కిరణ్ మార్పు, తెలంగాణ అంశాల పై ఊహాగానాలు...

న్యూఢిల్లీ,ఆగస్ట్ 11: రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఢిల్లీలో బిజీ ఉండడంతో రాష్ట్ర రాజకీయాలపై పెద్ద యెత్తున ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చానని, తన భేటీలకు రాజకీయ ప్రాధాన్యత ఏమీ లేదని గవర్నర్ అన్నారు. అయితే, ఆయన అలా అన్నప్పటికీ ఏదో జరుగుతోందనే ప్రచారం మాత్రం జరుగుతోంది.గవర్నర్ నరసింహన్ కాంగ్రెసు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌తో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరాన్ని, హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేను కలిశారు. దానికి తోడు, పెట్రోలియం శాఖ మంత్రి ఎస్ జైపాల్ రెడ్డితో గంటకు పైగా చర్చలు జరిపారు. పైగా, జైపాల్ రెడ్డి శనివారం సాయంత్రం హైదరాబాదులోని పిసిసి కార్యాలయం గాంధీభవన్‌లో జరిగే సన్మాన కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంది. కానీ, దానికి ఆయన హాజరు కాలేదు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రానికి గ్యాస్ కేటాయింపులపై చెలరేగిన వివాదం కారణంగానే మనస్తాపానికి గురై జైపాల్ రెడ్డి రాలేదని చెబుతున్నప్పటికీ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఢిల్లీలో ఉండాల్సిన అవసరం ఏర్పడిందని, దానివల్లనే ఆయన రాలేదని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. గవర్నర్ భేటీ తర్వాత సుశీల్ కుమార్ షిండే మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన అన్నారు. తెలంగాణ చాలా సున్నితమైన అంశమని, తాను ఇప్పుడు ఏమీ మాట్లాడబోనని ఆయన అన్నారు. తాను కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా పనిచేశానని, ఆ రాష్ట్ర గవర్నర్‌గా పనిచేస్తున్న నరసింహన్ కలిసినప్పుడు ఇరువురి మధ్య సంభాషణ జరగడం సహజమని ఆయన అన్నారు. అన్ని విషయాలు గవర్నర్‌తో మాట్లాడినట్లు ఆయన తెలిపారు.     

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు