Friday, August 30, 2013

టి.డి.పి. భయంతో తెలుగుజాతినే దెబ్బ తీశారు: చంద్రబాబు

హైదరాబాద్, ఆగష్టు 30 : తెలుగువారికి గుర్తింపు తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పామని, ఆత్మ గౌరవంతో ప్రపంచాన్నే జయించవచ్చునని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టడం బాధాకరంగా ఉందని, విభజన రాజకీయ ప్రయోజనాలకోసమేనని, జాతి ప్రయోజనాలకు కాదని  ఆయన ఒక చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో పేర్కొన్నారు. 30 రోజుల నుంచి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంటే కేంద్రం పట్టించుకోవడం లేదని చంద్రబాబు విమర్శించారు. అసలు విభజనకు బీజం వేసింది వైఎస్సేనని, 1999లో ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపించారని, అప్పటి నుంచే ఈ కార్యక్రమం మొదలైందని చంద్రబాబు పేర్కొన్నారు. వి వైసీపీ, టీఆర్ఎస్ పార్టీలను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నదని  ఆయన ఆరోపించారు. తెలుగుదేశం పార్టీని దెబ్బ తీయాలనే కుట్రతో తెలుగు జాతినే దెబ్బతీయాలనే పరిస్థితికి వచ్చారనిబాబు విమర్శించారు. కాంగ్రెస్ కుట్రలను రాష్ట్ర ప్రజలకు వివరించేదుకే సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి బస్సు యాత్ర చేస్తున్నట్లు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం రవీంధ్రభారతిలో చేసిన వ్యాఖ్యలు నిర్ణయానికి ముందు ఎందుకు చెప్పలేదని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.  తెలుగు జాతి కోసం హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామని, సైబరాబాద్ సిటీని నిర్మించామని, తొమ్మిదేళ్ళ పాలనలో దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధి చేసి చూపించామని, తెలుగువారి ప్రతిష్ట కోసం ప్రపంచమంతా తిరిగామని ఆయన అన్నారు. రాష్టంలోని పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయంతో కాంగ్రెస్ భయపడి ఇలాంటి తొందపాటు నిర్ణయాలు తీసుకుందని చంద్రబాబు నాయుడు విమర్శించారు. తెలుగుజాతికి సంబంధించిన వ్యవహారాన్ని కాంగ్రెస్ సొంత వ్యవహారంలా చేసిందని ఆయన అన్నారు.

భత్కల్ కు 12 రోజుల పోలీసు కస్టడీ

న్యూఢిల్లీ,ఆగస్టు 30: నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహుద్దీన్ అగ్రనేత యాసిన్ భత్కల్ ను 12 రోజుల పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇతనితో పాటు దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో మరో నిందితుడైన అసదుల్లా అక్తర్ అలియాస్ తబ్రేజ్ అలియాస్ ‘హడ్డి’ని కూడా కోర్టు కస్టడీకి అప్పగించింది. హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో గత ఫిబ్రవరిలో జరిగిన బాంబు పేలుళ్లతో పాటు దేశవ్యాప్తంగా సుమారు 40 బాంబు పేలుళ్ల కేసులో నిందితుడైన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది యాసిన్ భత్కల్ ఎట్టకేలకు గురువారం ఇంటెలిజెన్స్ అధికారులకు చిక్కాడు. ఇప్పటి వరకూ వరుస దాడులకు దిగుతూ ప్రభుత్వానికి కంటి మీద కునుకులేకుండా చేసిన భత్కల్ భారత్ -నేపాల్ సరిహద్దులో  పోలీసులకు చిక్కాడు.  యాసిన్‌పై రూ.35 లక్షల రివార్డు ఉంది.  ఇతనితో పాటు దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో మరో నిందితుడైన అసదుల్లా అక్తర్ అలియాస్ తబ్రేజ్ అలియాస్ ‘హడ్డి’ని కూడా బీహార్ పోలీసులు అరెస్టు చేశారు. వీరిని శుక్రవారం ప్రత్యేక విమానంలో ఢిల్లీ తీసుకువచ్చి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులకు అప్పగించారు..

అంతర్జాతీయ పరిణామాలతోనే రూపాయి పతనం: ప్రధాని

న్యూఢిల్లీ,ఆగస్టు 30: రూపాయి పతనం ఆందోళనకర పరిణామమని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. ఊహించని అంతర్జాతీయ పరిణామాలతోనే రూపాయి రికార్డు స్థాయికి పడిపోయిందని ఆయన తెలిపారు. లోక్ సభలో దేశ ఆర్థిక పరిస్థితిపై ప్రధాని ప్రకటన చేశారు. ప్రపంచ దేశాల కరెన్సీ బలహీనపడడానికి అమెరికా ఫెడరల్ బ్యాంకు తీసుకున్న నిర్ణయాలే కారణమని మన్మోహన్ సింగ్ అన్నారు. బంగారంపై వ్యామోహం తగ్గించుకోవాలని, చమురు ఉత్పత్తులను పొదుపుగా వాడుకోవాలని దేశ ప్రజలను ప్రధాని కోరారు. పసిడి కొనుగోళ్లకు ఎగబడవద్దని సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కరెంట్ ఖాతా లోటును 70 బిలియన్ డాలర్లకు తగ్గిస్తామన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. రూపాయి పతనంతో అభివృద్ధి చెందిన దేశాల కంటే భారత్ లో ద్రవ్యోల్బణం అధికంగా ఉందని తెలిపారు. రూపాయి విలువ తగ్గడం, ముడి చమురు ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం అధికమయిందని వివరించారు. రూపాయి పతనానికి అడ్డుకట్ట వేసేందుకు ఆర్ బీఐ, ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నాయని  చెప్పారు.

Thursday, August 29, 2013

భూసేకరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం...

న్యూఢిల్లీ, ఆగస్టు 30:  భూసేకరణ బిల్లును లోక్ సభ గురువారం ఆమోదించింది. కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం ఆహార భద్రత బిల్లు తర్వాత అంతే ప్రతిష్టాత్మకంగా తెచ్చిన  మరో ముఖ్యమైన బిల్లు ఇది. పారిశ్రామిక అవసరాల కోసం భూమిని సేకరించే సందర్భాల్లో నిర్వాసిత కుటుంబాలకు న్యాయమైన, సముచితమైన రీతిలో పరిహారం చెల్లించేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. గ్రామీణ ప్రాంత నిర్వాసితులకు భూమి మార్కెట్ విలువపై నాలుగు రెట్లు, పట్టణ ప్రాంత నిర్వాసితులకు రెండు రెట్లు నగదు పరిహారం చెల్లించాలని ఈ బిల్లు నిర్దేశిస్తోంది. నిర్వాసితులను అభివృద్ధిలో భాగస్వాముల్ని చేసే ఈ బిల్లును బ్రిటిష్ కాలంలో 1894 నాటి భూసేకరణ చట్టం  స్థానంలో భూసేకరణలో సరైన పరిహారం పొందే హక్కు, పారదర్శకత, పునరావాస బిల్లుగా దీన్ని పిలవనున్నారు. ఈ బిల్లుపై జరిగిన ఓటింగ్ లో మొత్తం 235 మంది పాల్గొనగా,  అనుకూలంగా 216 మంది, వ్యతిరేకంగా 19 మంది ఓట్లు వేశారు. 

జగన్ దీక్ష భగ్నం: ఉస్మానియకు తరలింపు

హైదరాబాద్, ఆగస్టు 29: చంచల్ గూడ జైల్లో ఐదు రోజులుగా దీక్ష చేస్తున్న వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దీక్షను పోలీసులు భగ్నం చేశారు.ఆయన ఆరోగ్యం క్షీణించండంతో రాత్రి 11:50 సమయంలో ఆయనను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.  జగన్ తనకు తానుగా నడుచుకుంటూ బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోంచి దిగి ఆస్పత్రిలోకి వెళ్లారు. కాగా,  ఆస్పత్రి వద్ద జగన్ ను చూసేందుకు భారీ సంఖ్యలో వచ్చిన అభిమానులను అడ్డుకోడానికి పోలీసులు లాఠీచార్జి చేశారు.  చంచల్ గూడ జైలు నుంచి ఉస్మానియా ఆస్పత్రి వరకు వెళ్లే మార్గం మొత్తాన్ని ముందుగానే పోలీసులు తమ స్వాధీనంలోకి తీసుకున్నారు.

Wednesday, August 28, 2013

డాలర్ తో రూపాయి 68.80 ---బంగారం రు. 34,500

ముంబై,ఆగస్టు 28:  అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి బలహీనపడటంతో బులియన్ మార్కెట్ లో బంగారానికి డిమాండ్ పెరిగింది.  పది గ్రాముల బంగారం ధర 34,500 రూపాయలు ట్రేడ్ అయింది.  బంగారం ధరకు ఇదే ఆల్ టైమ్ రికార్డు. గత సంవత్సరం నవంబర్ 27న బంగారం 32975 రూపాయలు నమోదు చేసుకోవడం ఇప్పటి వరకు గరిష్టం. కాగా బుధవారం మార్కెట్ లో వెండి 3700 రూపాయలు పెరిగి 58500 రూపాయలకు చేరుకుంది. అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్ లో రూపాయి 68.80 వద్ద క్లోజ్ అవ్వడమే బంగారం, వెండి పెరుగుదలకు కారణమని  విశ్లేషకులు వెల్లడించారు. మరోవైపు సెన్సెక్స్ 28 పాయింట్ల లాభంతో 17996 వద్ద, నిఫ్టీ 2 పాయింట్లు కోల్పోయి 5285 వద్ద ముగిసాయి.  

