Monday, August 27, 2012

ఎన్‌డీటీవీ సర్వే----జగన్ వైపే ప్రజల మొగ్గు...

హైదరాబాద్,ఆగస్ట్ 27: ఇప్పటికిప్పుడు మధ్యంతర ఎన్నికలు జరిగితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు కోరుకుంటున్నారని ఎన్‌డీటీవీ సర్వేలో వెల్లడైంది. ఆ సర్వే ప్రకారం.. జగన్ ముఖ్యమంత్రి కావాలని రాష్ట్రంలో 48 శాతం ప్రజలు కోరుకుంటున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సీఎం కావాలని 18 శాతం ప్రజలు కోరుకుంటే.. టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు సీఎం కావాలని 17 శాతం మంది కోరుకుంటున్నారు. ప్రస్తుత సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని 11 శాతం మంది.. తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన చిరంజీవి సీఎం కావాలని 6 శాతం ప్రజలు కోరుకుంటున్నారు. రాష్ట్రంలో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో జగన్ సీఎం కావాలని కోరుకుంటున్న వారు 62 శాతం మంది ఉంటే.. ఆ సంఖ్య తెలంగాణలో 19 శాతంగా ఉంది. తెలంగాణలో 43 శాతం మంది ప్రజలు కేసీఆర్ సీఎం కావాలని కోరుకుంటుండగా.. మిగతా ప్రాంతంలో ఆ సంఖ్య 4 శాతంగా ఉంది. అలాగే,  మధ్యంతర ఎన్నికలు జరిగితే రాష్ట్రంలోని 42 పార్లమెంటు స్థానాల్లో 21 సీట్లు వైఎస్సార్ కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని సర్వేలో తేలింది. ఇటీవల ఇండియాటుడే సర్వేలో కూడా మధ్యంతర ఎన్నికలు వస్తే.. వైఎస్సార్ కాంగ్రెస్ 23 నుంచి 27 లోక్‌సభ సీట్లు గెలుచుకుంటుందని వెల్లడైన విషయం తెలిసిందే. తాజా ఎన్‌డీటీవీ సర్వే ప్రకారం.. టీఆర్‌ఎస్‌కు 10 ఎంపీ సీట్లు, కాంగ్రెస్‌కు 9 ఎంపీ సీట్లు వస్తాయని వెల్లడైంది. రెండు స్థానాలు ఇతరులకు వస్తాయని తేలింది. మజ్లిస్‌కు ఒక స్థానం పోతే మిగిలిన ఒక స్థానంలోనే టీడీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎం తదితర పార్టీలన్నీ సర్దుకోవాల్సి వస్తుందని ఈ సర్వేఅంచనా.  అలాగే.. జగన్ అరెస్టు రాజకీయ కక్ష సాధింపేనని ఆంధ్ర, రాయలసీమల్లోని 56 శాతం మంది ప్రజలు భావిస్తున్నారు. దీనితో ఏకీభవిస్తున్న వారి సంఖ్య తెలంగాణలో 26 శాతంగా ఉంది. ఇక ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయాల్సిందేనని తెలంగాణలో 86% మంది చెప్తుండగా.. మిగతా ప్రాంతాల్లో దీనితో ఏకీభవిస్తున్న వారి సంఖ్య 24 శాతంగా ఉంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...