ముగిసిన ఒలింపిక్స్... పసిడి లేని భారత్ ....
లండన్, ఆగస్టు 12: లండన్ ఒలింపిక్స్ క్రీడోత్సవం ఆదివారంతో ముగిసింది. స్టార్ రన్నర్ ఉసేన్ బోల్ట్ వరుసగా రెండు ఒలింపిక్స్ లోనూ మూడేసి స్వర్ణాలు అందుకొని రికార్డు సృష్టిస్తే, అమెరికా స్విమ్మర్ మైఖేల్ ఫెల్ప్స్ ఏకంగా అత్యధిక పతకాలు సాధించి చరిత్రను తిరగరాశాడు. అతని ఖాతాలో మొత్తం 22 పతకాలు చేరగా, వాటిలో 18 స్వర్ణాలే. రెండు రజతాలు, మరో రెండు కాంస్యాలను కూడా ఒలింపిక్స్ లో కైవసం చేసుకున్నాడు. ఇలావుంటే, ఉగ్రవాద దాడుల భయం నేపథ్యంలో బ్రిటన్ ప్రభ్వుం గతంలో ఎన్నడూ లేని రీతిలో భారీ భద్రతను ఏర్పాటు చేసింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ మెగా ఈవెంట్‌ను లండన్ ఒలింపిక్స్ నిర్వాహణ కమిటీ విజయవంతంగా పూర్తి చేసింది. గత నెల 27న ప్రారంభోత్సవం మాదిరిగానే ముగింపు కార్యక్రమం కూడా అట్టహాసంగా జరిగింది. కాగా, ఒలింపిక్స్ పురుషుల హాకీలో డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ టైటిల్‌ను నిలబెట్టుకుంది. రివర్‌బాంక్ ఎరీనాలో జరిగిన ఫైనల్‌లో నెదర్లాండ్స్‌ను 2-1 గోల్స్ తేడాతో ఓడించింది. పతకాల పట్టికలో అమెరికా 104 పతకాలతో మొదటి స్థానం లో నిలవగా, 87 పతకాలతో చైనా రెండవ స్థానం లోనూ, 65 పతకాలతో బ్రిటన్ మూడో స్థానం లోనూ నిలిచాయి. ఇండియా రెండు రజత, 4 కాంస్య పతకాలు మాత్రమే గెలిచింది.

Comments