Monday, August 26, 2013

సోనియాకు అస్వస్థత- ఎయిమ్స్ లో చికిత్స

న్యూఢిల్లీ,ఆగస్టు 26: : కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అస్వస్థతకు గురయ్యారు. ఆమెను చికిత్స నిమిత్తం ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు తరలించారు.  ఆహార భద్రతా బిల్లుపై పార్లమెంటులో ఓటింగ్ జరుగుతుండగా, అందులో పాల్గొనకుండానే  కేంద్ర మంత్రి కుమారి షెల్జా, కుమారుడు రాహుల్ గాంధీతో కలిసి ఆమె ఉన్నట్టుండి బయటకు వెళ్లిపోయారు. పూర్తిగా నడవలేని పరిస్థితిలో ఉన్న సోనియాను షెల్జా చేయి పట్టుకుని మరీ కారు వరకు తీసుకెళ్లారు. గత రాత్రి నుంచి జ్వరంతో బాధపడుతున్న సోనియాగాంధీ, కేవలం ఆహార భద్రత బిల్లు కోసమే పార్లమెంటుకు హాజరయ్యారు. కానీ, ఓటింగ్ పూర్తయ్యే వరకు సభలో్ కూర్చోడానికి కూడా ఆమెకు ఓపిక లేకపోవడంతో షెల్జా, రాహుల్ దగ్గరుండి ఆమెను ఆస్పత్రికి తరలించారు. 67 ఏళ్ల సోనియాగాంధీని ఎయిమ్స్ లోని కార్డియాలజీ విభాగంలో చేర్చారు. ఆమెకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. అనంతరం ఆమె ఇంటికి వెళ్ళారు.

ఆహార భద్రత బిల్లుకు లోక్ సభ ఆమోదం

బిల్లుకు బీజేపీ అనుకూలం...అన్నాడీఎంకే వ్యతిరేకం
న్యూఢిల్లీ,ఆగస్టు 26:  యూపీఏ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఆహార భద్రత బిల్లును లోక్ సభ ఆమోదించింది. భారతదేశంలో ఉన్న మొత్తం జనాభాలో మూడింట రెండొంతుల మంది పేదలకు భారీ సబ్సిడీతో ఆహార ధాన్యాలను అందించడానికి ఉద్దేశించిన ఈ బిల్లు బిల్లుపై ఏకంగా ఎనిమిది గంటల పాటు చర్చ జరగింది.
ప్రతిపక్షాలు ఈ బిల్లుకు దాదాపు ౩00 సవరణలను ప్రతిపాదించగా, అన్నింటినీ తోసిపుచ్చారు. అయితే, ప్రధాన బిల్లుపై ఓటింగ్ జరగడానికి కొద్ది నిమిషాల ముందు ఈ బిల్లుకు బీజేపీ మద్దతిస్తున్నట్లు విపక్ష నేత సుష్మా స్వరాజ్ ప్రకటించారు. బిల్లు అరకొరగా, బలహీనంగా ఉన్నా, పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తాము మద్దతిస్తున్నామన్నారు. తాము అధికారంలోకి వచ్చాక దీన్ని మరింత మెరుగు పరుస్తామని చెప్పారు. అన్నాడీఎంకే మాత్రమే ఈ బిల్లును వ్యతిరేకించింది. 

గీతారెడ్డికి సీబీఐ సమన్లు

హైదరాబాద్,ఆగస్టు 26:  రాష్ట్రమంత్రి జే గీతారెడ్డికి సీబీఐ సమన్లు జారీ చేసింది. లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూకేటాయింపుల వ్యవహారంలో మంగళవారం నాడు   సీబీఐ గీతారెడ్డిని విచారించనుంది.  గీతారెడ్డిని విచారించేందుకు  సీబీఐ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి పొందారు.  గీతారెడ్డిని ఆమె నివాసంలోనే  సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్ వ్యవహారంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావును కూడా సీబీఐ అధికారులు ఇటీవల ప్రశ్నించిన సంగతి తెలిసిందే.

Sunday, August 25, 2013

"చల్లని రాజా ఓ చందమామా" గాయకుని మృతి

భువనేశ్వర్, ఆగస్టు 25: సుప్రసిద్ధ క్లాసికల్ సింగర్ పండిట్ రఘునాథ్ పాణిగ్రహి తన 79వ ఏట ఆదివారం నాడు ఇక్కడ కన్ను మూశారు. కోరాపుట్ జిల్లాలోని గుణుపూర్ లో 1934 ఆగస్టు 10న జన్మించిన రఘునాథ్ పాణిగ్రహి  ఇలవేలుపు సినిమాలో "చల్లని రాజా ఓ చందమామా" పాట ద్వారా తెలుగు వారికి సుపరిచితుడు. ఒరియా, తెలుగు, తమిళ, కన్నడ భాషలలో అనేక పాటలు పాడారు. జయదేవుని ' గీతగోవిందం '  సంస్కృత రచనకు తనదైన శైలిలో గళ భాష్యం అందించారు. ఆయన భార్య సంజుక్త ఒడిస్సీ నృత్య కళాకారిణి 1997లో మరణించారు.

తెలుగుదేశం పార్టీకి తమ్మినేని రాజీనామా

హైదరాబాద్,ఆగస్టు 25:  తెలుగుదేశం పార్టీకి సీనియర్ నేత తమ్మినేని సీతారాం రాజీనామా సమర్పించారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని తెలుగుదేశం పార్టీ కాపాడలేకపోయిందని  సీతారాం  పార్టీ అధినేత చంద్రబాబుకు రాసిన 10 పేజిల బహిరంగ లేఖలో పేర్కొన్నారు.   ఎన్టీఆర్ ఆశయాలకు విరుద్దంగా చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తోందని లేఖలో ఘాటైన విమర్శలు చేశారు.  బలహీన ప్రభుత్వం, ప్రతిపక్షం ఉన్నందునే రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారింది అని తమ్మినేని అన్నారు. గతంలో ఎర్రం నాయుడు మృతి, ఇప్పుడు  తమ్మినేని సీతారాం రాజీనామాతో తెలుగుదేశానికి ఉత్తరాంధ్రలో మరో గట్టి దెబ్బ  తగిలింది.

విభజన పై జైలులోజగన్ నిరశన దీక్ష....

హైదరాబాద్,ఆగస్టు 25:  రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ  వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చంచల్‌గూడ జైలులో  ఆదివారం నాడు నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. ఇరుప్రాంతాలకూ సమన్యాయం చేయాలని, అలా చేయలేని పక్షంలో రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలనే డిమాండ్‌తో ఆయన జైలులోనే దీక్ష ప్రారంభించారు. జగన్‌ దీక్ష నేపథ్యంలో చంచల్ గూడ జైలు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

Saturday, August 24, 2013

శనివారం ఢిల్లీలో నేషనల్ మీడియా సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మన్మోహన్, సోనియా,మంత్రి మనీష్ తివారి తదితరులు... 

అవనిగడ్డ ఉప ఎన్నిక: టి.డి.పి. గెలుపు

హైదరాబాద్,ఆగస్టు 24:   కృష్ణా జిల్లా అవనిగడ్డ శాసనసభా నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అంబటి శ్రీహరి ప్రసాద్  61,644 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయనపై ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేశారు. వారిలో సైకం రాజశేఖర్‌కు 13,638 ఓట్లు రాగా, సుబ్రహ్మణ్యానికి 3,389 ఓట్లు వచ్చాయి. అంబటి శ్రీహరి ప్రసాద్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని తెలుగుదేశం పార్టీ కోరడంతో  కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు తమ అభ్యర్థులను పోటీకి దింపలేదు.  అయితే, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు రంగంలో ఉండడంతో పోలింగ్ అనివార్యం అయింది. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు అంబటి బ్రాహ్మణయ్య మరణించడంతో అవనిగడ్డకు ఉప ఎన్నిక జరిగింది.

మరో కమిటీ వేస్తాం: సోనియా

హైదరాబాద్,ఆగస్టు 24:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశంపై సమస్యలను వినేందుకు ప్రభుత్వం తరఫన ఓ కమిటీ వేస్తామని యుపిఎ చైర్‌పర్సన్, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రకటించారు. ప్రభావిత ప్రాంతాల సమస్యలను వినేందుకు ఆ కమిటీ వేస్తామని ఆమె చెప్పారు. తెలంగాణపై ప్రకటన వెలువరించిన తర్వాత ప్రభావిత ప్రాంతాల సమస్యలను వినేందుకు ఆంటోనీ కమిటీని వేశామన్న సోనియా కొత్తగా  ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీ విధివిధానాల గురించి మాత్రం వివరించలేదు. అయితే విభజన ప్రక్రియను ముందుకు తీసుకుని వెళ్లడానికి అనుగుణంగానే  ఆ కమిటీ పనిచేయవచ్చునని అంటున్నారు.   తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందన్న సోనియా  ఈ విషయంలో ఒకరికి న్యాయం, మరొకరికి అన్యాయం చేయబోమని  చెప్పారు. ఇరు ప్రాంతాల ప్రజలకు అన్యాయం జరగకుండా చూస్తామని చెప్పారు.

Friday, August 23, 2013

విజయమ్మ దీక్ష భగ్నం-ఆస్పత్రికి తరలింపు

గుంటూరు,ఆగస్టు 23 :  సమన్యాయం చేయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఐదు రోజులుగా  ఇచేస్తున్న సమర దీక్షను  శుక్రవారం  అర్ధరాత్రి పోలీసులు భగ్నం చేశారు. ఆమె ను ఆస్పత్రికి తరలించారు.  గత నాలుగు రోజులుగా మంచినీళ్ల మీదే ఉండటంతో ఆమె ఆరోగ్యం బాగా క్షీణించినట్లు విజయమ్మకు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు చెప్పారు.  

హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తేనే సమన్యాయం: చిరు

న్యూఢిల్లీ,ఆగస్టు 23:  రాష్ట్ర విభజన ప్రక్రియపై తమ కాంగ్రెసు పార్టీ అధిష్టానం వెనక్కి పోతుందని అనుకోవడం లేదని. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై హడావిడిగా ముందుకు సాగకపోవచ్చునని   కేంద్ర మంత్రి చిరంజీవి అన్నారు.  కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అనంతరం ఆయన శుక్రవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ,  సమన్యాయం చేయాలని తాను సోనియాను కోరినట్లు ఆయన తెలిపారు.  హైదరాబాదులాంటి నగరాన్ని నిర్మించుకోవడానికి తరాలు పడుతుందని, హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తేనే సమన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు.  జల, ఉద్యోగ విషయాల్లో సమన్యాయం జరిగేలా చూడాలని ఆయన అన్నారు. తాను సమైక్యవాదినని, ప్రజలతో ఉంటానని ఆయన అన్నారు. కాంగ్రెసు అధిష్టానం పరిస్థితిని చక్కదిద్దుతుందని ఆయన అన్నారు. సీమాంధ్ర ప్రజల ఆందోళన  తీవ్రతను తాను సోనియాకు వివరించినట్లు ఆయన తెలిపారు.  రాష్ట్రాన్ని విభజిస్తే అనేక సమస్యలు వస్తాయని ఆయన అన్నారు. త్వరలో సమన్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లు చిరంజీవి చెప్పారు. 

ఫొటో జర్నలిస్టు గ్యాంగ్ రేప్ కేసులో ఒకరి అరెస్టు

ముంబై,ఆగస్టు 23:  ముంబైలో జరిగిన ఫొటో జర్నలిస్టు గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. మరో  ఐదుగురు నిందితులను కూడా గుర్తించారు. ఇంకో నలుగురి కోసం గాలిస్తున్నారు.  గురువారం సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో ఓ పత్రికలో పనిచేస్తున్న మహిళా ఫొటో జర్నలిస్టుపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది. 

పన్నెండు మంది తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్

న్యూఢిల్లీ,ఆగస్టు 23: విభజన నిర్ణయం నేపథ్యంలో తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల సీమాంధ్ర ఎంపీలు ఉభయ సభల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో  పన్నెండు మంది ఎంపీలపై శుక్రవారం సస్పెన్షన్ వేటు పడింది.  ఎంపీల సస్పెన్షన్ పై గురువారమే  తీర్మానం ప్రవేశ పెట్టినప్పటికీ విపక్షాలు డివిజన్‌కు వెళ్తామని హెచ్చరించడంతో ఈ రోజు రూల్ 374 ఏ ప్రకారం స్పీకర్ ద్వారా సస్పెన్షన్ వేటు వేశారు. ఈ రోజు రెండుసార్లు సభ వాయిదా పడిన అనంతరం పన్నెండన్నర గంటలకు తిరిగి ప్రారంభమైంది. సభ మొదలుకాగానే కమల్ నాథ్ సభా కార్యక్రమాలు అడ్డుకుంటున్నారని నలుగురు టిడిపి, ఎనిమిది మంది కాంగ్రెసు ఎంపీలపై తీర్మానం ప్రవేశ పెట్టారు. స్పీకర్ వారిని ఐదు రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సస్పెండైన వారిలో టిడిపి ఎంపీలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, శివ ప్రసాద్, కొణకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్ప, కాంగ్రెసు ఎంపీలు హర్ష కుమార్, లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్ కుమార్, అనంత వెంకట్రామి రెడ్డి, సాయి ప్రతాప్, కనుమూరి బాపిరాజు, రాయపాటి సాంబశివ రావు, మాగుంట శ్రీనివాసులు రెడ్డిలు ఉన్నారు. అనంతరం సభ శనివారానికి వాయిదా పడింది. సభ రేపటికి వాయిదా పడిన అరువాత కూడా  టిడిపి ఎంపీలు  సభలోనే బైఠాయించారు. 

Thursday, August 22, 2013

రాజ్యసభ సభ్యత్వానికి హరికృష్ణ గుడ్ బై

న్యూఢిల్లీ,ఆగస్టు 22: సమైక్యాంధ్రకు మద్దతుగా అందరికంటే ముందుగా రాజీనామాను ఆమోదింపజేసుకున్న ఎన్టీఆర్ తనయుడు, తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ తదుపరి కార్యాచరణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలుగు రాష్ట్రాన్ని చీల్చేందుకు జరుగుతున్న కుట్రలను నిరసిస్తూ తన రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకున్న హరికృష్ణ  రాష్ట్ర విభజనకు తన బావ ఓకే చెప్పడంతో  పార్టీ కట్టబెట్టిన రాజ్యసభ సభ్యత్వానికి  గుడ్ బై చెప్పారు. కొంతకాలంగా చంద్రబాబు నాయుడు, హరికృష్ణ మధ్య రాజుకున్న చిచ్చుకు రాష్ట్ర విభజన అంశం ఆజ్యం పోసింది.  హరికృష్ణ కొద్ది రోజులుగా పార్టీతో అంటిముట్టనట్టు ఉంటున్నారు. నిన్న జరిగిన సోదరుడు నంమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె వివాహానికి కూడా హరికృష్ణ హాజరు కాలేదు. ఈ వివాహానికి జూనియర్ ఎన్టీఆర్ కు అసలు ఆహ్వానమే అందలేదన్న ప్రచారమూ జరుగుతోంది. ఇప్పుడు  ఎంపీ పదవిని వదులుకున్న హరికృష్ణ- టీడీపీలో కొనసాగుతారా, అన్న తెలుగుదేశం పార్టీని పునరుద్దరిస్తారా అనేది లేక  సమైక్యాంధ్ర ఉద్యమంలో  భాగస్వామి అవుతారా అని చర్చ జరుగుతోంది.  

Wednesday, August 21, 2013

విభజన నిర్ణయం అమలులో క్రియాశీల పాత్ర....సి.ఎం. కు సోనియా, రాహుల్ క్లాస్?

న్యూఢిల్లీ,ఆగస్టు 21: తెలంగాణ ఏర్పాటు నిర్ణయంపై పునరాలోచన చేసే సమస్యే లేదని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి కాంగ్రెస్ అధ్యక్షు రాలు సోనియాగాంధీ, ఉపాధ్య క్షుడు రాహుల్ గాంధీ తేల్చిచెప్పినట్టు సమాచారం.  రాష్ట్ర విభజన ప్రక్రియతో ముందుకు సాగాల్సిందేనని బుధవారం తనను కలిసిన కిరణ్‌కు సోనియా స్పష్టం చేసినట్టు సమాచారం.  అవసరమైతే రాష్ట్రపతి పాలనకు వెళ్తామే తప్ప తెలంగాణపై ఇచ్చిన మాట తప్పేది లేదంటూ సోనియా కుండబద్దలు కొట్టారని సమాచారం.  ‘సీమాంధ్ర ప్రజల సమస్యలకు పరిష్కారాలను కనుగొనే ప్రయత్నాలు చేస్తున్నాం. కాబట్టి అందరికీ నచ్చజెప్పే ప్రయత్నాలు కొనసాగించండి. విభజన నిర్ణయాన్ని అమలు  చేయడంలో ముఖ్యమంత్రిగా క్రియాశీల పాత్ర పోషించండి’ అని కిరణ్‌కు సూచించారని తెలిసింది. అధిష్టానం పిలుపు మేరకు మంగళవారం ఢిల్లీ వచ్చిన ముఖ్యమంత్రి  విభజనతో తలెత్తే సమస్యలను వివరిస్తూ రూపొందించిన రెండు నివేదికలను  సోనియా, రాహుల్‌లకు సమర్పించినట్టు తెలిసింది. సీమాంధ్రలో  సాగుతున్న ఉద్యమంలో ప్రజలే స్వచ్ఛందంగా వీధుల్లోకి వస్తున్నారని , కాంగ్రెస్ నేతలెవరూ నియోజకవర్గాలకు వెళ్లగలిగే పరిస్థితులు లేవని కిరణ్ వారికి చెప్పారని సమాచారం. 
 

ఆధ్యాత్మిక గురువు ఆశారామ్ బాపూపై రేప్ కేసు...

న్యూఢిల్లీ,ఆగస్టు 21: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారామ్ బాపూ  తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఓ 16 ఏళ్ల బాలిక ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ఆశ్రమంలో ఆశారామ్ తనపై ఈ దాష్టీకానికి పాల్పడ్డారని ఆరోపించింది. లైంగిక దాడి జరిగినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ కావడంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆశారామ్‌పై ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటన రాజస్థాన్‌లో జరిగినట్లు బాధితురాలు పేర్కొన్నందున కేసును అక్కడికి బదిలీ చేస్తామని చెప్పారు.  ఆశారామ్ బాపూపై గతంలోనూ పలు కేసులు నమోదయ్యాయి. గుజరాత్‌లో 2009లో ఆయనపై హత్యాయత్నం, భూకబ్జా కేసులు నమోదవగా మధ్యప్రదేశ్‌లోనూ భూకబ్జా కేసు నమోదైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పాదాభివందనం చేసేందుకు వచ్చిన ఓ భక్తుడిని ఆశారామ్ దుర్భాషలాడుతూ కాలితో తన్నారు. 2012లో ఓ వీడియో జర్నలిస్టు చెంప చెళ్లుమనిపించారు. 2008లో గుజరాత్‌లో ఆశారామ్‌కు చెందిన ఆశ్రమ పాఠశాలలో చదువుకుంటున్న ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద రీతిలో మృతిచెందారు.

ఎంసెట్ ఆప్షన్స్ ఎంపిక వాయిదా ...

హైదరాబాద్,ఆగస్టు 21: సీమాంధ్ర ఉద్యమ నేపథ్యంలో ఎంసెట్ ఆప్షన్స్ ఎంపిక నిరవధికంగా వాయిదా పడింది. అయితే , సర్టిఫికెట్ల పరిశీలన యథావిధిగా కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

రచయిత్రి మాలతీ చందూర్ మృతి...

