Wednesday, July 31, 2013

తెలంగాణా తంతు నానేనా...

న్యూఢిల్లీ, జులై 31: ఐదు దశాబ్దాలుగా రగులుతున్న తెలంగాణా  సమస్యకు 'రాష్ట్ర విభజనే' పరిష్కారమని  కాంగ్రెస్ పార్టీ తేల్చేయడం తో  దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావానికి అంకురార్పణ పూర్తయింది.  పది జిల్లాలతో కూడిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు నిన్న  కేవలం మూడు గంటల వ్యవధిలో... అటు యూపీఏ సమన్వయ కమిటీతో, ఇటు సీడబ్ల్యూసీతో కాంగ్రెస్ 'ఆమోద ముద్ర' వేయించింది.  'సీమ-ఆంధ్ర' రాష్ట్రం 'ఆంధ్రప్రదేశ్‌గానే కొనసాగుతుందని,  ఇన్నాళ్ళుగా ఈ సమస్యకు కేంద్ర బిందువుగా ఉన్న హైదరాబాద్ పదేళ్ళ పాటు రెండు రాష్ట్రాలకు ఉమండి రాజధానిగా ఉంటుందని, ఈ లోగా  'అనువైన చోట' ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణం జరుగుతుందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ చెప్పారు.  నదీ జలాలు, విద్యుదుత్పత్తి-పంపిణీ, మూడు ప్రాంతాల్లోని ప్రజలందరి భద్రత-రక్షణ, ప్రాథమిక హక్కుల పరిరక్షణపై నిర్దిష్టమైన కాలపరిమితిలోపు ప్రత్యేకమైన వ్యవస్థ కు రూపకల్పన జరుగుతుందని ఆయన భరోసా ఇచ్చారు .
కార్యాచరణ  ఇలా....
తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని సిఫార్సు చేస్తూ తగిన తీర్మానం చేసేందుకు వీలుగా ఈ అంశాన్ని ఆంధ్రప్రదేశ్  శాసనసభకు కేంద్ర ప్రభుత్వం నివేదిస్తుంది. అసెంబ్లీ తీర్మానం కేంద్ర మంత్రివర్గానికి చేరిన  తర్వాత నదీజలాలు, విద్యుత్, ఆస్తులు - అప్పుల్లో వాటాల పంపిణీ తదితర అంశాలన్నింటినీ పరిశీలించేందుకు కేంద్ర మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటవుతుంది. ఈ అన్ని అంశాలనూ పరిశీలించి కేంద్ర మంత్రివర్గ ఉపసంఘం నివేదిక సమర్పించాక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లును రూపొందించేందుకు వీలుగా ఆ నివేదికను కేంద్ర న్యాయ శాఖకు పంపుతారు. అనంతరం ఆ  బిల్లుపై  ఆంధ్రప్రదేశ్ శాసనసభ  అభిప్రాయం కోరతారు.  అయితేశాసనసభ తీర్మానానికి గానీ, అభిప్రాయాలు, సూచనలకు గానీ కేంద్రం  కట్టుబడాల్సిన అవసరం గాని,  వాటిని విధిగా ఆమోదించాల్సిన అవసరం  గానీ ఉండదు. ఈ లాంచనం  తర్వాత తెలంగాణ రాష్ట్ర బిల్లు ప్రతిని కేంద్ర కేబినెట్ ఆమోదించి రాష్ట్రపతికి పంపుతుంది.రాష్ట్రపతి ఆమోదంతో  బిల్లును పార్లమెంట్ పరిశీలనకు వస్తుంది.బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు సాధారణ మెజారిటీతో ఆమోదించాక అది తిరిగి రాష్ట్రపతి వద్దకు వెళ్తుంది దీనితో  తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్రపతి నోటిఫికేషన్ విడుదల చేస్తారు.  మొత్తంమీద ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ దాదాపుగా నాలుగైదు నెలల్లో పూర్తయ్యే విధంగాఈ ఈ కార్యాచరణ ఉంటుంది. కాగా,  రాష్ట్ర విభజనకు పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరమయ్యే రాజ్యాంగ సవరణ  విషయం లో ఇంకా స్పష్టత  రావాల్సి ఉంది. 
విలీనం నుంచి విభజన దాకా....
ఒకప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉన్న తెలంగాణ ప్రాంతం 1948 సెప్టెంబరు 17న ఇండియన్ యూనియన్‌లో భాగమైంది. 1956లో ఆంధ్రరాష్ట్రంతో కలిసి సమైక్య ఆంధ్రప్రదేశ్‌గా ఆవిర్భవించింది. తెలుగు మాట్లాడే ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఉండాలన్న డిమాండ్‌తో పొట్టి శ్రీరాములు 1952లో 56 రోజుల పాటు చేసిన ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగా భాషాప్రాతిపదిక ఏర్పాటైన ఆంధ్రరాష్ట్రంతో హైదరాబాద్ రాష్ట్రాన్ని కలపాలన్న ప్రతిపాదనను 1953లో కాంగ్రెస్ అధిష్ఠానం తెరపైకి తెచ్చింది.దీనికి తెలంగాణ ప్రాంతంలో వ్యతిరేకత వ్యక్తమైనా అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం కాంగ్రెస్ అధిష్ఠానానికి మద్దతు పలికారు. దీంతో కర్నూలు రాజధానిగా 1953లో ఆంధ్రరాష్ట్రం ఆవిర్భవించింది. తరువాత  కేవలం తెలుగు భాష మాట్లాడే ప్రజలను ప్రాతిపదికగా తీసుకుని 1956లో  హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. మొదట దీనికి తెలంగాణ ప్రాంత ప్రజల్లో వ్యతిరేకత వచ్చినా ఆ ప్రాంత ప్రజల హక్కులకు ఎలాంటి భంగం కలగదన్న హామీతో విలీన ప్రతిపాదన తీర్మానాన్ని ఆంధ్రరాష్ట్ర అసెంబ్లీ 1955 నవంబరు 25న ఆమోదించింది.  1956 ఫిబ్రవరి 20న తెలంగాణ, ఆంధ్రరాష్ట్ర ప్రాంతాల నాయకుల మధ్య  'పెద్ద మనుషుల ఒప్పందం' జరిగింది. దీనిపై బెజవాడ గోపాలరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు సంతకం చేశారు. ఎట్టకేలకు రాష్ట్రాల పునర్విభజన చట్టాన్ని అనుసరించి తెలుగు మాట్లాడే ప్రజలందరితో కలిసి సమైక్య ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించింది. నాటి నుంచి జైఆంధ్ర, ప్రత్యేక తెలంగాణ నినాదాలతో సమైక్య ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలన్న డిమాండ్లు ఊపిరి పోసుకున్నాయి.  తొలిసారిగా 1969లో పెద్ద మనుషుల ఒప్పందాన్ని అమలు చేయడంలో విఫలమయ్యారంటూ తెలంగాణ ప్రాంత ప్రజలు నిరసన గళం విన్పించారు.
-కాంగ్రెస్ నాయకుడుగా న మర్రి చెన్నారెడ్డి ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రజా సమితి పేరుతో పార్టీని స్థాపించారు. విద్యార్థుల సహకారంతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కొంత కాలం ఉద్ధృతంగా సాగింది. నాటి పరిస్థితుల తీవ్రతను తగ్గించేందుకు అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ 1969 ఏప్రిల్ 12న 8 సూత్రాల ప్రణాళికను రూపొందించారు. అయితే తెలంగాణ ప్రాంత నాయకులు దాన్ని తిరస్కరించారు. మరోవైపు
- తెలంగాణ ఉద్యమానికి  ధీటుగా 1972లో సీమాంధ్ర ప్రాంతాల్లో జైఆంధ్ర ఉద్యమం మొదలైంది. - ఇరుప్రాంతాల్లో శాంతియుత పరిస్థితులను తీసుకొచ్చేందుకు 1973 సెప్టెంబరు 21న 6 సూత్రాల పథకం తెరపైకి వచ్చింది. -ఉద్యోగ నియామకాల్లో తమకు అన్యాయం జరుగుతోందంటూ 1985లో తెలంగాణ ప్రాంతంలో నిరసన స్వరాలు మొదలయ్యాయి. దీంతో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం తెలంగాణ ప్రాంత ప్రజల ఉద్యోగభద్రతకు జీవోను తీసుకొచ్చింది. తరువాత 1999 వరకు ఉద్యమాలు  లేకున్నా 2001 ఏప్రిల్ 21న తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటుతో  ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కొత్త పుంతలు తొక్కింది. చివరకు  రాష్ట్ర విభజనకు బాటలు వేసింది.    

Sunday, July 28, 2013

కిరణ్ తప్పుకున్నట్టేనా....?

న్యూఢిల్లీ, జులై 28: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి  తన రాజీనామా లేఖను కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ చేతిలో పెట్టినట్లు  ప్రచారం జరుగుతోంది. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ తిరిగి వచ్చేముందు ఆయన రాష్ట్ర విభజనలో తాను భాగస్వామిని కాలేనంటూ చెప్పి  తన రాజీనామా లేఖను సోనియాకు ఇచ్చినట్లు  చెబుతున్నారు.  కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా లేఖ ప్రస్తుతం సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ వద్ద ఉందంటున్నారు.  ముఖ్యమంత్రి శనివారంనాడు సచివాలయానికి వెళ్ళలేదు.  హెలికాప్టర్‌లో నల్సార్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ సభకు మాత్రం వెళ్ళారు. కాగా  కిరణ్ కుమార్ రెడ్డి అంగీకరించకపోయినప్పటికీ శానససభను సస్పెండ్ యానిమేషన్‌లో ఉంచి, రాష్ట్రపతి పాలన విధించి,  రాష్ట్ర విభజనకు సంబంధించిన ప్రణాళికను పూర్తి చేస్తారని అంటున్నారు. కొత్తగా ఏర్పడే ఆంధ్ర రాష్ట్రానికి  ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి  అంగీకరించకపోతే పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయవచ్చుననే ప్రచారం సాగుతోంది.

హ్యాట్రిక్ విజయం తో సిరీస్ కైవసం

హరారే, జులై 28: సెల్ కాన్ కప్ వన్డే సిరీస్ ను  భారత్ హ్యాట్రిక్ విజయం తో కైవసం చేసుకుంది. ఐదు వన్ డే ల ఈ సిరీస్  లో ఈ రోజు జరిగిన  మూడవ వన్ డే లో జింబాబ్వేపై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.  184 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్ 35.3 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే నష్టపోయి చేధించింది.  టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 46 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటయింది. 

Saturday, July 27, 2013

మూతబడిన యూనివర్సిటీ ఆఫ్ నార్తర్న్ వర్జీనియా

వాషింగ్టన్, జులై 27: భారత విద్యార్థులు అధికంగా ఉన్న మరో అమెరికా విశ్వవిద్యాలయం మూతపడింది. మూడేళ్ల వ్యవధిలో మూతపడిన  మూడో విశ్వవిద్యాలయం ఇది. యూనివర్సిటీ ఆఫ్ నార్తర్న్ వర్జీనియాను తక్షణమే మూసేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ యూనివర్సిటీ ఐదేళ్లుగా 'యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్'కు చెందిన ఏ విభాగం నుంచీ గుర్తింపు పొందకపోవడమే మూసివేతకు కారణం. యూనివర్సిటీ ఆఫ్ నార్తర్న్ వర్జీనియా(యూఎన్‌వీ) గడిచిన 15 ఏళ్లుగా వాషింగ్టన్ శివార్లలోగల అన్నాడేల్‌లోని ఓ కార్యాలయ భవనం కింది అంతస్తులో కొనసాగుతోంది. వర్జీనియాలోని స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఎస్‌సీహెచ్ఈవీ) ఈ వర్సిటీ మూసివేతకు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో ఆంధ్ర విధ్యార్ధులు కూడా ఎక్కువే ఉన్నారు.

