Wednesday, February 29, 2012

మంత్రి మోపిదేవికి డబ్బులిచ్చినట్లు ఎసిబి బలవంతంగా చెప్పించింది...

మాట మార్చిన మద్యం వ్యాపారి  రమణ
హైదరాబాద్ ఫిబ్రవరి 29:   మద్యం సిండికేట్ల వ్యవహారంలో మద్యం వ్యాపారి నున్నా రమణ ఫ్లేటు ఫిరాయించాడు. ఆబ్కారీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు పది లక్షల రూపాయలు లంచం ఇచ్చినట్లు ఇంతకు ముందు చెప్పిన అతను ఇప్పుడు పూర్తిగా మాట మార్చాడు. మోపిదేవి వెంకటరమణ పేరును ఎసిబి అధికారులు తనతో బలవంతంగా చెప్పించారని అతను ఆరోపించాడు. రెండోసారి కోర్టులో అతను బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ బెయిల్ పిటిషన్‌లో అతను సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనపై ఎసిబి థర్డ్ డిగ్రీ ప్రయోగించిందని  ఆరోపించాడు. తనకు మద్యం సిండికేట్లతో సంబంధం లేదని, తాను వ్యవసాయం చేసుకుంటున్నానని, తన పిల్లల చదువుల కోసం, తన భార్య ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల మాత్రమే తాను ఖమ్మంలో ఉంటున్నానని అతను చెప్పాడు. ఎసిబి అధికారులు పెట్టిన బాధలు తాను భరించలేకపోయానని, ఎసిబి అధికారులు తనను అనవసరంగా ఇరికించారని అతను చెప్పాడు. తనపై ఒత్తిడి తెచ్చి ఎసిబి అధికారులు  తన వాంగ్మూలాన్ని వారిష్టం వచ్చినట్లు రాసుకున్నారని ఆరోపించాడు. తనకు ఏ సంబంధం లేని విషయాలు అధికారులు చేర్చారని అతను చెప్పాడు. ఎసిబి అధికారులు తనతో తప్పుడు ప్రకటనలు చేయించారని అన్నాడు. ప్రస్తుతం దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌లో రమణ అధికారులకు, ఇతరులకు ముడుపులు ఇచ్చిన విషయం ఎక్కడా ప్రస్తావించలేదు. ఓ సీనియర్ న్యాయవాది రమణ తరఫున బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రమణ బెయిల్ పిటిషన్‌పై  ఎసిబి  కౌంటర్ దాఖలు చేసింది.

తెలంగాణా ప్రాంతీయ మండలా..అదేం లేదే...చిదంబరం

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 29:  తెలంగాణ ప్రాంతీయ మండలిని  ఏర్పాటు చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనే వార్తల్లో నిజం లేదని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం చెప్పారు. తెలంగాణకు ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయాలనే విషయంపై ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణ అంశంపై ఏ విధమైన పురోగతి లేదని ఆయన స్పష్టం చేశారు.తీవ్రవాదుల కుట్రను మూడు రాష్ట్రాల పోలీసులు, కేంద్ర సంస్థలు కలిసి భగ్నం చేశాయని ఆయన చెప్పారు. బుధవారం ఉదయం పట్టుబడిన ఇద్దరు ఉగ్రవాదులు ఢిల్లీలో దాడులకు కుట్ర చేశారని ఆయన చెప్పారు. దేశంలో పేలుళ్లకు లష్కరే తోయిబా సహకారంతో రద్దీ ప్రదేశాల్లో పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర చేసినట్లు ఆయన తెలిపారు. వివిఐపిలను వారు లక్ష్యం చేసుకోలేదని ఆయన చెప్పారు. ఉగ్రవాద కుట్రలను భగ్నం చేసిన మూడు రాష్ట్రాల పోలీసులను, కేంద్ర సంస్థలను ఆయన అభినందించారు.ఎన్‌సిటిసి వివాదంపై సిఎస్‌లు, డిజీలు, ఎటిఎస్ చీఫ్‌లతో సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

ఆసియా కప్ కు భారత జట్టు ఖరారు

ముంబై,ఫిబ్రవరి 29:  బంగ్లాదేశ్‌లోని మీర్పూర్‌లో మార్చి 11 తేది నుంచి ఆరంభమయ్యే ఆసియా కప్ కోసం 15 మంది సభ్యుల భారత్ జట్టును జాతీయ సెలెక్టర్లు  ప్రకటించారు. వీరేంద్ర సెహ్వాగ్, ఉమేష్ యాదవ్, జహీర్ ఖాన్‌లకు విశ్రాంతి కల్పించారు. ఆస్ట్రేలియా పర్యటనలో దారుణంగా విఫలమైన రోహిత్, రవీంద్ర జడేజాలను జట్టులోకి తీసుకున్నారు. చెప్పుకోదగ్గ మార్పులు లేకుండానే జట్టును ఎంపిక చేశారు. సచిన్ జట్టులోకి తీసుకోవడం, విరాట్ కోహ్లీకి వె స్ కెప్టెన్ బాధ్యతల్ని అప్పగించడం విశేషం. బెంగాల్ బౌలర్ అశోక్ దిండా, యూసఫ్ పఠాన్‌లను జట్టులోకి తీసుకున్నారు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్, శ్రీలంకలతోపాటు భారత జట్టు ముక్కోణపు టోర్నిలో ఆడనుంది.

ఉపఎన్నికలకు 126 నామినేషన్లు...

హైదారాబాద్,ఫిబ్రవరి 29:  రాష్ట్రంలో  ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరుగనున్న ఉప ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఏడు స్థానాలకు మొత్తం 126 నామినేషన్లు దాఖలయ్యాయని రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. మార్చి ఒకటవ తేదిన నామినేషన్ల పరిశీలన, మార్చి 3 తేదిన నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది అని భన్వర్‌లాల్ తెలిపారు. మొత్తం ఏడు ఉప ఎన్నికలు జరిగే స్థానాలకు 1660 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసామని.. వాటిలో 477 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, 427 అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామని భన్వర్‌లాల్ తెలిపారు.
టీఆర్‌ఎస్‌కు సీపీఐ మద్దతు
ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం కష్టమని సీపీఐ కార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు. తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్నామని నారాయణ తెలిపారు. రాజీనామా చేసిన టీఆర్‌ఎస్ అభ్యర్థులకే మద్దతిస్తామని ఆయన తెలిపారు. కోవూరులో సీపీఎంకు మద్దతిస్తామన్నారు.
ఎంపీ మేకపాటి రాజీనామా ఆమోదం
నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి రాజీనామాను లోకసభ స్పీకర్ మీరాకుమార్ ఆమోదించారు. సీబీఐ చార్జిషీట్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును చేర్చడాన్ని నిరసిస్తూ మేకపాటి లోకసభ సభ్యత్వానికి రాజీనామా సమర్పించిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం రాజీనామా నిర్ణయాన్ని మేకపాటి నుంచి ఫోన్ ద్వారా స్పీకర్ తెలుసుకున్నారు. తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని మేకపాటి స్పష్టం చేయడంతో స్పీకర్ రాజీనామాను ఆమోదించారు.
 ప్రయోగ పరీక్షకు సిద్ధమవుతున్న అగ్ని-5 అణు క్షిపణి నమూనా.... 

Tuesday, February 28, 2012

తెలుగుదేశం పార్టీకి మద్దతివ్వం: రాఘవులు

హైదరాబాద్, ఫిబ్రవరి 29: తెలుగుదేశం పార్టీకి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు షాక్ ఇచ్చారు. ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతివ్వలేమని ఆయన స్పష్టం చేశారు. మద్దతు ఇవ్వాలని కోరుతూ తెలుగుదేశం నాయకులు టి. దేవేందర్ గౌడ్, వర్ల రామయ్య రాఘవులును కోరారు. రాష్ట్రంలోని ఏడు స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో తాము పోటీ చేస్తామని, ఉద్యమాలు చేసిన చోటల్లా తాము పోటీలో ఉంటామని రాఘవులు తెలుగుదేశం నాయకులకు చెప్పారు. మిగతా చోట్ల ఎవరికి మద్దతివ్వాలనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, అయితే వామపక్షాలు పోటీ చేస్తే ఆ పార్టీలకు మద్దతిస్తామని ఆయన చెప్పారు.

ఆంధ్రకు మూడు పర్యాటక అవార్డులు

హైదరాబాద్, ఫిబ్రవరి 29: జాతీయ పర్యాటక అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌కు మూడు పురస్కారాలు దక్కాయి. ఉత్తమ హెరిటేజ్ సిటీగా హైదరాబాద్, ఉత్తమ పర్యాటక ప్రాజెక్టుగా శ్రీకాళహస్తి, ఉత్తమ విమానాశ్రయంగా శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అవార్డులను సాధించాయి.

ఆరోగ్య పరీక్షల నిమిత్తం అమెరికాకు సోనియా

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 29: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆరోగ్య పరీక్షల నిమిత్తం అమెరికా వెళ్లారు. ఆర్నెల్ల క్రితం శస్త్రచికిత్స చేయించుకున్న ఆమె సాధారణ ఆరోగ్య పరీక్షల కోసమే అమెరికా వెళ్లారని, నాలుగైదు రోజుల తర్వాత తిరిగివస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి, మీడియా విభాగం చైర్మన్ జనార్ధన్ ద్వివేది  వెల్లడించారు.   65 ఏళ్ల సోనియాకు గత ఆగస్టులో అమెరికాలో శస్త్రచికిత్స జరిగిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆమె దాదాపు ఆరు వారాలపాటు విశ్రాంతి తీసుకుని పూర్తిగా కోలుకున్న తర్వాత ప్రజల మధ్యకు వచ్చారు. కాగా, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు బహిరంగ సభల్లో ప్రసంగించిన సోనియా.. మొన్న ఆదివారం కూడా యూపీలోని సహరాన్‌పూర్‌లో ర్యాలీలో పాల్గొన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్న మార్చి 6 నాటికి సోనియా ఢిల్లీకి తిరిగివస్తారని ఏఐసీసీలోని ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయి. కాగా, శస్త్రచికిత్స నిమిత్తం గత ఏడాది అమెరికా వెళ్లిన సమయంలో సోనియా పార్టీ వ్యవహారాల పర్యవేక్షణకు తనయుడు రాహుల్‌గాంధీ సహా నలుగురు సభ్యులతో కమిటీ వేసిన విషయం విదితమే. అయితే ఇప్పుడు ఎలాంటి కమిటీని నియమించలేదు.ఇప్పటికిప్పుడు అత్యవసరంగా పరిష్కరించాల్సిన సమస్యలు లేనందున, ఆమె ఎలాగూ వారంలోపే తిరిగివస్తున్నందున కొత్తగా కమిటీ వేయాల్సిన అవసరం లేదని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి.  