చెన్నై, ఆగస్టు 21 : ప్రముఖ  రచయిత్రి, కాలమిస్ట్ మాలతీ చందూర్ (87) కన్నుమూశారు. గత కొంతకాలంగా మాలతీ చందూర్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. చెన్నైలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఆమె మృతి చెందారు. తొలి మహిళ కాలమిస్టుగా గుర్తింపు సాధంచిన మాలతీ చందూర్ 1930వ సంవత్సరంలో కృష్ణా జిల్లాలోని నూజివీడులో జన్మించారు. ఎక్కువగా చదువుకోక పోయినా ఆమె చిన్ననాటినుంచే నవలు, కథలు, విజ్ఞాన శాస్త్ర పుస్తకాలు ఎక్కువగా చదివేవారు. రచనలను కేవలం చదవడమే కాకుండా వాటిని విశ్లేషించడం ఆమె ప్రత్యేకత. ఆంధ్రప్రభ పత్రికలో వచ్చే ‘ప్రమాదవనం’ అనే ఫీచర్‌తో మాలతీ చందూర్ మంచి గుర్తింపు పొందారు.   ఇంకా అనేక పత్రికలకు వివిధ రకాల శీర్షికలను అందించారు. మాలతి చందూర్‌ దాదాపు ఆరు దశాబ్దాలుగా చెన్నైలో  నివసిస్తునారు. కేవలం రచయిత్రిగానే కాకుండా ఆమె జగతి అనే మాసపత్రికు ఎడిటర్‌తో పాటు, జర్నలిస్ట్‌ గా పనిచేశారు.

Tuesday, August 20, 2013

మాజీ ప్రధాని రాజీవ్ గాంధి 69వ వర్ధంతి సందర్భంగా పార్లమెంట్ హౌస్ లో నేతల నివాళి... 

రాష్ట్రపతికి రాఖీ కడుతున్న చిన్నారులు...  

ఆంటోనీ కమిటీ చెవిలో ' సమైక్య ' శంఖం...

న్యూఢిల్లీ,ఆగస్టు 20:  రాష్ట్ర విభజన వల్ల తలెత్తే సమస్యలను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆంటోనీ కమిటీ కి వివరించారు.  దాదాపు నలబై నిమిషాల పాటు జలవనరులు, విద్యుత్తు, ఉపాధి, నక్సలిజం, హైదరాబాద్ విషయాల్లో తలెత్తే సమస్యలను ఆయన వివరించినట్టు సమాచారం. రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే రాష్ట్రం ఐక్యంగానే ఉండాలని ఆయన సూచించారు.  విభజన రెండు ప్రాంతాలకు కూడా నష్టమేనని ఆయన చెప్పారుట.  రాష్ట్ర విభజనపై పునరాలోచన చేయాలని ఆయన సూచించారని భోగట్టా.   అయితే, రాష్ట్ర విభజనపై నిర్ణయం జరిగిపోయిందని, వెనక్కి వెళ్లలేమని ఆంటోనీ కిరణ్ కుమార్ రెడ్డితో చెప్పినట్లు సమాచారం.  కాగా, ఆంటోనీ కమిటీ ముందు సీమాంధ్ర రాష్ట్ర మంత్రులు, శానససభ్యులు, ఎమ్మెల్సీలు కూడా  సమైక్యవాదాన్ని వినిపించారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని తాము కోరినట్లు ఆంటోనీ కమిటీతో బేటీ అనంతరం మంత్రి శైలజానాథ్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. రాయలసీమ, ఆంధ్ర, హైదరాబాద్ ప్రాంతాల ప్రజలు సమైక్యాన్ని కోరుకుంటున్నట్లు తాము చెప్పినట్లు ఆయన తెలిపారు. విఫజన జరిగితే ఇంతకన్నా పెద్ద సమస్యలు తలెత్తుతాయని చెప్పినట్లు తెలిపారు. నదీజలాలు, ఉపాధి కల్పన, ఆర్థికాభివృద్ధి తదితర విషయాల్లో ఇరు ప్రాంతాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని వివరించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రానికి రావాలని ఆంటోనీ కమిటీని కోరినట్లు ఆయన తెలిపారు. విభజన వల్ల తలెత్తే సమస్యలను తాము వివరించినట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్‌పైనా చర్చించామని ఆయన తెలిపారు. హైదరాబాదులో సీమాంధ్రులకు రక్షణ ఉండదని చెప్పినట్లు ఆయన తెలిపారు. తాము చెప్పిన విషయాలను సావధానంగా విన్నారని, రాష్ట్రంలో పర్యటించాలని ఆంటోనీ కమిటీని కోరామన ఆయన చెప్పారు.సీమాంధ్ర నాయకులు దాదాపు రెండు గంటల పాటు ఆంటోనీ కమిటీతో సమావేశమయ్యారు.  సీమాంధ్ర నేతలతో ఆంటోనీ కమిటీ భేటీ అనంతరం దిగ్విజయ్ సింగ్  మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కుంటున్నారని  అన్నారు. ఈ నెల 26, 27, 28 తేదీల్లో మళ్లీ సమావేశమవుతామని ఆయన చెప్పారు. సీమాంధ్ర నేతల అభిప్రాయాలను తాము సావధానంగా విన్నట్లు ఆయన తెలిపారు.

Monday, August 19, 2013

చివరి క్షణాల్లో వాయిదా పడిన జీఎస్‌ఎల్‌వీ-డీ5 ప్రయోగం

సూళ్లూరుపేట, ,ఆగస్టు 19:   భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన జీఎస్‌ఎల్‌వీ-డీ5 ప్రయోగం చివరి క్షణాల్లో వాయిదా పడింది. సోమవారం సాయంత్రం 4.50 గంటలకు నిర్వహించాల్సిన ఈ ప్రయోగాన్ని.. రెండో దశలో ఇంధనం లీకేజీని గుర్తించడంతో నిలిపేశారు. కౌంట్ డౌన్ నిర్విఘ్నంగా కొనసాగుతున్న సమయంలో మరో 75 నిమిషాల్లో ప్రయోగం జరగాల్సి ఉండగా రాకెట్‌లోని రెండో దశ(జీఎస్-2)లో ఇంధనం లీకేజీ ఉన్నట్లు ఇస్రో చైర్మన్ గుర్తించారు. దీంతో సరిగ్గా 3.45 గంటలకు మిషన్ కంట్రోల్ రూమ్ నుంచి రాకెట్ వ్యవస్థలన్నింటినీ నిలిపి వేశారు.  ఈ రాకెట్ ద్వారా 1982 కిలోల జీశాట్-14 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టాల్సి ఉంది. వాస్తవానికి దీన్ని జూలై నెలాఖరులో ప్రయోగించాల్సి ఉండగా ఇప్పటిదాకా వాయిదా పడుతూ వచ్చింది. ఇందులోని క్రయోజనిక్ దశను పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు. 

రైలు దూసుకుపోయి 37మంది దుర్మరణం...

పాట్నా,ఆగస్టు 19:  పాట్నాకు 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖగారియా జిల్లాలోని ధమారాఘాట్ స్టేషన్‌లో సోమవారం ఉదయం  రైల్వే ట్రాక్ దాటుతున్నవారిపై నుంచి  ఎదురుగా వస్తున్న మరో రైలు దూసుకుపోవడంతో 37 మంది దుర్మరణం పాలయ్యారు. వీరిలో 13 మంది మహిళలు, నలుగురు పిల్లలున్నారు. మరో 24 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.  సమస్తిపూర్-సహర్సా ప్యాసింజర్ రైలు ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ధమారాఘాట్ స్టేషన్‌కు వచ్చి ఆగింది. ఈ రైలు నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు దిగారు. పవిత్ర శ్రావణ మాసం.. కావడంతో వీరంతా సమీపంలోని కాత్యాయనిస్థాన్ ఆలయంలో శివలింగానికి జలాభిషేకం చేయడానికి వెళ్తున్నారు. అవతలి వైపు వెళ్లడానికి ట్రాక్ దాటుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో మరోవైపు నుంచి సహర్సా-పాట్నా రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్ 80 కిలోమీటర్ల వేగంతో దూసుకువచ్చింది. వాస్తవానికి ఈ ఎక్స్‌ప్రెస్ ధమారాఘాట్ స్టేషన్‌లో ఆగదు. దీంతో డ్రైవరు అదే వేగంతో రైలును పోనివ్వడం, పట్టాలపై నడుస్తున్నవారంతా చక్రాల కింద పడిపోయి చనిపోవడం క్షణాల్లో జరిగిపోయింది. 

Sunday, August 18, 2013

హైదరాబాద్ తో పెట్టుకోవద్దు...టీఆర్‌ఎస్

హైదరాబాద్, ఆగస్టు 18:  హైదరాబాద్‌పై మెలికలు పెట్టి కిరికిరి చేయాలనుకుంటే రణరంగమే అవుతుందని టీఆర్‌ఎస్ హెచ్చరించింది. పది జిల్లాలతో కూడిన తెలంగాణకు తప్ప మరే ప్రత్యామ్నాయానికీ ఒప్పుకునేది లేదని స్పష్టం చేసింది. ‘హైదరాబాద్ ఆదాయంలో వాటా అడిగినా, పదేళ్ల పాటు శాంతి భద్రతలు కేంద్రం పరిధిలో ఉంటాయన్నా అంగీకరించే ప్రసక్తే లేదని’  ఆదివారం మెదక్ జిల్లా జగదేవ్‌పూర్‌లో టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, పొలిట్ బ్యూరో సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులతో అధినేత కేసీఆర్ జరిపిన అత్యవసర సమావేశం స్పష్టం చేసింది.   అంతేగాక పదేళ్ల కాలం పాటు కూడా హైదరాబాద్‌ను ‘తాత్కాలిక ఉమ్మడి రాజధాని’ అని మాత్రమే పేర్కొనాలంటూ డిమాండ్ చేయాలన్న భావన వ్యక్తమైంది.