హస్తినలో విభజన విన్యాసం....

న్యూఢిల్లీ, జులై 27:   ప్రత్యేక తెలంగాణ అంశంపై రాజకీయ క్రీడను కొనసాగిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం.. శుక్రవారం హస్తినలో మరోసారి రోజంతా హైడ్రామా నడిపింది. వార్ రూమ్ సమావేశాలు, కోర్ కమిటీ భేటీ అంటూ  రాష్ట్రమంతటా తీవ్ర ఉత్కంఠ రేపింది. ఈ అంశంలో ఇక చర్చలు ముగిశాయని, ఆంధ్రప్రదేశ్ విభజనకే మొగ్గు చూపుతున్నామని.. తెలంగాణ ఏర్పాటు చేయబోతున్నామని తొలుత వార్ రూమ్‌లో రాష్ట్ర నేతలకు సంకేతాలిచ్చింది. విభజనకు సిద్ధంకావాలంటూ చెప్పిపంపింది. పార్టీ పెద్దలు దిగ్విజయ్‌సింగ్, గులాంనబీ ఆజాద్‌లు  రాష్ట్ర విభజనపై నిర్ణయం జరిగిపోయిందని, రాబోయే పరిణామాలను ఎదుర్కోవలసిందేనంటూ నేతలకు చెప్పారుట. వార్ రూమ్ భేటీ తర్వాత.. ‘‘సంప్రదింపుల ప్రక్రియ ముగిసింది. ఇక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. తీసుకున్న నిర్ణయాన్ని మేం మీకు తెలియజేస్తాం’’ అని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ మీడియాతో పేర్కొన్నారు.అయితే సాయంత్రం కోర్ కమిటీ ముగిసిన తర్వాత  దిగ్విజయ్‌సింగ్ స్వరంలో స్పష్టమైన తేడా కనిపించింది. ‘‘చర్చలు ముగిశాయి.. ఇక కాంగ్రెస్, యూపీఏ నిర్ణయాల కోసం వేచిచూడాలి’’ అని ముక్తసరిగా వ్యాఖ్యానించటం ద్వారా సస్పెన్స్ ను సజీవంగా ఉంచారు.

హరారేలో భారత్ హవా..

హరారే, జులై 27:   జింబాబ్వేతో ఐదు వన్డేల సిరీస్‌లో  భారత్ 2-0 ఆధిక్యం సాధించింది. శుక్రవారం ఇక్కడ జరిగిన రెండవ వండే లో భారత జట్టు 58 పరుగుల ఆధిక్యంతో జింబాబ్వేను ఓడించింది.  ఓపెనర్ శిఖర్ ధావన్ (127 బంతుల్లో 116; 11 ఫోర్లు; 2 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగాడు. దావన్‌కు తోడుగా వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ (74 బంతుల్లో 69; 6 ఫోర్లు) నిలకడైన ఆటతీరును ప్రదర్శించాడు. చివర్లో వినయ్ (12 బంతుల్లో 27 నాటౌట్; 2 ఫోర్లు; 2 సిక్స్‌లు) చేలరేగడంతో భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 294 పరుగుల భారీ స్కోరు సాధించింది. అటు బౌలర్లు సమష్టిగా రాణించి ఆతిథ్య జింబాబ్వేను కట్టడి చేశారు. జింబాబ్వే 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 236 పరుగులు చేసింది. ఉనాద్కట్‌కు నాలుగు, మిశ్రాకు రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పురస్కారం ధావన్‌కు దక్కింది. మూడో వన్డే కూడా హరారేలోనే  ఆదివారం జరుగుతుంది.




జింబాబ్వే 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 236 పరుగులు చేసింది. ఉనాద్కట్‌కు నాలుగు, మిశ్రాకు రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పురస్కారం ధావన్‌కు దక్కింది. మూడో వన్డే ఇదే వేదికపై ఆదివారం జరుగుతుంది. - See more at: http://sakshi.com/main/Fullstory.aspx?catid=642146&Categoryid=2&subcatid=24#sthash.WgyqxNfA.dpuf

Wednesday, July 24, 2013

మళ్ళీ ముగ్గురు.............లకు పిలుపు...

న్యూఢిల్లీ, జులై 24: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహలకు అధిష్టానం నుండి మరోసారి పిలుపు వచ్చింది. దామోదర ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. బొత్స, కిరణ్‌లు శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. అదే రోజు  కాంగ్రెసు పార్టీ కోర్ కమిటీ సమావేశం కానుంది. ఈ నెల 28న సిడబ్ల్యూసి సమావేశంలో జరిగే అజెండా ఖరారు పైన చర్చించనున్నారు. సిడబ్ల్యూసిలో తెలంగాణ అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాఐ కూస్తోంది. అన్నదమ్ములు విడిపోతానంటే ఇంటి పెద్ద ఎలా ఆలోచిస్తాడో అలాగే కాంగ్రెస్  అధిష్టానం ఇప్పుడు ఆలోచిస్తోందని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన తాజా వ్యాఖ్య కొసమెరుపు...

Tuesday, July 23, 2013

మొన్న హోటల్ భవనం...నేడు ప్రహరీ గోడ...నగరం కూలుతోంది...

హైదరాబాద్, జులై 23:  సికింద్రాబాదులో ఓ హోటల్ భవనం కుప్పకూలి 18 మంది  మృతి చెందిన్ ఘటన  మరువక ముందే  మరో ప్రమాదం జరిగింది. భారీగా కురుస్తున్న వర్షాలకు  మౌలాలి డివిజన్ పరిధిలోని ఎంజె కాలనీలో ఒక కాంప్లెక్స్ ప్రహరీ గోడ కూలి ఆరుగురు మృతి చెందారు. మహబూబ్ నగర్ జిల్లాకు చందిన వెంకటయ్య, మహదేవ్‌ కుటుంబాలు స్థానికంగా గుడిసెలు వేసుకొని కూలి పనులు చేసుకొని జీవనం సాగిస్తన్నారు. వర్షాల కారణంగా పక్కనే ఉన్న గోడ నాని కూలి వారి ఇళ్ల పైన పడింది. వెంకటయ్య, మహదేవ్, పద్మ, ఇద్దరు చిన్నారులు శిథిలాల కింద పడి మృతి చెందారు. శిథిలాల కింద చిక్కున్న లిల్లీ అనే చిన్నారని కాపాడారు. మరో చిన్నారి శిథిలాల కిందే ఉన్నట్లుగా గుర్తించిన అధికారులు ఆరు గంటల అనంతరం రక్షించారు. చికిత్స కోసం వెంటనే ఆసుపత్రికి తరలించారు.  క్షేమంగా బయటపడ్డ చిన్నారులకు ఉచిత విద్య అందిస్తామని రఘువీరా చెప్పారు. మహదేవ్ కుటుంబానికి రూ.8.5 లక్షలు, వెంకటయ్య కుటుంబానికి రూ.6.5 లక్షళ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. కాగా ఇటీవలే సికింద్రాబాదులో ఓ హోటల్ భవనం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో 18 మంది వరకు మృతి చెందారు.

సాయంత్రానికి ' తొలి ' పంచాయతీ తీర్పు...

హైదరాబాద్, జులై 23: పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ మంగళవారం  మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రశాంతంగా ముగిసింది. చెదురు మదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చెపట్టారు.  మంగ్ళవారం సాయంత్రానికి పలితాలు ప్రకటించి  ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో వర్షాల వల్ల పోలింగ్ సిబ్బంది హాజరుకాలేని పరిస్థితి ఉండడంతో  పోలింగ్‌కు వీలుకాని గ్రామాల్లో రిజర్వ్ డే రోజు పోలింగ్ ఉంటుందని  ఎన్నికల సంఘం తెలిపింది. తొలివిడతలో 5,803 పంచాయతీల కు ఎన్నికలు జరిగాయి. ఈ నెల 27న   రెండవ దశ, 31న మూడవ దశ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి.

వస్తా...ఎల్లొస్తా...కానీ మరి రాదు....

చెన్నై, జులై 23 : ప్రముఖ నటి మంజుల (60) మంగళవారం కన్నుమూశారు.  కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో మృతి చెందారు. తెలుగు, తమిళం, కన్నడలో సుమారు వంద చిత్రాల్లో పైగా నటించిన మంజుల... ప్రముఖ నటుడు విజయ్ కుమార్ సతీమణి. టాలీవుడ్‌ సూపర్‌స్టార్లు ఎన్టీఆర్‌, అక్కినేని, కృష్ణ, శోభన్‌ బాబుతో పాటు తమిళ దిగ్గజాలు శివాజీ గణేషన్‌, యంజీ రామచంద్రన్‌, జెమిని గణేషన్‌ నటించిన అనేక సినిమాల్లో ఆమె హీరోయిన్‌గా నటించారు. 1969లో తమిళ సినిమా 'శాంతి నిలయం'తో బాలనటిగా మంజుల సినీరంగ ప్రవేశం చేశారు. ఆ సినిమాలో చిన్నప్పటి జెమినీ గణేషన్‌ పాత్రలో నటించారు. తెలుగులో ఆమె నటించిన మొదటి సినిమా జై-జవాన్‌. కృష్ణ హీరోగా నటించిన మాయదారి మల్లిగాడు సినిమా మంజులకు మంచి పేరు తెచ్చిపెట్టింది. 1992లో వెంకటేష్‌ నటించిన చంటి సినిమాలో హీరోయిన్‌ మీనాకు వదినగా నటించారు. 2002లో వెంకటేష్‌ చిత్రం వాసులో ఆమె తల్లిగా నటించింది. ఆ తర్వాత ఆమె తెలుగు సినిమాల్లో కనిపించలేదు. మంజులకు ముగ్గురు కూతుళ్లు. వీరిలో ఇద్దరు సినిమాల్లో  కనిపిస్తున్నారు.

Thursday, July 18, 2013

నీట్ లేదు...యథావిథిగా ఎంసెట్...

