌పురి భాషల్లో చిత్రాలను నిర్మించిన నిర్మాతగా గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించుకుని తెలుగు సినిమా కీర్తిపతాకాన్ని అంతర్జాతీయ వినువీధుల్లో ఎగురవేశారు. విఖ్యాత నట సార్వభౌమడు ఎన్టీఆర్‌తో మొదలైన ఆయన నిర్మాణ పరంపర.. ఇప్పటికీ అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. ప్రేమనగర్, శ్రీకృష్ణ తులాభారం, ప్రేమించు, బొబ్బిలి రాజా, అహ నా పెళ్లంట, ఆంధ్ర వైభవం, కథానాయకుడు తదితర విజయవంతమైన చిత్రాలను ఆయన నిర్మించారు. ప్రేమనగర్, దిల్‌దార్, బందిష్ వంటి హిందీ చిత్రాలకు ఆయన నిర్మాత. బెంగాలీలో అసుఖ్ సినిమాతో పాటు.. సుధు ఏక్‌బార్ బోలో అనే చిత్రాన్ని కూడా నిర్మించారు.కన్నడలో మడువే అగోనా బా, తవురమనె ఉడుగొరె, తమిళంలో వసంత మాలిగ, తిరుమంగళం, తన్నికుంట రాజ, ఒరియాలో ధర్మ దేవత, మళయాళంలో అశ్వరూఢన్, మరాఠీలో మజి ఆయి, భోజ్‌పురిలో శివ మొదలైన సినిమాలను ఆయన నిర్మించారు. రామానాయుడు.. 1963లో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు. భాగస్వామ్యంలో 'అనురాగం' అనే చిత్రాన్ని నిర్మించారు. ఆ తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ సంస్థను నెలకొల్పారు. ఈ పతాకంపై 'రాముడు-భీముడు' చిత్రాన్ని నిర్మించారు. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన తొలి చిత్రమిదే. తెలుగులో 130 సినిమాలు నిర్మించిన ఆయన... అక్కినేని నాగేశ్వరరావు, శివాజీ గణేషన్, శోభన్‌బాబు, కృష్ణ, కమల్‌హాసన్, చిరంజీవి, రజనీకాంత్, రాజేష్ ఖన్నా, జితేంద్ర వంటి హీరోలతో పాటు.. జమున, పద్మిని, జయప్రద, జయసుధ, హేమా మాలిని, రేఖ, శ్రీదేవి వంటి కథానాయికలతో సినిమాలు నిర్మించారు. చలన చిత్ర రంగంలో ఆయన స్పృశించని రంగం అంటూ లేదు.జయాపజయాల ప్రయాణం నాలుగున్నర దశాబ్దాల సినీ జీవితంలో అద్భుత విజయాలతో పాటు అపజయాలు కూడా రామానాయుడు చవి చూశారు. రామానాయుడు 21 మంది కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చారు. అనేక మంది నటీనటులను తెలుగు తెరకు పరిచయం చేశారు. ఆయన ఇద్దరు కుమారుల్లో వెంకటేశ్ హీరోగా, సురేష్ నిర్మాతగా తమదైన స్థానాలు ఏర్పాటు చేసుకున్నారు. మనవడు రానా కూడా హీరోగా రంగప్రవేశం చేయడంతో ఆయన వంశంలో మూడో తరం మొదలయింది. కథతో తన స్టూడియోలోకి అడుగుపెట్టిన నిర్మాత సినిమా తొలి కాపీతో బయటకు వెళ్లాలనేది ఆయన అందుకోసం ఆయన రికార్డింగ్, డబ్బింగ్ థియేటర్లతో పాటు ల్యాబ్ తదితర సదుపాయాలను తన స్టూడియోలో ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌తో పాటు.. వైజాగ్‌లోనూ స్టూడియో నెలకొల్పారు.

