Monday, October 31, 2022

13 మంది తెలంగాణ పోలీసులకు యూనియన్ హోం మినిస్టర్స్ స్పెషల్ ఆపరేషన్ మెడల్స్



హైదరాబాద్, అక్టోబర్ 31; 2022 సంవత్సరానికి కేంద్ర హోం శాఖ ప్రకటించిన యూనియన్ హోం మినిస్టర్స్ స్పెషల్ ఆపరేషన్ మెడల్స్ కు 13 మంది తెలంగాణ పోలీసులు ఎంపికయ్యారు. అవార్డులకు ఎంపికైంది వీరే..

అనిల్ కుమార్ – అడిషనల్ డీజీపీ 

తెలంగాణ

కైతా రవీందర్ రెడ్డి – డీఎస్పీ

మొగుళ్ల వెంకటేశ్వర్ గౌడ్ – ఇన్ స్పెక్టర్

కుకుడపు శ్రీనివాసులు – సబ్ ఇన్ స్పెక్టర్

మహ్మద్ అక్తర్ పాషా – సబ్ ఇన్ స్పెక్టర్

పాండే జితేందర్ ప్రసాద్ – సబ్ ఇన్స్పెక్టర్

సయీద్ అబ్దుల్ కరీం – సబ్ ఇన్ స్పెక్టర్

సనుగొమ్ముల రాజవర్ధన్ రెడ్డి – హెడ్ కానిస్టేబుల్

మహ్మద్ తాజ్ పాషా – హెడ్ కానిస్టేబుల్

మహ్మద్ ఫరీదుద్దీన్ – కానిస్టేబుల్

బచ్చుల లక్ష్మీనారాయణ – కానిస్టేబుల్

కొడ్గల్ కిరణ్ కుమార్ – కానిస్టేబుల్

సయీద్ జియా ఉల్ హక్ – కానిస్టేబుల్



తెలంగాణ‌లో అట్టారో ఇండియా 600 కోట్ల భారీ పెట్టుబ‌డి

హైదరాబాద్, అక్టోబర్ 31; అట్టారో ఇండియా కంపెనీ తెలంగాణ‌లో భారీ పెట్టుబ‌డి పెట్టేందుకు ముందుకు వ‌చ్చింది. ఈ విష‌యాన్ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ల మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించారు. అట్టారో ఇండియా కంపెనీ తెలంగాణ‌లో రూ. 600 కోట్ల భారీ పెట్టుబ‌డి పెట్ట‌బోతోంద‌ని, ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించేందుకు సంతోషిస్తున్నాన‌ని కేటీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ పెట్టుబ‌డి ద్వారా 300 మందికి పైగా ప్ర‌త్య‌క్ష ఉపాధి ల‌భించ‌నుంది. ప‌రోక్షంగా చాలా మంది ఉపాధి ల‌భించ‌నుంద‌ని తెలిపారు.



​టి ఆర్ ఎస్ తో కాంగ్రెస్ పొత్తు ప్రసక్తి లేదు: రాహుల్



హైదరాబాద్, అక్టోబర్ 31; దేశంలో 

బి జి పి ,  తెలంగాణా లో టి ఆర్ ఎస్ ఒకే విధానాన్ని అవలంభిస్తున్నాయని కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ విమర్శించారు. భారత్‌ జోడో యాత్ర లో భాగంగా రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం తిమ్మాపూర్ వద్ద మీడియా తో మాట్లాడుతూ, కొందరు నేతలు ఎవరికి వారు తమది పెద్ద పార్టీ అని ఊహించుకుంటున్నారనీ , భారాస ను అంతర్జాతీయ పార్టీగా కూడా ప్రకటించు కోవచ్చని వ్యాఖ్యానించారు. తెరాసతో ఎలాంటి అవగాహన గానీ.. పొత్తు గానీ ఉండదని రాహుల్‌ స్పష్టం చేశారు.భాజపా విద్వేష రాజకీయాలను తిప్పికొట్టాలనే ఉద్దేశంతోనే భారత్‌ జోడో యాత్ర కొనసాగిస్తున్నట్లు రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో.. రెండు సిద్ధాంతాల మధ్య పోరాటం జరగనుందని, ఇది విభజన శక్తులు, సంఘటిత శక్తులకు మధ్యేనని తెలిపారు. ప్రధాని మోదీ అన్ని వ్యవస్థలను నాశనం చేశారని , కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక అన్నింటినీ ప్రక్షాళన చేస్తామన్నారు. 



కేబుల్ వంతెన కూలిన దుర్ఘటన లో మృతుల సంఖ్య 134 కి చేరిక: తొమ్మిది మంది అరెస్ట్

అహ్మదాబాద్ , అక్టోబర్ 30; గుజరాత్ మోర్బీలో కేబుల్ వంతెన కూలి 134 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలో పోలీసులు తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు.  అరెస్ట్ ఆయిన  వారిలో వంతెన నిర్వహణ సంస్థ ఒరేవాకు చెందిన ఇద్దరు మేనేజర్లు, ఇద్దరు టికెట్ క్లర్క్స్, ఇద్దరు కాంట్రాక్టర్లు, ముగ్గరు సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. ప్రమాద స్థలాన్ని ప్రధాని నరేంద్ర మోదీ రేపు పరిశీలించనున్నట్లు గుజరాత్‌ సీఎంఓ వెల్లడించింది. ఈ ఘటనపై దర్యాప్తు కోసం ప్రత్యేక విచారణ బృందాన్ని కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. 

Sunday, October 30, 2022

గాయిగాయి గత్తర్‌ గత్తర్‌ కావద్దు: మునుగోడు కు కె సి ఆర్ పిలుపు

నల్గొండ, అక్టోబర్ 29; మునుగోడు ఉప ఎన్నిక ఫలితాన్ని మునుగోడు ప్రజలు ఎప్పుడో తేల్చేశారని సీఎం కేసీఆర్‌ అన్నారు. ‘‘మునుగోడులో అవసరం లేని ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నిక ఫలితాన్ని మునుగోడు ప్రజలు ఎప్పుడో తేల్చేశారు. ఎన్నికలు రాగానే లొల్లి మొదలవుతుంది. గాయిగాయి గత్తర్‌ గత్తర్‌ చేస్తారు.. విచిత్ర వేషధారులందరూ ఎన్నికలప్పుడు వస్తారు. ఎవరు ఏమి చెప్పినా నిజానిజాలపై ప్రజలు విస్తృతంగా చర్చించాలి. ఓటు వేసేటప్పుడు జాగ్రత్తగా లేకపోతే ఇల్లు కాలిపోతుంది.‘‘ అని మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా చండూరు మున్సిపాలిటీ పరిధిలోని బంగారిగడ్డలోలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కే సి ఆర్ అన్నారు. కొందరు ఢిల్లీ దిల్లీ బ్రోకర్‌లు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొందామని చూస్తే.. మన ఎమ్మెల్యేలు ఎడమకాలి చెప్పుతో కొట్టినట్టు చేశారని కేసీఆర్‌ అన్నారు. 

‘‘ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని కూలదోయాలని భాజపా చూస్తోంది. దేశాన్ని పాలించే అవకాశం ఇచ్చినా. రాష్ట్రాల్లో కుట్రలు ఎందుకు? ప్రజలు మోదీని రెండుసార్లు ప్రధానిని చేసినా ప్రభుత్వాలను ఎందుకు కూల్చాలి. ఎమ్మెల్యేలను కొనేందుకు భాజపాకు రూ. వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి. దేశంలో ఏ ప్రధాని చేయని దారుణాలు ప్రధాని మోదీ చేశారు. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ వేసిన తొలి ప్రధాని మోదీ. కేంద్రానికి బుద్దిరావాలంటే చేనేత కుటుంబాలు భాజపాకు ఒక్క ఓటు కూడా వేయొద్దు. చేనేత కార్మికులు తగిన బుద్ధి చెప్పాలి‘‘ అని అన్నారు.‘‘60 ఏళ్ల కింద చిన్న పొరపాటు జరిగితే 58 ఏళ్ల పాటు కొట్లాడినం. చివరికి చావు నోట్లో తలపెట్టి కొట్లాడితే తప్ప తెలంగాణ రాలేదు. జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయకపోతే .. పెట్టుబడి దారులను మనమే ప్రోత్సహించినట్లవుతుంది. మా బలం, బలగం మీరే.. మీరే అండగా లేకపోతే ఎవరికోసం పోరాడాలి‘‘ అన్నారు. ‘‘తెలంగాణ మాదిరిగానే భారత్‌ను చేయాలని పుట్టుకొచ్చిందే బీఆర్‌ఎస్‌. భారతదేశ రాజకీయాలకు పునాదిరాయి వేసే అవకాశం మునుగోడుకే దక్కింది. ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టితో గెలిపించి ప్రోత్సహించాలి. మునుగోడును కడుపులో పెట్టుకుంటా. ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి.. మునుగోడులో ప్రతి ఎకరానికి నీళ్లు తెచ్చే బాధ్యత నాది‘‘ అని హామీ ఇచ్చారు. 



గుజరాత్ లో కేబుల్‌ బ్రిడ్జి కుప్పకూలి 60 మంది మృతి

అహ్మదాబాద్, అక్టోబర్ 29: గుజరాత్‌ లోని మోర్బీ పట్టణంలో మచ్చూ నదిపై నిర్మించిన కేబుల్‌ బ్రిడ్జి కుప్పకూలి 60 మంది మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించేందుకు అంబులెన్స్‌లను మోహరించారు. వంతెన తెగిన సమయంలో దానిపై 500 మంది ఉండగా.. వీరిలో 100 మందికి పైగా నదిలో నీటిలో మునిగిపోయారు.



​దక్షిణాఫ్రికా చేతిలో ఓడిన భారత్

మెల్ బోర్న్, అక్టోబర్ 29: ప్రపంచకప్​లో భాగంగా జరిగిన మ్యాచ్​లో టీమ్​ఇండియా పై దక్షిణాఫ్రికా ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన రోహిత్‌ సేన నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. బ్యాటింగ్‌లో సూర్యకుమార్‌ (68) ఒక్కడే హాఫ్‌ సెంచరీతో రాణించాడు. రాహుల్‌ (9), రోహిత్‌ (15), కోహ్లీ (12), దీపక్‌ హుడా (0), హార్దిక్‌ (2), దినేశ్ కార్తీక్‌ (6), అశ్విన్‌(7) స్వల్ప స్కోరుకే వెనుదిరిగారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 4, పార్నెల్ 3, నోకియా 1 వికెట్‌ చొప్పున పడగొట్టారు. కాగా ఈ మ్యాచ్ లో మ్యాచ్​లో 12 పరుగులు సాధించిన కోహ్లీ.. జయవర్దనే తర్వాత వెయ్యి పరుగులు బాదిన రెండో బ్యాటర్​గా నిలిచాడు. 134 పరుగుల లక్ష్య చేధన లో దక్షిణాఫ్రికా ఆరంభంలోనే క్వింటెన్‌ డికాక్‌ (1), బవుమా (10), రుస్సో (10 ) వికెట్లను కోల్పోయింది. మర్‌క్రమ్‌(52) , డేవిడ్‌ మిల్లర్‌ (51) భాగస్వామ్యంలో జట్టుకు 85 పరుగుల భారీ స్కోర్‌ను అందించారు. 

Saturday, October 29, 2022

​తెలంగాణలో నవంబర్‌ రెండో వారం నుంచి చలి తీవ్రత

తెలంగాణలో నవంబర్‌ రెండో వారం నుంచి చలి తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈశాన్య గాలుల ప్రభావం వల్ల తమిళనాడు తీరం పాండిచ్చేరి, కరైకాల్‌, దక్షిణ కోస్తాంధ్ర ప్రదేశ్‌లలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయని తెలిపింది.గాలులు ఈశాన్య తూర్పు దిక్కుల నుంచి తెలంగాణలోకి వీస్తాయని,  గత రెండు రోజులుగా ఉన్న చలి తీవ్రత కాస్త తగ్గిందని, నవంబర్ రెండో వారం నుంచి చలి తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది.

గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రాథమిక కీ విడుదల

హైదరాబాద్, అక్టోబర్ 29: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రాథమిక కీ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. కీ తో పాటు అభ్యర్థుల ఓఎంఆర్ జవాబు పత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాటి డిజిటల్ కాపీలను కమిషన్ వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. మొత్తం 2,85,916 మంది అభ్యర్థుల డిజిటల్ ఓఎంఆర్ పత్రాలను అందుబాటులో ఉంచారు. టీఎస్​పీఎస్సీ ఐడీ, హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు పొందుపర్చి డిజిటల్ పత్రాలు డౌన్​లోడ్ చేసుకోవచ్చు.  అభ్యర్థుల ఓఎంఆర్ డిజిటల్ పత్రాలు నవంబర్ 29 వరకు కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. 