న్యూఢిల్లీ, జులై 18:  వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ స్థాయి అర్హతా పరీక్ష -నీట్- నోటిఫికేషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించే అధికారం మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకు లేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. నీట్‌ కోసం ఎంసీఐ జారీ చేసిన నోటిఫికేషన్‌ చట్టవిరుద్ధమని ప్రకటించింది. రాష్ట్రానికి సంబంధించి ఎంసెట్‌ ద్వారానే ప్రవేశాలు నిర్వహించేందుకు సుప్రీంకోర్టు తీర్పుతో మార్గం సుగమమైంది.  కగా, ముగ్గురు సభ్యుల బెంచ్‌లో ఒకరు ఈ తీర్పును వ్యతిరేకించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అల్తమస్‌ కబీర్‌, జస్టిస్‌ విక్రమ్‌జిత్‌ సేన్‌ నీట్‌ను కొట్టేయాలని చెప్పగా... బెంచ్‌లోని మరో సభ్యుడు జస్టిస్‌ అనిల్‌ దవే ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహణ చట్టబద్ధమని తీర్పు ఇచ్చారు. ‘నీట్’ నిర్వహణపై పలు రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. వీటిని పరిశీలించిన సుప్రీం కోర్టు నీట్‌తో పాటు వివిధ రాష్ట్రాలు విడిగా ప్రవేశ పరీక్షలను నిర్వహించుకోవచ్చని, ఫలితాలను మాత్రం వెల్లడించరాదని గతంలో మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.  సుప్రీంకోర్టు తాజా తీర్పుతో వచ్చే సంవత్సరం నుంచి మెడిసిన్‌ ఎంట్రెన్స్‌ కోసం ఎంసెట్‌ ఉంటుందా లేదా? అన్న అనుమానాలకు తెరపడింది.

మృత్యువుతో పోరాడుతూనే 95వ పుట్టినరోజు

వాషింగ్టన్ , జూలై 18 :  దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతూనే 95వ పుట్టినరోజు చేసుకుంటున్నారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమించి, రాబెన్ దీవిలో 27 సంవత్సరాల సుదీర్ఘ
కారాగార వాసం అనుభవించిన తర్వాత, ఆ దేశానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తొలి అధ్యక్షుడిగా నిలిచారు. నోబెల్ శాంతి బహుమతి సహా పలు అవార్డులు, రివార్డులు పొందారు. భారత ప్రభుత్వం కూడా ఆయనను నెహ్రూ శాంతిబహుమతితో సత్కరించింది. బాపూజీ బోధించిన అహింస, శాంతియుత విధానాలు తనకు స్ఫూర్తినిచ్చాయని తరచు చెప్పే మండేలా.. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని, చికిత్సకు మండేలా స్పందిస్తున్నారని ఆ దేశ అధ్యక్షుడు జాకబ్ జుమా కార్యాలయం ఇటీవలే ప్రకటించింది. అయితే, నల్లజాతి యావత్తు స్వేచ్ఛావాయువులు పీల్చడానికి తన జీవితాన్నే ధారపోసిన మండేలా మాత్రం.. తన శ్వాస ఆపేయాలని కోరుతున్నారు. ఈ ప్రత్యక్ష నరకాన్ని తాను భరించలేనని ఆయన చెబుతున్నట్లు తెలిసింది. కానీ దక్షిణాఫ్రికా జాతి మాత్రం ఆయన్ను వీలైనంత ఎక్కువ కాలం కాపాడుకోవాలని శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఇక.. నెల్సన్ మండేలా 95వ జన్మదినం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆయనకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. తన కుటుంబం తరఫున, అమెరికా ప్రజల తరఫున తాను, మిషెల్ మండేలాకు అభినందనలు తెలియజేస్తున్నామని ఆయనో ప్రకటనలో వెల్లడించారు. అలాగే, నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డే ఐదో వార్షికోత్సవాన్ని చేసుకుంటున్న దక్షిణాఫ్రికా ప్రజలు, ప్రభుత్వానికి కూడా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మండేలా గౌరవార్థం 2009లో ఆయన పుట్టిన రోజును ఐక్యరాజ్యసమితి నెల్సన్ మండేలా డేగా ప్రకటించింది.

విభజనకు అసెంబ్లీ తీర్మానం తప్పదు...ఉండవల్లి

విశాఖపట్నం, జూలై 18 : దేశానికి మంచి అయ్యే ఏ అభిప్రాయమైనా తెలంగాణ, సీమాంధ్ర నేతలు అంగీకరించాల్సిందేనని  రాజమండ్రి కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. రాష్ట్రం విడిపోయినా వచ్చే ప్రమాదమేమీ లేదని,  అయితే దేశ ప్రజలు ఒప్పుకోవాలని, అసెంబ్లీలో తీర్మానం కావాలని అన్నారు.   హైదరాబాదును దేశ రాజధానిగా చేయాలని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఎప్పుడో చెప్పారని,  విభజన అనివార్యమైతే హైదరాబాదును దేశానికి రెండో రాజధానిగా చేయాలని డిమాండ్ చేశారు.  హైదరాబాదు పై ఉన్న ప్రేమతో సీమాంధ్రులు విశాఖను విస్మరించారన్నారు.   తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు సీమాంధ్ర వారిని దూషించడమే పనిగా పెట్టుకున్నారని , తెలంగాణ ప్రజలకు అవాస్తవాలు చెప్పి, సీమాంధ్రులపై ద్వేషం పెంచుతున్నారన్నారు. సీమాంధ్రులను దోపిడీ దొంగలుగా తెరాస ముద్ర వేసిందన్నారు. తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడం ద్వారా ఇరు ప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాలు రగిలిస్తోందని ఉండవల్లి మండిపడ్డారు.

2562 గ్రామాల సర్పంచ్‌ల ఎన్నిక ఏకగ్రీవం...

హైదరాబాద్, జూలై 18 : పంచాయతీ ఎన్నికల పర్వంలో కీలకఘట్టం ముగిసింది. బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ తంతు ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 21,441 పంచాయతీలు ఉండగా... వాటిలో 2562 గ్రామాల సర్పంచ్‌ల ఎన్నిక అధికారికంగా ఏకగ్రీవమైంది. వేలంపాటల ద్వారా ఏకగ్రీవమైన గ్రామాల ఫలితాలను మాత్రం రాష్ట్ర ఎన్నికల సంఘం నిలిపివేసింది. పంచాయతీ ఎన్నికలు పార్టీరహితంగా జరుగుతున్నప్పటికీ... క్షేత్రస్థాయిలో మాత్రం అత్యధిక అభ్యర్థులు 'ఫలానా పార్టీ మద్దతు'తోనే బరిలో నిలిచినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు. పార్టీ రంగు కండువాలతోనే తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఏక్రగీవాల్లో ఏ పార్టీ ఖాతాలో ఎన్ని పడ్డాయనే అంశం ఆసక్తికరంగా మారింది. మొత్తానికి... అధికారపార్టీయే ఏకగ్రీవాల్లో ఆధిక్యం ప్రదర్శించింది. 2562 ఏకగ్రీవ సర్పంచ్‌లకుగాను... 764 కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు 548 పంచాయతీల్లో ఏకగ్రీవంగా సర్పంచులుగా ఎన్నికయ్యారు.  ఇక... జగన్ పార్టీకి 428 పంచాయితీలు పోటీలేకుండా దక్కాయి. టీఆర్ఎస్ మద్దతుదారులు 87 మంది ఏకగ్రీవంగా గెలుపొందగా.. ఇతరులు 754 మంది ఉన్నారు.

Wednesday, July 17, 2013

బడి భోజనానికి 20మంది బలి...

పాట్నా,జులై 17:  ‘మధ్యాహ్న భోజనం’ ఏకంగా 20 మంది  చిన్నారుల ప్రాణాలను బలిగొంది.  బీహార్‌లోని శరణ్ జిల్లా మష్రాఖ్ బ్లాక్ గందావన్ గ్రామంలో మంగళవారం ఈ విషాదం చోటు చేసుకుంది. గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రోజూ మాదిరిగానే వడ్డించే మధ్యాహ్న భోజ నాన్ని ఆరగించిన చిన్నారులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వారందరినీ హుటాహుటిన చాప్రా సదర్ ఆస్పత్రికి తరలించేటప్పటికే పదకొండు మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. తరవాత మరో 9  మంది తీవ్ర ఆస్పత్రి లో మరణించారు. ఇంకా 41 మందికి వైద్యులు  చికిత్స అందిస్తున్నారు.  తీవ్రంగా కలుషితమైన వంటనూనె, క ల్తీ దినుసులతో వండటం వల్లే ఆహారం విషపూరితమై ఉంటుందని  అధికారులు భావిస్తున్నారు.

12 రంగాలలో ఎఫ్.డి.ఐ. పరిమితులు పెంపు...

న్యూఢిల్లీ, జులై 17:  భీమా, రక్షణ రంగాలతో పాటు పన్నెండు రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితులను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగిన అత్యున్నత స్థాయి సమావేశం-టెలికంలో ఎఫ్‌డీఐలను 100 శాతం పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.   మయారాం కమిటీ ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా ఈ నిర్ణయాలు తీసుకున్నారు. 20 రంగాల్లో పెట్టుబడుల పరిమితులను సడలించాలంటూ కమిటీ సిఫార్సు చేసినప్పటికీ.. 12 రంగాలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మల్టి బ్రాండ్ రిటైల్, పౌర విమానయానం తదితర రంగాల్లో విదేశీ పెట్టుబడులకు తలుపులు బార్లా తెరిచిన పది నెలల తర్వాత ఈ రెండో విడత సంస్కరణలను ప్రభుత్వం చేపట్టింది. వివాదాస్పదమైన బీమా రంగంలో ఎఫ్‌డీఐలను ఆటోమేటిక్ పద్ధతిలో 26 శాతం నుంచి 49 శాతానికి పెంచారు. దీని వల్ల ఇన్వెస్ట్ చేసే కంపెనీలు ప్రభుత్వం నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోనక్కర్లేదు. ఈ రంగంలో ఎఫ్‌డీఐ పరిమితులను పెంచే బిల్లు ప్రస్తుతం రాజ్యసభలో పెండింగ్‌లో ఉంది. మరోవైపు, సింగిల్ బ్రాండ్ రిటైల్‌లో ఎఫ్‌డీఐల విధానంలో సవరణలు చేశారు. వీటి ప్రకారం ఈ రంగంలో 49 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆటోమేటిక్ రూట్ ద్వారా అనుమతిస్తారు. అంతకు మించితే విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌ఐపీబీ) అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు, కమోడిటీ ఎక్స్చేంజీలు, పవర్ ఎక్స్చేంజీలు, స్టాక్ ఎక్స్చేంజీలు, క్లియరింగ్ కార్పొరేషన్లలో ఆటోమేటిక్ పద్ధతిలో 49 శాతం దాకా ఎఫ్‌డీఐలను అనుమతిస్తారు. ప్రస్తుతం ఇందుకు ఎఫ్‌ఐపీబీ అనుమతి కావాల్సి ఉంటోంది. ఇక టెలికం రంగానికి సంబంధించి .. బేసిక్, సెల్యులార్ సర్వీసుల్లో ఎఫ్‌డీఐ పరిమితులను ప్రస్తుతమున్న 74 శాతం నుంచి 100 శాతానికి పెంచారు. ఇందులో 49 శాతం పెట్టుబడులను ఆటోమేటిక్ పద్ధతి ద్వారాను, మిగతాది ఎఫ్‌ఐపీబీ అనుమతుల ద్వారాను అనుమతిస్తారు. అటు కొరియర్ సర్వీసుల్లో 100 శాతం పెట్టుబడులను ఎఫ్‌ఐపీబీ మార్గం ద్వారా కాకుండా ఆటోమేటిక్ పద్ధతిలో అనుమతించనున్నారు. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ సంస్థల్లో ఆటోమేటిక్ పద్ధతిన 74 శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతిస్తారు. కాగా, పౌర విమానయానంలో పరిమితిని యథాతథంగా 49% వద్దే ఉంచారు. రక్షణ ఉత్పత్తుల విభాగంలో 26% పరిమితిని కొనసాగించేందుకు నిర్ణయించారు. ఇంతకుమించిన పెట్టుబడులను సీసీఎస్‌కు సంబంధించిన అత్యున్నత సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా పరిగణిస్తారు. సింగిల్ బ్రాండ్ రిటైల్‌లో 100% ఎఫ్‌డీఐలకు ఓకే. 49% పెట్టుబడులకు ఆటోమేటిక్ రూట్‌కాగా, ఆపై ఎఫ్‌ఐపీబీ అనుమతించాలి.  పవర్ ఎక్స్ఛేంజీలలో 49% వరకూ పెట్టుబడులకు ఆటోమేటిక్ మార్గంలో అనుమతిస్తారు. ఇంతక్రితం ఎఫ్‌ఐపీబీ అనుమతించాల్సి ఉండేది. ఆస్తుల పునర్‌నిర్వచన (అసెట్ రీకన్‌స్ట్రక్షన్) కంపెనీలలో విదేశీ పెట్టుబడుల పరిమితి 74% నుంచి 100%కు పెంపు. దీనిలో 49% వరకూ ఆటోమాటిక్ రూట్‌లో అనుమతిస్తారు. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలలో ఎఫ్‌డీఐ పరిమితిని 49% నుంచి 74%కు పెంచారు. స్టాక్ ఎక్స్ఛేంజీలు, డిపాజిటరీలలో 49% వరకూ ఎఫ్‌డీఐలను ఆటోమేటిక్ రూట్‌లో అనుమతిస్తారు. కొరియర్ సర్వీసుల విభాగంలో ఆటోమేటిక్ మార్గం ద్వారా 100% ఎఫ్‌డీఐలను అనుమతిస్తారు. టీ తోటల విభాగంలో 49% వరకూ పెట్టుబడులను ఆటోమాటిక్ రూట్‌లో అనుమతిస్తారు. ఆపై 100% వ రకూ పెట్టుబడులకు ఎఫ్‌ఐపీబీ అనుమతి తప్పనిసరి. విమానాశ్రయాలు, మీడియా, ఫార్మా యూనిట్ల కొనుగోలు(బ్రౌన్ ఫీల్డ్ ఫార్మా), మల్టీబ్రాండ్ రిటైల్‌లో ఎఫ్‌డీఐల పరిమితిపై నిర్ణయాలు తీసుకోలేదు.