ఒబామా వివాదాస్పద నిర్ణయం :ఔట్‌సోర్సింగ్‌కు రాయితీలు కట్

వాషింగ్టన్, సెప్టెంబర్ 11: భారత్‌కు శరాఘాతమైన నిర్ణయమిది. రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా 'విధానపరమైన అస్త్రాన్ని' బయటకు తీశారు. ఔట్‌సోర్సింగ్ చేసే కంపెనీలకు పన్ను రాయితీలు కల్పించేది లేదని తేల్చి చెప్పారు. దీంతో, ఔట్‌సోర్సింగ్‌పై ఆధారపడిన ఉద్యోగుల జీవితాలు త్రిశంకు స్వర్గంలో పడనున్నాయి. విదేశీ మారక ద్రవ్యంపైనా తీవ్ర ప్రభావం పడనుంది. వాస్తవానికి, అమెరికా సెనేట్‌లోని 100 సీట్లలో ఖాళీ అయిన 37 సీట్లకు వచ్చే నవంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో ఔట్‌సోర్సింగ్ ప్రధానాంశంగా మారనుంది. డెమొక్రాట్లు ఓటమి దిశగా పయనిస్తున్నారని ఇప్పటికే ఒపినియన్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. అదే సమయంలో, ఔట్‌సోర్సింగ్‌ను రద్దు చేస్తూ ఓహియో గవర్నర్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే, ఒబామా తన వైఖరిని సుస్పష్టంగా వెల్లడించారు. అమెరికాలో తప్ప.. విదేశాల్లో ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు పన్ను రాయితీలు కల్పించేది లేదని చెప్పారు. అంతేగాకుండా అమెరికాలోనే మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పించే కంపెనీలకు పన్ను రాయితీలు కల్పించడంలో ఉదారంగా వ్యవహరిస్తామని చెప్పారు. ఈ విషయాన్ని కూడా యాదృచ్ఛికంగా ఆయన ఓహియోలో జరిపిన ఎన్నికల ప్రచారంలోనే ప్రకటించడం విశేషం. అయితే, అమెరికా ప్రభుత్వ నిర్ణయాలపై భారత కంపెనీలు మండిపడుతున్నాయి. వచ్చే నవంబర్‌లో ఒబామా భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఈ అంశం మరింత వివాదాస్పదం కానుంది.

ఖైరతాబాద్ వినాయకుడికి తాపేశ్వరం లడ్డూ

హైదరాబాద్,సెప్టెంబర్ 11: రాష్ట్రంలోనే పేరెన్నికగన్నఖైరతాబాద్ వినాయకుడికి తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరానికి చెందిన ప్రముఖ స్వీట్స్ వ్యాపారి సురుచి ఫుడ్స్ అధినేత పోలిశెట్టి మల్లిబాబు తయారు చేసిన 500 కిలోల భారీ లడ్డూను శుక్రవారం ఉదయం హైదరాబాద్‌కు తరలించారు. శుక్రవారం లడ్డూను తాపేశ్వరంలో ఊరేగించి గ్రామంలోని ప్రధాన దేవాలయాల్లో పూజలు నిర్వహించారు.వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ శాస్త్రబద్ధంగా లడ్డూను మల్లిబాబు కుటుంబ సమేతంగా ప్రత్యేకంగా హైదరాబాద్‌కు తీసుకుని వెళ్లారు. శుక్రవారం మధ్యాహ్నం వరకూ కొనసాగిన ఊరేగింపు అనంతరం శనివారం తెల్లవారుజాముకల్లా లడ్డూను హైదరాబాద్ పట్టణంలోని ఖైరతాబాద్ వినాయకుడికి నైవేథ్యంగా అందించనున్నారు.అలాగే విశాఖపట్టణంలోని గాజువాకలో ఉన్న వినాయకుడికి కూడా 100 కిలోల లడ్డూను, అయినవిల్లి వినాయకుడికి 50 కిలోల లడ్డూను, రామచంద్రపురం డఫేదార్ వినాయకుడిని 51 కిలోల లడ్డూ, బిక్కవోలు వినాయకుడికి 20 కిలోల లడ్డూను అందించినట్టు మల్లిబాబు తెలిపారు. రాష్ట్ర చరిత్రలోనే భారీ స్థాయిలో లడ్డూను తయారు చేసి వినాయకుడికి అందించడం తనకెంతో గర్వంగా ఉందని, సురుచి ఫుడ్స్ అధినేత మల్లిబాబు తెలిపారు.

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...