ప్రాథమిక కీపై నవంబర్ నాలుగో తేదీ వరకు కమిషన్ వెబ్ సైట్ ద్వారా అభ్యంతరాలు స్వీకరిస్తారు.కేవలం వెబ్‌సైట్‌లోని ప్రత్యేక లింక్ ద్వారానే అభ్యంతరాలు నమోదు చేయాల్సి ఉంటుందని.. ఈ-మెయిల్, వ్యక్తిగతంగా అభ్యంతరాలు స్వీకరించేది లేదని కమిషన్ స్పష్టం చేసింది. అభ్యంతరాలకు సంబంధించిన ఆధారాలను కూడా లింక్‌లో పీడీఎఫ్ ద్వారా జతపర్చాలని టీఎస్​పీఎస్సీ తెలిపింది. 


Friday, October 28, 2022

మంత్రి జగదీష్ రెడ్డికి కోడ్ ఉల్లంఘన నోటీసు

హైదరాబాద్, అక్టోబర్ 28: మంత్రి జగదీశ్​ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసు ఇచ్చింది. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా - ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు అందవని మంత్రి జగదీశ్​ రెడ్డి అన్నారని బి జె పి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం నల్గొండ జిల్లా ఎన్నికల అధికారి నుంచి నివేదిక తెప్పించుకున్నది. మంత్రి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు అభిప్రాయపడింది. శనివారం మూడు గంటల్లోపు వివరణ ఇవ్వాలని, వివరణ ఇవ్వకపోతే తగిన నిర్ణయం తీసుకుంటామని జగదీశ్​ రెడ్డికి ఈసీ స్పష్టం చేసింది.



ఏ పి లో ఆరోగ్యశ్రీ చికిత్సల సంఖ్య పెంపు..

అమరావతి, అక్టోబర్ 28: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ చికిత్సల సంఖ్యను మరో 809 చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చింది. ఇప్పటివరకు 2వేల 446 రకాల చికిత్సలు అందిస్తుండగా... ఇప్పుడు ఆ సంఖ్య 3వేల 255కి చేరినట్లు ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. ఆరోగ్యశ్రీలో వైద్య చికిత్సల పెంపుతో ఏడాదికి రూ.2వేల 894.87 కోట్లు ఖర్చు కానుండగా, ఆరోగ్య ఆసరా కోసం సుమారు రూ.300 కోట్లు అవుతుందని అధికారులు అంచనా వేశారు.


మహబూబ్‌నగర్‌ జిల్లాలో భారత్‌ జోడో యాత్ర: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేనేత వస్త్రాలపై జీఎస్టీ ఎత్తివేస్తామని ప రాహుల్ గాంధీ హామీ


మహబూబ్‌నగర్‌, అక్టోబర్ 28: దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేనేత వస్త్రాలపై జీఎస్టీ ఎత్తివేస్తామని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో భారత్‌ జోడో యాత్ర సందర్భంగా తమను కలసిన చేనేత రంగం ప్రతినిధులకు రాహుల్ ఈ హామీ ఇచ్చారు. జిల్లా లోని పోడు రైతు ప్రతినిధుల బృందం కూడా రాహుల్  ను కలసి తమ సమస్యలు తెలిపారు. ఇందిరా గాంధీ హయాంలో తమకు ఇచ్చిన భూములను గుంజుకుంటున్నారని గిరిజన సంఘాల ప్రతినిధులు రాహుల్‌కు ఫిర్యాదు చేశారు.అటవీ ప్రాంతాల్లో దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న పోడు భూముల సమస్యలు పరిష్కరించడంతో పాటు భూమి పట్టాలు అందజేసి శాశ్వతంగా హక్కులు కల్పించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. 

దేశం లో పోలీసులందరికి ఒకేలా యూనిఫాం : మోదీ ప్రతిపాదన


న్యూఢిల్లీ, అక్టోబర్ 28: దేశవ్యాప్తంగా పోలీసులందరికీ ఒకే యూనిఫాం ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదన చేశారు. ఇది సూచన మాత్రమేనని.. రాష్ట్రాలపై రుద్దే ఉద్దేశం లేదని ఆయన అన్నారు. హరియాణాలోని సూరజ్​కుండ్​లో జరుగుతున్న రాష్ట్ర హోంమంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ప్రసంగించారు.నేరాలను నియంత్రించేందుకు, నేరస్థులను పట్టుకునేందుకు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం ఉండాలని మోదీ తెలిపారు. దేశ అంతర్గత భద్రత కోసం రాష్ట్రాలతో కలిసి పనిచేయడం కేంద్రం బాధ్యత అని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం ప్రకారం శాంతిభద్రతలు రాష్ట్రానికి సంబంధించినవి అయినప్పటికీ.. అవి దేశ ఐక్యత, సమగ్రతతో ముడిపడి ఉంటాయని ప్రధాని తెలిపారు.సైబర్ నేరాల నిర్వహణ వ్యవస్థ అభివృద్ధి, పోలీసు బలగాల ఆధునీకరణ, నేర న్యాయవ్యవస్థలో ఐటీ వాడకం పెంపు, భూ సరిహద్దు నిర్వహణ, తీర ప్రాంత భద్రత తదితర అంశాలపై ఈ సమావేశం లో చర్చించనున్నారు. అంతర్గత భద్రతకు మెరుగైన ప్రణాళిక, సమన్వయానికి జాతీయ విధానం తయారు చేయటం ఈ సమావేశాల ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వ పేర్కొన్నాయి. 


మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వద్ద బావి లో పడిన కారు: నలుగురి మృతి

హైదరాబాద్, అక్టోబర్ 28: తెలంగాణ లోని మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలోని బైపాస్ మలుపు వద్ద ఒక కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లికి చెందిన ఐదుగురు వరంగల్‌ జిల్లా అన్నారం షరీఫ్‌ వచ్చి.. తిరిగి వెడుతుండగా మహబూబాబాద్‌కు చెందిన మరో ఇద్దరు బంధువులను కూడా కారులో ఎక్కించుకున్నారు. కేసముద్రం బైపాస్‌ రోడ్డులో మలుపు వద్దకు రాగానే కారు అదుపుతప్పి వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. డ్రైవర్‌తో పాటు ఇద్దరు కారులోంచి బయటకు దూకి ప్రాణాలతో బయటపడ్డారు. మిగిలిన నలుగురు కారుతో సహా బావిలో పడిపోయారు. వారిలో ఇద్దరు మహిళలను వెలికి తీయగా ఒకరు మృతి చెందినట్లు గుర్తించారు. మరో మహిళ అపస్మారక స్థితిలో ఉండటంతో మహబూబాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరు వ్యక్తులు కారులోనే చిక్కుకుని మరణించారు.. 


Thursday, October 27, 2022

​‘మంగళ ‘మస్తు… లోకేష్ కు బాబు ఆశీస్సు

హైదరాబాద్, అక్టోబర్ 27: మంగళగిరి నియోజకవర్గంపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గత ఎన్నికల్లో ఓటమిని పట్టించుకోకుండా అందరినీ సమన్వయం చేసుకుంటూ అత్యధిక మెజార్టీతో మంగళగిరి సీటును గెలిచి చరిత్రను తిరగరాయాలని మంగళగిరి ఇంఛార్జ్​ లోకేశ్​కు చంద్రబాబు సూచించారు. తాను ఓడిపోయినా, టి డి పి ప్రతిపక్షంలో ఉన్నా.. నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలకు చేరువయ్యానని లోకేశ్​ ఈ సందర్భంగా వివరించారు. పార్టీ పరంగా అందించే సహాయాలే కాకుండా,.. తాను సొంతంగా 12కి పైగా సంక్షేమ కార్యక్రమాలు అందించడం ద్వారా అన్ని వర్గాల ప్రజల మనసులు గెలుచుకున్నానని లోకేశ్​ తెలిపారు.



నెదర్లాండ్స్ పై భారత్ గెలుపు: ఆదివారం దక్షిణాఫ్రికాతో మ్యాచ్ కీలకం

మెల్బోర్న్ ,అక్టోబర్ 27: ​టీ20 ప్రపంచకప్​లో భాగంగా నెదర్లాండ్స్​తో జరిగిన మ్యాచ్ లో భారత్ 56 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో ఈ ప్రపంచకప్​లో వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

180 పరుగుల లక్ష్యానికి గానూ నెదర్లాండ్స్​  నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి కేవలం 123 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లలో భువనేశ్వర్‌, అర్షదీప్‌, అక్షర్ పటేల్‌, అశ్విన్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు. షమికి ఒక వికెట్ దక్కింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్​ఇండియా రెండు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. కెప్టెన్‌ రోహిత్ శర్మ 39 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 53 పరుగులు చేయడం విశేషం. ఈ గెలుపు తో సూపర్ -12 స్టేజ్‌ గ్రూప్ -2లో టీమ్‌ఇండియా నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌లో విజయం సాధిస్తే.. సెమీస్‌కు చేరుకొనేందుకు అవకాశాలు పెరుగుతాయి.



జింబాబ్వే సంచలనం: పాక్ పై పరుగు తేడాతో విజయం


మెల్బోర్న్, అక్టోబర్ 27: టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ జట్టుపై జింబాబ్వే ఒక్క పరుగు తేడాతో విజయం సాధించి సంచలనం సృష్టించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది.జింబాబ్వే బౌలర్లలో సికందర్‌ రజా 3 మూడు వికెట్లతో సత్తాచాటాడు. దీనితో ఇప్పటికే భారత్‌ జట్టుపై ఓటమి పాలైన పాకిస్థాన్‌ జట్టుకు సెమీస్‌ అవకాశాలు క్లిష్టంగా మారాయి.



ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై దర్యాప్తు..

హైదరాబాద్, అక్టోబర్ 26: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫాంహౌస్ లో టి ఆర్ ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించిన ఘటన పై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రయత్నించిన ముగ్గురు నిందితుల్ని పోలీసులు విచారిస్తున్నారు. ఎమ్మెల్యేల బేరసారాల వెనుక ఎవరున్నారనే విషయంపై ఆరా తీస్తున్నారు. చట్టంలోని సెక్షన్ -8, సెక్షన్ -120బీ కింద మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.ఏ1గా దిల్లీకి చెందిన రామచంద్రభారతి, ఏ2గా హైదరాబాద్ కు చెందిన నందకిశోర్ , ఏ3గా తిరుపతికి చెందిన సింహయాజులును చేర్చారు. నిందితుల నుంచి వివరాలను సేకరించిన తర్వాత ముగ్గురిని ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.

నటుడు ఆలీ కి కీలక పదవి ఇచ్చిన జగన్..

అమరావతి, అక్టోబర్ 27: ​సినీ నటుడు అలీ ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వ  ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారునిగా నియమితులయ్యారు.  ఈ మేరకు  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు గా అలీ రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు.

Wednesday, October 26, 2022

గులాబీ ఎమ్మెల్యేలు కొనబడును..!

హైదరాబాద్, అక్టోబర్ 26:ఢిల్లీ , తిరుపతి, హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులను మొయినాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి లోని అజీజ్ నగర్​లోన ఓ ఫామ్ హౌస్​లో పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి కోట్ల లో నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరు టి ఆర్ ఎస్ కు చెందిన కొందరు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు వీరు రంగంలోకి దిగారనే పక్కా సమాచారం ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఫిరాయింపులను ఎవరు ప్రోత్సహించారు? డబ్బు ఎవరు సమకూర్చారు? ఇందులో సూత్రధారులెవరు? అనే కోణం నుంచి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



Tuesday, October 25, 2022

మునుగోడు: దివ్యాంగులు, 80ఏళ్లు పైబడిన వారికి పోస్టల్ బ్యాలెట్లు

నల్గొండ, అక్టోబర్ 25: మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికకు దివ్యాంగులు, 80ఏళ్లు పైబడిన వారికి పోస్టల్ బ్యాలెట్లు కేటాయించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. ఆదివారం నుంచి మంగళవారం వరకు ఆయా బృందాలు వారి ఇళ్లకు వెళ్లి ఓట్లు నమోదు చేశాయన్నారు. ఇంతవరకు 318 మంది పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగించుకున్నారు.ఈనెల 27, 28న మరో దఫా పోస్టల్ బ్యాలెట్ ఓటుకు అవకాశం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై ఇప్పటివరకు 19 కేసులు నమోదు చేశారు. తనిఖీల్లో ఇప్పటి వరకు 2.70 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. ఎక్సైజ్ శాఖ 94 కేసులు నమోదు చేసి 44 మందిని అరెస్ట్ చేసింది. ఓటరు గుర్తింపు కార్డు లేని వారు ఓటుహక్కు వినియోగించు కునేందుకు 11 ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డులను ఈసీ అనుమతించింది. ఆధార్, పాన్ కార్డు, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఉపాధిహామీ జాబ్ కార్డు, ప్రభుత్వ ఉద్యోగుల గుర్తింపు కార్డు, పెన్షన్ డాక్యుమెంట్, బ్యాంకు పాసుపుస్తకం, ఆరోగ్యబీమా స్మార్ట్ కార్డు, ఆర్జీఐ - ఎన్పీఆర్ ఇచ్చే స్మార్ట్ కార్డు, ఎంపీలు - ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలకు ఇచ్చే గుర్తింపు కార్డులు ప్రత్యామ్నాయాల్లో ఉన్నాయి.