Tuesday, July 16, 2013

' కోర్ ' వివరాలు వెల్లడించలేం....దిగ్విజయ్

న్యూఢిల్లీ, జులై 16: తెలంగాణపై కాంగ్రెస్ కోర్ కమిటీకి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన నివేదికను బయటపెట్టేది లేదని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. అలాగే కోర్ గ్రూప్ సమావేశంలో చర్చించిన విషయాలను బయటకు చెప్పబోమని ఆయన అన్నారు. హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తారని వినిపిస్తున్నవన్నీ ఊహాగానాలేనని, ఈ విషయంపై అంతర్గతంగా జరుగుతున్న విషయాలను ఈ దశలో వెల్లడించలేమని ఆయన అన్నారు. 2014 సాధారణ ఎన్నికలకు ముందే తెలంగాణా పై నిర్ణయం జరుగుతుందని  దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. రాష్ట్ర విభజనపై ఇరు ప్రాంతాలకు చెందిన నేతల వాదనలు బలంగా ఉన్నాయని దిగ్విజయ్ అన్నారు. 

Sunday, July 14, 2013

వర్కింగ్ కమిటీలో కూడా తేలి చచ్చేది కాదు...

న్యూఢిల్లీ , జులై 14:  వర్కింగ్ కమిటీలో కూడా తెలంగాణ అంశం తేలే అవకాశం లేదని రాష్ట్రానికి చెందిన సిడబ్ల్యుసి సభ్యుడు సంజీవ రెడ్డి చెప్పారు. రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని తాను చెబుతానని ఆయన  టీవి చానెల్ ఇంటర్వ్యూ లో  అన్నారు. వర్కింగ్ కమిటీ సమావేశం కూడా నిర్ణయాన్ని పార్టీ అధిష్టానానికే వదిలేసే అవకాశాలున్నాయని ఆయన అన్నారు. అభివృద్ధికి కావాల్సింది డబ్బే కదా, అది ప్యాకేజీ రూపంలో ఇస్తే సరిపోతుందని ఆయన అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే మంచిదని అన్నారు. ఇరు ప్రాంతాలవారు ఓ రాజీ మార్గానికి వస్తే మంచిదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని, తాము మాత్రం సమైక్యవాదినేనని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వర్కింగ్ కమిటీలోని ఇతర రాష్ట్రాల సభ్యులు అంగీకరించకపోవచ్చునని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనతో దేశంలోని ఇతర ప్రాంతాల్లో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అన్నారు. వర్కింగ్ కమిటీ సమావేశంలో తెలంగాణపై విస్తృత చర్చ జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. తెలంగాణ ఇస్తే సీమాంధ్రలో పార్టీకి నష్టం జరుగుతుందని, ఇవ్వకపోతే తెలంగాణలో నష్టం జరుగుతుందని ఆయన అన్నారు. అయినా, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే మంచిదని ఆయన అన్నారు.

బ్రహ్మాస్త్రంతో విభజనను ఆపుతాం...లగడపాటి

హైదరాబాద్  , జులై 14:  రాష్ట్రం చీలిపోకుండా బ్రహ్మాస్త్రంతో ఆపే శక్తి తమకు ఉందని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు.   రాష్ట్రం విడిపోయే పరిస్థితి వస్తే రాజీనామా చేయాల్సిన అవసరం లేదని, బ్రహ్మాస్త్రం ప్రయోగించడానికి సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.2004, 2009 ఎన్నికల్లో ప్రజలు సమైక్యవాదానికే ఓటేశారని, మూడోసారి కూడా అధికారం తమదేనని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణ బికారి అవుతుందని ఆయన అన్నారు. విద్వేషాలను రెచ్చగొట్టేవారే ప్రజలను విడదీస్తారని, కాంగ్రెసు అలాంటి పనిచేయదని ఆయన అన్నారు. ప్రభుత్వం, పార్టీలతో సంబంధం లేకుండా రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని అన్నారు. శాసనసభలో తీర్మానం చేసిన తర్వాతనే బిల్లు పార్లమెంటుకు వస్తుందని ఆయన చెప్పారు. విభజనకు రాజ్యాంగ సవరణ తప్పనిసరి అని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏది చేసినా ఓ పద్ధతి ప్రకారం చేస్తుందని ఆయన అన్నారు. తెలంగాణపై ఈ నెలాఖరు లోపు నిర్ణయం వస్తుందని ఆయన చెప్పారు.

బోఫోర్స్ కేసులో ఆఖరి నిందితుడూ పోయాడు...

రోమ్ , జులై 14:  ఇటాలియన్ ఆయుధ దళారి,    బోఫోర్స్ కుంభకోణం కేసులో కీలక పాత్రధారి అయిన ఇటలీవ్యాపారి ఒట్టోవియో ఖత్రోకీ గుండెపోటుతో మిలాన్‌లో మృతి చెందాడు. ఆయన వయస్సు 74 ఏళ్లు.  మూడు దశాబ్దాల క్రితం మన దేశ రాజకీయాలను బోఫోర్స్ శతఘ్నుల కొనుగోళ్ల వ్యవహారం ఓ కుదుపు కుదిపింది. అప్పుడు ఖత్రోకీ పేరు బాగా వినిపించింది. 1993 వరకు భారత్‌లోనే ఉన్న ఖత్రోకీ తనపై అరెస్టు వారంట్ నమోదు కావడంతో దేశం వదిలి పారిపోయారు. ఇంటర్ పోల్ సంస్థ ఆయనపై రెడ్‌కార్నర్ నోటీస్ సైతం జారీ చేసింది. అయి నా  ఆయన ఏ ఒక్కనాడూ భారత్‌కు రావడం గానీ, కోర్టు విచారణను ఎదుర్కోవడం గానీ చేయలేదు. ఈ క్రమంలో సిబిఐ 1999లో ఆయనపై ప్రధాన అభియోగ పత్రం నమోదు చేసింది. ఆయనను మనదేశానికి తీసుకురావడానికి సిబిఐ అధికారులు రెండుసార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. 2003లో మలేషియాలో, 2007లో అర్జెంటీనాలో దొరికినట్టే దొరికి తప్పించుకుపోయారు. రెండు దశాబ్దాలకు పైగా దర్యాప్తు చేసినా ఖత్రోకీకి వ్యతిరేకంగా ఒక్క ఆధారమూ దొరకలేదంటూ 2009లో సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు 2011 మే 4వ తేదీన ఢిల్లీ హైకోర్టు ఖత్రోకీపై అభియోగాలను రద్దు చేసింది. దీంతో ఒక్కరికి కూడా శిక్ష పడకుండానే బోఫోర్స్ కేసు ముగిసిపోయింది. ఇప్పుడు ఖత్రోకీ మరణంతో బోఫోర్స్ కేసులో ఆరోపణలు, అభియోగాలు ఎదుర్కొన్న అందరూ దాదాపుగా మరణించినట్టే. బోఫోర్స్ మరక అంటిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 1991లో హత్యకు గురి కాగా, బోఫోర్స్ సంస్థ అధినేత మార్టిన్ ఒర్డబో, ఏజెంట్ విన్ చద్దా, మాజీ రక్షణ కార్యదర్శి ఎస్‌కే భట్నాగర్‌లు కేసు విచారణ క్రమంలోనే మరణించారు. ఇక మిగిలింది హిందూజా సోదరులు. వారిని 2000లో కోర్టు నిర్దోషులుగా ప్రకటించి వదిలేసింది.

ఇక ‘టెలిగ్రామ్’ లేదు...

న్యూఢిల్లీ, జులై 14:   ‘టెలిగ్రామ్’ అనే చిరపరిచితమైన పిలుపు ఇక దేశంలో ఎక్కడాచిరపరిచితమైన పిలుపు  వినిపించదు.1850లో కోల్‌కతా నుంచి డైమండ్ హార్బర్ వరకు ప్రయోగాత్మకంగా తొలి టెలిగ్రాఫ్ లైన్‌ను అప్పటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేసింది. టెలికం రంగం పుంజుకోని రోజుల్లో శరవేగంగా సమాచారాన్ని చేరవేసే ఏకైక సాధనంగా టెలిగ్రామ్ వెలుగొందింది. వార్తాసంస్థల నిర్వహణలోనూ కీలక పాత్ర పోషించింది. అయితే అధునాతన కమ్యూనికేషన్ సాధనాలు అందుబాటులోకి రావడంతో కొన్నేళ్లుగా టెలిగ్రామ్ వైభవం కొడిగట్టింది. టెలిగ్రాఫ్ వ్యవస్థకు ఏటా రూ.100 కోట్ల మేరకు ఖర్చవుతుండగా, దీనిపై ప్రస్తుతం దాదాపు రూ.75 లక్షల వార్షికాదాయం మాత్రమే లభిస్తోంది. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ వినియోగం విస్తరించడంతో టెలిగ్రామ్ సేవలను ఉపయోగించుకునే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. ఆదాయం తగ్గిపోవడంతో ప్రభుత్వం టెలిగ్రామ్ చార్జీలను 2011లో సవరించింది. 50 పదాలకు రూ.27గా చార్జీ నిర్ణయించింది. అయినా ఆదాయం కంటే నిర్వహణ ఖర్చు పెరగడంతో టెలిగ్రామ్ సేవలను శాశ్వతంగా నిలిపివేయాలి బీఎస్‌ఎన్‌ఎల్ నిర్ణయించుకుంది.

