
హైదరాబాద్, ఆగస్ట్ 12: సీనియర్ కాంగ్రెస్ నేత స్వర్గీయ పి.జనార్ధన్ రెడ్డి కూతురు విజయా రెడ్డి ఆదివారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ప్రజా సంక్షేమం కోసమే తాను జగన్ పార్టీలో చేరానని చెప్పారు. ఇద్దరు నేతలను (పిజెఆర్, వైయస్ఆర్) కలిపిన ఘనత తనదే అని చెప్పారు. స్వర్గీయ పిజెఆర్, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అహర్నిశలు ప్రజల కోసం పాటుపడ్డారని, వారి బాటలోనే నడుద్దామని చెప్పారు. విజయా రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిన సందర్భంగా భారీగా అభిమానులు తరలి వచ్చారు. అంతకుముందు విజయా రెడ్డి ఖైరతాబాద్‌లోని మహంకాళీ అమ్మవారి గుడిలో పూజలు చేశారు. ఆ తర్వాత ఖైరతాబాద్ జంక్షన్‌లోని పిజెఆర్ విగ్రహానికి, పంజాగుట్ట చౌరస్తాలోని వైయస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అక్కడి నుండి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయానికి వెళ్లారు.
Comments