Wednesday, August 29, 2012

నరోదా పాటియా అల్లర్ల కేసు: బీజేపీ ఎమ్మెల్యే మాయా కొద్నానీ సహా 32 మంది దోషులు

అహ్మదాబాద్, ఆగస్ట్ 29:  గుజరాత్ లో 2002లో గోధ్రా రైలు దహన ఘటన అనంతరం జరిగిన నరోదా పాటియా అల్లర్ల కేసులో నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితురాలు, బీజేపీ నరోదా నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మాయా కొద్నానీ, బజ్‌రంగ్‌దళ్ నేత బాబూ బజ్‌రంగీ సహా 32 మందిని కోర్టు దోషులుగా తేల్చింది. అల్లర్ల సమయంలో 97 మంది ముస్లింలను వీరంతా సజీవదహనం చేసినట్లు నిర్ధారించింది. మరో 29 మంది నిందితులను సరైన ఆధారాలు లేనందున నిర్దోషులుగా పేర్కొన్నారు. నిందితుల్లో ఒకరైన సురేశ్ అలియాస్ రిచర్డ్ చారాను అత్యాచారం కేసులో కోర్టు దోషిగా తేల్చింది. దోషులకు శిక్షల ఖరారుపై వాదనలు విన్న న్యాయమూర్తి ఈ నెల 31న వాటిని ఖరారు చేయనున్నారు. జడ్జి తీర్పు వెలువరించడంతో కోర్టు హాల్లో ఉన్న కొద్నానీ అక్కడే భోరున విలపించారు. ఈ కేసులో బెయిల్‌పై ఉన్న కొద్నానీ సహా ఇతర దోషులను తీర్పు అనంతరం కస్టడీలోకి తీసుకొని సబర్మతి జైలుకు తరలించారు.  ఈ కేసులో తొలుత 46 మందిని గుజరాత్ పోలీసులు అరెస్టు చేయగా 2008లో సుప్రీంకోర్టు నియమిత ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరో 24 మందిని అరెస్టు చేసింది. మొత్తం 70 మంది నిందితుల్లో ఆరుగురు అభియోగాల నమోదుకు ముందే మరణించగా మోహన్ నేపాలీ, తేజస్ పాఠక్‌లు బెయిల్‌పై బయటకు వచ్చి పరారయ్యారు. మొత్తం 327 మంది సాక్షులను కోర్టు విచారించింది. గోధ్రా రైలు దహన ఘటన జరిగిన మర్నాడు (2002 ఫిబ్రవరి 28న) నరోదా పాటియా ప్రాంతంలో వీహెచ్‌పీ బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్ సందర్భంగా పెద్ద సంఖ్యలో గుమిగూడిన ఆందోళనకారులు ఓ వర్గానికి చెందిన వారిపై దాడి చేశారు. ఈ దాడిలో 97 మంది మృతిచెందగా మరో 33 మంది గాయపడ్డారు. మోడీ కేబినెట్‌లో 2007 నుంచి స్త్రీ, శిశుసంక్షేమశాఖ మంత్రిగా ఉన్న కొద్నానీని ఈ కేసులో ఆరోపణలపై 2009 మార్చిలో పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఆమె తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. 1998లో ఆమె తొలిసారి నరోదా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆపై మరో రెండుసార్లు ఇదే నియోజకవర్గం నుంచి గెలిచారు. దాడుల సమయంలో ఆమె ఎమ్మెల్యేగా ఉన్నారు. బీజేపీ అగ్రనేత ఎల్.కె. అద్వానీ ప్రోద్బలంతో మంత్రి పదవి దక్కించుకున్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...