సమ్మె విరమించిన జూడాలు...

హైదరాబాద్, ఆగస్టు 18:  జూనియర్ డాక్టర్లు గత 20 రోజులుగా  చేస్తున్న సమ్మెను విరమించుకున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో జూడాలు వెనక్కి తగ్గారు.   సోమవారం నుంచి విధులకు హాజరవుతున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు ఫణి మహేశ్వర్ రెడ్డి తెలిపారు.   డిమాండ్ల పరిష్కారంపై సర్కారు  వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా జూనియర్‌ వైద్యులు గత నెల 29 నుంచి సమ్మెకు దిగారు. ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్‌ కోటా కింద చేరినా 9లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని... ఆ వసూళ్లను తక్షణమే నిలిపివేసి జీఓ నెంబరు 93ను రద్దు చేయాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్‌ చేస్తున్నారు. 

Saturday, August 17, 2013

విజయమ్మ దీక్షా వేదిక గుంటూరుకు మార్పు...

గుంటూరు,ఆగస్టు 17: రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్  తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్. విజయమ్మ ఈ నెల 19 నుంచి గుంటూరులో నిరవధిక దీక్షను ప్రారంభించనున్నారని ఆ పార్టీ  రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రకటించారు. విజయమ్మ దీక్షను తొలుత విజయవాడలో నిర్వహించాలనుకున్నామని, అయితే అవనిగడ్డ ఉప ఎన్నికలను కారణంగా చూపి పోలీస్ కమిషనర్ దీక్ష నిర్వహణకు అనుమతించలేదని తెలిపారు. దీంతో చట్టంపై ఉన్న గౌరవంతో విజయమ్మ, పార్టీ ముఖ్యనేతల సూచనల మేరకు దీక్షా వేదికను గుంటూరుకు మార్చామని చెప్పారు. 

సీమాంధ్ర ఉద్యోగుల సమ్మెపై ‘నో వర్క్-నో పే’ అస్త్రం...

హైదరాబాద్,ఆగస్టు 17:  సీమాంధ్ర ఉద్యోగులు చేపట్టిన సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం ‘నో వర్క్-నో పే’ అస్త్రాన్ని ప్రయోగించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోరుతూ తెలంగాణ ఉద్యోగుల చేపట్టిన సకల జనుల సమ్మెపై 2011లో ప్రయోగించిన జీవో-177ను ఇప్పుడు సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె పై ప్రభుత్వం ప్రయోగించింది. జీవో-177ను ఖచ్చితంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోను అమలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగుల హాజరు నివేదికను ప్రతిరోజూ సచివాలయానికి పంపించడంతో పాటు సమ్మె చేస్తున్న ఉద్యోగులపై జీవో-177 ప్రకారం చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశాల్లో స్పష్టం చేశారు. మరోవైపు  రాష్ట్ర ట్రెజరీ అండ్ అకౌంట్స్, పే అండ్ అకౌంట్స్, రాష్ట్ర వర్క్స్ ప్రాజెక్ట్స్ అండ్ అకౌంట్స్, ట్రెజరీ విభాగాల సబార్డినేట్ సర్వీసెస్‌లలో సమ్మెను నిషేధిస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వి.భాస్కర్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ సేవలను అత్యవసర సేవల పరిధిలోకి తీసుకొచ్చారు. ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని, ఆరు నెలల పాటు సమ్మె నిషేధం అమల్లో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Friday, August 16, 2013

అక్టోబర్ నాటికి రెండు పి.సి.సి.లు...!

హైదరాబాద్,ఆగస్తు 17:  రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తికాక ముందే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ)ని రెండు భాగాలుగా విభజించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. అందులోభాగంగా అక్టోబర్ నాటికి తెలంగాణ, సీమాంధ్ర కాంగ్రెస్ కమిటీలను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. రాబోయే సాధారణ ఎన్నికల నాటికి ఇరు ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతున్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పటికీ హైదరాబాద్‌ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తామని కాంగ్రెస్ ప్రకటించినందున గాంధీభవన్‌లోనే తెలంగాణ, ఆంధ్రా పీసీసీ కమిటీలకు కార్యాలయాలను నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం గాంధీభవన్‌ను ఆధునీకరించడంతోపాటు వెనకున్న స్థలంలో మూడంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు.   కొత్త భవనాన్ని తెలంగాణకు కేటాయించేలా మార్పులు చేయాలని భావిస్తున్నారు. కొత్త పీసీసీ కమిటీల్లో ఎంతమంది ఆఫీస్ బేరర్స్ ఉంటారనే దానిపై స్పష్టత రాలేదు. ప్రస్తుత ఆఫీస్ బేరర్స్‌లో ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శులంతా కలిపి 30 మంది ఉన్నారు. వీరిలో 16 మంది తెలంగాణ, 14 మంది సీమాంధ్ర వారు. రెండు నెలల క్రితమే వీరి నియామకం జరిగింది. ఈ నేపథ్యంలో ఏ ప్రాంతం వారిని ఆ ప్రాంత పీసీసీ ఆఫీస్ బేరర్స్‌గా కొనసాగిస్తారా, లేక అందరినీ తప్పించి కొత్త కమిటీలను నియమిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. 19న ఢిల్లీ వెళ్లనున్న బొత్స.. రెండు పీసీసీల ఏర్పాటు అంశాన్ని కూడా హైకమాండ్ పెద్దలతో చర్చించే అవకాశాలున్నాయని పీసీసీ వర్గాలు తెలిపాయి.

Thursday, August 15, 2013

టీడీపీ నేత లాల్‌జాన్‌బాషా దుర్మరణం...

హైదరాబాద్,ఆగస్టు 15:  టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ లాల్‌జాన్‌బాషా (57) గురువారం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండల కేంద్రం సమీపంలోని కామినేని ఆస్పత్రి జంక్షన్ వద్ద 65వ నంబరు జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనం అత్యంత వేగంగా వెళ్తూ అదుపుతప్పడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. బాషా గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి గుంటూరుకు వెడుతుండగా  ఆయన వాహనం నార్కట్‌పల్లి వద్ద డివైడర్‌ను ఢీకొట్టింది.  ఈ ప్రమాదంలో బాషా అక్కడికక్కడే మృతి చెందారు. . పోస్టుమార్టం అనంతరం బాషా భౌతికకాయాన్ని హైదరాబాద్‌  మిథిలానగర్‌లోని ఆయన స్వగృహానికి తరలించారు. అనంతరం ఆయన స్వస్థలం గుంటూరుకు తీసుకెళ్లారు.


 ఎర్రకోట నుంచి ప్రధాని మన్మోహన్ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం 

సంకుచిత భావ జాలాలతో సమాజానికి చేటు....ప్రధాని

న్యూఢిల్లీ,ఆగస్టు 15:   భారత్ వంటి ఆధునిక, లౌకిక, ప్రగతిశీల దేశంలో సంకుచిత భావజాలాలకు, విద్వేషపూరిత విధానాలకు తావులేదని ప్రధాని మన్మోహన్‌సింగ్ స్పష్టం చేశారు. అటువంటి ధోరణులు సమాజాన్ని విభజించి ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తాయన్నారు. చారిత్రక ఎర్రకోట నుంచి గురువారం చేసిన 67వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో 81 కోట్ల మంది పేదలకు లబ్ధి చేకూర్చే ఆహార భద్రత పథకం త్వరలో పార్లమెంటు ఆమోదం పొందుతుందని ధీమా వెలిబుచ్చారు. వాయువేగంతో అభివృద్ధి సాధించనిదే పేదరిక నిర్మూలన, అందరికీ నాణ్యమైన విద్య, ఆరోగ్య సేవలు, ఉపాధి వంటి లక్ష్యాలను సాధించలేమన్నారు.  ''పొరుగు దేశాలన్నింటితోనూ మేం స్నేహమే కోరుతున్నాం. అయితే పాకిస్థాన్ వైపు నుంచి పెరుగుతున్న భారత వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట పడాల్సిందే. అలాంటి కార్యకలాపాలను పాక్ అరికట్టినప్పుడే ఆ దేశంతో సంబంధాలు మెరుగుపడేందుకు ఆస్కారముంటుంది. నియంత్రణ రేఖ వద్ద ఇటీవల భారత జవాన్లను కాల్చి చంపిన వంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలూ తీసుకుంటాం'' అని ప్రధాని అన్నారు.  వచ్చే 12 నెలల్లో 10 లక్షల మంది యువతీయువకులకు నైపుణ్య శిక్షణ ఇచ్చే కొత్త పథకాన్ని త్వరలో ప్రారంభిస్తాం. నూతన నైపుణ్యాలను అలవర్చుకున్న వారికి రూ.10 వేల గ్రాంట్ అందజేస్తాం. త్వరలో మరిన్ని రంగాల్లోకి ఎఫ్‌డీఐలను అనుమతిస్తాం. యూపీఏ పాలనలో దేశం ఎంతో ప్రగతి సాధించింది. వర్తక, వాణిజ్యాలకు అనువైన వాతావరణం కల్పించాం. పారదర్శకతకు పెద్దపీట వేసి, అవినీతిని అరికట్టేందుకు సమాచార హక్కు చట్టం తెచ్చాం.అని చెప్పారు. ఎనిమిది కొత్త విమానాశ్రయాలు, రెండు కొత్త నౌకాశ్రయాలు, పారిశ్రామిక కారిడార్లతో సహా పలు మౌలికాభివృద్ధి ప్రాజెక్టులు అతి త్వరలో పట్టాలెక్కనున్నాయి. ఇవి దేశ ప్రగతికి తోడ్పడటమే గాక ఎంతోమందికి ఉపాధి కల్పించగలవు.  దేశ ఆర్థిక రంగంలో నెలకొన్న మందగమనం ఎక్కువ కాలం ఉండదు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. గత తొమ్మిదేళ్లలో మనం సగటున 7.9 శాతం సాధించిన ఆర్థిక వృద్ధిరేటే మన సామర్థ్యం ఏమిటో తెలియజేస్తోంది. 2012-13లో నమోదైన ఈ దశాబ్దిలోకెల్లా కనిష్ట వృద్ధి రేటు 5 శాతాన్ని మెరుగుపరుచుకొని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6 శాతం వృద్ధి రేటు సాధించగలమని ఆశిస్తున్నామని మన్మోహన్ తెలిపారు. కాగా,   మన్మోహన్‌సింగ్ ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం   వరుసగా పదోసారి. తద్వారా నెహ్రూ, ఇందిరాగాంధీ కుటుంబానికి వెలుపల ఈ ఘనతను సొంతం చేసుకున్న తొలి ప్రధానిగా మన్మోహన్ నిలిచారు. నెహ్రూ, ఇందిరాగాంధీలు ఎర్రకోటపై పదిసార్లకు మించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. నెహ్రూ వరుసగా 17 సార్లు పతాకావిష్కరణ చేయగా, ఇందిరకు ఈ గౌరవం 16 సార్లు దక్కింది.


శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ లేదు...సి.ఎం.

హైదరాబాద్,ఆగస్టు 15:   నిరుపేదలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందించేందుకు కృషి చేస్తున్న తమ ప్రభుత్వానికి ప్రగతి ప్రయాణంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని  ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. 67వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా  సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్స్‌లో నిర్వహించిన వేడుకలకు సీఎం ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణ, మత సామరస్యాన్ని కాపాడటంలో రాజీలేకుండా ముందుకు వెడుతున్నామని అన్నారు.   రాష్ట్రంలో ముందుగానే మంచి వర్షాలు పడినందున ఖరీఫ్ సీజన్‌లో మంచి పంటలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జలాశయాలన్నీ పూర్తిగా నిండాయని, విద్యుత్ పరిస్థితి పూర్తిగా మెరుగుపడిందని చెప్పారు. గత తొమ్మిదేళ్లలో ఈ ఏడాది తలసరి ఆదాయం జాతీయసగటు కన్నా ఎక్కువగా నమోదయిందని, జాతీయ స్థాయిలో పేదరికం శాతం 21.9గా ఉంటే మన రాష్ట్రంలో 9.2 శాతానికి తగ్గిందని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక చట్టం తెచ్చి ఆయా వర్గాల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఈ ఏడాది మహిళా సంఘాలకు రూ.16,500 కోట్లను రుణాలుగా ఇస్తున్నట్లు సీఎం తెలిపారు. పారిశ్రామిక పెట్టుబడుల్లో దేశంలోనే రాష్ట్రం రెండో స్థానానికి చేరుకుందని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని చెప్పారు.


Friday, August 9, 2013

సి.ఎం. సందేహాలను ఆంటోనీ కమిటీ పరిశీలిస్తుంది...దిగ్విజయ్

న్యూఢిల్లీ,ఆగస్టు 9:  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెల్లడించిన సందేహాలను ఎకె ఆంటోనీ నేతృత్వంలోని కమిటీ పరిశీలిస్తుందని, అన్ని వర్గాలతో చర్చించి సమస్య పరిష్కారం దిశగా ఆ కమిటీ సూచన చేస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ శుక్రవారం చెప్పారు. కిరణ్ లేవనెత్తిన అభ్యంతరాలపై కమిటి దృష్టి పెడుతుందన్నారు. అన్ని వర్గాలతో చర్చలు జరుపుతుందని చెప్పారు. ఆంటోనీ నేతృత్వంలో నలుగురు సభ్యులతో కూడిన కమిటీని వేసింది.. సమస్యల పైన దృష్టి సారించి వాటిని పరిష్కరించేందుకేనని దిగ్విజయ్ సింగ్ అభిప్రాయపడ్డారు.

సీఎం కు మెంటలొచ్చింది...కె.సి.ఆర్.

హైదరాబాద్,ఆగస్టు 9:  రాష్ట్ర విభజన , తదనంతర పరిణామాలపై ముఖ్యమంత్రి చెప్పినవన్నీ అబద్ధాలేనని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ విరుచుకుపడ్డారు.రాష్ట్ర విభజన ప్రకటనతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మానసిక స్థితి దెబ్బతిందని  కేసీఆర్ అన్నారు. చరిత్రను వక్రీకరించి సీఎం పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్ గురించి మాట్లాడే హక్కు సీఎంకు లేదన్నారు. విభజన ప్రకటన వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ పరిస్థితి ఏంటని కిరణ్ ప్రశ్నించడాన్ని ఆయన తప్పుబట్టారు. రాష్ట్ర విభజనపై సీఎం చెప్పిన లెక్కలన్నీ తప్పని కేసీఆర్ అన్నారు. సీఎం చెప్పిన లెక్కలు తప్పని నిరూపించేందుకు సిద్ధమన్నారు. కిరణ్ తో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. కరెంట్ కొరతను చూపి తెలంగాణ వాసులను సీఎం కిరణ్ భయపెడుతున్నారని కేసీఆర్ ఆరోపించారు. తమ ప్రాంతానికి 6800 మెగావాట్ల విద్యుత్ అవసరం కాగా, 2458 మెగావాట్ల విద్యుత్ కొరత ఉందన్నారు. లోటును పూడ్చుకునేందుకు కేంద్రం 1000 మెగావాట్ల విద్యుత్ తీసుకుంటామన్నారు. ఛత్తీస్ గఢ్ వెయ్యి మెగావాట్ల విద్యుత్ అందించేందుకు సిద్దంగా ఉందన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పడితే 10వేల మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పత్తి చేసే దిశగా ఎదుగుతామని కేసీఆర్ చెప్పారు. హైకోర్టు విషయంలో సీఎం కిరణ్ మసిపూసి మారేడు కాయ చేస్తున్నారని,   1919లోనే తెలంగాణలో హైకోర్టు ఏర్పడిందని, 1954లో గుంటూరులో హైకోర్టు ఏర్పడిందని తెలిపారు. హైదరాబాద్ లో ఆంధ్ర అడ్వకేట్లు 5 శాతం మందే ఉన్నారని వెల్లడించారు. ఆంధ్ర ప్రాంతీయులను వెనక్కి వెళ్లిపొమ్మని ఎవరు చెప్పారు? ఎవరైనా పొమ్మంటే ముందు నేనే కొట్లాడతనని ఆయన చెప్పారు. ఎవరినీ ఎవరూ పొమ్మనరని ఎన్ని సార్లు చెప్పాలి? హైదరాబాద్‌కు తెలుగు చలన చిత్ర పరిశ్రమ వచ్చింది, ఆంధ్ర ప్రాంతంవారు చలన చిత్ర పరిశ్రమలోకి చొచ్చుకుపోవడానికి  చారిత్రక ారణాలున్నాయని, ఇప్పుడిప్పుడే తెలంగాణావారు చిత్ర పరిశ్రమలోకి వస్తున్నారని, అయినా చిత్ర పరిశ్రమవారిని కడుపులో పెట్టుకుంటామని, ఇక ఎవరికైనా భయాందోళనలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. విడిపోతే ఆంధ్రప్రాంతానికి నష్టం అన్న ముఖ్యమంత్రి కలిసుంటే తెలంగాణాకు లాభం ఏమిటో చెప్పాలని ఆయన డిమాండు చేశారు. విభజన సందర్భంలో కొన్న భయాందోళనలు, అపోహలు తలెత్తడం సహజం, కాని ఈ సమయంలో ఆ భయాందోళనలను పోగొట్టవలసిన అవసరం ఉందని ఆయన చెప్పారు. గౌరవప్రదంగా, పరస్పర విశ్వాసంతో సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన అన్నారు. ఒరియా వారు మా కార్యాలయం పక్కనే గుడి కట్టుకున్నారు, వారికి ఉత్సవం జరిగినప్పుడు మా తెలంగాణ భవన్‌లోనే పార్కింగ్ పెట్టుకుంటారని, మేము ఖాళీ చేసి ఇస్తామని, అది సంస్కారం అని ఆయన చెప్పారు. కావాలంటే సీఎం కూడా హైదరాబాద్‌లో కర్రీపాయింట్ గానీ, టిఫిన్ సెంటర్ గానీ పెట్టుకుని ఉండవచ్చునని కేసీఆర్ వ్యంగ్యంగా పేర్కొన్నారు.

Thursday, August 8, 2013

19 నుంచి ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌

హైదరాబాద్, ఆగస్టు 8 : ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌కు  అవరోధాలు  తొలగిపోయాయి. ఈ నెల 19 నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభించాలని ఉన్నత విద్యామండలిని  హైకోర్టు గురువారం ఆదేశించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ వారం ముందు విడుదల చేయాలని సూచించింది.యాజమాన్య కోటా సీట్లకు సంబంధించిన వివరాల్ని వెబ్‌సైట్‌లో పొందుపరచాలని హైకోర్టు సూచించింది. మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీ కూడా కౌన్సెలింగ్‌ ద్వారానే భర్తీ చేయాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను అనుసరించి ఈ నెల 12న ఉన్నత విద్యా మండలి కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల చేసేందుకు చర్యలు ప్రారంభించింది. ఈ మధ్య కాలంలో ఎంసెట్‌ కౌన్సెలింగ్‌లో ఇంత జాప్యం జరగడం ఇదే మొదటిసారి. మే 12న ఎంసెట్‌ నిర్వహించగా, జూన్‌ 5న ఫలితాలు వెలువడ్డాయి.