Saturday, July 13, 2013

నటదిగ్గజం ప్రాణ్ కన్నుమూత.. .

ముంబై,జులై 13: దాదాపు అర్ధ శతాబ్దికి పైగా బాలీవుడ్ చిత్రసీమను ఏలిన నటదిగ్గజం ప్రాణ్ (93)  ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి  తుదిశ్వాస విడిచారు. కరడుకట్టిన  ప్రతినాయక పాత్రలతో పాటు కరుణ రసాత్మకమైన పాత్రల్లోనూ ప్రాణ్ తనదైన ముద్ర వేశారు. ఆయనకు చలన చిత్ర రంగంలో దేశంలోనే అత్యున్నత పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు 2012 సంవత్సరానికి లభించింది. దాదాపు నాలుగు వందల చిత్రాల్లో నటించిన ప్రాణ్, దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్నారు. కాశ్మీర్ కీ కలీ, ఖాందాన్, ఔరత్, బడీ బెహన్, జిస్ దేశ్‌మే గంగా బెహతీ హై, హాఫ్ టికెట్, మధుమతి, పూరబ్ ఔర్ పశ్చిమ్, జంజీర్, బాబీ, డాన్, రామ్ ఔర్ శ్యామ్ వంటి చిత్రాల్లో శక్తిమంతమైన పాత్రలు పోషించి, ప్రేక్షకులను మెప్పించారు. పాత ఢిల్లీలో 1920 ఫిబ్రవరి 12న జన్మించిన ప్రాణ్ అసలు పేరు ప్రాణ్ కేవల్ సికంద్. కపుర్తలా, ఉన్నావో, మీరట్, డెహ్రాడూన్, రామ్‌పూర్ తదితర ప్రాంతాల్లో విద్యాభ్యాసం సాగించారు. తొలుత ఫొటోగ్రాఫర్‌గా రాణించాలనుకున్న ప్రాణ్, అనుకోకుండా నటుడిగా మారారు. ‘యమ్లా జాట్’ అనే పంజాబీ చిత్రం ద్వారా 1940లో ఆయన హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత చౌదరి (1941), ఖాందాన్ (1942), కైసే కహూ (1945), బద్నామీ (1946) వంటి చిత్రాల్లో నటించారు. దేశ విభజన తర్వాత భార్య శుక్లా, కుమారులు అరవింద్, సునీల్‌లతో కలసి లాహోర్ నుంచి ముంబైకి మకాం మార్చారు. ముంబైకి వచ్చిన తొలినాళ్లలో వేషాలు దొరుకుతాయనే ఆశలు దాదాపు వదిలేసుకున్న దశలో ప్రముఖ రచయిత సాదత్ హసన్ మాంటో సాయంతో దేవానంద్ కథానాయకుడిగా నటించిన ‘జిద్దీ’ (1948) చిత్రంలో వేషం దక్కించుకున్నారు. అప్పటి నుంచి ప్రాణ్ కెరీర్ పుంజుకుంది. 1969-82 కాలంలో ప్రాణ్ బాలీవుడ్‌ను దాదాపు మకుటంలేని మహారాజులా ఏలారు. ఒకవైపు విలన్‌గా రాణిస్తున్న కాలంలోనే ‘ఉపకార్’లో మంగల్ చాచా, ‘జంజీర్’లో అమితాబ్ బచ్చన్‌కు సహచరునిగా షేర్‌ఖాన్, ‘పరిచయ్’లో తాతయ్య వంటి సున్నితమైన పాత్రలతోనూ ప్రేక్షకులను మెప్పించారు. తాండ్ర పాపారాయుడు, కొదమసింహం చిత్రాల ద్వారా ప్రాణ్ తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువయ్యారు. విలన్ వేషాలతో గుర్తింపు పొందిన ప్రాణ్, నిజ జీవితంలో మాత్రం చాలా ఉదారుడు, సున్నిత హృదయుడు. పాకిస్థాన్‌తో యుద్ధం ముగిశాక, బంగ్లా శరణార్థుల కోసం 1971లో చారిటీ షో నిర్వహించారు. పేదలు, వికలాంగులను ఆదుకునేందుకు కూడా పలుసార్లు ఇలాంటి ప్రదర్శనలు నిర్వహించి, వాటి ద్వారా సమకూరిన నిధులను మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చారు. ‘అండ్ ప్రాణ్’ పేరిట ఆయన రాసిన ఆత్మకథకు అమితాబ్ బచ్చన్ ముందుమాట రాశారు.

మోడీ ' హిందూ రూపం...

న్యూఢిల్లీ,జులై 13: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తనను తాను హిందూ జాతీయవాదిగా అభివర్ణించుకున్నారు. తాను హిందువులను, ముస్లింలను, క్రైస్తవులను వేర్వేరుగా చూడనని, అందర్నీ భారతీయులుగానే భావిస్తానని చెప్పారు. అదే సమయంలో గుజరాత్‌లో 2002 సంవత్సరంలో అల్లర్లు చెలరేగినప్పుడు తాను తీసుకున్న నిర్ణయాలు ముమ్మాటికీ కరెక్టేనని ఆయన రాయ్‌టర్స్ వార్తా సంస్థకు  ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉద్ఘాటించారు. భారత్‌కు లౌకికవాద నాయకుడు ఉండాలని విశ్వసిస్తారా అని అడగ్గా.. ‘‘మేం కచ్చితంగా దాన్ని విశ్వసిస్తాం. అయితే లౌకికవాదం అంటే అర్థం ఏమిటి? నా వరకు అయితే ముందు భారత్.. తర్వాతే ఏదైనా.. ఇదే నా లౌకికవాదం. అందరికీ న్యాయం చేయడం, ఎవరినీ బుజ్జగించకపోవడమే నా పార్టీ తత్వం’’ అని  మోడీ చెప్పారు. మైనారిటీ ఓటర్లను ఎలా ఆకట్టుకుంటారని ప్రశ్నించగా మోడీ స్పందిస్తూ.. ఓటర్లందరినీ భారతీయులుగానే చూస్తానన్నారు. ‘‘హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా.. అందరూ భారత దేశ పౌరులే. అందువల్ల వారిని వేర్వేరుగా భావించను. అలా చూస్తే అది ప్రజాస్వామ్యానికే ప్రమాదం. ప్రజాస్వామ్య ప్రక్రియలో మతం ఓ పనిముట్టు కాకూడదు’’ అని వ్యాఖ్యానించారు. కాగా, దేశ నాయకత్వ పగ్గాలు హిందుత్వ నాయకుడి చేతిలోనే ఉండాలని తాము విశ్వసిస్తామని శివసేన తెలిపింది. తాను హిందుత్వ జాతీయవాదినంటూ మోడీ చేసిన వ్యాఖ్యలను గట్టిగా సమర్థించింది. ‘‘హిందుత్వవాదులు ఏ మతానికీ వ్యతిరేకం కాదు’’ అని శివసేన పేర్కొంది.

సీడబ్ల్యూసీ కోర్టుకు ' టీ ' బంతి...

న్యూఢిల్లీ,జులై 13: తెలంగాణ బంతి కాంగ్రెస్ పార్టీలోని అత్యున్నత నిర్ణాయక విభాగమైన వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) కోర్టుకు చేరింది. శుక్రవారం రాష్ట్రమంతా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసిన కాంగ్రెస్ కోర్ కమిటీ దాదాపు రెండు గంటల పాటు ఈ అంశంపై చర్చించిన అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ‘‘తెలంగాణ అంశంపై అన్ని రాజకీయ పార్టీలతో, నేతలతో కాంగ్రెస్ ఇప్పటికే అత్యంత  విస్తృతంగా  సంప్రదింపులు జరిపింది. ఇప్పుడు పార్టీ కోర్ కమిటీ కూడా సమావేశమైంది. సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ అభిప్రాయాలను విన్నాం. ఇక కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని సమావేశపరిచి నిర్ణయం తీసుకుంటాం’’ అంటూ దిగ్విజయ్ సింగ్ మీడియాకు రెండే ముక్కల్లో విషయాన్ని వివరించి వెనుదిరిగారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ప్రధాని మన్మోహన్ నివాసంలో సోనియాగాంధీ సారథ్యంలో జరిగిన కోర్ కమిటీ భేటీలో సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్, రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ, కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే, దిగ్విజయ్, గులాం నబీ ఆజాద్‌లతో పాటు రాహుల్‌గాంధీ కూడా పాల్గొనడం విశేషం. ఆయన కోర్ కమిటీ భేటీకి రావడం ఇదే తొలిసారి. కోర్ కమిటీ సభ్యుడైన కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం విదేశీ పర్యటనలో ఉండటంతో సమావేశంలో పాల్గొనలేదు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలను విడివిడిగా లోనికి పిలిచి వారి నుంచి రోడ్‌మ్యాప్‌లను స్వీకరించడంతో పాటు వారి వాదనలు విన్నారు.

జార్ఖండ్ లో కొలువుతీరిన సంకీర్ణ సర్కార్

             
రాంచీ, జులై 1:  ఎట్టకేలకు జార్ఖండ్‌లో సంకీర్ణ సర్కారు కొలువుతీరింది. జార్ఖండ్‌ ముక్తి మోర్చా, కాంగ్రెస్‌ల పొత్తుతో రాష్ట్రపతి పాలన రద్దయి ప్రభుత్వం ఏర్పడింది. జార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా జేఎంఎం నేత శిబుసోరెన్‌ తనయుడు హేమంత్‌ సోరెన్‌  ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత ఆ రాష్ట్ర గవర్నర్‌ సయ్యద్‌ అహ్మద్‌  రాజ్ భవన్ లో ప్రమాణం చేయించారు. జార్ఖండ్‌ అసెంబ్లీలో 82మంది మెంబర్లకు గాను 42 మంది ఎమ్మెల్యేల మద్దతు తో  జార్ఖండ్‌ ముక్తిమోర్చా  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

Thursday, July 11, 2013

తెలంగాణ ఇస్తామని హామీఇవ్వలేదు...రెండో ఎస్సార్సీపై మాత్రమే ఇచ్చాం...దిగ్విజయ్‌

న్యూఢిల్లీ, జులై 11: తెలంగాణ ఇస్తామని 2004 ఎన్నికల్లో కాంగ్రెస్  హామీ ఇవ్వలేదని  పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇంచార్జి అన్నారు.  ఎన్నికల మ్యానిఫెస్టోలో  రెండో ఎస్సార్సీ ఏర్పాటు చేస్తామని మాత్రమే హామీ ఇచ్చినట్లు దిగ్విజయ్‌సింగ్ ఒక వార్తా సంస్థ కి ఇచ్చిన  ఇంటర్వ్యూలో చెప్పారు.  రాజ్యాంగ సవరణ చేయవలసి ఉన్నందున తెలంగాణ విషయమై యుపిఏ మిత్రపక్షాలు, ప్రతిపక్షాలతో సంప్రదించవలసి ఉంటుందని చెప్పారు. అస్పష్టతకు తావులేని విధంగా నిర్ణయం ఉంటుందని చెప్పారు.అయితే తెలంగాణ అంశంపై నిర్ణయాన్ని ఇక వాయిదా వేసే పరిస్థితి లేదన్నారు.  సమైక్యమా? తెలంగాణ? అనే విషయంలో  గందర గోళానికి తావు లేకుండా నిర్ణయం ఉంటుందని చెప్పారు.