హమ్మయ్య...ఎట్టకేలకు...ఓ గెలుపు...ఫైనల్ ఆశలు సజీవం

హోబర్ట్,ఫిబ్రవరి 28: : ముక్కోణపు టోర్నీలో భాగంగా మంగళవారం జరిగిన కీలక వన్డే మ్యాచ్‌లో ఇండియా 36.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. ఈ టూర్‌లో ఇండియా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఈరోజు లంకపై విజయం సాధించి, ఫైనల్‌కు ఆశలు సజీవంగా ఉంచుకోవడంతో భారత క్రీడాభిమానులలో  సంతోషం వెల్లివిరిసింది. భారత్ 36.4 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. విరాట్ కోహ్లీ 88 బంతులలో 133 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, గౌతమ్ గంభీర్ 63, సచిన్ : 39, సెహ్వాగ్ : 30 పరుగులు చేశారు. మలింగ వేసిన ఓవర్లో మొదటి బంతికి రెండు పరుగులతో సెంచరీని పూర్తిచేసిన విరాట్ కోహ్లీ.. ఆకాశమే హద్దుగా చెలరేగి అదే ఓవర్లో ఓ సిక్స్, నాలుగు ఫోర్లతో మొత్తం 24 పరుగులు చేసి భారత్‌కు బోనస్ పాయింట్ దక్కడంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా టీమిండియాకు శ్రీలంకపై అలవోక విజయాన్ని అందించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని సొంతం చేసుకున్నాడు. కాగా  తొలుత టీంఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో  బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసి 321 పరుగుల విజయలక్ష్యాన్ని ఇండియా ముందుంచింది. మ్యాచ్ ప్రారంభం నుంచి నిలకడగా ఆడిన శ్రీలంక భారీ స్కోర్ చేసింది. దిల్షాన్ (160-నాటౌట్),  ,సంగక్కర (105) పరుగుల వర్షం కురిపించి ఇండియా బౌలర్లను హడలెత్తించారు. 

ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కాగానే తెలంగాణ ప్రాంతీయ బోర్డు ?

హైదరాబాద్,ఫిబ్రవరి 28:  ఐదు రాష్ట్రాల శానససభ ఎన్నికలు పూర్తి కాగానే తెలంగాణ సమస్యపై కాంగ్రెసు అధిష్టానం దృష్టి సారించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.తెలంగాణ సమస్య పరిష్కారానికి ప్రాంతీయ బోర్డు ఏర్పాటే పరిష్కారంగా కాంగ్రెసు అధిష్టానం భావిస్తున్నట్టు  సమాచారం.   ప్రాంతీయ మండలి ఏర్పాటుతో పాటు రూ.15 - 20 వేల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీ కూడా ఉంటుందని అంటున్నారు.  ప్రత్యేక మండలి స్వరూప స్వభావాలపై ఇప్పటికే చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ హిల్ కౌన్సిల్ తరహా పరిష్కార మార్గాన్నే తెలంగాణకు వర్తింపజేయాలనే ఆలోచన సాగుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ, సీమాంధ్ర నాయకులతో పలు మార్లు చర్చలు జరిపిన కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ సోనియాకు ఓ నివేదికను సమర్పించినట్లు తెలుస్తోంది. రాజ్యాంగ, చట్టబద్ద హక్కులతో తెలంగాణకు ప్రత్యేక మండలి ప్రకటిస్తూ భారీ ఆర్థిక ప్యాకేజీ ఇవ్వడమే మంచిదని ఆయన అభిప్రాయపడినట్లు చెబుతున్నారు. కాగా, ప్యాకేజీలు, ప్రత్యేక మండళ్లు తెలంగాణ ప్రజలు ఒప్పుకోరని తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యుడు హరీష్ రావు అన్నారు. ఎలాంటి ప్యాకేజీలను తాము ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. తమకు తెలంగాణ రాష్ట్రం తప్ప ఏదీ వద్దన్నారు. మండలి అంటే తెలంగాణలో కాంగ్రెసు పార్టీ శాశ్వతంగా ప్రజలకు దూరమవుతుందని హెచ్చరించారు. 

Monday, February 27, 2012

సాగని సభ...

హైదరాబాద్,ఫిబ్రవరి 27: మద్యం మాఫియాపై సంపూర్ణ చర్చ జరగాలంటూ టీడీపీ పట్టుబడడంతో అసెంబ్లీ సోమవారం  ఎటువంటి కార్యక్రమం  చేపట్టకుండానే  మంగళవారానికి  వాయిదా పడింది.  ఉదయం అసెంబ్లీ ప్రారంభం కాగానే మద్యం సిండికేట్ల పై  చర్చ కొనసాగించాలంటూ  టీడీపీ సభా కార్యక్రమాలను   అడ్డుకుంది. దీంతో స్పీకర్ నాదెండ్ల మనోహర్ రెండుసార్లు సభను అరగంట పాటు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో టీడీపీ మళ్లీ అదే తీరును ప్రదర్శించింది. బడ్జెట్‌పై చర్చను ప్రారంభించేందుకు ద్రోణంరాజు శ్రీనివాస్‌ రెండుసార్లు ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోవడంతో డిప్యూటీ స్పీకర్‌ భట్టీ విక్రమార్క సభను మంగళవారానికి వాయిదా వేశారు. 

ఆస్కార్ ఉత్తమ చిత్రం ‘ది ఆర్టిస్ట్’

1929 తర్వాత ఆస్కార్ గెలిచిన మూకీ చిత్రం 
లాస్ ఎంజిలస్,ఫిబ్రవరి 27: 84వ ఆస్కార్ అవార్డుల్లో ఫ్రాన్స్ ప్రేమ కథా ‘మూకీ చిత్రం’ ది ఆర్టిస్ట్ ఉత్తమ చిత్రంగా నిలిచింది. గత 83 సంవత్సరాల ఆస్కార్ చరిత్రలో ఓ మూకీ చిత్రం ఆస్కార్ సొంతం చేసుకోవడం ఇదే తొలిసారి. చివరిసారిగా 1929 సంవత్సరంలో వింగ్స్ అనే చిత్రం ఆస్కార్అవార్డును సొంతం చేసుకుంది. జార్జ్ క్లూనీ, బ్రాడ్ పిట్‌లాంటి స్టార్ నటుల్ని వెనక్కి నెట్టి జీన్ డుజార్డిన్ ‘ది ఆర్టిస్ట్’ చిత్రానికిగాను ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నారు. ది ఐరన్ లేడి చిత్రంలో మార్గరేట్ థాచర్ పాత్రను పోషించిన మెరిల్ స్ట్రీప్ ఉత్తమ న టిగా నిలిచింది. ది ‘ఆర్టిస్ట్’ చిత్రానికి దర్శకత్వం వహించిన మైఖెల్ హజానావిసియస్ ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. అకాడమి చరిత్రలో 17 సార్లు నామినేట్ అయిన మెరిల్ స్ట్రీప్ తాజాగా మూడో అస్కార్‌ను సొంతం చేసుకుంది. 1979 సంవత్సరంలో ‘క్రామెర్ వర్సెస్ క్రామెర్’, 1982లో ‘సోఫీస్ చాయిస్’ చిత్రానికి మెరిల్ స్ట్రీప్ అస్కార్‌లను అందుకున్నారు. కాగా 'హ్యూగో ' చిత్రం . సినిమాటోగ్రఫీ, కళాదర్శకత్వం, సౌండ్‌ ఎడిటింగ్‌, సౌండ్‌ మిక్సింగ్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ విభాగాల్లో ఆస్కార్‌లను కైవసం చేసుకుంది. పాకిస్థాన్‌కు తొలి ఆస్కార్ అవార్డు లభించింది. మహిళలపై యాసిడ్ దాడులపై దర్శకురాలు షర్మీన్‌  ఒబేద్ చినాయ్ రూపొందించిన ‘సేవింగ్ ఫేస్’ డాక్యుమెంటరీకి ఆస్కార్ అవార్డు దక్కింది. దేశానికి తొలి అవార్డును అందించిన షర్మీన్‌కు పాకిస్థాన్ అత్యుత్తమ పౌర పురస్కారాన్ని అందించేందుకు సిద్ధమైంది. 

Saturday, February 25, 2012

తమ్ముళ్ళు టి.డి.పి. లోకి పోరు: చిరు

రాజమండ్రి, ఫిబ్రవరి 25: తన సోదరులు పవన్ కల్యాణ్,  నాగబాబు తెలుగుదేశం పార్టీకి దగ్గరవుతున్నారనే వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తిరుపతి శాసనసభ్యుడు, కాంగ్రెసు పార్టీ నేత చిరంజీవి  స్పష్టం చేశారు. వారు టిడిపిలోకి వెళ్ళే ప్రసక్తి లేదని చిరు రాజమండ్రిలో చెప్పారు. కాంగ్రెసు పార్టీలో ఎలాంటి గ్రూపు విభేదాలు లేవన్నారు. గ్రూపులు ఉన్నాయనేది కేవలం మీడియా సృష్టి మాత్రమేనన్నారు. కాంగ్రెసులో తాను స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయడం ద్వారా తనకు మంచి వేదిక దొరికిందన్నారు. విలీనానంతరం రాజకీయంగా తన బలం మరింత పెరిగిందని అన్నారు. ఉప ఎన్నికల్లో ప్రచారం చేసే అంశంపై తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు. పార్టీ ఆదేశాల మేరకే తాను పని చేస్తానని చెప్పారు. పార్టీలో తనకు ఎవరితోనూ విభేదాలు లేవన్నారు.

నెల్సన్ మండేలా ఆరోగ్యం విషమం

జోహనెస్‌బర్గ్, ఫిబ్రవరి 25: వర్ణ వివక్షపై అలుపెరుగని పోరాటం చేసిన ‘నల్ల సూరీడు’, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత నెల్సన్ మండేలా ఆరోగ్యం విషమించింది.  గత కొద్దికాలంగా  ఉదర సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మండేలాకు ప్రత్యేక చికిత్స అవసరమని వైద్యులు వెల్లడించారు. 93 ఏళ్ల నెల్సన్  దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షపై పోరాటం జరిపి   27 సంవత్సరాల సుదీర్ఘ కాలం జైలు జీవితాన్ని గడిపారు. 1990 సంవత్సరంలో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.   1993లో ఆయనకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. 1994 సంవత్సరంలో తొలి నల్ల జాతీయుడిగా  దక్షిణాఫ్రికా అధ్యక్ష పదవిని మండేలా చేపట్టారు.
 కాగా మండేలాకు శనివారం నాడు  హెర్నియా ఆపరేషన్ చేసినట్టు సమాచారం. ఆయన రెండు రోజులలో డిస్ చార్జి అవుతారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. మండేలా అరోగ్యం పై ఆందోళన వద్దని దేశాధ్యక్షుడు జాకొబ్ జుమా తెలిపారు.  

Friday, February 24, 2012

శాసనసభ లో మద్యం కంపు !

హైదరాబాద్ ఫిబ్రవరి 24:   రాష్ట్ర శాసనసభ శుక్రవారం మద్యం కంపు కొట్టింది. మద్యం సిండికేట్లపై రాత్రి 9.20 వరకు సుదీర్ఘంగా జరిగిన చర్చలో అధికార కాంగ్రెస్ , ప్రతిపక్ష  తెలుగుదేశం పార్టీల నేతలు  తాగుబోతుల కన్న హీనంగా ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలకు దిగారు. మద్యం ముడుపుల ఆరోపణలపై చర్చ జరుగుతున్న సమయంలో ఓ సందర్భంలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి సిగ్గు శరం లేదన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు దర్యాఫ్తును ప్రభావితం చేసేలా ఉన్నాయన్నారు. ఆరోపణలు వచ్చిన వారిని సిఎం వెనకేసుకొస్తున్నారన్నారు. తనను ముఖ్యమంత్రి నిందితుడు అంటున్నారని అయితే అరెస్టు చేసుకోండని సవాల్ విసిరారు. సిఎం కిరణ్ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కన్నా దిగజారారన్నారు. నేను సిఎంలా నా తమ్ముళ్లతో వసూళ్లు చేయించడం లేదన్నారు. మోపిదేవికి సిఎం క్లీన్ చిట్ ఎలా ఇస్తారన్నారు. కాంగ్రెసు నుండి నీతి సూత్రాలు నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. ఏ సిఎం ఇంత నీచంగా మాట్లాడలేదన్నారు. సిఎం దోషులను సమర్థిస్తున్నారన్నారు. తప్పు చేసిన వారు జైలుకు వెళ్లక తప్పదని తాము ఎవరినీ వదలే సమస్య లేదన్నారు. ఇంతగా దిగజారిన ముఖ్యమంత్రి లేరన్నారు. తన రాజకీయ జీవితంలో నీతి, నిజాయితీలతో పని చేశానన్నారు. అంతర్గత విభేదాలలో కూరుకుపోయి కిరణ్ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారన్నారు. బాబు వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అదే స్థాయిలో మండిపడ్డారు. సిగ్గు, శరం బాబు దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదని, ఆయన  చరిత్ర టిడిపి ఆఫీసులో చెప్పుకోవాలని   ఎద్దేవా చేశారు. ఆరోపణలు వచ్చినప్పుడు బాబు రాజీనామా చేశారా అని ప్రశ్నించారు.  చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తోందని మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. లిక్కర్ కేసులో నిందితుడు అయి ఉండి చంద్రబాబు సిగ్గు లేకుండా కోర్టు నుండి స్టే తెచ్చుకున్నారని ధ్వజమెత్తారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి మాట్లాడాల్సిన మాటల్లా ఉన్నాయా అన్నారు. బాబులా సభలో ఇప్పటి వరకు అసెంబ్లీలో మాట్లాడిన దాఖలాలు లేవని మరో మంత్రి దానం నాగేందర్ అన్నారు. సిగ్గు, లజ్జ లేనిది వారికేనని మండిపడ్డారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు వంటి ప్రతిపక్ష నేత దాపురించడం  ఖర్మ అన్నారు. బాబు మాటలు సభా గౌరవాన్ని కాపాడేలా లేవన్నారు. బాబుకు నైతికత లేదన్నారు. తాను గాలి ముద్దుకృష్ణమలా దిగజారి మాట్లాడలేనన్నారు. బాబు చేసేది నిరసనా ప్రసంగమా అని అడిగారు.  బాబు  విశాల హృదయాన్ని స్వర్గీయ నందమూరి తారక రామారావే తట్టుకోలేక పోయారన్నారు. కాగా సభలో కాంగ్రెసు, టిడిపిల వైఖరికి నిరసనగా బిజెపి, ఎంఐఎం వాకౌట్ చేశాయి. అధికార, ప్రతిపక్షాల తీరును అక్బరుద్దీన్ తప్పు పట్టారు. దీంతో సిఎం, అక్బరుద్దీన్ మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి ఇంత చర్చ జరిగినా... మంత్రి మోపిదేవి రాజినామా డిమాండ్ కు గాని, న్యాయ విచారణ డిమాండ్ కు గాని, ఎ.సి.బి. దర్యాప్తు నివేదికను సభ ముందుంచాలన్న డిమాండ్ కు గాని ప్రభుత్వం అంగీకరిచలేదు. పెద్ద ఎత్తున సభా సమయం, ప్రజాధనం వృధా అనంతరం సభ సోమవారానికి వాయిదా పడింది.   

శ్రీలంక సంచలన విజయం

హొబర్ట్,ఫిబ్రవరి 24:  ముక్కోణపు క్రికెట్ పోటీలో ఆస్ట్రేలియాపై మూడు వికెట్ల తేడాతో శ్రీలంక జట్టు సంచలన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా  నిర్ణీత 50 ఓవర్లలో  6 వికెట్లు నష్టపోయి 280 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 49.2 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 283 పరుగులు చేసింది. శ్రీలంక జట్టులో జయవర్ధనే 85 పరుగులు, చంఢీమాల్ 80 పరుగులు చేశారు. క్రిస్టియన్ మూడు వికెట్లు, హిల్ఫెన్ హాస్ రెండు, హారిస్, డోహెర్టీలు ఒక్కో వికెట్ తీసుకున్నారు. ఈ సిరీస్ లో  ప్రస్తుతం శ్రీలంక 15 పాయింట్లు, ఆస్ట్రేలియా 14, భారత్ 10 పాయింట్లతో ఉన్నాయి.

లండన్ మేయర్ పదవికి భారత సంతతి మహిళ పోటీ

లండన్,ఫిబ్రవరి 24:  లండన్ మేయర్ ఎన్నికల రేసులో భారత సంతతికి చెందిన స్వతంత్ర అభ్యర్థి సియోబాన్ బెనీటా (40) కన్సర్వేటివ్ , లేబర్ పార్టీ అభ్యర్ధులకు గట్టి పోటీ ఇస్తున్నారు. . ప్రచారంలో తనదైన శైలిలో ముందుకు వెళ్తున్న ఆమెకు గత ప్రభుత్వాల్లో పనిచేసిన పలువురు ప్రముఖుల నుంచి మద్దతు లభిస్తుండడం విశేషం . వచ్చే మే నెల 3న జరిగే ఎన్నికల్లో పాల్గొనే నిమిత్తం ఆమె ప్రజా సేవల విభాగంలో తన పదవికి కూడా ఇటీవలే  రాజీనామా చేశారు. భారత సంతతికి చెందిన తల్లి, కార్నిష్ తండ్రికి జన్మించిన బెనీటా.. 1996లో సివిల్ సర్వీసెస్‌లో చేరి  ప్రజాసేవలో భాగమయ్యారు. లండన్‌లోనే పుట్టి పెరిగిన బెనీటా.. ప్రస్తుతం తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి కింగ్‌స్టన్ ప్రాంతంలో నివసిస్తున్నారు. వార్విక్ విశ్వవిద్యాలయంలో ఇంగ్లిష్, జర్మన్‌లను అభ్యసించిన ఆమె ప్రజా సేవలోనూ ప్రశంసలు పొందారు.ఇప్పుడు  పదవికి రాజీనామా చేసి ‘మరింత మెరుగైన లండన్’ నినాదంతో ప్రస్తుత మేయర్ ఎన్నికల్లో  స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ప్రచారం నిమిత్తం  రూపొందించిన వెబ్‌సైట్‌లో తన తల్లి భారత్ నుంచి 1956లో ఓ యువతిగా ఉన్నప్పుడు లండన్‌కు వచ్చిన విషయాన్ని ప్రస్తావించి భారత సంతతికి చెందిన వారిని ఆకర్షిస్తున్నారు. స్వతంత్ర మేయర్ ద్వారానే లండన్ మరింత సమగ్రంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని ఆమె లండన్‌వాసులకు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు గతంలో పలువురు ప్రధాన మంత్రుల హయాంలో పనిచేసిన లార్డ్ ఒ డానెల్ మద్దతు ఇస్తుండడం విశేషం.

బెదిరిస్తున్న యడ్యూరప్ప...

బెంగళూరు,ఫిబ్రవరి 24:  కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్. యడ్యూరప్ప బీజేపీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు.  తన పుట్టినరోజైన ఈ నెల 27లోగా తనకు తిరిగి సీఎం పదవి ఇచ్చి తీరాలని డెడ్‌లైన్ విధించారు.  లేనట్లయితే తన దారి తాను చూసుకుంటానంటూ  హెచ్చరిక చేశారు.  శుక్ర, శనివారాల్లో బెంగళూరు శివార్లలోని ఓ రిసార్టులో జరుగనున్న పార్టీ మేధోమథన సదస్సుకు అధ్యక్షుడు నితిన్ గడ్కరీ వస్తున్న నేపథ్యంలో యడ్యూరప్ప బలప్రదర్శనకు దిగారు. గురువారం ఇక్కడి రేస్ కోర్సు రోడ్డులోని తన నివాసంలో ఆయన ఏర్పాటు చేసిన ‘విందు’ సమావేశానికి 80 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎమ్మెల్సీలు, 15 మంది ఎంపీలు హాజరయ్యారు. సదానందగౌడ సీఎం అభ్యర్థిత్వానికి గతంలో యడ్యూరప్ప మద్దతిచ్చినప్పుడు వ్యతిరేకించిన గ్రామీణాభివృద్ధి మంత్రి జగదీష్ షట్టర్, హోంమంత్రి ఆర్. అశోక కూడా ఈ సమావేశానికి హాజరుకావడం గమనార్హం. అలాగే బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కె.ఎస్. ఈశ్వరప్ప కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.  