ఆర్థిక సంక్షోభం తొలగిస్తా: రిషి సునాక్​

లండన్ , అక్టోబర్ 25: బ్రిటన్​ ప్రధాన మంత్రిగా భారత సంతతి వ్యక్తి రిషి సునాక్​.. బాధ్యతలు చేపట్టారు. బ్రిటన్ అధికారిక సంప్రదాయాల ప్రకారం రాజు చార్లెస్​-3 ఆహ్వానం మేరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కరోనా, ఉక్రెయిన్​-రష్యా యుద్ధం మూలాన దేశంలో ఆర్థిక సంక్షోభం తలెత్తిందని చెప్పారు. ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బ్రిటన్​ను బయటపడేసేందుకు తన శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. తమ ప్రభుత్వంలో ప్రతి స్థాయిలోనూ జవాబుదారీతనం, సమగ్రత ఉంటుందని స్పష్టం చేశారు. బ్రిటన్‌ ఉప ప్రధానిగా డొమినిక్‌ రాబ్‌ని నియమించిన రిషి.. ప్రస్తుత ఆర్థికమంత్రిగా ఉన్న జెరిమీ హంట్‌ను అదే పదవిలో కొనసాగిస్తున్నట్టు ప్రకటించారు. అలాగే, జేమ్స్‌ క్లెవర్లీని విదేశాంగ శాఖ కార్యదర్శిగా, బెన్‌ వాల్సేని డిఫెన్స్‌ సెక్రటరీగా నియమించారు. భారత మూలాలు ఉన్న సుయోల్లా బ్రేవర్మన్‌ను తిరిగి హోం సెక్రటరీగా, అలాగే, గ్రాంట్‌ శాప్స్‌ను ఎనర్జీ, ఇండస్ట్రియల్‌ స్ట్రాటజీ సెక్రటరీగా నియమించారు.



Monday, October 24, 2022

కార్గిల్‌లో జవాన్లతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న మోదీ

న్యూఢిల్లీ, అక్టోబర్ 24: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్గిల్‌లో జవాన్లతో కలిసి  దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. భారత్‌ను చెడు దృష్టితో చూసేవారికి దీటైన జవాబిచ్చే సత్తా, వ్యూహాలు దేశ సైనిక బలగాలకు ఉన్నాయని ప్రధాని ఈసందర్భంగా అన్నారు. అయితే.. యుద్ధం మన చివరి ప్రత్యామ్నాయం మాత్రమే నని తేల్చిచెప్పారు. భారత సైనికులు ఎన్నో సంవత్సరాలుగా తన కుటుంబ సభ్యులుగా మారారని ఆయన చెప్పారు. దీపావళి వెలుగులు.. ప్రపంచంలో శాంతిని నింపాలని భారత్‌ అభిలషిస్తోందని వెల్లడించారు. సరిహద్దులు భద్రంగా, ఆర్థిక వ్యవస్థ బలంగా, సమాజం పూర్తి విశ్వాసంతో ఉన్నప్పుడు దేశం సురక్షితంగా ఉంటుందని మోదీ అభిప్రాయపడ్డారు. దేశం వెలుపల, లోపల ఉన్న శత్రువులను విజయవంతంగా ఎదుర్కోవడం వల్ల అంతర్జాతీయంగా భారత ప్రతిష్ఠ పెరిగిందన్నారు. అవినీతిపై నిర్ణయాత్మక పోరు సాగుతోందని ఆయన చెప్పారు. 

మూరత్​ ట్రేడింగ్​లో దేశీయ స్టాక్ మార్కెట్లకు లాభాలు..

ముంబై , అక్టోబర్ 24: దీపావళి సందర్భంగా జరిగిన మూరత్​ ట్రేడింగ్​లో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సాయంత్రం 6 గంటల 15 నుంచి 7 గంటల 15 నిమిషాల వరకు సాగిన ట్రేడింగ్​లో.. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీ 524 పాయింట్ల లాభంతో 59,831 వద్ద ముగించింది. జాతీయ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ సూచీ నిఫ్టీ 17,730 పాయింట్ల వద్ద స్థిరపడింది. స్టాక్‌ మార్కెట్‌లో దీపావళి పర్వదినం రోజు ట్రేడింగ్‌ చేస్తే.. వచ్చే దీపావళి వరకు లాభాల పంట పండుతుందన్నది ఇన్వెస్టర్ల నమ్మకం. అందులో భాగంగానే స్టాక్‌ ఎక్స్ఛేంజీలు ఏటా దీపావళి రోజు ప్రత్యేకంగా మూరత్‌ ట్రేడింగ్‌ను నిర్వహిస్తాయి. ఇది ఒక గంట పాటు కొనసాగుతుంది. స్టాక్‌ ఎక్స్ఛేంజీలే సమయాన్ని నిర్ణయిస్తాయి. ఈ సమయంలో కనీసం ఒక్క స్టాక్‌ అయినా కొనాలని చాలామంది ట్రేడర్లు సెంటిమెంట్‌గా పెట్టుకుంటారు. 


పోయిందనుకున్న పదవి వరించింది: బ్రిటన్‌ ప్రధానిగా భారత సంతతి వ్యక్తి రిషి సునాక్‌

లండన్, అక్టోబర్ 24: బ్రిటన్‌ ప్రధానిగా భారత సంతతి వ్యక్తి రిషి సునాక్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దలేక ప్రస్తుత ప్రధాని లిజ్‌ట్రస్‌ రాజీనామా ప్రకటించడంతో అత్యంత వేగంగా నూతన ప్రధాని ఎంపికను కన్జర్వేటివ్ పార్టీ చేపట్టింది. రిషి సునాక్, బోరిస్ జాన్సన్‌, పెన్నీ మోర్డాంట్‌లు ప్రధాని పదవికి పోటీపడ్డారు. కానీ ముందుగానే బోరిస్ జాన్సన్‌ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కన్జర్వేటివ్‌ నాయకుడిగా తనకు చట్టసభ సభ్యుల మద్దతు ఉన్నప్పటికీ పార్టీ ఐక్యత కోసం కన్జర్వేటివ్ నాయకత్వానికి పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు బోరిస్‌ జాన్సన్‌ తెలిపారు. బ్రిటన్‌ ప్రధానమంత్రి పదవికి పోటీలో నిలిచేందుకు కన్జర్వేటివ్‌ పార్టీలో 100 మంది ఎంపీల మద్దతు అవసరం. ఇందులో భాగంగా తమకు పూర్తి మద్దతు ఉన్నట్లు బ్రిటన్ కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 2గంటలలోపే పోటీలో ఉన్న సభ్యులు వెల్లడించాల్సి ఉంది. రిషి సునాక్‌కు 150కిపైగా ఎంపీల మద్దతు లభించింది. మరో నాయకురాలు పెన్నీ మోర్డాంట్‌ వందమంది ఎంపీల మద్దతు కూడ గట్టలేక పోటీ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో బ్రిటిష్‌ ప్రధానిగా సునాక్‌కు మార్గం సుగమమైంది.ఇంతకు ముందు లిజ్‌ట్రస్‌తో ప్రధాని పదవికి పోటీపడ్డ రుషీ సునాక్‌ ఎంపీల మద్దతు సాధించారు. కానీ కన్జర్వేటివ్‌ పార్టీకి చెందిన టోరీ సభ్యుల మద్దతు గెలవలేకపోయారు. ఐతే తాను తీసుకున్న నిర్ణయాల కారణంగా దేశంలో ఆర్థిక సంక్షోభం మరింత ముదరడంతో బ్రిటన్‌ ప్రధాని పదవి చేపట్టిన 45 రోజుల్లోపే లిజ్‌ ట్రస్‌ వైదొలిగారు. ఈ నేపథ్యంలో గతంలో ఆర్థికమంత్రిగా పని చేసిన రిషీ సునాక్‌ ఎంపిల మద్దతు కూడగట్టి బ్రిటన్‌ ప్రధానిగా ఎన్నికయ్యారు.



Sunday, October 23, 2022

అయోధ్యలో వైభవంగా దీపోత్సవం: హాజరైన మోదీ


లక్నో, అక్టోబర్ 22;   ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో దీపోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. దీపావళి పర్వదిన సంబరాల్లో భాగంగా సరయు నది తీరాన దాదాపు 18 లక్షల మట్టి దీపాలను వెలిగించారు. ప్రధాని మోదీ సమక్షంలో అయోధ్యలో బాణసంచా, లేజర్ షో, రాంలీలా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీరామచంద్రుడి మాటలు, ఆలోచనలు, పరిపాలన విలువలే 'సబ్‌ కా సాథ్‌.. సబ్‌ కా వికాస్‌'కు ప్రేరణ అని మోదీ అన్నారు. మోదీ రామ జన్మభూమిలో రామ్‌లల్లాకు.. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడ మట్టి ప్రమిదను వెలిగించి హారతి ఇచ్చారు. రామ మందిర నిర్మాణ పనులను కూడా ప్రధాని పరిశీలించారు. అనంతరం రాముడికి మోదీ పట్టాభిషేకం చేశారు. 

తెలంగాణలో ప్రవేశించిన భారత జోడో పాదయాత్ర: తోపులాటలో పలువురు నేతలకు గాయాలు

హైదరాబాద్, అక్టోబర్ 22;   తెలంగాణలో ప్రవేశించిన భారత జోడో పాదయాత్రలో అపశృతి చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలోకి పాదయాత్ర ప్రవేశించిన మొదటి రోజు స్వాగతం పలికేందుకు అధిక సంఖ్యలో జనాలు తరలిరావడంతో తోపులాట జరిగింది. కార్యకర్తల తోపులాటలో ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్యయ్య, మహేష్‌కుమార్ గౌడ్‌ లకు గాయాలయ్యాయి. దీపావళి సందర్భంగా మూడు రోజులు పాదయాత్రకు రాహుల్​ విరామం ఇవ్వనున్నారు. ఈనెల 27న మక్తల్ మండలం చందాపూర్ నుంచి పాదయాత్ర తిరిగి ప్రారంభంకానుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 110 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. పాదయాత్రలో స్థానిక నేతలకు అవకాశం కల్పించడం, శిబిరాల వద్ద వారితో మాట్లాడించడం ద్వారా తృతీయ, ద్వితీయశ్రేణి నేతల్లో ఉత్సాహం నింపేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.

మెరిసిన కోహ్లీ.. పాక్ పై గెలిచిన భారత్

అక్టోబర్ 22;   వరల్డ్ కప్ టి 20 లో మెల్‌బోర్న్‌ లో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ లో పాకిస్థాన్​పై భారత్ జట్టు అద్భుత విజయం సాధించింది. 160 పరుగుల విజయ లక్ష్యాన్ని చేదించడంలో 31 పరుగులకే 4వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన టీమ్‌ఇండియాను విరాట్‌ కోహ్లీ-హార్దిక్‌ పాండ్య ఆదుకున్నారు. ఐదో వికెట్‌కు శతక భాగస్వామ్యం జోడించారు.ఉత్కంఠభరిత మ్యాచ్‌లో భారత్‌ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. అన్ని విభాగాల్లో రాణించి చిరకాల ప్రత్యర్థిపై విజయాల పరంపర కొనసాగించింది. మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ (82*) ఒంటి చేత్తో టీమ్‌ఇండియాను గెలిపించాడు. 31 పరుగులకే 4వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన టీమ్‌ఇండియాను విరాట్‌ కోహ్లీ-హార్దిక్‌ పాండ్య ఆదుకున్నారు. ఐదో వికెట్‌కు శతక భాగస్వామ్యం జోడించారు. ఆ తర్వాత పాండ్య ఔటవగా.. కోహ్లీ చివరి వరకూ క్రీజ్‌లో ఉండి జట్టు కు విజయం అందించాడు. దీంతో టీమ్‌ఇండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పాక్​ బౌలర్లు హరిస్ రవుఫ్(2), నసీం షా(1) నవాజ్​(2) వికెట్లు తీశారు. భారత్ టాస్​ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా, పాక్​ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఈ మ్యాచ్​తో వరల్డ్​ కప్​​లో మొదటి సారి ఆడుతున్న టీమ్ ఇండియా యువ బౌలర్ అర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీసుకోవడం విశేషం. హార్దిక్​ పాండ్యా 3, షమీ, భువనేశ్వర్ చెరో ఒక వికెట్​ పడగొట్టారు.


