పార్లమెంటు సమావేశాల తర్వాత చూద్దాం: తెలంగాణపై ఆజాద్

న్యూఢిల్లీ, ఆగస్ట్ 30: తెలంగాణపై ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదని, తెలంగాణపై ఇప్పటికిప్పుడు తేల్చేదేమీ లేదని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ అన్నారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో భేటీ తర్వాత ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. సెప్టెంబర్ 17వ తేదీలోగా తెలంగాణపై తేల్చాలని పార్టీ తెలంగాణ నాయకులు అడుగుతున్నారని, తెలంగాణపై త్వరగా తేల్చాలని సీమాంధ్ర నాయకులు కోరుతున్నారని మీడియా ప్రతినిధులు గుర్తు చేయగా, పార్లమెంటు సమావేశాల తర్వాతనే తెలంగాణపై ఆలోచన ఉంటుందని ఆయన చెప్పారు.పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగడం లేదని, దానిపైనే తామంతా దృష్టి పెట్టామని ఆయన అన్నారు. ధర్మాన ప్రసాద రావు రాజీనామాను ఆమోదించలేదని, రాజీనామా పెండింగులోనే ఉందని, పెండింగులోనే ఉంటుందని ఆయన చెప్పారు. వివరణ ఇవ్వడానికి సిబిఐ ధర్మాన ప్రసాద రావుకు నాలుగు నెలల సమయం ఇచ్చిందని, ఆ తర్వాతనే ధర్మాన ప్రసాద రావు రాజీనామాపై నిర్ణయం ఉంటుందని ఆయన చెప్పారు. నాయకత్వ మార్పుపై వస్తున్న వార్తలపై కూడా ఆయన ప్రతిస్పందించారు. నాయకత్వ మార్పు ఏదీ ఉండదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని గానీ పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను గానీ మార్చడం లేదని ఆయన చెప్పారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు