రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్ డౌన్: స్తంభించిన పాలన
హైదరాబాద్,జనవరి 19: పెండింగ్ డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన పెన్, చాక్, టూల్ డౌన్‌తో భుధవారం నాడు పరిపాలన వ్యవస్థ స్తంభించింది. రాష్టవ్య్రాప్తంగా 10 లక్షల మంది ఉద్యోగులు ఉద్యమ బాట పట్టడంతో మండల స్థాయి నుంచి రాష్ట్ర రాజధాని వరకూ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. దీంతో వివిధ పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చిన ప్రజలు నిరాశతో వెనుదిరిగారు. నల్లబ్యాడ్జీలు ధరించిన ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తొలిరోజు నిరసన కార్యక్రమం పూర్తిస్థాయిలో విజయవంతమైందని జేఏసీ నేతలు తెలిపారు. గురు,శుక్ర వారాలలో కూడా నిరసన కొనసాగ నున్న నేపథ్యంలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ముఖ్యంగా వాణిజ్య పన్నులు, రెవెన్యూ, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్లు, పరిశ్రమలు, ఖజానా, రవాణా, మున్సిపాలిటీలు తదితర శాఖల్లో ఆర్థిక లావాదేవీలు పూర్తిగా స్తంభించాయి. సుమారు 600 కోట్ల విలువైన ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయినట్లు అంచనా. సర్కారుకు రావాల్సిన ఆదాయం, వసూళ్లు ఆగిపోయాయి. గృహనిర్మాణశాఖ నుంచి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రోజువారీగా అందాల్సిన సిమెంటు, సొమ్ము నిలిచిపోయింది. దీంతో వీటి నిర్మాణాలకు బ్రేక్ పడింది. మండల రెవెన్యూ కేంద్రాల్లో జారీ కావాల్సిన ధ్రువపత్రాలు.. జిల్లా కలెక్టరేట్లలో బిల్లులు, ఇతరత్రా కీలకమైన పనులు ఆగిపోయాయి. అటెండర్ మొదలు గెజిటెడ్ అధికారి వరకు నిరసనలో పాల్గొంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో బోధనకు బ్రేక్ పడింది.
Comments