అడ్డగోలుగా విభజిస్తే అనర్ధాలు తప్పవు...సి.ఎం.

హైదరాబాద్, ఆగస్టు 8 : ఒక కొత్త రాష్ట్రాన్ని ఇవ్వాలనే ఉత్సాహంలో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఎదుర్కోబోయే సమస్యలను పట్టించుకోకపోతే భవిష్యత్తులో అనేక క్లిష్ట సమస్యలు ఎదురవుతాయని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. రెండువైపులా ఉన్న సమస్యలను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ముందు పెట్టవలసిన బాధ్యత ముఖ్యమంత్రిగా తనపై ఉన్నదని ఆయన వ్యాఖ్యానించారు. సి.డబ్ల్యూ.సి. నిర్ణయం అనంతరం తొమ్మిది రోజుల తరవాత   గురువారం సాయంత్రం మీడియా ముందుకు వచ్చిన ముఖ్యమంత్రి  ఎవరి కోరికమేరకో, ఉద్యమాల కోసమో రాష్ట్రాలు ఏర్పడవు అని ఆయన చెప్పారు. మీ పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని మీరు బద్ధులు కారా అని మీడియా ప్రతినిధులు పదే పదే  ప్రశ్నించగా పార్టీ నిర్ణయాన్ని తాను స్వాగతించడం లేదు, అలా అని వ్యతిరేకించడంలేదని ఆయన చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు అంశంపై తొమ్మిది రోజులుగా సీమాంధ్ర ప్రాంతాలలో జరుగుతున్న ఆందోళనలపై  ఆవేదన వ్యక్తం చేస్తూ ఎవరు ఏ రకమైన ఆందోళనలనైనా నిర్వహించవచ్చునని,  నిరసనలనైనా వ్యక్తం చేయవచ్చునని, కాని ఏదైనా శాంతియుతంగా జరగాలని ఆయన అన్నారు. జాతీయ నాయకులు ప్రత్యేకంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలను తీర్చిదిద్దిన పండిత్ జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధి, రాజీవ్ గాంధి వంటి వారి విగ్రహాలను కూల్చివేయడం చాలా బాధాకరమని, ఇటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన నిర్ణయం కాంగ్రెస్ పార్టీ మాత్రమే తీసుకున్నదని, ప్రభుత్వ నిర్ణయం ఇంకా కాలేదని, విభజన తర్వాత ఏయే సమస్యలు వస్తాయో, వాటికి ఏయే పరిష్కార మార్గాలను చూపించాలో ఇప్పుడే చెప్పాలని, ఆ తర్వాతే విభజన ప్రక్రియ జరగాలని కిరణ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్  మనది అనుకుని ప్రజలు ఇక్కడికి వచ్చారని, ఎంతో మంది ఇక్కడే పుట్టారని, వారి హోదా ఇప్పుడు ఏమిటి, రేపు ఏమిటో చెప్పవలసిన అవసరం ఉన్నదని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనపై అభ్యంతరాలుంటే ఏకే ఆంటోనీ నేతృత్వంలోని ఉన్నతస్థాయికి చెప్పాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఏకే ఆంటోనీ కమిటీని హైదరాబాద్ కు ఆహ్వానించి అభ్యంతరాలు తెలుసుకునే అవకాశం కల్పిస్తామని ఆయన హామీయిచ్చారు. విభజిస్తే జలవివాదాలు పెరుగుతాయన్నారు. రాష్ట్ర విభజన జరిగిన వెంటనే తెలంగాణకు విద్యుత్ సమస్య ఎదురవుతుందని తెలిపారు. 610 జీవో విషయంలో అస్యతాలు ప్రచారం చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు స్పష్టత ఇచ్చిన తర్వాతే రాష్ట్ర విభజన ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్లాలని అన్నారు.


Wednesday, August 7, 2013

ఏదైనా ఉంటే కమిటీకి చెప్పుకోండి.-దిగ్విజయ్

న్యూఢిల్లీ,ఆగస్టు 7: రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్టానం కేంద్ర రక్షణశాఖ మంత్రి ఏకె ఆంటోనీ ఆధ్వర్యంలో హైలెవల్ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ వర్గాలు  అధికారికంగా ప్రకటించాయి.  హైలెవల్ కమిటీ ఛైర్మన్‌గా ఆంటోనీ, కమిటీ సభ్యులుగా కేంద్ర మంత్రులు అహ్మద్ పటేల్, వీరప్పమొయిలీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్‌ ఉన్నారు.  సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం జరిగిన పరిణామాలపై సీమాంధ్ర ప్రజల నుంచి హైలెవల్ కమిటీ అభిప్రాయాలను సేకరించనుంది. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ప్రాంతాలకూ న్యాయం చేస్తామని, ఎవ్వరూ ఆందోళన చెందనక్కరలేదని, అన్ని ప్రాంతాల సమస్యలనూ విని వాటికి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారమార్గాన్ని అమలు చేస్తామని  కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ హామీ ఇచ్చారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ విభజన అంశంపై నిర్ణయం జరిగిపోయిందని, ఇక దానిపై వెనక్కి వెళ్లేది లేదని ఆయన చెప్పారు. అయితే ఎవరికి ఏ అభిప్రాయాలు ఉన్నా, ఏ కోరికలు ఉన్నా ఇప్పుడు నియమించిన ఉన్నత స్థాయి కమిటీకి నివేదించాలని, అన్ని సమస్యలనూ ఈ కమిటీ పరిగణనలోకి తీసుకుంటుందని ఆయన చెప్పారు.

అవనిగడ్డలో ముక్కోణం...

హైదరాబాద్,ఆగస్టు 7:  అవనిగడ్డ ఉపఎన్నిక పోలింగ్ అనివార్యంగా మారింది. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోకపోవడంతో పోలింగ్ నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.  నామినేషన్ ఉపసంహరణ బుధవారంతో ముగిసింది.  టీడీపీ సహా ముగ్గురు అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఈ నెల 21న పోలింగు  జరగనుండగా, 24న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. టీడీపీ తరపున అంబటి బ్రాహ్మణయ్య తనయుడు అంబటి హరిప్రసాద్ పోటీ చేస్తున్నారు. అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి అంబటి బ్రాహ్మణయ్య మృతితో ఖాళీ ఏర్పడింది. ఆయన చనిపోయిన నాటి నుంచి ఏకగ్రీవం కోసం టీడీపీ నాయకులు, అంబటి కుటుంబసభ్యులు ఇతర పార్టీల నేతలను కోరుతూ వచ్చారు. ఇదే విషయమై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రధాన పార్టీల రాష్ట్ర అధ్యక్షులకు లేఖలు కూడా రాశారు. సానుభూతి కోణంలో  వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్, లోక్‌సత్తా, సీపీఎం, బీజేపీలు తాము అభ్యర్థులను పోటీకి పెట్టక పోయినా ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉండడంతో  పోలింగ్ అనివార్యం అయింది.

Tuesday, August 6, 2013

రిజర్వ్‌ బ్యాంకు కొత్త గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 6:  రిజర్వ్‌ బ్యాంకు కొత్త గవర్నర్‌గా రఘురామ్‌ రాజన్‌ నియమితులయ్యారు. ప్రస్తుత గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు పదవీ కాలం సెప్టెంబరు 4తో ముగియనుంది. అదే రోజు 23వ  గవర్నర్‌గా రాజన్‌ బాధ్యతలు చేపడతారు. మూడేళ్ల పాటు ఈ పదవిలో ఆయన ఉంటారు. రాజన్‌ ప్రస్తుతం భారత ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. సాధారణంగా రిజర్వ్‌ బ్యాంకుకు ఐఏఎస్‌ అధికారిని మాత్రమే గవర్నర్‌గా నియమిస్తుంటారు. దువ్వూరి సుబ్బారావు , అంతకుముందున్న గవర్నర్‌ వై.వి.రెడ్డి ఇద్దరూ ఐఏఎస్‌ అధికారులే. అసాధారణమైన ప్రతిభావంతుడిగా పేరున్న రాజన్‌  ఐఏఎస్‌ కాకపోయినాఈ పదవికి ఎంపిక కాచడం విశేషం. రఘురామ్‌ రాజన్‌ భోపాల్‌లో 1963 ఫిబ్రవరి 3న జన్మించారు. ఆయన తండ్రి దౌత్యవేత్త.  అందువల్ల 7వ తరగతి వరకు  రాజన్ విదేశాల్లోనే చదువుకున్నారు.  ఆ తర్వాత నుంచి ఢిల్లీలో చదువుకున్నారు. 1985లో ఢిల్లీ ఐఐటీ నుంచి గోల్డ్‌ మెడల్‌తో బీటెక్‌ పట్టా అందుకున్నారు.  అహ్మదాబాద్‌ ఐఐఎంలో ఎంబీఏ చేశారు. అమెరికాలోని మసాచుసెట్స్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. బ్యాంకింగ్‌ రంగంపై సమర్పించిన పత్రానికి ఎంఐటి  పీహెచ్‌డీ మంజూరు చేసింది. రాజన్ చికాగోలోని బూత్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో పని చేశారు. ఐఎంఎఫ్ లో చీఫ్‌ ఎకానమిస్ట్‌గా నియమితులయ్యారు. ఈ పదవి చేపట్టిన వారిలో అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు. ఫైనాన్స్ రంగంలో ఆయన పలు అవార్డులు అందుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక శాస్త్రానికి సంబంధించి పలు పుస్తకాలు కూడా రాశారు. 2008లో ఆర్థిక సంక్షోభం రాబోతోందని అంచనా వేసిన వారిలో రాజన్‌కు కూడా ముఖ్యమైన స్థానం ఉంది. అదే ఏడాది మన దేశానికి గౌరవ ఆర్థిక సలహాదారుగా ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్ నియమించారు. 2012లో ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారుగా నియమితులయ్యారు. ఇప్పుడు అత్యంత చిన్న వయసులో ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. 