 

Saturday, October 22, 2022

రామోజీ కుడిభుజం.. అట్లూరి రామమోహనరావు మృతి


హైదరాబాద్, అక్టోబర్ 22;    రామోజీ గ్రూపు సంస్థల్లో సుదీర్ఘకాలం ఎండీగా పనిచేసిన అట్లూరి రామమోహనరావు కన్నుమూశారు. ఈనాడు పత్రిక ఉన్నతిలో, విస్తృతిలో ఆయనది ప్రత్యేక స్థానం. రామమోహనరావు భౌతికకాయానికి రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు నివాళులు అర్పించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆయన కు నివాళులు అర్పించారు. రామమోహనరావు 1974లో ఈనాడులో ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1992 నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణ వ్యవహారాల్లోనూ... పాలుపంచుకున్నారు. 1995లో ఫిల్మ్ సిటీ ఎండీగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి సుదీర్ఘకాలం ఆ బాధ్యతల్లో కొనసాగారు.

Friday, October 21, 2022

టి ఆర్ ఎస్ ను గెలిపిస్తే మునుగోడు దత్తత ఖాయం: కే టి ఆర్

https://youtu.be/GlPAy1c93go

నల్గొండ, అక్టోబర్ 20;    టి ఆర్ ఎస్ ను గెలిపిస్తేలో టి ఆర్ ఎస్ ను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ తెలిపారు. మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ వద్ద​ శుక్రవారం రోడ్డు షో నిర్వహించిన మంత్రి మునుగోడు ప్రజలు రాజగోపాల్​రెడ్డికి ఓటుతోనే బుద్ధి చెప్పాలని కోరారు. రాజగోపాల్​రెడ్డి తన పదవిని మూడేళ్ల నుంచే భాజపా దగ్గర బేరం పెట్టి రూ.18వేల కోట్లు గుంజుకుని.. కోవర్ట్​ రాజకీయాలు చేశారని తీవ్రంగా విమర్శించారు. టి ఆర్ ఎస్ ను గెలిపిస్తే మునుగోడును దత్తత తీసుకు తీరుతామని కే టి ఆర్ మరోసారి స్పష్టం చేశారు.



కేదారీశ్వరుడ్ని దర్శించుకున్న ప్రధాని ...

డెహ్రాడూన్, అక్టోబర్ 20;    ఉత్తరాఖండ్​లోని రుద్రప్రయాగ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ కేదార్​నాథ్​ దేవాలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ  శుక్రవారం ఉదయం సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కేదారీశ్వరుడ్ని దర్శించుకున్నారు. జగద్గురు ఆదిశంకారాచార్య సమాధిని కూడా సందర్శించారు.గౌరీకుండ్​ నుంచి కేదార్​నాథ్ వరకు​ 9.7 కిలోమీటర్ల రోప్​వే ప్రాజెక్టుకు ప్రధాని శ్రీకారం చుట్టనున్నారు. 

https://youtu.be/6JNAWKHcE7k

మునుగోడు ఉపఎన్నికకు ముందు బి జి పి కి దెబ్బ: టి ఆర్ ఎస్ లోకి జంప్ అయిన స్వామిగౌడ్, దాసోజు

హైదరాబాద్ , అక్టోబర్ 20; ఒకే రోజు ఇద్దరు బీసీ నేతలు స్వామిగౌడ్‌, దాసోజు శ్రవణ్‌ భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. తిరిగి టి ఆర్ ఎస్ లో చేరుతున్నట్టు ప్రకటించారు. వీరు ఇద్దరు తమ రాజీనామా లేఖలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు పంపారు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించడంలో బి జె పి విఫలమైందని స్వామిగౌడ్‌ ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికలో బి జె పి వ్యవహరిస్తున్న తీరు జుగుప్సాకరంగా ఉందని, అనేక ఆశయాలతో బి జె పి చేరినప్పటికీ దశాదిశ లేని నాయకత్వ ధోరణులు.. నిర్మాణాత్మక రాజకీయాలకు, తెలంగాణ సమాజానికి ఏమాత్రం ఉపయోగకరంగా లేవని అనతికాలంలోనే అర్థమైందని అన్నారు. ప్రజాహితమైన పథకాలు, నిబద్ధత కలిగిన రాజకీయ సిద్ధాంతాలతో ప్రజలను మెప్పించడం కంటే మందు, మాంసం, విచ్చలవిడిగా నోట్ల కట్టలు పంచడం ద్వారా మునుగోడు ఉప ఎన్నికలో గెలవాలనుకుంటున్న బి జె పి తీరు పట్ల నిరసన తెలియజేస్తూ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాని శ్రవణ్‌ పేర్కొన్నారు.

Wednesday, October 19, 2022

అంగన్వాడీలపై జగన్ దృష్టి..

విజయవాడ, అక్టోబర్ 19: ఆంధ్రప్రదేశ్ లో నవంబర్​​ నుంచి అంగన్​వాడీల ద్వారా అందించే పౌష్టికాహార పంపిణీని ప్రత్యేక యాప్‌ల ద్వారా పర్యవేక్షించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. ఇందుకోసం అంగన్​వాడీలు, సూపర్​వైజర్లకు సెల్​ఫోన్ల పంపిణీని ఆయన బుధవారం ప్రారంభించారు. గర్భిణీలు, బాలింతలు, 6 సంవత్సరాల లోపు పిల్లలకు అందించే పౌష్టికాహారం, ఇతర సేవలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. డిసెంబర్‌ 1 నుంచి పౌష్టికాహార పంపిణీ బాధ్యతలను మార్క్‌ఫెడ్​కి అప్పగించాలని ఆదేశాలిచ్చారు. అంగన్‌వాడీల్లో పిల్లల ఆరోగ్య పరిస్థితులపై విలేజ్​ క్లినిక్స్‌, ఆశా వర్కర్ల ద్వారా వైద్యాధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. సచివాలయం లోని వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ కూడా ఇందులో భాగస్వామ్యం కావాలన్నారు. శారీరకంగా బలహీనంగా ఉన్న పిల్లలకు వైద్య సహాయం మాత్రమే కాకుండా, ఆ పిల్లలకు పౌష్టికాహారం మరింత అందించేలా తగిన ఆలోచనలు చేయాలన్నారు. అంగన్‌వాడీలపై సూపర్‌వైజర్ల పర్యవేక్షణ జియోట్యాగింగ్‌ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పిల్లలకు రోజూ ఇచ్చే పాలు, గుడ్లులాంటివి పాడవకుండా నిల్వచేసే విధానాలపైనా కూడా దృష్టి పెట్టాలని ప్రతి అంగన్‌వాడీల్లో ఫ్రిడ్జ్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. 

​ నేను టి ఆర్ ఎస్ తోనే: పద్మారావు గౌడ్​


హైదరాబాద్ , అక్టోబర్ 19: తాను పార్టీ మారుతున్నట్లు వస్తోన్న వదంతులను డిప్యూటీ స్పీకర్​ పద్మారావు గౌడ్​ కొట్టిపారేశారు. ఊపిరి ఉన్నంత కాలం టి ఆర్ ఎస్ ను వీడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. బూర నర్సయ్య పార్టీ మారినంత మాత్రాన.. తాను కూడా పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేయడం సరికాదన్నారు. సికింద్రాబాద్​లో అనేక అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను చేస్తున్నామని, సికింద్రాబాద్​లో జూనియర్, డిగ్రీ కళాశాల, హైస్కూల్‌లో రూ.30 కోట్లతో విద్యార్థులకు అనువుగా నూతన నిర్మాణాలు చేపట్టామని తెలిపారు. మెట్టుగూడ, తుకారాం గేట్‌లో ఆర్‌యుబీ నిర్మించినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే రూ.102 కోట్ల నిధులు మంజూరయ్యాయని, కళాశాలలు, వైద్యశాల ఏర్పాటుకు అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నామని పద్మారావు వివరించారు.



అసలు నాయకులే తక్కువ.. పైగా మునుగోడు ప్రచారం… బూర వెంట అందరూ ఢిల్లీ పోవాలా..

న్యూఢిల్లీ, అక్టోబర్ 19: ఇటీవలే టి ఆర్ ఎస్ కు రాజీనామా చేసిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ భారతీయ జనతా పార్టీలో చేరారు. ఢిల్లీ లోని బి జి పి కేంద్ర కార్యాలయంలో కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌, రాష్ట్ర బి జి పి వ్యవహారాల ఇంఛార్జ్‌ తరుణ్ చుగ్ సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. బూర నర్సయ్య గౌడ్‌తో పాటు పార్టీలోకి 16 మంది నేతలు చేరారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్‌, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, డీకే అరుణ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడిన బూర నర్సయ్య.. కొందరి కోసం తెలంగాణ కాదు.. అందరి తెలంగాణ రావాలనేదే తన లక్ష్యమని తెలిపారు. ఒకపక్క మునుగోడు ఎన్నిక ప్రచారం సమయంలో రాష్ట్రంలో వెళ్ల మీద లెక్కించ దాగిన ఐదుగురు నేతలు పోలో మంటూ ఢిల్లీ లో నర్సయ్య గౌడ్ బి జె పి లో చేరిక 

కార్యక్రమానికి వెళ్ళడం విడ్డూరం. 


డాలర్ కు 83 రూపాయలు..

న్యూఢిల్లీ, అక్టోబర్ 19: : రూపాయి పతనం కొనసాగుతూనే ఉంది. తాజాగా రూపాయి మారకం విలువ జీవితకాల కనిష్ఠాన్ని నమోదు చేసింది. డాలరుతో పోలిస్తే 61 పైసలు క్షీణించి రూ.83.01కి చేరుకుంది. విదేశీ మార్కెట్లలో డాలర్​ బలపడడం.. అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు పెరగడమే రూపాయి పతనానికి కారణమని ఆర్థిక రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.



రూ. లక్ష దాటిన ఇంజినీరింగ్ ఫీజు

హైదరాబాద్, అక్టోబర్ 19: : బీటెక్ తో పాటు ఎంటెక్, ఎంబీయే, ఎంసీయే రుసుములు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 40 కాలేజీల్లో బీటెక్ వార్షిక రుసుము లక్ష రూపాయలు దాటింది. కనీస రుసుము రూ.35వేల నుంచి రూ.45వేలకు చేరింది. ఎంటెక్​లో కనీస ఫీజు రూ. 57వేల రూపాయలు.. ఎంబీయే, ఎంసీయే కనీస రుసుము రూ.27వేలు అయింది. ఇంజినీరింగ్​ ఫీజులను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఎట్టకేలకు ఉత్తర్వులు జారీ చేసింది. గత రెండేళ్లు కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది పాత ఫీజులే కొనసాగించాలని రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ.. మొదట భావించింది. కొన్ని కాలేజీలు హైకోర్టును ఆశ్రయించి తాము కోరిన ఫీజులే వసూలు చేసేలా మధ్యంతర ఉత్తర్వులు పొందాయి. ఈ నేపథ్యంలో కళాశాలల యాజమాన్యాలతో టీఎస్ఏఎఫ్ఆర్సీ చర్చించి ఫీజులు ఖరారు చేసి ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఏఎఫ్‌ఆర్‌సీ సిఫార్సుల మేరకు రాష్ట్రంలోని 159 ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.రాష్ట్రవ్యాప్తంగా 40 కాలేజీల్లో ఇంజినీరింగ్ వార్షిక రుసుము లక్ష రూపాయలు దాటింది. ఇప్పటి వరకు కనీస రుసుము రూ.35వేల రూపాయలు ఉండగా.. దాన్ని రూ.45వేలకు ప్రభుత్వం పెంచింది. అత్యధికంగా ఎంజీఐటీలో లక్ష 60వేల రూపాయలు.. సీవీఆర్​లో లక్షన్నర, సీబీఐటీ, వర్ధమాన్, వాసవీలో లక్ష 40వేల రూపాయల ఫీజును ఖరారు చేసింది. ఎన్ఆర్ఐ కోటాలో గరిష్ఠ ఫీజు 5వేల డాలర్లుగా నిర్ణయించింది. ప్రవేశాల సమయంలో సుమారు మూడున్నర వేల రూపాయలు.. ఎన్‌బీయే గుర్తింపు ఉంటే మరో 3వేల రూపాయలు అదనంగా చెల్లించాలి. ఎంటెక్, ఎంబీయే, ఎంసీయే ఫీజులను కూడా ప్రభుత్వం పెంచింది. ఎంటెక్ కనీస ఫీజు 57వేలు.. ఎంబీయే, ఎంసీయే కనీస వార్షిక రుసుము 27వేలకు పెరిగింది. ఈ ఫీజులు మూడేళ్ల పాటు అమల్లో ఉంటాయి. అయితే ఫీజు రీఎంబర్స్​మెంట్​ పెంపుపై మాత్రం ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు.



ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా పోరాడతా: ఖర్గే

న్యూఢిల్లీ , అక్టోబర్ 19: : అక్టోబర్‌ 26న కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టనున్నట్లు ఆ పార్టీ సీనియర్‌నేత మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన అనంతరం మీడియా సమావేశంలో ఖర్గే మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్న ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా.. తాము కలిసికట్టుగా పోరాడతామని ఖర్గే తెలిపారు. రాజ్యాంగానికి ముప్పుగా పరిణమిల్లే వాటిని అడ్డుకుంటామని తెలిపారు.అధ్యక్ష ఫలితాలపై స్పందించిన శశిథరూర్‌.. ఈ విజయం ఖర్గేది కాదని యావత్‌ కాంగ్రెస్‌ పార్టీదని కొనియాడారు. ఈ ఎన్నికలు పార్టీ శ్రేణులకు ఉత్సాహాన్ని అందించిందని తెలిపారు. బలమైన భారతదేశం కావాలంటే.. బలమైన కాంగ్రెస్​ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.


 

Tuesday, October 18, 2022

కాంతారా... కలకలం..


బెంగళూరు, అక్టోబర్ 18: :  సినీ బాక్సాఫీస్ ముందు సంచలనం సృష్టించిన కాంతార.. కన్నడ చిత్రం అధిక వసూళ్లతోపాటు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటోంది. రిషబ్‌ శెట్టి స్వీయదర్శకత్వంలో నటించిన ఈ సినిమా తెలుగులో కూడా సూపర్ హిట్ గా నిలిచింది. తాజాగా ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్‌ ఐఎండీబీ ప్రకటించిన 'టాప్‌ 250 ఇండియన్‌ ఫిల్మ్స్‌' జాబితాలో కాంతార అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. తమ యూజర్స్‌ ఇచ్చిన రేటింగ్స్‌ ఆధారంగా ఐఎండీబీ ఆ లిస్ట్‌ను రూపొందించింది. సోషల్‌ మీడియా లో ఆ వివరాలు పంచుకుంది.నంబర్‌ 1 స్థానం లో'కాంతార' ఉండగా 2వ స్థానంలో రామాయణ (1993), 3లో రాకెట్రీ (2022), 4లో నాయకన్‌ (1987), 5లో అన్బే శివం (2003), 6లో గోల్‌మాల్‌ (1979), 7లో జై భీమ్‌, 8లో 777 చార్లీ, 9లో పరియెరుమ్‌ పెరుమాళ్‌ (2018), 10లో మణిచిత్రతజు (1993) నిలిచాయి.



అమరావతి రైతులకు రాహుల్ సంఘీభావం..

కర్నూలు, అక్టోబర్ 18: : కర్నూలు జిల్లాలో ప్రవేశించిన భారత్​ జోడో యాత్రలో రాహుల్ గాంధీని అమరావతి రైతులు కలిశారు. అమరావతి రాజధానిగా und ఉండేందుకు మద్దతు ఇవ్వాలని రాహుల్​ను కోరారు. తమ పాదయాత్రకు రాహుల్సంఘీభావం తెలిపారని, న్యాయ సహాయం చేస్తామని చెప్పారని,  వీలైతే పాదయాత్రలో పాల్గొంటానని రాహుల్​ చెప్పినట్లు అమరావతి రైతులు తెలిపారు. కాగా, రాహుల్​గాంధీని పోలవరం నిర్వాసిత రైతులు కూడా కలిశారు. పోలవరం నిర్వాసిత రైతులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని రాహుల్ తెలిపారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజ్‌ అమలు చేస్తామని హామీ ఇచ్చారు.



బీసీసీఐకి కొత్త అధ్యక్షుడుగా రోజర్ బిన్నీ


ముంబై ,అక్టోబర్ 18: : బీసీసీఐకి కొత్త అధ్యక్షుడు గా భారత జట్టు మాజీ ప్లేయర్ రోజర్ బిన్నీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. మంగళవారం ముంబయి తాజ్​ హొటల్​లో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో బీసీసీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ పాలకవర్గానికి కూడా ఎన్నికలు జరిగిగాయి. అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ, ఉపాధ్యక్షుడిగా రాజీవ్​ శుక్లా, కార్యదర్శిగా జై షా, సంయుక్త కార్యదర్శిగా దేవజిత్ లోన్ సాకి, కోశాధికారిగా ఆశీష్​ షెలార్‌, ఐపీఎల్‌ ఛైర్మన్‌గా అరుణ్‌ సింగ్‌ ధూమాల్‌, అపెక్స్‌ కౌన్సిల్‌ మెంబర్‌గా ఖైరుల్‌ జమాల్‌ మజుందార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండు విషయాలపై ఫోకస్​ పెట్టబోతున్నట్టు కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన రోజర్ బిన్నీ తెలిపాడు. మొదటిది ప్లేయర్లకు గాయాలు కాకుండా.. రెండోది దేశంలోని పిచ్​లపై అని చెప్పాడు. గాయాల కారణంగానే బుమ్రా వరల్డ్​ కప్​కు దూరమయ్యాడని పేర్కొన్నాడు.


జీనోమ్ వ్యాలీలో బయో ఫార్మా హబ్‌ సహా ఐదు ప్రాజెక్టులకు కేటీఆర్ శంకుస్థాపన


హైదరాబాద్, అక్టోబర్ 18: : రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ రంగం విలువ 2030 నాటికి 100 బిలియన్ డాలర్లు చేరేలా తెలంగాణ ప్రయాణం కొనసాగిస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. జీనోమ్ వ్యాలీలో రూ. 1100 కోట్ల విలువైన బయో ఫార్మా హబ్‌ సహా ఐదు ప్రాజెక్టులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు.జీనోమ్ వ్యాలీ స్పేస్ కోసం రోజురోజుకు డిమాండ్ పెరుగుతుందని తెలిపారు. అనేక కొత్త కంపెనీలు రావడంతో పాటు ఇప్పటికే కొన్ని కంపెనీలు తమ విస్తరణను చేపట్టాయని పేర్కొన్నారు. లైఫ్‌ సైన్సెస్ రంగంలో పెట్టుబడులతో దేశంలోనే జీనోమ్ వ్యాలీ కీలకంగా ఎదిగిందని మంత్రి స్పష్టం చేశారు. జీనోమ్ వ్యాలీ తెలంగాణతో పాటు దేశానికి ఎంతో కీలకమైందన్నారు. 


ఆరు రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంపు

న్యూఢిల్లీ, అక్టోబర్ 18: 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆరు రబీ పంటలకు కనీస మద్దతు ధరలను పెంచుతూ మంత్రివర్గం మంగళవారం నిర్ణయం తీసుకుంది. కందుల కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.500 పెంచినట్లు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. గోధుమలపై రూ.110 పెంచగా.. ఆవాలపై రూ.400 పెంచామని వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) పంటలకు కనీస మద్దతు ధరను పెంపు నిర్ణయం తీసుకున్నట్లు అనురాగ్ ఠాకూర్ తెలిపారు.


పంట

పెంపు

ధర(క్వింటాలుకు)


గోధుమలు

రూ.110

రూ.2,125

ఆవాలు

రూ.400   

రూ.5,450

బార్లీ

రూ.100   

రూ.1,735

శనగలు

రూ.105   

రూ.5,335

కందులు

రూ.500   

రూ.6,000

సన్​ఫ్లవర్

రూ.209   

రూ.5,650



బాబు, పవన్ ప్రజాస్వామ్య గళం..


విజయవాడ , అక్టోబర్ 18: ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటం చేస్తామని టి డి పి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. విజయవాడలోని నోవాటెల్‌ హోటల్‌లో పవన్‌ కల్యాణ్‌ను చంద్రబాబు నాయుడు కలిసిన అనంతరం ఇద్దరూ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. విశాఖలో జరిగిన తీరు చూస్తే 

బాధేస్తోందని ,పవన్‌ను కలిసి సంఘీభావం తెలిపేందుకే ఆయనను కలిశానని చెప్పారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో వైకాపా లాంటి పార్టీని ఎప్పుడూ చూడలేదని, ప్రజాస్వామ్యరక్షణ కు కలిసి రావాలని పవన్‌ కల్యాణ్‌ను 

కోరామని తెలిపారు. ఎవరెలా పోటీ చేస్తారో పరిస్థితిని బట్టి ఉంటుంది.. ‘‘ముందుగా ప్రజాస్వామ్య పరిరక్షణ ముఖ్యం.. ఆ తర్వాత ఎవరెలా పోటీ చేస్తారో అప్పటి పరిస్థితి బట్టి ఉంటుంది‘‘ అన్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, సంఘీభావం తెలిపేందుకు వచ్చిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘రాజకీయ పార్టీలు నడిపే వ్యక్తులను నలిపేస్తామంటే ఎలా? ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ప్రజా స్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరముంది. ఎన్నికల గురించి మాట్లాడాల్సిన సమయం కాదు.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన సమయమిది. ఎన్నికలకు ఎలా వెళ్లాలనే విషయం ఒక్కరోజులో తేలేది కాదు. వైకాపాతో పోరాటం చేసేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాం. ముందుగా న్యాయ, రాజకీయ పోరాటం చేస్తాం. అంతిమంగా ప్రజలకు మేలు చేయడమే మా ఉద్దేశం’’ అని పవన్‌ కల్యాణ్ స్పష్టం చేశారు.


ఉగ్రవాదంపై సమష్టి పోరే శరణ్యం- మోదీ


న్యూఢిల్లీ , అక్టోబర్ 18: ఉగ్రవాదులు, అవినీతిపరులు, నేరస్థులకు అనుకూలమైన అన్ని మార్గాలను పూర్తిగా మూసివేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. అందుకోసం అంతర్జాతీయ సమాజం మరింత వేగవంతంగా, కలిసి కట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. దిల్లీలో ఇంటర్‌పోల్‌ 90వ జనరల్‌ సమావేశాలను ప్రారంభించారు. ఉగ్రవాదం, డ్రగ్స్‌, స్మగ్లింగ్‌, వ్యవస్థీకృత నేరాలు మానవాళిని పీడిస్తున్న ప్రధాన సమస్యలని మోదీ అన్నారు. అవి ఏ ఒక్క దేశానికో పరిమితం కాలేదనీ వాటికి అన్ని దేశాల్లో గట్టి పునాదులు కలిగి ఉన్నాయన్నారు. ఆ నెట్వర్క్‌ను ఎదుర్కోడానికి స్థానికంగా తీసుకునే చర్యలు ఏమాత్రం సరిపోవని తెలిపారు. ఉగ్రవాదం లాంటి పెనుభూతాన్ని భూస్థాపితం చేయాలంటే దేశాలన్నీ ఏకతాటి పైకి రావాలని స్పష్టం చేశారు. ఇంటర్‌పోల్‌ 90వ అసెంబ్లీ సమావేశాలను పురస్కరించుకునే మోదీ వంద రూపాయల నాణేన్ని విడుదల చేశారు.




పొత్తు పొడుపు కు సంకేతమా…?

విజయవాడ, , అక్టోబర్ 18: తెలుగుదేశం అధినేత చంద్రబాబు మంగళవారం విజయవాడ నొవాటెల్‌ హోటల్‌ లో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్​తో భేటీ అయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల తరువాత ఇరువురు నేతలు బహిరంగంగా కలవడం ఇదే ప్రథమం.  విశాఖలో పోలీసులు పవన్‌ కల్యాణ్​ పట్ల వ్యవహరించిన తీరు పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇవాళ్టి నుంచి రాజకీయ ముఖచిత్రం మారుతోందని… బి జె పి తో పొత్తు ఉన్నా ఎందుకో కలిసి వెళ్లలేకపోతున్నామని పవన్‌ అన్నారు. రౌడీలు రాజ్యమేలుతుంటే తన ప్రజలను రక్షించుకోవడానికి తాను వ్యూహాలు మార్చుకోవాల్సి వస్తుందని పవన్​ వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపటికే చంద్రబాబు ఆయనను కలవడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. 




Monday, October 17, 2022

​హైదరాబాద్‌లో గ్లోబల్ అనలిటిక్స్‌ అండ్ టెక్నాలజీ ఎక్స్‌లెన్స్‌ సెంటర్


హైదరాబాద్, అక్టోబర్ 17: హైదరాబాద్‌లో గ్లోబల్ అనలిటిక్స్‌ అండ్ టెక్నాలజీ ఎక్స్‌లెన్స్‌ సెంటర్‌ ఏర్పాటు చేసేందుకు రోచే ఫార్మా సంస్థ ముందుకొచ్చింది. హైదరాబాద్‌లో రెండో డేటా అనలిటిక్స్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. నగరంలో డేటా సైన్స్‌, అడ్వాన్స్‌ డ్‌ అనలిటిక్స్‌ సంబంధిత సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి పెట్టుబడి పెట్టనుంది. ఇందులో భాగంగా సోమవారం రాష్ట్ర ఐటీ,పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌తో రోచే ఫార్మా మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ సింప్సన్‌ ఇమ్మాన్యుయేల్‌ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. రోచే ఫార్మా తమ గ్లోబల్‌ కెపాబిలిటీ సెంటర్లను స్థాపించడానికి హైదరాబాద్‌ను ఎంచుకోవడం గర్వ కారణంగా ఉందన్నారు. సెంటర్‌లకు ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. 


​కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక లో  ఓట్లు వేస్తున్న సోనియా, ప్రియాంక, మన్మోహన్, రాహుల్ 

కొత్త సీజేఐగా జస్టిస్‌ చంద్రచూడ్‌ : నవంబర్ ‌9న ప్రమాణం


న్యూఢిల్లీ, , అక్టోబర్ 17: సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ నియమితులయ్యారు. సీజేఐగా జస్టిస్‌ చంద్రచూడ్‌ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ నవంబర్‌ 8న జస్టిస్‌ లలిత్‌ పదవీ విరమణ చేయనుండగా నవంబర్‌9న జస్టిస్‌ చంద్రచూడ్‌ నూతన సీజేఐగా బాధ్యతలు స్వీకరిస్తారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన భారత రాజ్యాంగం ప్రకారం వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కుల కిందకు వస్తుందని జస్టిస్‌ కె.ఎస్‌.పుట్టుస్వామి వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో 2017 ఆగస్టులో ఏకగీవ్రంగా తీర్పునిచ్చిన 9 మంది సభ్యుల ధర్మాసనంలో సభ్యుడిగా ఉన్నారు. ఆధార్‌ బిల్లును మనీ బిల్లుగా రాజ్యాంగ విరుద్ధంగా ఆమోదించినట్లు జస్టిస్‌ కె.ఎస్‌.పుట్టుస్వామి వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో మెజారిటీ న్యాయమూర్తుల అభిప్రాయానికి భిన్నంగా ప్రత్యేక తీర్పురాశారు. ఆ చట్టంలోని నిబంధనలు వ్యక్తిగత గోప్యత, గౌరవం, స్వతంత్రతను ప్రభావితం చేస్తాయని చెప్పారు. అలాగే నవ్‌తేజ్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో ఐపీసీ సెక్షన్‌ 377 రాజ్యాంగ విరుద్ధమని, సేమ్‌ సెక్స్‌ ఇంటర్‌కోర్స్‌ చట్టబద్ధమేనని పేర్కొన్నారు. సెక్షన్‌ 377 వలసవాదుల పాలనలో వచ్చిందని, అది ప్రాథమిక హక్కులు, సమానత్వం, భావప్రకటనా స్వేచ్ఛ, జీవితం, వ్యక్తిగత గోప్యతకు విరుద్ధంగా ఉందని స్పష్టం చేశారు.మేజర్‌ అయిన వారికి వివాహం, మతం విషయంలో తమకు నచ్చినట్లు నడుచుకొనే స్వేచ్ఛ ఉంటుందని సాఫిన్‌ జహాన్‌ వర్సెస్‌ అశోకన్‌ కేఎం కేసులో తీర్పు చెప్పారు. 10-50 ఏళ్ల మహిళలకు శబరిమల ఆలయ ప్రవేశం నిషిద్ధం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమని, అలాచేయడం వారి స్వతంత్రత, స్వేచ్ఛ, మర్యాదలను దెబ్బతీయడమేనని ఇండియన్‌ యంగ్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసులో స్పష్టంచేశారు. వ్యభిచారం నేరం కాదని జోసెఫ్‌ షైన్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో మెజారిటీ తీర్పుతో ఏకీభవించారు. ఐపీసీ సెక్షన్‌ 497 రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14 (చట్టం ముందు అందరూ సమానం), 15 (మతం, వర్ణం, కులం, లింగం, జన్మస్థలం ఆధారంగా వివక్షచూపడం నిషేధం), 21 (జీవితం, వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ)కు విరుద్ధమని చెప్పారు. 1959 నవంబరు 11న బొంబాయిలో జన్మించిన జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ 2016 మే 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అంతకుముందు 2000 మార్చి 29న బొంబాయి హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన ఆయన 2013 అక్టోబరు 31న అలహాబాద్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 1998 నుంచి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులు అయ్యేంతవరకూ అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా పనిచేశారు. అమెరికాలోని హార్వర్డ్‌ లా స్కూల్‌లో ఎల్‌ఎల్‌ఎం డిగ్రీ, జ్యుడిషియల్‌ సైన్సెస్‌లో డాక్టరేట్‌ పొందారు. దిల్లీ సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీలో ఆర్థికశాస్త్రంలో బి.ఎ., దిల్లీ యూనివర్సిటీ క్యాంపస్‌ లా సెంటర్‌లో ఎల్‌ఎల్‌బీ చేశారు. తండ్రీకుమారులు ఇద్దరూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులైన ఘనత జస్టిస్‌ వై.వి.చంద్రచూడ్‌, జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌లకే దక్కనుంది.



​రైతులకు 1700 రకాల పంట విత్తనాలు

న్యూఢిల్లీ, అక్టోబర్ 17: పి ఎం కిసాన్‌ సమ్మాన్‌ సమ్మేళన్‌ పథకం కింద అర్హులైన 11 కోట్ల మంది రైతులకు.. 16 వేల కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు.  దిల్లీలో ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ సమ్మేళన్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 22కోట్ల మంది రైతులకు సాయిల్‌ హెల్త్‌ కార్డులతోపాటు 1700 రకాలైన విత్తనాలను అందించి పంట ఉత్పాదకతను పెంచనున్నట్లు మోదీ చెప్పారు. వ్యవసాయంలో నానో యూరియా ప్రాధాన్యతను ప్రస్తావిస్తూ, ఒక సీసా ద్రవరూప యూరియా ఒక బస్తా యూరియాతో సమానమని చెప్పారు. దేశవ్యాప్తంగా 600 కిసాన్‌ సమృద్ధి కేంద్రాలను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇప్పటికే ఉన్న 3,30 లక్షల విత్తన దుకాణాలు పీఎం కిసాన్‌ సమృద్ధి కేంద్రాలుగా మారనున్నాయని తెలిపారు.

ఈ సందర్భంగా అంతర్జాతీయ వీక్లీ ఫెర్టిలైజర్ ఇ-మ్యాగజైన్ ఇండియన్ ఎడ్జ్‌ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఎరువుల బ్రాండ్లపై రైతులు భ్రమలు, అయోమయంలో ఉన్నారని.. ఇకపై దేశమంతా ఒకే బ్రాండ్‌లో ఎరువుల విక్రయాలు సాగుతాయని మోదీ తెలిపారు.


మునుగోడు బరిలో 47 మంది..

నల్గొండ, అక్టోబర్ 17: మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నిక నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ గడువు సోమవారంతో ముగిసింది. అక్టోబరు 7న ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ విడుదల కాగా.. అక్టోబరు 14న నామినేషన్ల ప్రక్రియ ముగిసే సరికి మొత్తంగా 130 మంది అభ్యర్థులు 199 నామినేషన్లు దాఖలు చేశారు. పరిశీలనలో 47 మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. మిగిలిన 83 మంది అభ్యర్థు్ల్లో 36 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో మొత్తంగా 47 మంది అభ్యర్థులు ఉపఎన్నిక బరిలో ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

Saturday, October 15, 2022

పుట్టిన పిల్లలకు జనన ధ్రువీకరణ పత్రంతోపాటు ఆధార్‌..

న్యూఢిల్లీ, అక్టోబర్ 15: ​అప్పుడే పుట్టిన పిల్లలకు జనన ధ్రువీకరణ పత్రంతోపాటు ఆధార్‌ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. తెలంగాణతోపాటు మరో 15 రాష్ట్రాల్లో ప్రస్తుతం.. ఈ విధానం అమలు చేస్తుండగా త్వరలోనే అన్ని రాష్ట్రాలకు విస్తరించనున్నట్లు తెలిపింది. తెలంగాణలో గతేడాది నుంచి జనన ధ్రువీకరణ పత్రాన్ని ఆధార్‌తో అనుసంధానం చేశారు. ప్రస్తుతం ఐదేళ్లలోపు చిన్నారులకు.. ఆధార్‌ ఇచ్చినప్పటికీ వారి వేలిముద్రలు, ఐరిస్‌ నమోదు చేయకుండా పిల్లల ఫొటోను తల్లిదండ్రుల ఆధార్‌తో అనుసంధానిస్తున్నారు. తర్వాత 5 నుంచి 15 ఏళ్ల మధ్య బయోమెట్రిక్‌ను అప్‌డేట్‌ చేసుకునే అవకాశం కల్పించారు. 

సినీ నిర్మాత కాట్రగడ్డ మురారి మృతి..

Friday, October 14, 2022

ఏ టి ఎం ఇడ్లీ రెడీ..

https://youtube.com/shorts/1K9rVUcV4rs?feature=share 

బెంగుళూరు, అక్టోబర్ 14: 

వేడి వేడి ఇడ్లీలు అందించే ఏటీఎంలు అందుబాటులోకి వచ్చాయి. బెంగుళరులో ఒక స్టార్టప్‌ కంపెనీ ‘ఇడ్లీ ఏటీఎం’లను ఏర్పాటు చేసింది. బెంగళూరుకు చెందిన శరణ్ హిరేమత్, సురేష్ చంద్రశేఖరన్‌లు స్థాపించిన స్టార్టప్ ఫ్రెషప్ రోబోటిక్స్, ఇన్‌స్టెంట్‌ ఇడ్లీ తయారు యంత్రాన్ని రూపొందించింది. ఇరవై నాలుగు గంటలు వేడి వేడి ఇడ్లీలు అందించే ఈ ఏటీఎంను ఫ్రెషాట్‌లో ఏర్పాటు చేశారు. ఇది కేవలం 12 నిమిషాల్లో 72 ఇడ్లీలు తయారు చేయగలదు. చట్నీ, కారప్పొడి వంటి వాటితో ఇడ్లీలను ప్యాక్‌ చేసి కస్టమర్లకు అందిస్తుంది.ఏటీఎం వద్ద ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను మొబైల్‌ ఫోన్‌తో స్కాన్ చేయాలి. దీంతో మెనూ కనిపిస్తుంది. ఇడ్లీలు ఆర్డర్‌ చేసి డబ్బులను ఆన్‌లైన్‌లో చెల్లించాలి. దీంతో నిమిషంలోపే చట్నీతో కూడిన ఇడ్లీ ప్యాక్‌ ఆ ఏటీఎం నుంచి బయటకు వస్తుంది. 

2016లో తన కుమార్తె అనారోగ్యంతో బాధపడినప్పుడు అర్థరాత్రి వేళ ఎక్కడా వేడి వేడి ఇడ్లీలు లభించక ఇబ్బంది పడ్డానని, అందుకే ఇడ్లీలు తయారు చేసే ఏటీఎం యంత్రాన్ని రూపొందించాలన్న ఆలోచన వచ్చిందని శరణ్‌ హిరేమత్‌ తెలిపారు. ప్రస్తుతం బెంగళూరులోని రెండు చోట్ల ఇడ్లీ ఏటీఎంలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వీటిని మరింతగా విస్తరించడంతోపాటు దోస, రైస్‌, జ్యూస్‌ వంటి ఏటీఎంలను కూడా అందుబాటులోకి తెచ్చే యోచనలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. 


నవంబర్​ 12న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు

న్యూఢిల్లీ, అక్టోబర్ 14: 

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్​ను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. ఒకే దశలో నవంబర్​ 12న పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 8న ఫలితాలు వెలువడతాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రస్తుతం బి జి పి అధికారంలో ఉంది. ఆ రాష్ట్ర అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది జనవరితో పూర్తి కానుంది. హిమాచల్​లో 68 అసెంబ్లీ స్థానాలున్నాయి. 55 లక్షల మందికిపైగా ఓటర్లు ఉన్నారు. 2017లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 43 స్థానాల్లో విజయం సాధించగా.. కాంగ్రెస్‌ పార్టీ 22 స్థానాలు దక్కించుకుంది. 


మహిళా ఉద్యోగులకు ఇక నైట్ డ్యూటీలు..

హైదరాబాద్, అక్టోబర్ 14: దుకాణాలు, కంపెనీలు, సంస్థల్లో నిర్దేశిత షరతులకు లోబడి మహిళా ఉద్యోగులు కూడా రాత్రి పూట విధులు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు కార్మికశాఖ జారీ చేసిన ఉత్తర్వులు ఈ నెల 17 నుంచి అమలు లోకి వస్తాయి. రాత్రి ఎనిమిదిన్నర నుంచి ఉదయం ఆరు గంటల వరకు మహిళా ఉద్యోగులు విధులు నిర్వర్తించవచ్చు. ఇందుకు మహిళా ఉద్యోగుల అంగీకారం తప్పనిసరి అని ఉత్తర్వు స్పష్టం చేసింది. మహిళా ఉద్యోగులు కార్యాలయానికి వెళ్లేందుకు, తిరిగి వచ్చేందుకు ఉచితంగా రవాణా సదుపాయం కల్పించాలని.. వాటికి జీపీఎస్​ వ్యవస్థ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించింది. మహిళా ఉద్యోగులకు రాత్రి విధులు రొటేషన్ విధానంలో అమలు చేయాలని.. కార్యాలయాల్లో అవసరమైన సదుపాయాలు కల్పించడంతో పాటు లైంగిక వేధింపుల నుంచి భద్రతా చర్యలు, కనీసం ఐదుగురు మహిళా ఉద్యోగులు విధుల్లో ఉండేలా చూడాలని పేర్కొంది. ప్రసవానికి ముందు, తర్వాత కనీసం 16 వారాల పాటు మహిళా ఉద్యోగులకు రాత్రి విధులు అప్పగించరాదని స్పష్టం చేసింది. నిర్దేశించిన నిబంధనలను ఏ సంస్థ పాటించకపోయినా రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని, లేదా మహిళా ఉద్యోగులకు రాత్రి విధులకు ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. 


