తెలుగు, ఉర్దూ సాహితీవేత్త సామల సదాశివ కన్నుమూత
న్యూఢిల్లీ,,ఆగస్ట్ 7: ప్రముఖ తెలుగు, ఉర్దూ సాహితీవేత్త సామల సదాశివ (85) మంగళవారం ఉదయం కన్నుమూశారు. హిందుస్తానీ సంగీతంపై ఆయన రాసిన ' స్వరలయలు ' గ్రంథానికి ఇటీవలే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. హిందీ, ఉర్దూ, సంస్కృతం, మరాఠీ, పార్శీ భాషల నుంచి పలు గ్రంథాలను ఆయన తెలుగులోకి అనువదించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి ఆయన గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. 2006లో రాజీవ్ ప్రతిభా పురస్కారం అందుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా దయాగామ్ మండలం చెరుపల్లి ఆయన స్వగ్రామం. 1928లో జన్మించిన ఆయన ఆదిలాబాద్‌లోని విద్యానగర్‌లో ఉంటున్నారు. వృత్తిరీత్యా ఆయన ఉపాధ్యాయుడు. యాది అనే ఆయన రచన విశేష ప్రాచుర్యం పొందింది. ఉర్దూలో అంజాద్ రుబాయిలు, హిందుస్థానీ గజల్స్ ఆయన పేరెన్నికగన్న రచనలు. పలువురు ఉర్దూ కవులను ఆయన తెలుగువారికి పరిచయం చేశారు. ఆయనను అభిమానులు ఆత్మీయంగా రుషి, దీర్ఘదర్శి అని పిలుచుకుంటారు. ఆయన రచనలు ఆత్మీయంగానూ ఆసక్తికరంగానూ సాగుతాయి. ఆయన కవిత్వం సాంబశివ శతకం (1950), నిరీక్షణం (1952), ప్రభాతం (1949), విశ్వామిత్రం, సఖినామాలుగా వచ్చాయి. వాటన్నింటితో 2002లో సదాశివ కావ్యసుధ పేర గ్రంథం వచ్చింది.

Comments