Thursday, February 23, 2012

ఉత్కంఠ భరితం కోవూరు ' ముక్కోణం ' !

నెల్లూరు,ఫిబ్రవరి 23:  ఏడు అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికలలో నెల్లూరు జిల్లా కోవూరు స్థానం ఎన్నిక ఆసక్తి రేపుతోంది.  ఆరు తెలంగాణ స్థానాల్లో పోటీకి దూరం గా ఉన్న  వైయస్ జగన్‌ నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఒక్క కోవూరు నుంచి బరిలోకి దిగుతోంది. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఆయనపై తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ మంత్రి  సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ,  కాంగ్రెసు తరఫున పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పోటీ చేస్తున్నారు. చంద్రమోహన్ రెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి గట్టి పోటీ ఇస్తారని అంటున్నారు. కాంగ్రెసు తరఫున ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో పాటు పలువురు రాష్ట్ర స్థాయి నాయకులు కోవూరులో మోహరించనున్నారు.  నెల్లూరు జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బలంగానే ఉంది. పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డితో పాటు శాసనసభ్యుడు, ఆయన సోదరుడు మేకపాటి చంద్రశేఖర రెడ్డి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విజయం కోసం రంగంలోకి దిగనున్నారు. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తన గెలుపు పై  పూర్తి విశ్వాసంతో ఉన్నారు.
కాగా ఈనెల 25న ప్రసన్నకుమార్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. మరోవైపు ఆయన తరఫున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మార్చి 2 నుంచి  ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మార్చి 2న విడవలూరు, 3న కొడవలూరు, 4న ఇందుకూరుపేట మండలాల్లో ఆయన తొలి విడత ప్రచారం నిర్వహించనున్నారు.  

Wednesday, February 22, 2012

స్టేట్ యునైట్...పార్టీలే సెపరేట్...!

ఉప ఎన్నికల ' సిత్రం '  
హైదరాబాద్,ఫిబ్రవరి 22:  మార్చి 18వ తేదీన తెలంగాణలోని ఆరు స్థానాలకు, ఆంధ్రలోని ఓ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల నేపధ్యంలో  రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు  మారే సూచనలు కనిపిస్తున్నాయి.   అధికార కాంగ్రెసు పార్టీ మిత్రులెవరూ లేకుండా  ఉప ఎన్నికల బరిలోకి దిగుతోంది. మరోవైపు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కి సిపిఎంతో బెడిసింది.  సిపిఐ మాత్రం తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చే అవకాశాలున్నా సిపిఎం పోటీ చేసే స్థానాల్లో మాత్రం తెలుగుదేశం పార్టీకి సిపిఐ మద్దతు దొరికే చాన్స్ లేనట్టే.  ఇక తెలంగాణ ఉద్యమం సమయంలో చెట్టపట్టాలు వేసుకు తిరిగిన తెరాస, బిజెపి మధ్య కూడా  దూరం పెరిగింది. మొదట రెండు స్థానాలకు మాత్రమే పోటీ చేయాలని భావించిన బిజెపి ఇప్పుడు  అన్ని స్థానాలకు పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు కనబడుతోంది.  తొలుత మహబూబ్‌నగర్, కోస్తాంధ్రలోని కోవూరు స్థానాలకు మాత్రమే పోటీ చేయాలనుకున్న బిజెపి మొత్తం స్థానాలకు పోటీ  చేస్తే కొంత మేరకు తెలంగాణ సెంటిమెంటుకు సంబంధించిన ఓట్లు చీలడం ఖాయమని వేరే చెప్పక్కరలేదు.   ఏది ఏమైనా ప్రస్తుత పరిస్థితులు కెసిఆర్‌ కు సంకటం గానే ఉన్నాయి. తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలే గాక అనుకూలంగా ఉన్న పార్టీలు కూడా అయనకు కలసి వచ్చే వాతావరణం కంపించడం లేదు.  ఈ ఉప ఎన్నీలలో తెలంగాణ సెంటిమెంటు ను మరోసారి చాటి చెప్పాలనుకుంటున్న టి. ఆర్.ఎస్., అభివృద్ధి మంత్రం తో కాంగ్రెస్, కాంగ్రెసు, తెరాసలను ఎండగట్టే లక్ష్యం తో తెలుగుదేశం, ఒక్క కోవూరు స్థానం నుంచి పోటితో రాజకీయ ఉనికిని కాపాడుకోవాలని వైయస్సార్ కాంగ్రెసు  హోరాహోరీ తలపడుతున్న ఈ ఉప ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ  నెలకొంది.   


నల్లారి పాలనపై ' చంద్ర ' నిప్పులు

హైదరాబాద్,ఫిబ్రవరి 22:  ఇది పనికిమాలిన ప్రభుత్వం అని బుధవారం  శాసనసభలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై  సుదీర్ఘంగా చేసిన  ప్రసంగంలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధులలో తాకట్టు పెడుతున్నారని, అందువల్ల తాము గవర్నర్ ప్రసంగాన్ని సమర్ధించలేకపోతున్నామని చంద్రబాబు  అన్నారు.  అసమర్థ పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడాలన్నారు. ప్రభుత్వం విచ్చలవిడిగా ప్రవర్తిస్తోందని ఆరోపించారు. అవినీతి మంత్రులు ఎందుకు రాజీనామా చేయరని ఆయన ప్రశ్నించారు. మద్యం సిండికేట్ లో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చినా మంత్రి రాజీనామా చేయలేదన్నారు. ముఖ్యమంత్రి కూడా ఆయనపై చర్యలు ఎందుకు తీసుకోలేదని నిలదీశారు.
ఈ ప్రభుత్వం అవినీతిని నియంత్రించలేకపోతోందన్నారు. 4700 కోట్ల రూపాయల విలువైన పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ ని అర్హతలేని కంపెనీకి ఇచ్చి, ఆ తరువాత రద్దు చేశారన్నారు. మంత్రుల మాటలు విన్న అధికారులు జైళ్లలో ఉన్నారన్నారు. ప్రభుత్వ అవినీతి వల్ల ఒక్క పరిశ్రమ కూడా ఇక్కడకు రావడంలేదని , రాజీవ్ గృహ కల్పపేరుతో డబ్బు వసూలు చేసి ఇళ్లు కట్టించలేదని విమర్శించారు. శాంతి భద్రతలు పరిస్థితి అధ్వాన్నంగా తయారయిందన్నారు. ప్రాణహిత-చేవెల్ల ప్రాజెక్టుకు జాతీయహొదా కల్పించలేకపోవడం ప్రభుత్వం చేతగానితనంగా పేర్కొన్నారు. రైల్వే బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగిపోయిందన్నారు. రాష్ట్రంపై కేంద్రం ఎందుకు వివక్ష చూపుతోందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ పథకాలన్నీ ప్రజా సంక్షేమానికి తూట్లు పొడుస్తున్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రైతులకు ఎరువులు కూడా ఇవ్వలేని హీనస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు.రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, ప్రజలు పన్నుపోటుతో చితికి పోతున్నారని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గల్లంతు కావటం ఖాయమన్నారు.  తెలంగాణపై తమ వైఖరిని ఇది వరకే చెప్పామని ఆయన అన్నారు. తెలంగాణపై నిర్ణయం తీసుకునే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, తెలంగాణపై నిర్ణయం తీసుకుని రాష్ట్రంలోని అనిశ్చితికి తెర దించాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని ఆయన అన్నారు. తమను అడ్డం పెట్టుకుని కాంగ్రెసు రాజకీయాలు చేస్తోందని, తమ పార్టీని దెబ్బ తీయాలని ప్రయత్నిస్తోందని, తమ పార్టీని ఎవరూ దెబ్బ తీయలేరని ఆయన అన్నారు. ఉద్యమాల సందర్భంగా విద్యార్థులపై పెట్టిన కేసులను మాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఉప ఎన్నికలకు మొదలైన నామినేషన్లు...

హైదరాబాద్, ఫిబ్రవరి 22: రాష్ట్రంలో ఉప ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల కమిషన్ బుధవారం ఉప ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడం తో  నామినేషన్ల ప్రక్రియ మొదలయింది.  ఈనెల 29వ తేదీ వరకూ నామినేషన్లు దాఖలు చేయవచ్చు. మార్చి 1వ తేదీన నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసం హరణ గడువు మార్చి మూడవ తేదీతో ముగుస్తుంది. రాష్ట్రంలోని మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, కొల్లాపూర్, స్టేషన్ ఘనాపూర్, ఆదిలాబాద్, కామారెడ్డి, కోవూరు నియోజకవర్గాలకు మార్చి 18న పోలింగ్ జరుగుతుంది.  21వ తేదీన ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.  

Tuesday, February 21, 2012

సమాచార కమిషనర్ల ఎంపిక పై వివాదం

ఫైల్ తిప్పి పంపిన గవర్నర్... 
హైదరాబాద్ , ఫిబ్రవరి 21:    సమాచార హక్కు కమిషనర్ల నియామక ఫైల్ ని గవర్నర్ నరసింహన్ ప్రభుత్వానికి తిప్పిపంపారు. ఎనిమిది  మంది కమిషనర్ల నియామకంపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అనుభవంలేనివారిని నియమించారని ఆరోపణలు వచ్చాయి. ఎంపిక ప్రక్రియ రాజకీయవేదికగా మారిందని ఫిర్యాదులు వచ్చాయి. ఈ పరిస్థితులలో సమాచార కమిషనర్ల ఎంపికని మరోసారి పరిశీలించాలని గవర్నర్ ప్రభుత్వాన్ని కోరినట్టు సమాచారం. రాజకీయ చరిత్ర కలిగిన నలుగురి పేర్లను గవర్నర్ తిరస్కరించినట్టు  తెలుస్తోంది.  

మోపిదేవి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు...

