Monday, January 17, 2011

స్విస్ ఖాతాల చిట్టా విప్పనున్న వికీలీక్స్!

లండన్,జనవరి 17: సంచలనాల వికీలీక్స్ ఇప్పుడు భారత్‌తో సహా వివిధ దేశాలకు చెందిన 2,000 మంది అక్రమార్కులు స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో దాచుకున్న లక్షల కోట్ల రూపాయల గుట్టు రట్టుచేయడానికి సిద్ధపడుతోంది.మరికొన్ని వారాల్లో వెల్లడ య్యే ఈ చిట్టాలో మన దేశానికి చెందిన 40 మంది శ్రీమంతులున్నట్టు కొన్ని చానళ్ల కథనం. భారత్‌కు చెందిన పలువురు రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు దాచిన నల్లడబ్బు ఎంతో ఆసక్తి నెలకొంది. స్విస్ బ్యాంకుల్లో దాదాపు 300 దేశాలనుంచి వచ్చిన నల్లధనం దాగుందని ఒక అంచనా. దేశదేశాల్లో ఎందరో పన్నులు ఎగ్గొట్టి, ముడుపులు మింగి అక్రమ మార్గాల ద్వారా స్విస్ బ్యాంకులకు చేర్చిన సొమ్ము వివరాలున్న రెండు సీడీలను స్విస్ బ్యాంక్ జూలియస్ బేయర్‌లో మాజీ ఉద్యోగి అయిన రుడాల్ఫ్ ఎల్మార్ సోమవారం లండన్‌లోని ఫ్రంట్‌లైన్ క్లబ్‌లో మీడియా సాక్షిగా వికీలీక్స్ అధినేత అసాంజేకు అందజేశారు. ఎల్మార్ రహస్య బ్యాంకింగ్ చట్టాలను ఉల్లంఘించాడంటూ అతను పనిచేసిన బ్యాంకు 19 ఆరోపణలతో లోగడే కేసు పెట్టింది. ఆ కేసులో కోర్టుకు హాజరయ్యేందుకు ఎల్మార్ మరో రెండురోజుల్లో స్విట్జర్లాండ్ వెళ్లాల్సి ఉంది. తనకు అసాంజేపై అపారమైన విశ్వాసం ఉందని, అందుకే ఈ రెండు సీడీలనూ ఆయనకు అప్పగిస్తానని ఎల్మార్ ముందే ప్రకటించాడు. ఎల్మార్‌పై ఆరోపణలు రుజువైతే ఆయనకు మూడేళ్లు శిక్ష పడే అవకాశం ఉంది.కాగా, ఎల్మార్ అందజేసిన సీడీల్లోని డాక్యుమెంట్లను పరిశీలించాల్సి ఉందని అసాంజే చెప్పారు. ప్రస్తుతం దౌత్యపరమైన 2,50,000 కేబుల్ సందేశాలపై వికీలీక్స్ దృష్టిపెట్టినందువల్ల ఈ రెండు సీడీలనూ చూసి తమ వెబ్‌సైట్‌లో పెట్టడానికి మరికొన్ని వారాలు పడుతుందని అసాంజే వివరించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...