  



కమిటీ పని పూర్తయ్యే వరకు ప్రక్రియ ఆగుతుంది...పళ్ళం రాజు మాట

న్యూఢిల్లీ, ఆగస్టు 6:  రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ కమిటీ పని పూర్తయ్యే వరకు రాష్ట్ర విభజన ప్రక్రియ ఆగుతుందని సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రి పళ్లంరాజు చెప్పారు. సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, చిరంజీవి, పళ్లంరాజు, పనబాక లక్ష్మి, కిల్లి కృపారాణి, జెడి శీలం మంగళవారం సోనియాను కలిశారు. భేటీ అనంతరం  మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ  కమిటీకి సమస్యలు వినిపించాలని సోనియా చెప్పారని పళ్లంరాజు అన్నప్పుడు-అంతవరకు ప్రక్రియ ఆగుతుందా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆగుతుందని పళ్లంరాజు సమాధానమిచ్చారు. తమ ప్రాంతంలోని ఆందోళనను సోనియాకు వివరించామని ,  ఒక ప్రాంతానికి పరిష్కారం చూపించారని, తమకు అన్యాయం జరుగుతుందనే భావన సీమాంధ్రలో నెలకొని ఉందని చెప్పామని ఆయన అన్నారు. ''కమిటీని ప్రకటిస్తాం, ఆ కమిటీ ముందు అన్ని విషయాలూ చెప్పండని'' సోనియా సూచించినట్లు ఆయన తెలిపారు. అన్యాయం ఎక్కడ జరుగుతుందో చెప్పాలని, వాటిని పరిశీలిస్తామని సోనియా చెప్పినట్లు ఆయన అన్నారు. న్యాయం జరుగుతుందనే నమ్మకం తమకు ఉందని ఆయన అన్నారు. ప్రశాంతంగా ఉండాలని ఆయన సీమాంధ్ర ప్రజలకు ఆయన విజ్ఝప్తి చేశారు.  కాగా,    హైదరాబాదును శాశ్వత రాజధానిగా ఉంచాలని కమిటీకి చెప్తామని, తమ కోరిక నెరవేరుతుందనే ఆశతో ఉన్నామని కేంద్ర మంత్రి చిరంజీవి అన్నారు.

బాబాయ్ కి ' అనంత " బాధ్యతలు అప్పగించిన జగన్...

అనంతపురం, ఆగస్టు 6: కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి తన వైపు వచ్చిన  బాబాయ్ వైయస్ వివేకానందరెడ్డికి  జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకు  బాధ్యతలు అప్పగించారు.   అనంతపురం లోక్‌సభ స్థానం పరిధిలోని తాడిపత్రి, కళ్యాణదుర్గంలతో పాటు హిందూపురం లోక్‌సభ స్థానం పరిధిలోని మడకశిర, కదిరి, పెనుకొండ, హిందూపురం శాసనసభ స్థానాల పరిశీలకుడిగా వైయస్ వివేకానంద రెడ్డిని నియమిస్తూ  ఉత్తర్వులు జారీ చేశారు. ఆరు శాసనసభా నియోజకవర్గాల్లోనూ పార్టీని బలోపేతం చేసే బాధ్యతను వైయస్ వివేకానంద రెడ్డికి జగన్ అప్పగించారు. అయితే, కడప జిల్లా నుంచి వైయస్ వివేకానంద రెడ్డిని  దూరంగా  పెట్టి  అనంతపురం జిల్లా బాధ్యతలను ఏ ఉద్దేశంతో అప్పగించారనేది అంతుపట్టని విషయం...

Monday, August 5, 2013

సీమాంధ్ర ప్రజల మూలాలన్నీ హైదరాబాదులోనే...చిరు

హైదరాబాద్, ఆగస్టు 5:  హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేసి, రెండు రాష్ట్రాలకు శాశ్వత రాజధానిగా చేయాలని  కేంద్ర మంత్రి చిరంజీవి అన్నారు. తమకు హైదరాబాదుపై ఎనలేని అభిమానం ఉందని ఆయన చెప్పారు.  సీమాంధ్ర ప్రజల మూలాలన్నీ హైదరాబాదులోనే ఉన్నాయని, అందువల్ల ఆందోళన చేస్తున్న ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. వారు ఏ భావనతో ఉన్నారో తాను అదే భావనతో ఉన్నానని అన్నారు. పదవిలో ఉంటేనే పార్లమెంటులో విభజనపై వాణిని వినిపించగలుగుతామని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడానికి పదవులే ఆధారమని చిరంజీవి అన్నారు. విగ్రహాలను, ఆస్తులను ధ్వంసం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. 

ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి రాజీనామా

హైదరాబాద్, ఆగస్టు 5:  కాంగ్రెస్ అధిష్టానం, తెలుగుదేశం పార్టీ కుమ్మక్కై రాష్ట ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న తీరుకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత కేంద్రంలోని పెద్దలు రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని, ప్రజలతో ఆటలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తెలంగాణకు అనుకూలమని లేఖ ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు... ఇప్పుడు సీమాంధ్ర ప్రాంత నాయకులతో వేరే మాట చెప్పిస్తున్నారని దుయ్యబట్టారు. ‘‘కాంగ్రెస్ హైకమాండ్, తెలుగుదేశం పార్టీ కుమ్మక్కై ఆంధ్రప్రదేశ్ ప్రజలతో ఆడుతున్న నాటకానికి నిరసనగా  రాజీనామా  లేఖను లోక్‌సభ స్పీకర్‌కు ఫ్యాక్స్ ద్వారా పంపుతున్నా మని. వ్యక్తిగతంగా రమ్మని స్పీకర్ నుంచి పిలుపు వస్తే అక్కడికి వెళ్లి రాజీనామాను ధ్రువీకరిస్తానని  చెప్పారు.   

Sunday, August 4, 2013

రాజ్యసభ సభ్యత్వానికి హరికృష్ణ రాజీనామా

హైదరాబాద్, ఆగస్టు 4: రాష్ట్ర విభజన తీరుకు నిరసనగా టీడీపీ నాయకుడు నందమూరి హరికృష్ణ ఆదివారం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ఫ్యాక్స్ ద్వారా రాజ్యసభ చైర్మన్ కు పంపించారు. అనంతరం ఆయన  ఎన్టీఆర్ ఘాట్ వద్ద తన తండ్రి నందమూరి తారకరామారావుకు ఘనంగా నివాళులర్పించారు.   అన్నతమ్ములుగా కలిసి ఉంటూ ఒకే భాష మాట్లాడుతున్న తెలుగువారని విభజించేందుకు కుట్ర జరుగుతోదని ఆయన ఆరోపించారు. స్వార్థపర రాజకీయ నాయకులు ఆడే నాటకంలో మనమంతా భాగస్వాములం అయిపోతున్నామని హరికృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోతే సమైక్యతలో ఉన్న మాధుర్యం దూరం అవుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం షష్ఠిపూర్తి చేసుకునే దశలో విడిపోవడం చాలా బాధాకరమని ఆయన పేర్కొన్నారు. గతంలో నెహ్రూ ప్రధానిగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలకు కలపి పెళ్లి చేస్తే, ఆ ఇంటి కోడలు సోనియా సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విడాకాలు ఇస్తుందని హరికృష్ణ ఎద్దేవా చేశారు. అసలు రాష్టంలో ఏమి జరగుతుందో ఢిల్లీ పెద్దలకు తెలియడం లేదన్నారు. ఢిల్లీలో కూర్చుని కళ్లకు గంతలు కట్టుకుని నిర్ణయం తీసుకుంటే ఏలా అని ప్రశ్నించారు. రాష్ట విభజన వల్ల నీళ్లు, కరెంట్, పాలన పరమైన సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు.  

సమైక్యోద్యమంపై మంత్రుల కమిటీ

హైదరాబాద్, ఆగస్టు 4: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని అధిష్టానాన్ని కోరడంతో పాటు అదే సమయంలో సీమాంధ్రలో  పార్టీకి నష్టం కలగకుండా సమైక్యోద్యమంలో పాల్గొనాలని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. ఈ ఉద్యమంలో పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు మంత్రులు శైలజానాథ్, గంటా శ్రీనివాసరావు, ఆనం రామానారాయణరెడ్డి, కొండ్రు మురళీలతో కమిటీ ఏర్పాటయింది.  మరో 10 మంది మంత్రులు ఈ కమిటీకి సహాయంగా పని చేస్తారు. శనివారం సీఎం క్యాంపు కార్యాలయంలో సీమాంధ్ర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ దాదాపు ఐదున్నర గంటలసేపు భేటీ అయ్యారు. 20 మంది మంత్రులు, 45 మంది ఎమ్మెల్యేలు, 15 మంది ఎమ్మెల్సీలు సమావేశంలో పాల్గొన్నారు. ఏఐసీసీ పరిశీలకులుగా తిరునావుక్కరసు, కుంతియా హాజరయ్యారు.  రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలంటూ తీర్మానం చేశారు. సీమాంధ్రుల సమస్యలపై రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ నేతృత్వంలో పార్టీపరంగా ఉన్నత స్థాయి కమిటీ వేసినందున సీడబ్ల్యూసీ తీర్మానంపై కేంద్రం తదుపరి చర్యలు చేపట్టకుండా చూడాలంటూ మరో తీర్మానాన్ని ఆమోదించారు. అదే సమయంలో పార్టీ ప్రయోజనాలు కాపాడుకొనేలా ఉద్యమాన్ని నిర్వహించాలని నిర్ణయిస్తూ మూడో తీర్మానం చేశారు. 

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...