హైదరాబాద్ , ఫిబ్రవరి 21:   మద్యం సిండికేట్ల వ్యవహారంలో మంత్రి మోపిదేవి వెంకటరమణ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఎసిబి అదుపులో ఉన్న ఎన్.  రమణ --కీలక సమాచారం అందించినట్టు తెలుస్తోంది.  మంత్రి తన ఇంట్లోనే రెండు గ్రూపుల తగాదాలు పరిష్కరించారని,  ఆ రెండు గ్రూపుల మధ్య రాజీ కుదిర్చి మంత్రి మోపిదేవి పది లక్షల రూపాయలు తీసుకున్నారని రమణ తెలిపినట్టు సమాచారం. రమణ నేరాంగీకార పత్రంలో పేర్కొన్న విషయాలపై ఎసిబి అధికారులు దృష్టిసారించారు. మరో 14 మంది మద్యం వ్యాపారులను కూడా అధికారులు ప్రశ్నించారు.
మోపిదేవి ఆవేదన
తనకు సంబంధంలేని విషయాలలో తనని ఇరికిస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం సిండికేట్ల వ్యవహారంలో తన ప్రస్తావన పదేపదే రావడం బాధిస్తోందన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రిని నిలదీసినట్లు ఆయన చెప్పారు. సిండికేట్లపై శాసనసభలో మాట్లాడేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఎసిబి ఒక వైపే పని చేస్తుందన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. సిండికేట్ల వ్యవహారంలో తన ప్రమేయం ఉందని తేలితే మరుక్షణం  రాజీనామా చేస్తానని మంత్రి చెప్పారు. రాజీనామా లేఖ తన జేబులోనే ఉన్నట్లు ఆయన తెలిపారు. 

ఉప ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాపై కిరణ్ మార్క్...!

హైదరాబాద్ , ఫిబ్రవరి 21:   ఉప ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. స్టేషన్ ఘన్ పూర్ - ప్రతాప్, ఆదిలాబాద్ - రామచంద్రారెడ్డి, కొల్లాపూర్ - విష్టువర్ధన రెడ్డి, కామారెడ్డి - రాజారెడ్డి, మహబూబ్ నగర్ - ముత్యాల ప్రకాశ్, కోవూరు - పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి, నాగర్ కర్నూలు - దామోదర రెడ్డి పోటీ చేస్తారు.  ఎఐసిసి అధికారికంగా అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ముఖ్యమంత్రి కోరిక మేరకే అభ్యర్థుల పేర్లు ప్రకటించినట్లు తెలుస్తోంది. కాగా, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అభ్యర్థుల విషయం చర్చించడానికి ఢిల్లీ చేరుకోనుండగా,  అధిష్టానవర్గం అధికారికంగా అభ్యర్థుల పేర్లను ప్రకటింఅం గమనార్హం.  మరోవైపు మహబూబ్ నగర్ శాసనసభా స్థానం నుంచి తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని రాజేశ్వర రెడ్డి భార్య విజయలక్ష్మి ప్రకటించారు. 2009 ఎన్నికలలో రాజేశ్వర రెడ్డి ఇక్కడ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. ఆ తరువాత ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. గుండెపోటు కారణంగా ఆయన ఆకస్మికంగా మృతి చెందడంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఆయన భార్య విజయలక్ష్మికే ఉప ఎన్నికలలో టిక్కెట్ ఇస్తారని భావించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు విజయలక్ష్మి ప్రకటించారు. 

 

లంక చేతిలో టీమిండియా ఓటమి...

బ్రిస్బేన్: ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా మంగళవారమిక్కడ శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 51 పరుగుల తేడాతో పరాజయం పాలయింది. లంక నిర్దేశించిన 290 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 45.1 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌటయింది. టీమిండియా అన్ని రంగాల్లో విఫలపై ఓటమి చవిచూసింది. కొహ్లి(66), రైనా(32), పఠాన్(47) పర్వాలేదనిపించారు. లంక బౌలర్లలో ఫెరీరా 4, కులశేఖర 3, మలింగ 2 వికెట్లు పడగొట్టారు. మహరూఫ్ ఒక వికెట్ తీశాడు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 289 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అశ్విన్, పఠాన్ రెండేసి వికెట్లు తీశారు. రైనా, యాదవ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

Monday, February 20, 2012

శివరాత్రి శోభ...

 మహాశివరాత్రి  సందర్భంగా విద్యుద్దీపాల వెలుగులో నేపాల్ రాజధాని ఖట్మండూ లోని  లోని పశుపతి నాథ్ ఆలయం

శివనామ స్మరణతో మార్మోగుతున్న శైవ క్షేత్రాలు

హైదరాబాద్,ఫిబ్రవరి 20:  మహాశివరాత్రి  సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి. మహాశివుడిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజామునుంచే శివాలయాలకు క్యూ కట్టారు.  ఈసారి శివరాత్రి సోమవారం రావడంతో మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. శ్రీశైలం, శ్రీకాళహస్తి, వేములవాడ, కాళేశ్వరం, ద్రాక్షారామం, కోటప్పకొండ తదితర క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివరాత్రి ని పురస్కరించుకుని అన్ని క్షేత్రాల్లోనూ ఆది దంపతులైన పార్వతీపరమేశ్వరుల కల్యాణోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీశైలంలో కొలువుదీరిన శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్లకు దేవాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్య రాష్ట్ర ప్రభుత్వం తరఫున  పట్టువస్త్రాలు సమర్పించారు. కరీంనగర్ జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి, కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. పంచారామాల్లో ఒకటైన ద్రాక్షారామంలో కొలువుదీరిన భీమేశ్వరుని దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.  కోటప్పకొండలో మహాశివరాత్రి తిరునాళ్లను ప్రభుత్వం రాష్ర్ట పండుగగా గుర్తించిన నేపథ్యంలో ఈసారి ఘనంగా ఏర్పాట్లు చేశారు. త్రికోటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణాన్ని విద్యుద్దీపాలతో వైభవంగా అలంకరించారు. కాగా, మహాశివరాత్రి సందర్భంగా విజయవాడ వద్ద కృష్ణానదిలో పుణ్యస్నానం చేసేందుకు భక్తులు పోటెత్తారు.  రంగారెడ్డి జిల్లా కీసరలోనూ భక్తులు పోటెత్తారు.

కింగ్‌ఫిషర్‌ లో ముదురుతున్న సంక్షోభం.. .

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20:  కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్ లో సంక్షోభం ముదురుతోంది. నెలల తరబడి జీతాలు చెల్లించలేకపోవడంతో ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. ఫలితంగా మూడు రోజులుగా   కింగ్‌ఫిషర్‌ భారీగా విమాన సర్వీసులు రద్దు చేస్తోంది. ఏ విమానాన్ని ఎప్పుడు రద్దు చేస్తారో చివరి నిమిషం దాకా తెలియకపోవడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు .దేశవ్యాప్తంగా కింగ్ ఫిషర్ కు చెందిన 40 విమానాలను రద్దు చేశారు. ఇందులో ముంబాయి నుంచి హైదరాబాద్‌ రావాల్సిన 3 విమానాలు కూడా ఉన్నాయి. విమాన సర్వీసులు రద్దు చేయడంపై వివరణ ఇవ్వాలని విమాన నియంత్రణ సంస్థ డీజీసీఏ కింగ్‌ఫిషర్‌ సీఈఓ సంజయ్‌ అగర్వాల్‌ సహా ఇతర ఉన్నతాధికారులను ఆదేశించింది. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది.మరోవైపు కింగ్‌ఫిషర్‌ను బెయిలవుట్‌ చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని విమానయాన శాఖ మంత్రి అజిత్‌ సింగ్‌ విలేకరులతో చెప్పారు. ప్రయాణికుల భద్రతకు సంబంధించిన విషయాలను డీజీసీఏ చూసుకుంటుందని ఆయన తెలిపారు.

Sunday, February 19, 2012

ఉపఎన్నికలకు టీఆర్ఎస్ అభ్యర్థులు రెడీ

హైదరాబాద్ , ఫిబ్రవరి 19:   ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను టీఆర్ఎస్  ప్రకటించింది. జూపల్లి కృష్ణారావు(కొల్హాపూర్) జోగు రామన్న(ఆదిలాబాద్), టి.రాజయ్య (స్టేషన్ ఘన్ పూర్), సయిద్ ఇబ్రహీం (మహబూబ్ నగర్), గంప గోవర్థన్ (కామారెడ్డి) పేర్లను ఖరారు చేసింది. వీరిలో ఇబ్రహీం మినహా మిగతావారందరూ తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవులకు  రాజీనామా చేసినవారు కావడం గమనార్హం. కాగా నాగర్ కర్నూలులో నాగం జనార్దనరెడ్డిపై పోటీ పెట్టరాదని టీఆర్ఎస్ నిర్ణయించింది.
కోవూరు నుంచి  వైఎస్ఆర్ కాంగ్రెస్  అభ్యర్థిగా నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి
ఉప ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది. కోవూరు నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థిగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఈ నెల 25వ తేదీ  నామినేషన్ దాఖలు చేస్తారు. ఆ పార్టీ అధ్యక్షుడు, వైఎస్ జగన్మోహన రెడ్డి ఈ నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొంటారు. 

భారత్ పై ఆస్ట్రేలియా ఘనవిజయం

బ్రిస్బేన్, ఫిబ్రవరి 19:  ఇక్కడ జరిగిన  ముక్కోణపు సిరీస్ మ్యాచ్ లో భారత్ పై ఆస్ట్రేలియా 110 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లకు 5 వికెట్లు నష్టపోయి 288 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ జట్టు 43.3 ఓవర్లకు 178 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. అయిదు వికెట్లు తీసుకున్న హిల్ఫెనాస్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది. 

ఉప ఎన్నికల్లో లెఫ్ట్ రూటు సెపరేటు...!

హైదరాబాద్ ,ఫిబ్రవరి 19:  రాష్ట్రంలోని ఏడు స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు   చెప్పారు. దీనితో సమైక్యవాదం వినిపిస్తున్న సిపిఎం ఓట్లు తమకు తెలంగాణలో కలిసి వస్తాయనే తెలుగుదేశం పార్టీ ఆశలు వమ్మయ్యే పరిస్థితే ఉంది. వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్,  నెల్లూరు జిల్లా కోవూరు లో  పోటీ చేసే ఆలోచనలో సిపిఎం ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా వామపక్షాల మద్దతు తీసుకుని ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని సిపిఎం భావిస్తోంది. తెలుగుదేశం పార్టీతో అవగాహనకు రావడం కన్నా క్యాడర్‌ను నిలుపుకోవడానికి పోటీ చేయడమే మేలన్న భావనతో సిపిఎం నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా స్థానాల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే విషయంపై ఆలోచిస్తామని రాఘవులు చెప్పారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు లేదని రాఘవులు స్పష్టం చేశారు. కాగా, ఉప ఎన్నికల్లో తాము ఎప్పుడూ పోటీ చేయలేదని, ఉప ఎన్నికలపై ఈ నెల 21వ తేదీ తర్వాత నిర్ణయం తీసుకుంటామని సిపిఐ కార్యదర్శి కె. నారాయణ చెప్పారు. తెలుగుదేశం పార్టీకి మద్దతివ్వాలా, సిపిఎంకు ఇవ్వాలా అనే విషయంపై కరీంనగర్‌లో జరిగే మహాసభలో నిర్ణయిస్తామని ఆయన చెప్పారు.