Wednesday, July 10, 2013

ప్రేమ ఫలించకే టెక్కీ ఆత్మహత్య...!

హైదరాబాద్  , జులై 10: మాదాపూర్‌లోని ఒరాకిల్ సంస్థలో పని చేస్తున్న మహిళా సాఫ్టువేర్ ఇంజనీర్ అశ్విని  ప్రేమ విఫలం కావడంతో ఒత్తిడికి లోనై  ఆత్మహత్యకు పాల్పడినట్లుగా ప్రాథమికంగా తేలింది. ఆమె ఉద్యోగం లో చేరిన పదిహేను రోజుల్లోనే ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించిన యువకుడు తాను దూరమవుతానని చెప్పడంతో ఆమె తనువు చాలించినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. అశ్వినీ జూన్ 24న ఒరాకిల్ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగంలో చేరింది.  ఆశ్వినికి చెందిన ఒక డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డైరీలో సూసైడ్ నోట్ లభించింది. జీవితంపై విరక్తి చెంది, మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నానని, తన మరణానికి ఎవరూ బాధ్యులు కారని, తల్లిదండ్రులు తనను క్షమించాలని కోరుతున్నానని.. ఆమె ఆ లేఖలో రాసినట్లు పోలీసులు చెప్పారు. కాగా, అశ్విని గురించి ఆరా తీసిన పోలీసులు.. ప్రేమ విఫలమవడంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు ఒక అంచనాకు వచ్చారు. బెంగళూరులో చదువుకుంటున్నప్పుడు ఆమె తన సహాధ్యాయి రవీష్ జిరోజీని ప్రేమించిందని తెలిసింది. ఆమె హైదరాబాద్ రావడం, అతడు ఉద్యోగరీత్యా ముంబైకి వెళ్లడం, ఇద్దరి మధ్య దూరం పెరగడంతో అశ్విని కొన్నాళ్లుగా మనస్తాపానికి గురయిందని, వైద్యచికిత్స పొందుతోందని పోలీసుల దర్యాప్తులో తేలింది. అశ్విని ప్రేమ వ్యవహారంలో మానసిక ఒత్తిడికి గురికావడంతో నగరంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో మానసిక వైద్య నిపుణుడి వద్ద చికిత్స తీసుకుంటుందని పోలీసులు తెలిపారు. ఆమె ఆత్మహత్య చేసుకునేందుకు నిశ్చయించుకున్నట్లు వైద్యులు గుర్తించారని, ఒంటరిగా ఉంచకూడదని తల్లిదండ్రులకు పదిరోజుల క్రితమే సూచించారని పోలీసులు చెప్పారు. 

ముక్కోణపు సిరీస్ ఫైనల్లో భారత్...

 పోర్ట్ ఆఫ్ స్పెయిన్ , జులై 10:  ముక్కోణపు సిరీస్ లో భాగంగా పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో జరిగిన కీలక మ్యాచ్ లో శ్రీలంక జట్టుపై భారత జట్టు 81 పరుగుల తేడాతో విజయం సాధించి, ఫైనల్లోకి దూసుకెళ్లింది.  టాస్ గెలిచి శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకోవడంతో భారత జట్టు బ్యాటింగ్ చేపట్టింది. మ్యాచ్ 29 ఓవర్లు ముగిసిన తర్వాత వర్షం కురియడంతో ఆటను నిలిపివేశారు. మ్యాచ్ నిలిపివేసే సమయానికి భారత జట్టు 3 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ కు అంతరాయం కలుగడంతో డక్ వర్త్ లూయిస్ పద్దతిన మ్యాచ్ 26 ఓవర్లకు కుదించి శ్రీలంక జట్టుకు 178 పరుగుల లక్ష్యాన్నినిర్ణయించారు. అయితే భారత భౌలర్ భువనేశ్వర్ కుమార్ విజృంభించి 4 వికెట్లు పడగొట్టడంతో శ్రీలంక జట్టు 24.4 ఓవర్లలో 96 పరుగులకు ఆలౌటైంది.  భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన భువనేశ్వర్ కుమార్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

జెడ్డా విమానానికి సాంకేతిక లోపం

హైదరాబాద్, జులై 10:   శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి జెడ్డా వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో బుధవారం తెల్లవారుజామున సాంకేతిక లోపం ఏర్పడింది. దాంతో విమానాశ్రయ అధికారులు విమానాన్ని నిలిపివేశారు. దీంతో జెడ్డా వెళ్లవలసిన110 మంది ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.  విమానంలో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని నివారించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 

Tuesday, July 9, 2013

వెస్టిండీస్ ఫై శ్రీలంక విజయం

 పోర్ట్ ఆఫ్ స్పెయిన్ , జులై 9:  ముక్కోణపు సిరీస్ లో భాగంగా వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో శ్రీలంక 39 పరుగుల తేడాతో విజయం సాధించింది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో ఆదివారం జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా వాయిదా పడటంతో మ్యాచ్ ను సోమవారం కొనసాగించారు. 19 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 60 పరుగులతో ఆటను కొనసాగించిన శ్రీలంక జట్టు 41 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. అయితే వెస్టిండీస్ విజయలక్ష్యాన్ని 41 ఓవర్లలో 230 పరుగులుగా నిర్ణయించారు. 230 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన విండీస్  41 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులే చేసింది.  శ్రీలంక విజయంలో కీలక పాత్ర పోషించిన సంగక్కరకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

సిటీలైట్ హోటల్ భవనం కూలిన ఘటన : మృతుల సంఖ్య 16

హైదరాబాద్, జులై 9: సికిందరాబాద్ లోని  సిటీలైట్ హోటల్ భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 16కి చేరింది. శిథిలాల కింద నుంచి రెండు మృతదేహాలను సహాయక సిబ్బంది మంగళవారం వెలికి తీసింది. మృతుల్లో ఖమ్మంకు చెందిన టీ మాస్టర్ వెంకటేష్, మహబూబ్ నగర్ కు చెందిన కిరణ్ ఉన్నారు. అలీ,భరత్, వెంకటేష్,కిరణ్ అనే మరో నలుగురు వర్కర్ల ఆచూకీ తెలియ రాలేదు. జీహెచ్ ఎంసీ కమిషనర్ కృష్ణబాబు ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సాయంత్రంలోగా శిథిలాలను తొలగిస్తామని ఆయన తెలిపారు. కాగా సిటీ లైట్ హోటల్ ప్రమాద ఘటన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న పాత భవనాలను కూల్చివేయాలని జీహెచ్ ఎంసీ నిర్ణయించింది. దాదాపు 700 పాత భవనాలను గతంలోనే గుర్తించారు. శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలో 23, ఉప్పల్ సర్కిల్ పరిధిలో ఎనిమిది భవనాలను గుర్తించారు. పాతభవనాలను ఉపేక్షించేది లేదని కమిషనర్ కృష్ణబాబు తేల్చిచెప్పారు. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగబోమని ఆయన తెలిపారు.

Sunday, July 7, 2013

గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్...ఆరుగురు మావోయిస్టులు మృతి

మహారాష్ట్ర, జూలై 7 : మహారాష్ట్రలోని గడ్చిరోలి వద్ద ఆదివారం తెల్లవారు జామున భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలతో సహా ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. గడ్చిరోలీలోని పేటపల్లి వద్ద మావోయిస్టులు సమావేశమైనట్లు అందిన  సమాచారం పై  పోలీసు బలగాలు కూంబింగ్ నిర్వహించడంతో మావోయిస్టులు ఎదురుపడడంతో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. సంఘటనా ఘటనలో భారీగా ఆయుధ సామాగ్రి లభ్యమైనట్లు తెలియవచ్చింది. 

ప్రేలుళ్ళతో దద్దరిల్లిన బుద్ధగయ...

పాట్నా , జులై 7:    బీహార్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం బుద్ధగయ ఆదివారం ఉదయం వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. మహాబోధి ఆలయం సమీపంలో 8 వరుస పేలుళ్లు సంభవించాయి. స్వల్ప వ్యవధిలో జరిగిన ఈ పేలుళ్లలో ఇద్దరు సన్యాసులు తో సహా ఐదుగురు  గాయపడ్డారు. ప్రేలుడు ధాటికి   ఆలయం లోని కొంత భాగం దెబ్బ తింది.   ఆలయం వెలుపల పేలకుండా ఉన్న మరో బాంబును భద్రతా సిబ్బంది నిర్వీర్యం చేశారు. ఫోరెన్సిక్ నిపుణులు పేలుళ్లు జరిగిన ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. గాయపడిన ఇద్దరినీ సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 2002 లో హెరిటేజ్ సైట్ గా యునెస్కో గుర్తింపు పొందిన మహాబోధి ఆలయం ఉగ్రవాదుల హిట్ లిస్టు లో ఉన్నట్టు సమాచారం. ఇక్కడ సాధారణంగా సెప్టెంబర్ నుంచి పర్యాటకుల రద్ది ఎక్కువగా ఉంటుంది.      


అమెరికాలో విమాన ప్రమాదం- ఇద్దరు మృతి

వాషింగ్టన్ , జులై 7:  అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన విమాన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. 49 మంది తీవ్రంగా గాయపడ్డారు. దక్షిణ కొరియాకు చెందిన బోయింగ్ 777 ఆసియానా ఎయిర్‌లైన్స్‌ విమానం ల్యాండింగ్‌ సమయంలో కూలిపోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
దక్షిణ కొరియా రాజధాని సియోల్ నుంచి ఇక్కడి చేరుకున్న ఈ విమానం కిందకు దిగుతుండగా ప్రమాదానికి గురయిందని  సమాచారం. ప్రమాద సమయంలో విమానంలో 291 మంది ప్రయాణికులు, 16 మంది విమాన సిబ్బంది ఉన్నారు. 82 మందిని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాద  కారణాలు తెలియరాలేదు. 

వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేత బర్తోలీ ...

లండన్, జులై 7:  ఏమాత్రం అంచనాలు లేకుండా వింబుల్డన్ టోర్నమెంట్‌లో అడుగుపెట్టిన 28 ఏళ్ల  ఫ్రాన్స్ క్రీడాకారిణి బర్తోలీ  విజేతగా అవతరించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో 15వ సీడ్ బర్తోలీ 81 నిమిషాల్లో 6-1, 6-4తో 23వ సీడ్ సబైన్ లిసికి (జర్మనీ) పై విజయం సాధించింది. కెరీర్‌లో 47వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడిన బర్తోలీకిదే తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విశేషం. 2007లో వింబుల్డన్ టోర్నమెంట్‌లో తొలిసారి ఫైనల్‌కు చేరిన బర్తోలీ టైటిల్ పోరులో వీనస్ విలియమ్స్ (అమెరికా) చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. ఆరేళ్ల తర్వాత అదే టోర్నమెంట్‌లో... అదే వేదికపై... అంతిమ సమరంలో ఓడిపోయిన చోటే విజేతగా నిలిచింది.  బర్తోలీకి వింబుల్డన్ ట్రోఫీతోపాటు 16 లక్షల పౌండ్లు (రూ. 14 కోట్ల 36 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించింది. రన్నరప్ లిసికి ఖాతాలో 8 లక్షల పౌండ్లు (రూ. 7 కోట్ల 18 లక్షలు) చేరాయి. అగ్రశ్రేణి క్రీడాకారిణులను ఓడించి టైటిల్ పోరుకు చేరిన లిసికి ఫైనల్లో ఓటమి తర్వాత కన్నీళ్లపర్యంతమైంది. 