మునుగోడులో ముగిసిన నామినేషన్ల పర్వం

హైదరాబాద్, అక్టోబర్ 14: మునుగోడులో నామినేషన్ల పర్వం ముగిసింది. బి జె పి అభ్యర్థి రాజగోపాల్​రెడ్డి, టి ఆర్ ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్​రెడ్డి ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేయగా, నేడు ఆఖరి రోజున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి బంగారు గడ్డ నుంచి చండూరు తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీతో తరలివచ్చి రిటర్నింగ్ అధికారికి నామ పత్రాలు సమర్పించారు. స్రవంతి వెంట టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి, ఎంపీ ఉత్తమ్​కుమార్​రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జానారెడ్డి, జగ్గారెడ్డి, సీతక్క, పార్టీ సీనియర్ నాయకులు తదితరులు ఉన్నారు. మునుగోడు ఉపఎన్నికకు నామినేషన్ల పర్వం ముగియడంతో ఇక ప్రచారంపై ప్రధాన పార్టీలు దృష్టి సారించనున్నాయి. ఇప్పటికే మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రాంతాలకు చెందిన నేతలంతా మునుగోడులోనే మకాం వేశారు. విపక్షాలు సైతం అదే స్థాయిలో హడావిడి చేస్తున్నాయి. కీలక ఉపఎన్నిక నేపథ్యంలో రాష్ట్ర రాజకీయం మునుగోడులో కేంద్రీకృతమైంది. 

ఈ ఏడాది 100 శాతం సిలబస్‌తో ఇంటర్‌ పరీక్షలు

హైదరాబాద్, అక్టోబర్ 14: ఈ ఏడాది 100 శాతం సిలబస్‌తో ఇంటర్‌  పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. కొవిడ్ వల్ల గత రెండేళ్లు 70 శాతం సిలబస్‌తో ఇంటర్‌ పరీక్షలు నిర్వహించామని తెలిపింది. ఈ సంవత్సరం 100 శాతం సిలబస్​తో పరీక్షలు నిర్వహించనున్నట్లు.. ఇందుకు సంబంధించిన సిలబస్, నమూనా ప్రశ్నాపత్రాలను ఇంటర్ బోర్డు వెబ్​సైట్​లో అందుబాటులో ఉంచినట్లుపేర్కొంది.

Wednesday, October 12, 2022

సమ్మె విరమించిన వీఆర్ఏలు ..

హైదరాబాద్, అక్టోబర్ 12: సమస్యల పరిష్కారం కోరుతూ 80 రోజులుగా చేస్తున్న సమ్మె ను వీఆర్ఏలు విరమించారు. వీఆర్ఏల ప్రతినిధులు, ట్రెసా నేతలతో సీఎస్ సోమేశ్‌ కుమార్ జరిపిన చర్చలు సఫలం అయ్యాయి.వీఆర్ఏల సమస్యలను పరిష్కరిస్తామని సీఎస్ హామీ ఇచ్చారని , వచ్చే నెల 7 తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారని ట్రెసా అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి తెలిపారు. మునుగోడు ఉపఎన్నిక కోడ్ దృష్ట్యా వచ్చే నెల నిర్ణయిస్తామని చెప్పారని ఆయన వెల్లడించారు. వీఆర్ఏలు రేపట్నుంచి విధులకు హాజరవుతారని ట్రెసా అధ్యక్షుడు తెలిపారు.

మైడెన్ మందుల ఉత్పత్తి బంద్..

న్యూఢిల్లీ, అక్టోబర్ 12: గాంబియాలో 66 మంది చిన్నారుల మృతికి కారణమైన మందుల కంపెనీ ఉత్పత్తిని నిలిపివేయాలని డ్రగ్​ కంట్రోల్ ఆదేశాలు జారీచేసింది. హరియాణాలోని సొనెపట్‌ కేంద్రంగా.. మైడెన్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఉత్పత్తిచేసిన నాలుగు సిరప్‌ల కారణంగానే సెప్టెంబరులో ఈ మరణాలు సంభవించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చిన్నారుల మృతికి కారణమైన మందుల కంపెనీ ఉత్పత్తిని నిలిపివేయాలని డ్రగ్​ కంట్రోల్ ఆదేశాలు జారీచేసింది. తనిఖీల సమయంలో సొనెపట్‌లోని మైడెన్‌కు చెందిన దగ్గుమందు తయారీ కేంద్రంలోని లోపాలను హరియాణా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ గుర్తించింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సంస్థకు చెందిన తయారీ లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని దానిలో పేర్కొంది. ఈ నోటీసులపై మైడెన్‌ నవంబర్ 14లోగా సమాధానం ఇవ్వాల్సి ఉంది. 


Tuesday, October 11, 2022

సుప్రీంకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చంద్రచూడ్

న్యూఢిల్లీ, అక్టోబర్ 11; భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చంద్రచూడ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన పేరును ప్రతిపాదిస్తూ ప్రస్తుత సీజేఐ జస్టిస్​ యూయూ లలిత్ లేఖను అందించారు. నవంబర్ 8న జస్టిస్ లలిత్ పదవీ విరమణ చేసిన తర్వాత నవంబర్ 9న తదుపరి సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్ బాధ్యతలు చేపడతారు. 


అదిగో నవలోకం..‘ మహా కాల్ లోక్ ‘

భోపాల్, అక్టోబర్ 11; మధ్యప్రదేశ్‌ ఉజ్జయినిలో శ్రీ మహాకాల్ లోక్‌ కారిడార్‌ తొలిదశను ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతికి అంకితం చేశారు. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన పురాతన మహాకాళేశ్వర్‌ ఆలయ ఆవరణ అభివృద్ధి ప్రాజెక్టు తొలిదశ కింద రూ.856 కోట్లతో చేపట్టిన నిర్మాణాలు పూర్తయ్యాయి. ఈ ఆలయంలో అభివృద్ధి చేసిన 900 మీటర్ల పొడవైన కారిడార్ 'మహాకాల్ లోక్‌'ను.. భక్తులను ఆథ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్లేవిధంగా తీర్చిదిద్దారు. భక్తులకు స్వాగతం పలుతున్నట్టుగా రెండు ప్రవేశ ద్వారాలను ఏర్పాటు చేశారు. అందులో ఒకటి నందీ ద్వార్‌.. ఎత్తయిన రెండు నందులు.. భక్తులకు స్వాగతం పలుకుతున్నట్లుగా ఈ ప్రవేశ ద్వారాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రవేశ ద్వారానికి ముందు ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇంకో ద్వారం పేరు పినాకి ద్వార్‌.. ఈ ద్వారంపైన ధనుస్సును అమర్చారు. త్రిపురాసురులు అనే రాక్షుసులను శివుడు హతమార్చినందుకు గుర్తుగా ఈ ద్వారానికి ఆ పేరు పెట్టారు. ఈ ద్వారాల నుంచి లోపలికి అడుగుపెట్టగానే 108 రాజస్థాన్‌ రాతి స్తంభాలు స్వాగతం పలుకుతాయి. జలయంత్రాలు.. 50 పైగా శివపురాణాన్ని తెలిపే కుడ్యచిత్రాలు.. అబ్బురపరుస్తాయి. నంది, భైరవ, గణేశ, పార్వతి మాత సహా ఇతర దేవతల విగ్రహాలు భక్తి పారవశ్యాన్ని కలిగిస్తాయి. మహాకాల్ లోక్‌ లో కమల్ సరోవర్ ప్రత్యేక ఆకర్షణ. ఈ సరస్సులో చుట్టూ కృత్రిమ కమలాలను ఏర్పాటు చేయగా.. మధ్యలో ధ్యానముద్రలో పరమశివుడు కొలువు దీరాడు. చుట్టూ సింహాలను ఏర్పాటు చేశారు. పరమ శివుడి చుట్టూ సప్త రుషుల.. విగ్రహాలు ఏర్పాటు చేశారు. కశ్యప, అత్రి, వశిష్ఠ, విశ్వామిత్ర, గౌతమ, జమదగ్ని, భరద్వాజ రుషుల ప్రతిమలను కూడా ఈ మహాకాల్‌ లోక్‌ లో ఏర్పాటు చేశారు. మహాకవి కాళిదాసు 'అభిజ్ఞాన శాకుంతలం'లో పేర్కొన్న జాతుల మొక్కలను సైతం ఇక్కడి ఆవరణలో నాటారు. రుద్రాక్ష్, బేల్‌పత్ర, సప్తపర్ణి వంటి 40 నుంచి 45 రకాల మొక్కలు సందర్శకులను అలరిస్తాయి. రాత్రి వేళల్లో విద్యుద్దీపాల వెలుగులో మహాకాల్‌ దీప్‌ దేదీప్యమానంగా వెలిగిపోతుంది.

ములాయం కుటుంబానికి కేసి ఆర్, చంద్రబాబు పరామర్శ ..

భోపాల్, అక్టోబర్ 11; యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు ఘనంగా జరిగాయి. ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఇటావా జిల్లాలోని ములాయం స్వస్థలం సైఫైలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ములాయం కుమారుడు అఖిలేష్‌ యాదవ్‌.. తండ్రి చితికి నిప్పంటించారు. ములాయం అంత్యక్రియల్లో కేంద్రమంత్రి రాజ్​నాథ్ సింగ్​, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్​, సమాజ్​వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్​, బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ హాజరయ్యారు. అంతకుముందు తెలంగాణ సీఎం కేసీఆర్, ములాయం అంత్యక్రియల్లో కేంద్రమంత్రి రాజ్​నాథ్ సింగ్​, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్​, సమాజ్​వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్​, బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ హాజరయ్యారు. అంతకుముందు తెలంగాణ సీఎం కేసీఆర్, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ములాయం సింగ్ పార్థివదేహం వద్ద నివాళులర్పించారు. ములాయం కుమారుడు అఖిలేశ్ యాదవ్​ను పరామర్శించారు.



అదిగో నవ లోకం...‘మహాకాల్ లోక్‌ ‘

గండిపేట పార్క్ ప్రారంభం..

హైదరాబాద్, అక్టోబర్ 11; హైదరాబాద్ లో ఉస్మాన్‌సాగర్‌ గండిపేట వద్ద ఏర్పాటు చేసిన సుందర ఉద్యానవనాన్ని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఉస్మాన్‌సాగర్‌ వద్ద ల్యాండ్ స్కేప్ పార్కును ఐదున్నర ఎకరాల్లో రూ.35 కోట్ల వ్యయంతో తీర్చిదిద్దారు. ఎంట్రెన్స్ ప్లాజాతో పాటు వాక్ వేలు, ఆర్ట్ పెవిలియన్, ఫ్లవర్ టెర్రస్, పిక్నిక్ స్పాట్లు, 1200 సీట్ల సామర్థ్యం గల ఓపెన్ ఎయిర్ థియేటర్, ఇన్నర్ క్రాస్ రోడ్స్, కిడ్స్ ప్లే ఏరియా, ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేశారు. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, పుప్పాలగూడ, నానక్‌రామ్‌గూడ, మణికొండ, అత్తాపూర్, రాజేంద్రనగర్ నుంచి తక్కువ సమయంలో ఇక్కడికి చేరుకునే వీలుంది. హిమాయత్‌సాగర్‌ ప్రాజెక్టు కొత్వాల్‌గూడ వద్ద 85 ఎకరాల్లో రూపుదిద్దుకోనున్న ఎకో పార్కుకు కూడా మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు.