Saturday, February 18, 2012

భారత జెండాకు అవమానం

ఉక్రెయిన్  యువతులపై క్రిమినల్ కేసు
మాస్కో,ఫిబ్రవరి 19:  వీసా నిబంధనలు కఠినతరం చేసినందుకు నిరసనగా ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో జరిగిన ‘అర్ధ నగ్న’ నిరసనలో భారత జెండాను చింపి,  అవమానించిన యువతులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు ఉక్రెయిన్ పోలీసులు తెలిపారు.  వారు దోషులుగా తేలితే నాలుగేళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది. పర్యాటక వీసాపై దేశానికి వచ్చే ఉక్రెయిన్ మహిళల వివరాలను క్షుణ్నంగా తనిఖీ చేయాలని భారత విదేశాంగ శాఖ జారీ చేసిన ఆదేశాలకు నిరసనగా వారీ ఆందోళనకు దిగారు. ఇటీవలి కాలంలో మధ్య ఆసియా దేశాల మహిళలు సెక్స్ రాకెట్లలో ఎక్కువగా ఉంటున్నందున.. దాన్ని నియంత్రించేందుకు ఈ ఆదేశాలు జారీ అయ్యాయన్న భారత్ మీడియా కథనాలు వారిని మరింత ఆగ్రహానికి గురి చేశాయి. ఈ నేపథ్యంలో గత నెలలో కీవ్‌లోని భారత రాయబారి నివాసం వద్ద ‘ఫెమెన్’ గ్రూపు కార్యకర్తలు నిరసనకు దిగారు. వీరిలో కొందరు రాయబారి నివాసం బాల్కనీ ఎక్కి.. బట్టలిప్పేసి.. ‘నేను ఉక్రెయిన్ వ్యభిచారిణి కాదు’ అంటూ నినాదాలు చేశారు. 

Thursday, February 16, 2012

మ్రోగిన ' ఉప ' రణభేరి....

హైదరాబాద్, ఫిబ్రవరి 16 :  ఉప ఎన్నికల నగారా మోగింది. తెలంగాణలో ఆరు నియోజకవర్గాలతో పాటు నెల్లూరు జిల్లా కోవూరు స్థానంలోనూ ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్  జారీ చేసింది. వీటితో పాటు దేశవ్యాప్తంగా మరో 4 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంటు స్థానానికి కూడా మార్చి 18వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది. ఫలితాలు మార్చి 21న వెల్లడవుతాయి.  తెలంగాణలోని ఆరు నియోజకవర్గాలతో పాటు పార్టీ ఫిరాయింపు చట్టం ఫలితంగా ఖాళీ అయిన నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గానికి  ఇప్పుడు ఉప ఎన్నికలు జరగనున్నాయి. మహబూబ్‌నగర్,నాగర్‌కర్నూలు, కొల్లాపూర్, స్టేషన్‌ఘన్‌పూర్, కామారెడ్డి, ఆదిలాబాద్, కోవూరు అసెంబ్లీ స్థానాలకు మార్చి 18వ తేదీన ఉప ఎన్నికలు జరుగుతాయి. ఇందులో  మహబూబ్‌నగర్ :  స్వతంత్ర సభ్యుడిగా గెలిచి కాంగ్రెస్ అనుబంధ సభ్యుడిగా కొనసాగిన రాజేశ్వర్‌రెడ్డి మరణంతో ఈ స్థానం ఖాళీ అయ్యింది. నాగర్‌కర్నూలు: నాగం జనార్దన్‌రెడ్డి టీడీపీ నుంచి సస్పెండయ్యి, తర్వాత రాజీనామా చేశారు. కొల్లాపూర్: జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి మంత్రి పదవి చేపట్టి, దానికి రాజీనామా చేసి తర్వాత ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. టీఆర్ఎస్‌లో చేరారు. స్టేషన్‌ఘన్‌పూర్: టి. రాజయ్య కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుని రాజీనామా చేశారు. కామారెడ్డి: గంప గోవర్ధన్ టీడీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్‌లో చేరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆదిలాబాద్: జోగు రామన్న టీడీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్‌లో చేరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కోవూరు: నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి టీడీపీ తరఫున గెలిచి జగన్ పార్టీకి అనుబంధంగా వ్యవహరిస్తూ పార్టీ నుంచి సస్పెండయ్యారు. పార్టీ ఫిరాయింపు చట్టం కింద అనర్హుడు కావడంతో ఇక్కడ ఉప ఎన్నిక అవసరమైంది. 



బాబుకు రిలీఫ్... వైఎస్ విజయ పిటిషన్‌ కొట్టివేత

హైదరాబాద్, ఫిబ్రవరి 16 : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఊరట లభించింది. చంద్రబాబుతోపాటు ఆయన కుటుంబ సభ్యులు, సుజనా చౌదరి, నామా నాగేశ్వరరావు, 'ఈనాడు' రామోజీరావు తదితరులపై దర్యాప్తు జరపాలంటూ జగన్ తల్లి వైఎస్ విజయ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వైఎస్ విజయ పిటిషన్‌ను ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించలేమని స్పష్టం చేసింది. ఇందులో రాజకీయ కక్ష సాధింపు ధోరణే కనిపిస్తోందని జస్టిస్ జి.రోహిణి, జస్టిస్ అశుతోష్ మొహంతాలతో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది. మొత్తం 55 పేజీల తీర్పులో . 'వైఎస్ విజయ వ్యాజ్యంలో ప్రజా ప్రయోజనం లేదని పేర్కొంది.  చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ, దీనిపై సీబీఐ దర్యాప్తు జరపాలని గత ఏడాది అక్టోబర్ 17న వైఎస్ విజయ హైకోర్టులో 'పిల్' వేశారు. ఇందులో చంద్రబాబుతోపాటు నారా భువనేశ్వరి. నారా లోకేశ్, 'ఈనాడు' రామోజీరావు, ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్, హెరిటేజ్ ఫుడ్స్, అహోబలరావు, వి. నాగార్జున నాయుడు, ఎలమంచిలి సత్యనారాయణ చౌదరి, మధుకాన్ షుగర్స్, మాగంటి రాజాబాబు (మురళీ మోహన్), కర్నాటి వెంకటేశ్వరరావు, సీఎం రమేశ్‌లపైనా ఆరోపణలు చేశారు. పిటిషన్‌తోపాటు 2400కు పైగా అనుబంధపత్రాలను సమర్పించారు.
విలువలతో బతుకుతున్నా : బాబు
హైకోర్ట్ తీర్పు పై చంద్రబాబు స్పందిస్తూ, ' 'నా జీవితం తెరిచిన పుస్తకం. 33 ఏళ్ళుగా నేను నా క్యారెక్టర్‌ను, విలువలను కాపాడుకుంటూ వస్తున్నాను. వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా ఇప్పటివరకు నాపై 35 కేసులు వేశారు. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక 25 రకాల విచారణలు జరిపించారు. అయినా ఒక్క మచ్చ పడకుండా బయటకు రాగలిగాను. నేను తప్పు చేయలేదు' అని  వ్యాఖ్యానించారు. 
సుప్రీంకోర్టులో సవాలు చేస్తాం
‘సంతకం, తేదీ లేకుండా ఎమ్మెల్యే పి.శంకర్రావు గుడ్డిగా రాసిన రెండు పేజీల లేఖను పిల్‌గా స్వీకరించిన రాష్ట్ర హైకోర్టు, వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ  అన్ని ఆధారాలతో టీడీపీ అధినేత చంద్రబాబుపై వేసిన  రెండువేల ఐదువందల పేజీల  పిటిషన్‌ను తిరస్కరించడం ప్రజల్లో అనేక అనుమానాలకు తావిస్తోందని,   ఒకే రకమైన రెండు కేసుల్లో భిన్నమైన తీర్పులు రావడం ఆశ్చర్యకరంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని పద్మ చెప్పారు.





 

Wednesday, February 15, 2012

అమెరికా రోడ్డు ప్రమాదంలో ఆదిలాబాద్ విద్యార్ధి మృతి

హైదరాబాద్,పిబ్రవరి 15:   అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్ రైల్వేకాలనీకి చెందిన పులి రాజేశ్ (25) మృతిచెందాడు. టెక్సాస్ రాష్ట్రంలోని డొనాలస్‌లో ఏ అండ్ ఎం విశ్వవిద్యాలయంలో రాజేశ్ ఎం.ఎస్. సెకండియర్ చేస్తున్నాడు.  మంగళవారం మధ్యాహ్నం జోరుగా కురుస్తున్న వర్షంలో రాజేశ్ స్వయంగా నడుపుతున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ రాజేశ్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. స్నేహితులు హుటాహుటిన ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. అప్పటికే పరిస్థితి విషమించడంలో మంగళవారం అర్ధరాత్రి రాజేశ్ మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. పులి వెంకటేష్-కస్తూరి దంపతులకు రాజేశ్ ఒక్కడే కుమారుడు.  మరో కుమార్తె ఉంది.

మరోసారి కేసీఆర్ 'తెలంగాణా' యాగం

హైదరాబాద్,పిబ్రవరి 15:  టీఆర్ఎస్ అద్యక్షుడు కేసీఆర్ మరోసారి చండీయాగం చేపట్టారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంతోపాటు తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండేందుకు ఆయన ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో గురువారం ఉదయం వేదపండితులు యాగానికి అంకురార్పణ చేశారు. కేసీఆర్ దంపతులు, కుమార్తె కవిత, ఇతర కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ సాధన కోసం 2009లోనూ కేసీఆర్ ఇలాంటి యాగం నిర్వహించారు. శుక్రవారం కేసీఆర్ జన్మదినం నేపథ్యంలో ఈ యాగాన్ని శుక్రవారం సాయంత్రం ముగించనున్నారు. 