Saturday, July 6, 2013

వింబుల్డన్...అతికష్టం మీద ఫైనల్స్ కు జొకోవిచ్

లండన్, జులై 6: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌ పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ అతికష్టం మీద గెలిచి ఫైనల్స్ కు చేరాడు.  ఎనిమిదో సీడ్ డెల్ పొట్రో (అర్జెంటీనా)తో 4 గంటల 44 నిమిషాలపాటు హోరాహోరీ సమరంలో ఈ సెర్బియా స్టార్ జొకోవిచ్  7-5, 4-6, 7-6 (7/2), 6-7 (6/8), 6-3 పై విజయం సాధించాడు. వింబుల్డన్ టోర్నమెంట్ చరిత్రలోనే సుదీర్ఘంగా సాగిన సెమీఫైనల్‌గా ఈ మ్యాచ్ నిలిచింది. డెల్ పొట్రోతో జరిగిన మ్యాచ్‌లో జొకోవిచ్‌కు ఊహించని ప్రతిఘటన ఎదురైంది. ఇద్దరూ బేస్‌లైన్ ఆటతీరుతో సుదీర్ఘ ర్యాలీలు ఆడుతూ అభిమానులను ఉద్వేగానికి గురి చేశారు.

ట్రై సిరీస్... కీలక మ్యాచ్ లో గెలిచిన భారత్

ట్రినిటాడ్, జులై 6:  ముక్కోణపు టోర్నిలో భారత బౌలర్లు సమిష్టిగా రాణించడంతో వెస్టిండీస్ పై భారత జట్టు 102 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచి పోవడంతో డక్ వర్త్ లూయిస్ పద్దతిన విండీస్ లక్ష్యాన్ని 39 ఓవర్లలో 274 పరుగుల లక్ష్యాన్ని నిర్ణయించారు. వెస్టిండీస్ జట్టు 171 పరుగులకు ఆలౌటైంది. చార్లెస్ (45), రోచ్ (34), నరైన్(24) లు భారత బౌలర్లను కొంత ప్రతిఘటించగా మిగితావారందరూ తక్కువ స్కోరుకే అవుటయ్యారు.  భారత బౌలర్లు భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్ మూడేసి వికెట్లు, ఇషాంత్ శర్మ, జడేజాలు రెండేసి వికెట్లు పడగొట్టారు.  అంతకుముందు వెస్టిండీస్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టుకు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. ధావన్, రోహిత్ లు కలిసి తొలి వికెట్ కు 123 పరుగులు జోడించారు. 69 పరుగులు చేసి మంచి ఊపు మీద కనిపించిన శిఖర్ ధావన్ ను రోచ్ అవుట్ చేయగా, రోహిత్ శర్మను 46 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బెస్ట్ పెవిలియన్ కు పంపాడు. ఆతర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ (102) విజృంభించి సెంచరీ చేయడంతో వెస్టిండీస్ ముందు 312 పరుగుల భారీ లక్ష్యాన్ని ముందుంచింది. భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 311 పరుగులు చేసింది. భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ విరాట్ కోహ్లికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు   లభించింది. 

Friday, July 5, 2013

ఐదు కిలోలతో ఆహార భద్రత....

న్యూఢిల్లీ,జులై 5:  ఆహార భద్రత  ఆర్డినెన్స్‌ కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు. ఆర్డినెన్స్ పై  కేంద్ర ప్రభుత్వం నిన్న రాత్రి ఆర్డినెన్స్ ను ప్రణబ్ ముఖర్జీ ఆమోదం కోసం పంపింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదంతో ఆర్డినెన్స్ తక్షణం అమల్లోకి వచ్చింది.  రాష్ట్ర ప్రభుత్వాలు లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసుకున్న తరువాత.. ఆగస్టు నుంచి ఈ కార్యక్రమం అమల్లోకి వస్తుంది.  దేశంలోని మూడింట రెండు వంతుల జనాభాకు (60 శాతానికి పైగా) దీని వల్ల లబ్ధి చేకూరనుంది. కుటుంబంలోని ఒక్కొక్కరికి నెలకు కేజీ రూపాయి నుంచి మూడు రూపాయల లోపు సబ్సిడీ ధరతో ఐదు కేజీల ఆహార ధాన్యాలను ఇచ్చేందుకు ఈ బిల్లు రూపొందింది. ఒక లక్షా 25 వేల కోట్ల రూపాయలను సబ్సిడీ కింద ప్రభుత్వం భరించడానికి సిద్ధమవుతున్న ఈ పధకం ప్రపంచంలోనే అతి బృహత్తర కార్యక్రమం  కావడం విశేషం. వాస్తవానికి ఈ పథకాన్ని గత బడ్జెట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టి ఆమోదించాలని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేసింది. అయితే, యూపీఏ సర్కారుపై వచ్చిన అనేక అవినీతి కుంభకోణాలపై ప్రతిపక్షాల ఆందోళనలతో ఆ అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆర్డినెన్స్ రూపంలో పథకాన్ని అమల్లోకి తీసుకు రావాలని యూపీఏ సిద్ధమైంది. ఆర్డినెన్స్ తీసుకొచ్చినా, ఈ బిల్లుకు ఉభయ సభల ఆమోదం తప్పనిసరి.

Wednesday, July 3, 2013

విభజన అసాధ్యం...కిరణ్ మనోగతం...?

హైదరాబాద్, జులై 3: 'ఏమీ జరగదు- 'రాష్ట్ర విభజనఅంత సులువైన పని కాదు' ఇది అని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మనోగతం. "రాష్ట్ర విభజన జరిగితే గందరగోళం నెలకొంటుంది. ఇప్పుడున్న ఉద్యమాలకంటే తీవ్రమైన ఉద్యమాలు తలెత్తే ప్రమాదం ఉంది. జలాల పంపిణీ, సరిహద్దు సమస్య వంటి అనేకం తెరపైకి వస్తాయి. ఇవి అంత త్వరగా పరిష్కారం అయ్యేవి కావు'' అని  ఆయన కొందరు మంత్రుల వద్ద వ్యాఖానించినట్టు సమాచారం.

టి.డి.పి. సైలెంట్... టి.ఆర్..ఎస్.లో టెన్షన్...

హైదరాబాద్, జులై 3:  తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌లో పరిణామాలపై ఎవరూ నోరు మెదపవద్దని పార్టీ నేతలను తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రత్యేక రాష్ర్ట ఏర్పాటుకు అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా పార్టీ ఇబ్బందులు ఎదుర్కోక తప్పదన్నారు. కాంగ్రెస్‌లో జరుగుతున్న హడావుడిపై ఇరు ప్రాంతాల టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత పరిణామాలు ఏ రకంగా చూసినా టీడీపీకే తీవ్ర నష్టం తప్పదన్న అంచనాకు ఆ పార్టీ నేతలొస్తున్నారు.  ఇవన్నీ ఒక పథకంలో భాగమేనని, స్థానిక ఎన్నికలు అయిపోయిన తరువాత ఈ అంశాన్ని కేంద్రం అటకెక్కిస్తుందని  చంద్రబాబు పార్టీ సీనియర్లతో వ్యాఖ్యానించినట్లు  సమాచారం.
టి.ఆర్..ఎస్.లో టెన్షన్... 
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం విషయంలో కాంగ్రెస్ పార్టీలో తాజా గా మొదలైన హడావుడి ఆంతర్యమేమిటో తెలంగాణ రాష్ట్ర సమితి నేతలకు అంతుచిక్కటం లేదు. అధికార పార్టీ నేతల హడావుడి కేవలం ఎన్నికల స్టంటా? లేదంటే రాష్ట్ర ఏర్పాటు దిశగా కేంద్రం నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నాయా? అన్నదానిపై ఒక అంచనాకు రాలేక మల్లగుల్లాలు పడుతున్నారు.  కాంగ్రెస్ తమ పార్టీని టార్గెట్ చేసుకునిగానీ వ్యవహరిస్తోందా? అన్న అనుమానాలు కూడా టీఆర్‌ఎస్ నేతల్లో వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ విషయంలో గతంలో అనేకసార్లు తమ అధినేత కేసీఆర్‌తో మాట్లాడిన ఢిల్లీ పెద్దలు ఇప్పుడు ఆ అంశంపై ఎలాంటి సంప్రదింపులు జరపపోవటంపై టీఆర్ ఎస్‌లో చర్చ జరుగుతోంది. గతంలో ఢిల్లీ పెద్దలు తనతో టచ్‌లో ఉన్నారంటూ పలుమార్లు చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు మౌనంగా ఉండడం పార్టీ శ్రేణులకు విస్మయం కలిగిస్తోంది. 

జాడలేని వారు ఇంకా వేలల్లోనే...

ముగిసిన సహాయ చర్యలు...  
డెహ్రాడూన్, జులై 3:  కనీవినీ ఎరుగని వరద బీభత్సంతో అతలాకుతలమైన  ఉత్తరాఖండ్‌లో ఎట్టకేలకు సహాయ చర్యలు ముగిశాయి.  17 రోజులపాటు నిరాటంకంగా సాగిన సహాయక పనులు మంగళవారంతో పూర్తయ్యాయి. ప్రపంచంలోనే అతిపెద్ద సహాయక కార్యక్రమంగా చెబుతున్న ఈ మహాక్రతువులో ఆర్మీ, వాయుసేన, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), జాతీయ విపత్తు స్పందన దళానికి (ఎన్‌డీఆర్‌ఎఫ్) చెందిన సిబ్బంది అనేక సవాళ్లను అధిగమిస్తూ మొత్తం 1.10 లక్షల మందిని కాపాడారు. బద్రీనాథ్ నుంచి మంగళవారం 150 మందిని కాపాడడంతో సహాయక పనులు పరిసమాప్తమయ్యాయి. కాగా  మృతుల సంఖ్య, ఆచూకీలేని వారి సంఖ్య నేటికీ తేలలేదు. ఆచూకీలేని వారు 3 వేల మంది మాత్రమే అని అధికారిక లెక్కలు చెబుతున్నా.. వీరి సంఖ్య 11 వేలకుపైగా ఉండొచ్చని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ తెలిపింది.   బాధితులు, యాత్రికుల తరలింపు పూర్తిగా ముగిసినా కేదార్‌నాథ్‌లో దారుణమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఓవైపు శవాల కుప్పలు.. మరోవైపు మట్టిదిబ్బల కింద కుళ్లిపోతున్న మృతదేహాలతో పరిసర ప్రాంతాలన్నీ దుర్గంధం వెదజల్లుతున్నాయి. వాతావరణం సహకరించకపోవడంతో వరుసగా నాలుగోరోజు సామూహిక అంత్యక్రియల ప్రక్రియకు ఆటంకం కలిగింది.