మూడవ వన్ డే లో భారత్ ఘనవిజయం: సిరీస్ కైవసం

న్యూఢిల్లీ, అక్టోబర్ 11; దక్షిణాఫ్రికాతో మూడు వన్ డే మ్యాచ్ ల సీరీస్ ను భారత్ 2-1 తో కైవసం చేసుకుంది. ఢిల్లీ లో ఈ రోజు జరిగిన మూడవ, చివరి వన్డేలో దక్షిణాఫ్రికాపై 7 వికెట్ల తేడాతో భారత్​ ఘన విజయం సాధించింది. మొదట టాస్​ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. 27.1 ఓవర్లలో 99 పరుగులకే సఫారీలను ఆల్​ ఔట్​ చేసింది. కుల్​దీప్ యాదవ్​ నాలుగు వికెట్లు పడగొట్టాడు. వాషింగ్టన్​ సుందర్​, మహ్మద్ సిరాజ్​, షహబాజ్​ అహ్మద్ రెండు చొప్పున వికెట్లు తీశారు. సఫారీ జట్టులో క్లాసెన్​, మలాన్, యాన్​సెన్ మినహా మిగతా బ్యాటర్లందరూ సింగిల్ డిజిట్​కే పరిమితమయ్యారు. తరువాత భారత్​ 19.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. శుభ్​మన్​ గిల్ 49 పరుగులతో రాణించాడు. ఓపెనర్ ధావన్ 14 బంతుల్లో 8 పరుగులు , ఇషన్​ కిషన్​ 18 బంతుల్లో 10 పరుగులు 

చేశారు. శ్రేయస్​ అయ్యర్​ 28 పరుగులు చేశాడు. సంజు శాంసన్ రెండు పరుగులు చేశాడు.

Monday, October 10, 2022

స్వర్గానికేగిన ‘సాధు‘ మొసలి ..

కాస‌ర‌గోడ్‌: మొస‌ళ్లు ఎక్కువ‌గా మాంసాహారాన్నే ఇష్ట‌ప‌డుతాయి. నీటి ఒడ్డున మాటువేసి అటుగా వ‌చ్చిన జంతువుల‌పై దాడి చేస్తాయి. కానీ కేరళ లో కాస‌ర‌గోడ్‌లోని అనంత‌పుర ఆలయ స‌ర‌స్సులో ఉండే మొస‌లి మాత్రం మాంసం ముట్ట‌దు. పూర్తిగా శాఖాహారి. స‌ర‌స్సులోగ‌ల అనంత ప‌ద్మ‌నాభ స్వామి ఆల‌యానికి వ‌చ్చే భ‌క్తులు పెట్టే బెల్లం, బియ్యం లాంటి ప్ర‌సాదాలు మాత్ర‌మే తింటుంది.1945 లో కాస‌ర‌గోడ్‌లోని అనంత‌పుర స‌ర‌స్సులో ఈ మొసలి క‌నిపించింది. ఆల‌యానికి వ‌చ్చే భ‌క్తులు ఎవ‌రికీ ఇంత‌వ‌ర‌కు ఎలాంటి కీడు చేయ‌లేదు. ఆల‌య నిర్వాహ‌కులు దానికి బ‌బియా అని నామ‌క‌ర‌ణం చేసి బాగోగులు చూసుకున్నారు. బ‌బియా ప్ర‌తిరోజు ఉద‌యం, సాయంత్రం ఆలయానికి వ‌చ్చే భ‌క్తులు పెట్టే ప్ర‌సాదం తినేది. స‌ర‌స్సులో ఆల‌యం చుట్టూ తిరిగేది. అప్పుడ‌ప్పుడు మెట్ల‌పైకి వ‌చ్చి సేద‌దీరేది. ఇలా భ‌క్తుల‌కు ఒక ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా మారిపోయింది. అలాంటి బ‌బియా పాపం ఆదివారం స‌ర‌స్సులోనే ప్రాణాలు కోల్పోయింది. అనారోగ్యం పాలైన బ‌బియాకు వైద్యులు చికిత్స చేసినా ఫ‌లితం ద‌క్క‌లేదు. ఆల‌య నిర్వాహ‌కులు బ‌బియాకు ఘ‌నంగా అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించదం విశేషం. . 




14416 టోల్ ఫ్రీ నెంబర్ తో ‘టెలి-మానస్‘

బెంగుళరు, అక్టోబర్ 10: ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా  కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ టెలీ మెంటల్ హెల్త్ అసిస్టెన్స్ అండ్ నెట్ వర్కింగ్ అక్రాస్ స్టేట్స్ (టెలి-మానస్) చొరవను బెంగుళూరు లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (నిమ్హాన్స్)లో ప్రారంభించింది. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో మానసిక ఆరోగ్య సంక్షోభం , మహమ్మారి వల్ల పెరిగిన సవాళ్లను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం 2022-23 కేంద్ర బడ్జెట్లో నేషనల్ టెలీ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ (ఎన్ టి ఎం హెచ్ పీ)) ని ప్రకటించింది.టెలి-మానస్ ద్వారా దేశవ్యాప్తంగా 24 గంటలూ ఉచిత టెలీ-మెంటల్ హెల్త్ సేవలను అందిస్తారు. ఈ సేవల కోసం దేశవ్యాప్తంగా టోల్ ఫ్రీ, 24/7 హెల్ప్ లైన్ నెంబరు (14416) ను ఏర్పాటు చేశారు. తద్వారా ఫోన్ చేసే వారు సేవలను పొందడానికి తమ భాషను ఎంచుకోవడానికి వీలు కల్పించారు. సంబంధిత రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలోని టెలి-మానస్ సెల్స్ కు కాల్స్ ను మళ్ళిస్థారు.  ఈ కార్యక్రమంలో 23 టెలీ-మెంటల్ హెల్త్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ నెట్వర్క్ ఉంది, నిమ్హాన్స్ నోడల్ సెంటర్ గా ఉంటుంది. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-బెంగళూరు (ఐఐఐటిబి) టెక్నాలజీ మద్దతును అందిస్తుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) బెంగళూరు , నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రిసోర్స్ సెంటర్ (ఎన్ హెచ్ ఆర్ ఎస్ సి) సాంకేతిక మద్దతును అందిస్తాయి.





హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో రూ.700 కోట్లతో జంతు వ్యాక్సిన్ తయారీ యూనిట్

హైదరాబాద్, అక్టోబర్ 10: హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో రూ.700 కోట్లతో జంతు వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ సంస్థ (ఐఐఎల్) ప్రకటించింది. ఆ సంస్థ ప్రతినిధులు సమావేశమయ్యారు. పాదాలు, నోటి ద్వారా పశవులకు సంక్రమించే వ్యాధులు, ఇతర వ్యాధులకు సంబంధించిన టీకాల ఉత్పత్తి కోసం కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ ప్రతినిధులు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​తో జరిపిన సమావేశంలో తెలిపారు. ఐఐఎల్ ఎండీ ఆనంద్ కుమార్, ఇతర ప్రతినిధులు తమ సంస్థ విస్తరణ ప్రణాళికలు వివరించారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే ఈ కేంద్రంతో 750 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. అత్యాధునిక సౌకర్యాలతో బయో సేఫ్టీ లెవల్ 3 ప్రమాణాలతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. గచ్చిబౌలిలో ప్రస్తుతం ఉన్న తయారీ కేంద్రం సంవత్సరానికి 300 మిలియన్ డోస్​ల సామర్థ్యాన్ని కలిగి ఉందని చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేయబోతున్న ఈ వ్యాక్సిన్ తయారీ కేంద్రంతో ఇప్పటికే సంస్థకు ఉన్న సామర్థ్యానికి అదనంగా సంవత్సరానికి మరో 300 మిలియన్ డోసుల వ్యాక్సిన్ ఉత్పత్తి అవుతుందని వివరించారు. 






ముగిసిన ములాయం శకం..

లక్నో, అక్టోబర్ 10: ఉత్తర్​ప్రదేశ్‌ లో ములాయంసింగ్‌ యాదవ్‌ శకం ముగిసింది. ఉత్తర్​ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్​వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయంసింగ్‌ యాదవ్‌(82)  గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ, గురుగ్రామ్​లోని ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు.ఆరోగ్య సమస్యల రీత్యా ఆగస్టు 22 నుంచి ములాయం ఆసుపత్రిలోనే ఉన్నారు. గతవారం ఆయన ఆరోగ్యం విషమించడంతో ఐసీయూకు తరలించారు. అప్పటి నుంచి వెంటిలేటర్ పై ఉన్న ఆయన.. సోమవారం ఉదయం కన్నుమూశారు. ములాయం మృతి పట్ల యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ రాష్ట్రంలో మూడు రోజుల పాటు సంతాపదినాలు ప్రకటించారు. ములాయం అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన సైఫయిలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు అధికారిక లాంఛనాలతో జరుగుతాయని సమాజ్​వాదీ పార్టీ వర్గాలు తెలిపాయి. ములాయం.. ఎటావా జిల్లాలోని సైఫాయి గ్రామంలో 1939 నవంబర్‌ 22న జన్మించారు. 1992లో సమాజ్‌వాదీ పార్టీని స్థాపించిన ములాయం.. ఉత్తరప్రదేశ్‌లో దానిని తిరుగులేని శక్తిగా మార్చారు. మూడుసార్లు ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రిగా, ఒకసారి రక్షణ మంత్రిగా పనిచేశారు. శాసనసభ్యడిగా 10 సార్లు, లోక్​సభ సభ్యుడిగా ఏడుసార్లు ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రిగా ఉత్తర్​ప్రదేశ్‌ను ములాయం అభివృద్ధి పథంలో నడిపించారు. యూపీలో అనేక సంస్కరణలను, పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారు.



బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాజ్య సమితి : షర్మిల

కామారెడ్డి, అక్టోబర్10; వై ఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్​ షర్మిల కామారెడ్డి జిల్లా లింగంపేట్, ఎల్లారెడ్డిలో మండల్లాలో పాదయాత్ర నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ, వైఎస్సార్ విగ్రహ ఏర్పాటును పోలీసులు అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల మనోభావాలకు తెలంగాణలో విలువ లేదని.. ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాజ్య సమితి అని విమర్శించారు. తెలంగాణలో వైఎస్సార్‌ రాజ్యం తేవడమే లక్ష్యమని వైఎస్​ షర్మిల పునరుద్ఘటించారు. 

ధోనీ... డ్రోనీ..

న్యూఢిల్లీ, అక్టోబర్10; భారత క్రికెట్ మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ రిటైర్మెంట్ అనంతరం వ్యవసాయం పై దృష్టి పెట్టారు. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వాడకాన్ని అభివృద్ధి చేస్తున్న గరుడ ఏరోస్పేస్‌ సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న ధోనీ -. ఈ సంస్థ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అధునాతన డ్రోన్‌ను ఆవిష్కరించారు. దీనికి 'డ్రోనీ' అని నామకరణం చేశారు. పంటపొలాల్లో ఎరువులు చల్లడమే కాకుండా ఇతర సాగు అవసరాలకు వీటిని వినియోగించనున్నారు.

శివసేన చీలిక వర్గాలకు కొత్తపేర్లు....

న్యూఢిల్లీ, అక్టోబర్10; శివసేన చీలిక వర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం.  కొత్తపేర్లు, గుర్తులు కేటాయించింది ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి 'కాగడా' గుర్తును కేటాయిస్తూ, 'శివసేన- ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే' పేరును ఠాక్రే వర్గానికి కేటాయించింది. కాగా, 'బాలాసాహెబంచి శివసేన' అన్న పేరును శిందే వర్గానికి కేటాయించిన ఈసీ. కొత్త ఎన్నికల గుర్తు ఎంచుకోవాలని ఆ వర్గానికి ఆదేశాలు జారీ చేసింది. ఇరువర్గాలు కోరినట్లు 'త్రిశూలం', 'గద' గుర్తులను కేటాయించేందుకు ఈసీ నిరాకరించింది. కాగా, శివసేన పేరు, గుర్తును స్తంభింపజేయడాన్ని ఛాలెంజ్​ చేస్తూ ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. 

అమెరికాకు చెందిన ముగ్గురికి ‘ఆర్థిక ‘ నోబెల్..

న్యూఢిల్లీ, అక్టోబర్10; అమెరికాకు చెందిన ముగ్గురు ఆర్థిక నిపుణులకు ఈ ఏడాది ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమిని ప్రకటించారు. బెన్ ఎస్ బెర్నాంకే, డగ్లస్ డబ్ల్యూ డైమండ్, ఫిలిప్ దిబ్విగ్​లకు  బ్యాంకులు, ఆర్థిక సంక్షోభాలపై చేసిన పరిశోధనలకు గాను అవార్డు ఇస్తున్నట్లు నోబెల్ కమిటీ తెలిపింది. ఆర్థికశాస్త్రంలో నోబెల్ ప్రకటనతో ఈ ఏడాది అన్ని రంగాల్లో నోబెల్ అవార్డుల విజేతలను ప్రకటించటం పూర్తయింది. పురస్కార గ్రహీతల విశ్లేషణలు.. తీవ్రమైన ఆర్థిక సంక్షోభాలు, బెయిలవుట్‌లను నివారించగల సామర్థ్యాన్ని మెరుగుపరిచాయని నోబెల్‌ ప్రైజ్ కమిటీ ఛైర్మన్‌ టోర్ ఎల్లింగ్‌సెన్ చెప్పారు.

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...