Tuesday, February 14, 2012

మా వైపే ప్రజల చూపు: బాబు

హైదరాబాద్, ఫిబ్రవరి 14 : 'కాంగ్రెస్‌లో కుమ్ములాటలు, అవినీతి కుంభకోణాలతో  విసిగిపోయిన ప్రజలు తమ పార్టీ వైపే చూస్తున్నారని , వచ్చే ఎన్నికలు తమకు ఏకపక్షంగా ఉంటాయని  తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మద్యం ముడుపుల కుంభకోణంపై కాంగ్రెస్ పార్టీ డొల్లతనం అసెంబ్లీలో బయటపడిందని, అటు చర్యలూ తీసుకోలేక...ఇటు అసెంబ్లీలో చర్చకూ ముందుకు రాలేక మొహం దాచుకొంటోందని ఆయన విమర్శించారు. 

Sunday, February 12, 2012

అల్లరి అసెంబ్లీ ప్రారంభం

హైదరాబాద్,ఫిబ్రవరి 14: గవర్నర్ నరసింహన్ సోమవారం అసెంబ్లీలో త్వరత్వరగా  తన ప్రసంగాన్ని పూర్తి చేశారు. ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే  గవర్నర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగం ప్రారంభించారు. అయితే విపక్షాలతో పాటు తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు నినాదాలు చేశారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగ ప్రతులను ఎమ్మెల్యేలు చించి గవర్నర్ వైపు విసిరారు. తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యేలు కూడా గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలేందుకు ప్రయత్నించారు. దీంతో గవర్నర్ తన ప్రసంగాన్ని జెట్ స్పీడ్‌తో చదవడం ప్రారంభించారు. హడావుడిగా గవర్నర్ ప్రసంగం చదవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కాసేపటికి విపక్షాల నినాదాలు చల్లబడటంతో ఆయన కూడా తన ప్రసంగంలో వేగం తగ్గించారు.  బలహీనవర్గాల కోసం ప్రభుత్వం ఎన్నో చేసిందని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ, మతపరమైన పరిస్థితులు  అదుపులో ఉన్నాయన్నారు.వామపక్ష తీవ్రవాదం ఎదుర్కొనేందుకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశ పెట్టామని చెప్పారు.      

ఆస్ట్రేలియాపై భారత్ విజయం

అడిలైడ్, ఫిబ్రవరి 12,:  కామన్‌వెల్త్ బ్యాంక్ ముక్కోణపు సిరీస్‌లో భాగంగా ఓవల్ మైదానంలో జరిగిన  నాల్గవ వన్ డేఅ లో  ఆస్ట్రేలియా పై భారత జట్టు 4 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. విజయానికి చివరి ఓవర్లో 13 పరుగులు కావాల్సి ఉండడంతో కెప్టెన్ ధోని కొట్టిన సిక్సర్‌ తో విజయం  భారత్ ను వరించింది.  ధోని 44, అశ్విన్ 1 పరుగుతో నాటౌట్‌గా నిలిచారు. 270 పరుగుల విజయలక్ష్యంతో భారత్ బ్యాటింగ్  చేపట్టింది. ఓపెనర్లు సెహ్వాగ్, గంభీర్‌లు రాణించడంతో తొలి వికెట్‌కు 52 పరుగులు లభించాయి. ఆతర్వాత ఆస్ట్రేలియా బౌలర్ మెక్ కే విజృంభించి సెహ్వాగ్ (20), కోహ్లి (18) వికెట్లు పడగొట్టాడు. అయితే గంభీర్ (92), శర్మ (33), రైనా (38) లు సమోచితంగా రాణించడంతో భారత్ లక్ష్యానికి చేరువైంది. భారత విజయంలో కీలక పాత్ర పోషించిన గంభీర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.అంతకుముందు  టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ ఎంచుకొని.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 269 పరుగులు సాధించింది. ఆస్ట్రేలియా జట్టులో హస్సీ 72, ఫారెస్ట్ 66, క్లార్క్ 38, క్రిస్టియన్ 39 పరుగులు చేశారు. భారత బౌలర్లలో యాదవ్, వినయ్‌కుమార్ రెండేసి వికెట్లు తీసుకోగా, జహీర్‌కు ఓ వికెట్ దక్కింది.  

Saturday, February 11, 2012

అసమదీయులకు కిరణ్ తాయిలాలు...

హైదరాబాద్:,ఫిబ్రవరి 11:  బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కాంగ్రెసు, ప్రజారాజ్యం పార్టీలకు చెందిన 21 మంది శానససభ్యులకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నజరానాలు ప్రకటించారు. నియోజకవర్గాల సంక్షేమం, అభివృద్ధి కింద వారికి నిధులు కేటాయిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు.  పార్టీలోని అసంతృప్తులను తగ్గించుకునే ఎత్తుగడలో భాగంగానే ఆయన ఈ చర్యకు దిగినట్లు చెబుతున్నారు. 21 మంది శాసనసభ్యులకు మొత్తం 30కోట్ల రూపాయలు విడుదల చేయడానికి సిద్ధపడ్డారు.ఒక్కో ఎమ్మెల్యేలకు 2 కోట్ల రూపాయల నుంచి మూడు కోట్ల రూపాయల వరకు కేటాయించారు. నిధులు పొందిన శానససభ్యులు - కుంజా సత్యవతి ( రూ. 2 కోట్లు), శ్రీధర్ (2.51 కోట్లు), కవిత (2 కోట్లు), కమలమ్మ (2.7 కోట్లు), ఉషారాణి (3 కోట్లు), టివై దాసు (2 కోట్లు), ప్రవీణ్ రెడ్డి (2 కోట్లు), విజయ్ (2 కోట్లు), ప్రతాప రెడ్డి (3 కోట్లు), సుధాకర్ (2 కోట్లు), కన్నబాబు (2 కోట్లు), వరప్రసాద్ (1.05 కోట్లు), ఈలి నాని (2 కోట్లు), కాటసాని రాంరెడ్డి (2 కోట్లు), రాంభూపాల్ రెడ్డి (2.5), కోమటిరెడ్డి వెంకటరెడ్డి (2.05), బాలు నాయక్ (2 కోట్లు), లింగయ్య (2.12 కోట్లు).రానున్న ఉప ఎన్నికలను, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కూడా శాసనసభ్యులకు ఆ నిధులు మంజూరు చేసినట్లు భావిస్తున్నారు. వీరికి నామినేటెడ్ పదవులు ఇచ్చే అవకాశాలు  లేకపోవడంతో ముఖ్యమంత్రి ఈ నిధులు విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా, కాంగ్రెసు పార్టీలో ప్రజారాజ్యం పార్టీ విలీన ప్రక్రియను పూర్తి చేసి, చిరంజీవిని శానససభా పక్ష ఉప నేతగా నియమిస్తారని తెలుస్తోంది. శానససభలో ప్రజారాజ్యం పార్టీ ఇంకా సాంకేతికంగా కాంగ్రెసు పార్టీలో విలీనం కాలేదు. విలీన ప్రక్రియ పూర్తయితే చిరంజీవి శానససభలో వెనక సీట్లో కూర్చోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దానివల్ల గత శానససభా సమావేశాల సందర్భంగా విలీనానికి శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆమోదం తెలుపలేదని అంటున్నారు.తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనవారికి శాసనసభలో వెనక సీట్లు కేటాయిస్తారు. చిరంజీవి శానససభకు తొలిసారి ఎన్నిక కావడం వల్ల విలీన ప్రక్రియ పూర్తయితే వెనక సీట్లోకి వెళ్లాల్సి వస్తుంది. దీన్ని నివారించడానికే కాకుండా చిరంజీవికి తగిన ప్రాధాన్యం ఇవ్వడానికి ఆయనను శాసనసభా పక్ష ఉప నేతగా ప్రకటించనున్నారని సమాచారం. 

అధికారంలోకి వస్తే తెలంగాణ ఇస్తాం: వెంకయ్య నాయుడు

హైదరాబాద్:,ఫిబ్రవరి 11: తెలంగాణ పోరు ఆగేదికాదని బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడు అన్నారు.  రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు  కిషన్ రెడ్డి 24 రోజులపాటు నిర్వహించిన తెలంగాణ పోరు బాట ముగింపు సందర్భంగా  శనివారం నిజాం కళాశాల గ్రౌండ్స్ లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ ఇచ్చేది తమ పార్టియేనని అన్నారు. వచ్చే ఎన్నికలలో ఎన్ డిఎదే విజయం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యం అని, అందుకు ఉదాహరణ  ఉత్తరాఖండ్, జార్ఖండ్ అని చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం విషయంలో కాంగ్రెస్ స్పష్టమైన వైఖరి ప్రకటించాలన్నారు. అస్పష్టతగా ఉండటం రాష్ట్రానికి, దేశానికి మంచిదికాదన్నారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడితే తాము సమర్ధిస్తామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ కూడా ఈ విషయంలో స్పష్టమైన వైఖరితో లేదన్నారు.ఒక ఓటు రెండు రాష్ట్రాలని బిజెపి చెప్పిన మాట నిజమేనni, అయితే జనం తమకు ఓటు వేయలేదని, తమకు అధికారం ఇవ్వలేదని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే తప్పనిసరిగా తెలంగాణ ఇస్తామని చెప్పారు. 

ముగిసిన మేడారం జాతర

వరంగల్,ఫిబ్రవరి 11:  మూడు రోజుల పాటు జరిగిన మేడారం   సమ్మక్క-సారలమ్మ జాతర శనివారం తో ముగిసింది. ఆసియా ఖండంలోనే గిరిజనులు జరుపుకునే అతి పెద్ద జాతర ఇది. ఈ జాతరకు 80 నుంచి 85 లక్షల మంది భక్తులు వచ్చినట్లు అంచనా. గిరిజన సాంప్రదాయ పద్దతులతో శనివారం  సాయంత్రం విగ్రహాలకు పూజలు చేశారు. గద్దెల నుంచి సమ్మక్క, సారలమ్మలు వనానికి తరలివెళ్లడంతో జాతర ముగిసింది.   

Tuesday, February 7, 2012

అధిక్యతలో బరాక్ ఒబామా

వాషింగ్టన్,ఫిబ్రవరి 7:  అమెరికా అధ్యక్షపదవి రేసులో రిపబ్లికన్ నేత మిట్ రోమ్నిపై ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా అధిక్యతలో ఉన్నట్టు తాజా ఒపీనియన్ పోల్‌ లో వెల్లడైంది. రోమ్నిపై ఒబామా ఆరు పాయింట్ల ముందంజలో ఉన్నారు. తాజా సర్వేను వాషింగ్టన్ పోస్ట్, ఏబీసీ న్యూస్‌ సంయుక్తంగా నిర్వహించాయి. దేశ ఆర్ధిక వ్యవస్థను చక్కదిద్దిన తనకు రెండవసారి అధ్యక్షపదవిని చేపట్టే అర్హత ఉందని ఒబామా చేసిన మరుసటి రోజే ఈ సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి. అధ్యక్ష పదవికి పోటి పడే నలుగురు రిపబ్లికన్ అభ్యర్థులలో రోమ్ని ముందంజలో ఉన్నారు.