Tuesday, July 2, 2013

'తేలిపోయే' దశకు తెలగాణా...

హైదరాబాద్, జూలై 1 : "నేను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మా రాష్ట్రం నుంచి ఛత్తీస్‌గఢ్ విడిపోయింది. రాష్ట్ర విభజన బాధ ఏమిటో నాకు తెలుసు. రాష్ట్ర విభజన అంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి అటెండర్ వరకూ అందరూ విడిపోవాల్సిందే! సచివాలయం నుంచి అన్ని కార్యాలయాలూ పంచుకోవాల్సిందే! చివరికి కుర్చీలు, బల్లలు కూడా పంచుకోక తప్పని పరిస్థితి. విభజన తర్వాత... విద్యుదుత్పాదక సంస్థలన్నీ ఛత్తీస్‌గఢ్‌లో ఉండగా, వినియోగదారులు మాత్రం మధ్యప్రదేశ్‌లో ఉన్నారు. పంజాబ్, హర్యానా విడిపోయి 40 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఈ రెండు రాష్ట్రాల మధ్య న్యాయపరమైన వివాదాలు తొలగిపోలేదూ' అని తెగ బాధ పడిపోయిన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ తెలంగాణ అంశం తుది దశలో ఉందని, వారంలో జరిగే కోర్ కమిటీ సమావేశంలో తెలంగాణపై చర్చించి  పది రోజుల్లో తేల్చేస్తాం'' అని స్పష్టం చేశారు. అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా ఇరు ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ నేతలు కట్టుబడి ఉండాలని సూచించారు.  ఈసారి జరిగే కోర్‌కమిటీ భేటీకి  రాష్ట్రం నుంచి కిరణ్, బొత్సను కూడా పిలుస్తున్నామని వివరించారు. అయితే...వారిద్దరు సీమాం«ద్రులు కావడంతో.. కోర్ కమిటీ ముందు తెలంగాణ నుంచి వాణిని విన్పించేందుకు దామోదరను కూడా పిలుస్తామని దిగ్విజయ్ చెప్పారు.
 తెలంగాణపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా... అది దేశ, రాష్ట్ర ప్రయోజనాలకు ఉత్తమమైనదిగా ఉండాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మేలు చేసేలా ఉండాలని తెలిపారు. "రాష్ట్రాన్ని కలిపే ఉంచాలా? విభజించాలా? అనే అంశంపై ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత పార్టీపరంగా ఎలాంటి వ్యూహం ఉండాలి? పరిపాలనపరంగా ఎలాంటి కార్యాచరణ ఉండాలి? అనే అంశంపై రోడ్‌మ్యాప్ రూపొందించాల్సిందిగా కిరణ్, రాజనరసింహ, బొత్సలను కోరాను'' అని దిగ్విజయ్ తెలిపారు. అసెంబ్లీ తీర్మానానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు'' అని వివరించారు. శ్రీకృష్ణ సిఫారసులు కూడా పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు.

దౌర్భాగ్యపు ఆర్టీసికి బాసటగా దిక్కుమాలిన ప్రభుత్వం .

ప్రయాణీకులపై రూ.150 కోట్ల సెస్ వడ్డన  

హైదరాబాద్ , జులై 2:  ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ మరోసారి తన దౌర్భాగ్యాన్ని చాటుకుంది. తన సిబ్బంది జీత భత్యాలకోసం, తన న్ర్వహణ ఖర్చులకోసం ప్రయాణికులపై నిస్సిగ్గుగా  భారం మోపింది.  దరిద్రపు గొట్టు ప్రభుత్వం కూడా ఇందుకు ఆమోదం తెలిపింది. సెస్ పేరిట టికెట్‌కు ఒక రూపాయి వసూలు చేస్తారుట.  సెస్ ద్వారా వచ్చే నిధులను బస్టాండ్లలో ప్రయాణికుల సౌకర్యాల కల్పనకు, కొత్త బస్టాండ్ల నిర్మాణం, అభివృద్ధికి మాత్రమే వినియోగించాలని గొప్పగా నిబంధన పెట్టిన  సర్కార్  పీకేదేమిటో మరి...  సిటీ సర్వీసులు, జిల్లా పరిధిలో తిరిగే ఆర్డినరీ బస్సులకు మాత్రం సెస్ వసూలు నుంచి మినహాయింపు ఇచ్చారు. ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ (ఇంద్ర, గరుడ, గరుడ ప్లస్, వెన్నెల) బస్సుల్లో ప్రయాణించే ప్రతి ఒక్కరిపై రూ.1 భారం పడనుంది. ఆర్టీసీలో ప్రస్తుతం దాదాపు 23,500 బస్సులు ఉన్నాయి. రోజూ దాదాపు 1.4 కోట్ల మంది ప్రయాణికులు సంస్థ సేవలను వినియోగించుకుంటున్నారు. మొత్తం బస్సుల సంఖ్యలో 40 శాతం ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులు ఉన్నాయి. మొత్తం ప్రయాణికుల్లో 30 శాతం మంది వీటిలోప్రయాణిస్తారు. అంటే రోజూ దాదాపు 40 లక్షల మందికిపైగా ప్రయాణికులు ఈ సెస్ భారాన్ని భరించాల్సి ఉంటుంది. అంటే ఏటా దాదాపు రూ.150 కోట్ల ఆదాయం ఆర్టీసీకి సమకూరనుంది. 

నావిగేషన్ వ్యవస్థ ఇక మనకూ స్వంతం....

 'ఐఆర్ఎన్ఎస్ఎస్ -1ఏ' ప్రయోగం సక్సెస్... 

శ్రీహరికోట, జులై 2:  భారతదేశపు సొంత నావిగేషన్ వ్యవస్థలోని తొలి ఉపగ్రహం 'ఐఆర్ఎన్ఎస్ఎస్ -1ఏ' ను  సోమవారం రాత్రి  పీఎస్ఎల్వీ-సీ22 రాకెట్ ద్వారా విజయవంతంగా ప్రయోగించారు. సోమవారం అర్ధరాత్రి 11:41 గంటలకు  ప్రయోగించిన  20.25 నిమిషాలకు ఇండియన్ రీజనల్  ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహ కక్ష్యను పెంచే ప్రక్రియను వారంలోగా హసన్ కేంద్రం చేపట్టనున్నట్లు ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ వెల్లడించారు. ఉపగ్రహంలో ద్రవ ఇంధనంతో నింపిన అపోజీ మోటార్లను (ఎల్ఎఎం) పనిచేయిస్తూ భూమధ్య రేఖకు 29 డిగ్రీల వాలులో 55 డిగ్రీల తూర్పు అక్షాంశంలోని భూస్థిర కక్ష్యలోకి చేర్చనున్నారు. ఇలా రెండేళ్లలో మరో మూడు ఉపగ్రహాలు ప్రయోగించి వాహన చోదకులకు మార్గ సమాచారాన్ని ఇస్రో అందజేయనుంది. అలాగే భవిష్యత్తులో 11 ఉపగ్రహాలను ప్రయోగించి దేశంతోపాటు చుట్టుపక్కల 1500 కిలోమీటర్ల పరిధికి కూడా సమాచారాన్ని అందించే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ ఉపగ్రహం రెండు రకాల సేవలను అందిస్తుంది. వీటిలో స్టాండర్డ్ పొజిషనింగ్ సర్వీస్ సాధారణ పౌరుల వినియోగానికి, రిస్ట్రిక్టెడ్ సర్వీస్ మిలటరీ వినియోగానికి ఉపయోగపడనున్నాయి. కాగా, ఈ ప్రయోగంతో భారత్.. నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ కలిగిన అమెరికా, రష్యా, చైనా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీల సరసన చేరింది.


 

Monday, July 1, 2013

ఇదిగిదిగో తెలంగాణా...

 హైదరాబాద్,   జులై 1:  'తెలంగాణ ఇచ్చేది మేమే.. తెచ్చేది మేమే' అని ఇన్నాళ్లూ ప్రకటించిన కాంగ్రెస్... ఒక వేళ నిజంగా నే  ప్రత్యేక రాష్ట్రం వస్తే  ఆ  పన్నిన వ్యూహం ఫలించింది.    ఆదివారం హైదరాబాద్ నిజాం కాలేజీ మైదానంలో తెలంగాణ సాధన పేరిట పెద్ద బహిరంగ సభ నిర్వహించారు. ఇక్కడే ఇటీవల టీఆర్ఎస్, బీజేపీ నిర్వహించిన వాటికన్నా... భారీ స్థాయిలో జన సమీకరణ జరిపిన ఈ సభలో, తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలంతా ఒకే వేదికపై నిలిచి, ఒకే మాట వినిపించారు. వర్గాలు, వైషమ్యాలతో ఇన్నాళ్లూ దూరదూరంగా ఉంటూ వచ్చిన నాయకులంతా ఒక్కటై తెలంగానం పాడారు. ఇప్పటిదాకా ఉద్యమం ఊసెత్తనివారు, అధిష్ఠానానికి అత్యంత విధేయులుగా పేరుబడ్డవారు, ఆచితూచి మాట్లాడేవారు, ఆవేశపరులు అంతా కలసికట్టుగా చేతిలో చెయ్యేసి తెలంగాణ వస్తోందని తేల్చి చెప్పేశారు. ప్యాకేజీ గ్యీకేజీ ఏమీ లేదని, సోనియా నేతృత్వంలోనే ప్రత్యేక రాష్ట్ర ప్రకటన రాబోతోందని వెల్లడించారు. తెలంగాణకు మరో ప్రత్యామ్నాయం లేదంటూ సాధన సభలో తీర్మానం చేశారు. 'అధిష్ఠానం మనసులో ఏముందో తెలియకే ఇన్నాళ్లూ అవమానాలు భరించామని' పేర్కొనడం ద్వారా, అధిష్ఠానం మనోగతం తమకు తెలిసినట్టు, ఆమోదం తీసుకునే సభ నిర్వహించినట్టు టీ నేతలు  చెప్పుకొచ్చారు. "మా అస్తిత్వాన్ని గౌరవించండి.. మీ అస్తిత్వాన్ని గౌరవిస్తాం.. పరస్పరం గౌరవించుకుందాం.. ప్రాంతాలుగా విడిపోదాం'' అని సీమాంద్రులకు పిలుపునిచ్చారు.

చాంపియన్ కు షాక్...

జమైకా, జులై 1: ముక్కోణపు సిరీస్ లో  వెస్టిండీస్ వరసగా రెండవ విజయం నమోదు చెసింది.  భారత్ తో  జరిగిన మ్యాచ్ లో వెస్టిండీస్  ఒక వికెట్ తేడాతో గెలుపొందింది. భారత జట్టు నిర్దేశించిన 230 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ 9 వికెట్లు కోల్పోయి 47.4 ఓవర్లలో 230 పరుగులు చేసింది.  ఓపెనర్ చార్లెస్ (97) ఒంటరి పోరాటంతో విండీస్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.  భారత బౌలర్లలో యాదవ్ 3, శర్మ, అశ్విన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. విండీస్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ చేపట్టిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. భారత జట్టులో అత్యధికంగా రోహిత్ శర్మ 60, రైనా 44, ధోని 27, జడేజా 15 పరుగులు చేశారు. రోచ్, బెస్ట్, సమ్మి రెండేసీ వికెట్లు, శ్యామ్యూల్ ఒక వికెట్ పడగొట్టారు.

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...