Monday, February 6, 2012

13 నుంచి అసెంబ్లీ...17న బడ్జెట్

హైదరాబాద్, ఫిబ్రవరి 6:  శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈనెల 13 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈమేరకు గవర్నర్ నరసింహన్ నోటిఫికేషన్ జారీ చేశారు. అదే రోజు శాసనమండలి సమావేశాలు కూడా ప్రారంభమవుతాయి. తొలిరోజు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ఈనెల 17న శాసనసభలో 2012-13 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

ముగ్గురితో మూడో విస్తరణ...

కొత్తమంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రసాద్‌కుమార్ ,కొండ్రు మురళీమోహన్  
హైదరాబాద్, ఫిబ్రవరి 6:  ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మూడోసారి చేపట్టిన మంత్రివర్గ విస్తరణ ముగ్గురితో ముగిసింది. ప్రభుత్వ విప్ కొండ్రు మురళీమోహన్, ఎమ్మెల్యేలు కెప్టెన్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జి.ప్రసాద్‌కుమార్ మంత్రులుగా ప్రమాణం చేశారు. గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ వారితో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమానికి ఏకంగా సగం మంది మంత్రులు డుమ్మా కొట్టడం కాంగ్రెస్‌లోచర్చనీయంగా మారిం ది.  ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ, వైద్య మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి, హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి గైర్హాజరయ్యారు. రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, పీఆర్పీ ఎమ్మెల్యే చిరంజీవితో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలే కార్యక్రమంలో అధికంగా కన్పించారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అంతంతమాత్రంగానే హాజరయ్యారు. మంత్రులు జానారెడ్డి, బొత్స సత్యనారాయణ అసహనంగా కన్పించారు. జనవరి 19న మలివిడత విస్తరణలో గంటా శ్రీనివాసరావు, సి.రామచంద్రయ్య మంత్రులుగా ప్రమాణం చేయడం తెలిసిందే. కొండ్రు, ఉత్తమ్, ప్రసాద్‌ల చేరికతో కిరణ్ కేబినెట్ సంఖ్య 41కి చేరింది.  దామోదర రాజనర్సింహ కు అదనపు బాధ్యతగా అప్పగించిన వ్యవసాయ శాఖను మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు బదిలీ చేశారు. కన్నా నిర్వహిస్తున్న గృహ నిర్మాణ శాఖను కొత్త మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి కేటాయించారు. డీఎల్‌ను ఆరోగ్య శాఖకే పరిమితం చేసి, ఆయన నుంచి తప్పించిన వైద్య విద్యతో పాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ, 108, 104 సేవలను కొండ్రు మురళీమోహన్‌కు అప్పగించారు. ప్రసాద్‌కుమార్‌కు చేనేత, జౌళి శాఖలను కేటాయించారు.  కాగా, శాఖల కేటాయింపు పై అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది.

Thursday, February 2, 2012

ఏడాది జైలు జీవితాన్ని పూర్తి చేసుకున్న రాజా

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 2: 2జీ కుంభకోణంలో ప్రధాన నిందితుడు, టెలికం మాజీ మంత్రి ఎ.రాజా గురువారంతో ఏడాది జైలు జీవితాన్ని పూర్తి చేసుకున్నారు. ఆయన గతేడాది ఫిబ్రవరి 2న అరెస్టయ్యారు. ఈ కేసులో ఆయనదే తొలి అరెస్టు. అదే రోజున టెలికం మాజీ కార్యదర్శి సిద్ధార్థ బెహూరా కూడా అరెస్టయ్యారు. ఈ కేసులో అరెస్టయిన వారిలో ప్రస్తుతం వీరిద్దరే జైల్లో ఉన్నారు. రాజా తనను బెయిలుపై విడుదల చేయాలని పిటిషన్ దాఖలు చేయలేదు. సిద్ధార్థ బెయిలు పిటిషన్లను విచారణ కోర్టు, ఢిల్లీ హైకోర్టులు తోసిపుచ్చాయి. సహ నిందితులు డీఎంకే ఎంపీ కనిమొళి, రాజా మాజీ వ్యక్తిగత కార్యదర్శి చందోలియా తదితరులకు బెయిల్ లభించింది. 

74 మంది ప్రాణాలను బలిగొన్న ఫుట్‌బాల్ మ్యాచ్

కైరో,ఫిబ్రవరి 2:  ఈజిప్టులోని పోర్ట్ సయీద్‌లో జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్.. మృత్యు క్రీడగా మారింది. 74 మంది ప్రాణాలను బలిగొంది. ఈ ఘటనలో వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. బుధవారం సాయంత్రం పోర్ట్ సయీద్ పట్టణంలో అగ్రశ్రేణి సాకర్ క్లబ్‌లు అల్ మస్త్రీ, అల్ అహ్లీల మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్ జరిగింది. మ్యాచ్ జరుగుతున్నంతసేపూ ఇరు జట్ల అభిమానుల మధ్య దూషణల పర్వం కొనసాగింది. అల్ అహ్లీ మద్దతుదారుడు ఒకరు స్థానిక జట్టు అల్ మస్త్రీని అవమానిస్తూ బ్యానర్‌ను ప్రదర్శించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ మ్యాచ్‌లో స్థానిక జట్టు అల్ మస్త్రీ, అల్ అహ్లీ(కైరో జట్టు)ను 3-1 తేడాతో ఓడించింది. దీనితో  మ్యాచ్ ముగియగానే వందలాది మంది అల్ మస్త్రీ జట్టు మద్దతుదారులు మైదానంలోకి దూసుకెళ్లారు.  ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వేలాది మంది ప్రాణభయంతో పరుగులు తీశారు. అయితే, తలుపులు మూసేసి ఉండటంతో బయటకు వెళ్లే దారి లేకుండా పోయింది. అందరూ ఒక్కసారిగా బయటకు వెళ్లే దారి వైపు రావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. చనిపోయినవారిలో ఎక్కువ మంది తొక్కిసలాటలోనే మరణించారు. కొందరు నేరుగా బాల్కనీల నుంచి పిచ్ మీదకు దూక డంతో మృతి చెందారు.  ఈ ఘటనకు సంబంధించి 47 మందిని అరెస్టు చేశామని రక్షణ శాఖ పేర్కొంది.

122 2జీ లైసెన్సుల రద్దు

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 2:  2జీ కేసులో జారీ చేసిన మొత్తం 122 లైసెన్సులను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు గురువారం సంచలనాత్మక తీర్పునిచ్చింది. 2జీ కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయంటూ ప్రముఖ లాయర్ ప్రశాంత్‌ భూషణ్ పిటిషన్‌పై సుప్రీం ఈ తీర్పును వెలువరించింది. 2008లో జారీ చేసిన లైసెన్సలన్నింటికీ 2001 ప్రకారం లెక్క కట్టారని ఉన్నత థర్మాసనం తేల్చి చెప్పింది. అంతే కాకుండా అక్రమంగా లైసెన్సులు పొందిన ఒక్కో కంపెనీకి ఐదు కోట్లు జరిమానా విధించింది. జరిమానా చెల్లించాల్సిన కంపెనీల్లో యూనిటెక్‌, టాటా టెల్లీ, డి బి రియాల్టీ  ఉన్నాయి.మరోవైపు 2జీ కేసులో చిదంబరాన్ని చేర్చాలన్న జనతాపార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్‌లో చిదంబరానికి తాత్కాలికంగా ఊరట లభించింది. కేసు ప్రస్తుతం ట్రయల్ కోర్టులో ఉన్నందున అక్కడే తేల్చుకోవాలని సూచించింది. కాగా, 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో 122 లెసైన్సులను రద్దు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తామని కేంద్ర టెలికం మంత్రి కపిల్ సిబల్ తెలిపారు. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంతో ప్రధాని మన్మోహన్ సింగ్, ఆర్థిక మంత్రి చిదంబరానికి సంబంధం లేదన్నారు. కేంద్ర టెలికం విధానం సవ్యంగానే ఉందని సమర్థించుకున్నారు. 4జీ స్పెక్ట్రమ్ లెసైన్సుల వేలాన్ని ఈ ఏడాది చివరిలో నిర్వహించనున్నట్టు చెప్పారు.

తగలబడుతున్న కొంపలా రాష్ట్రం: కేసీఆర్

హైదరాబాద్,ఫిబ్రవరి 2:  రాష్ట్రం  తగలబడుతున్న కొంపలా ఉందని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు వ్యాఖ్యానించారు. జూనియర్ వైద్యులు, 104 సిబ్బంది, వస్త్రా వ్యాపారులు, బీఈడీ అభ్యర్థులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని   విలేకరుల సమావేశంలో  అన్నారు. తెలంగాణ సాధించడమే ఏకైక లక్ష్యమని కేసీఆర్ పునరుద్ఘాటించారు. త్వరలో ఉద్యమ కార్యాచరణ ఖరారు చేస్తామని తెలిపారు. తెలంగాణ ఉద్యమాన్ని ప్రపంచంలోని ఏ శక్తీ ఆపలేదని, తెలంగాణ సాధించే వరకు ఉద్యమం ఆగేది లేదని, తెలంగాణ సాధించుకోకుండా ఆగేదే అయితే 11 ఏళ్లుగా సాగి ఉండేది కాదని  అన్నారు. తెరాస కార్మిక విభాగం డైరీనీ, క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. తోలు మందం ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని నిందించాలని, గుడ్డి, చెవిటి, మూగ ప్రభుత్వం కేంద్రంలో ఉందని, కేంద్రం దిగి రాక తప్పదని ఆయన అన్నారు. అందరి రంగులు బయటపడ్డాయని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పడే వరకు విశ్రమించబోమని ఆయన అన్నారు. ఆందోళనలు చేస్తే ఎస్మా ప్రయోగిస్తామని అంటున్న కిరణ్ కుమార్ రెడ్డి ఎస్మా రెడ్డి అని ఆయన అభివర్ణించారు. 

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...