Tuesday, August 14, 2012

మంత్రి పదవికి ధర్మాన ప్రసాదరావు రాజీనామా

ఆమోదం పై సి.ఎం.తర్జనభర్జన... 
హైదరాబాద్, ఆగస్ట్ 14: జగన్ ఆస్తుల కేసుల తనను నిందితుడిగా చేర్చుతూ సీబీఐ అభియోగాలు నమోదు చేసిన నేపథ్యంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. మంగళవారం రాత్రి రాజీనామా లేఖను స్వయంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి అందజేశారు.  సీబీఐ తనపై నమోదు చేసిన కేసు నుంచి క్లీన్‌చిట్‌తో బయటకొస్తానని మంత్రి ధర్మాన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని నింపుకున్న తాను పార్టీకి, నాయకత్వానికి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతోనే రాజీనామా చేసినట్టు చెప్పారు. ‘‘కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన వ్యక్తిని నేను. ఈ దేశంలో ఎందరో నిస్వార్థ నాయకులను తయారు చేసిన కాంగ్రెస్ భావజాలాన్ని ఒంటిబట్టించుకున్న వ్యక్తిని. వ్యక్తిగత ప్రతిష్టకంటే కాంగ్రెస్ ప్రతిష్ట, ప్రభుత్వ గౌరవం ముఖ్యమని, మా నాయకుడికి ఏ సమస్యా రాకూడదని భావించాను. సీబీఐ నాపై అభియోగాలు నమోదు చేసిన కారణంగా ముఖ్యమంత్రికి నా రాజీనామాను సమర్పించాను. ఇది నా వ్యక్తిగత నిర్ణయం. మంచి సంప్రదాయాన్ని పాటించాను. ఉన్నత విలువలకు కట్టుబడే రాజీనామా చేశాను.  మంత్రిగా నేను ఎలాంటి అవినీతీ, పొరపాట్లూ చేయలేదని గట్టిగా నమ్ముతున్నా. నమ్మడమే కాదు, కోర్టులో సీబీఐ అభియోగాలను ఎదుర్కొని క్లీన్‌గా బయటకు రాగలననే పూర్తి విశ్వాసం నాకుంది. కేబినెట్ సభ్యునిగా సభా నాయకుడికే రాజీనామా సమర్పించాలనే సంప్రదాయాన్ని పాటించాను. అందుకే గవర్నర్‌ను కలవలేదు’’ అని ధర్మాన వివరించారు. 
మూడు దశాబ్దాల రాజకీయ ప్రస్థానం
శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం మబుగాం సర్పంచ్‌గా రాజకీయ జీవి తం ప్రారంభించిన ధర్మాన ఆ మండలానికి ఎంపిపిగా పనిచేశారు. ఆ తరువాత జిల్లా యువజన కాంగ్రెస్‌లో కీలక పాత్ర పోషించారు. యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేశారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. 1990లో ఎన్.జనార్దనరెడ్డి కేబినెట్‌లో తొలిసారిగా మంత్రి పదవి చేపట్టారు. 1996లో అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఓడిపోతామని తెలిసి కూడా కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాన్ని శిరసావహించి ఎంపీగా పోటీ చేశారు. 1999లో మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెసు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని సమర్థంగా తనదైన శైలిలో ఎదుర్కుని పలువురిని ఆకట్టుకున్న గుర్తింపు ఉంది. 1989లో శాసనసభ్యునిగా గెలుపొందిన ధర్మాన ఆ మరుసటి సంవత్సరంలోనే ఎన్ జనార్ధనరెడ్డి కేబినెట్‌లో ఓడరేవులు, క్రీడల శాఖ మంత్రిగా పనిచేశారు. 1999లో కూడా రెండోసారి శాసనసభ్యుడిగా గెలుపొందినప్పటికీ అప్పట్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది. 2004లో వైఎస్ హయాంలో రెవెన్యూ మంత్రిగా పనిచేసిన ధర్మాన, 2009లో కూడా రాజశేఖర్‌రెడ్డిహయాంలో  రెవెన్యూ మంత్రిగానే కొనసాగారు. వైయస్ మరణానంతరం రోశయ్య కేబినెట్‌లో కూడా అదే శాఖను నిర్వర్తించిన ధర్మాన కిరణ్ కేబినెట్‌లో ప్రస్తుతం ఆర్అండ్‌బీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దాదాపు అందరూ ముఖ్యమంత్రుల కేబినెట్‌లలో కూడా ధర్మాన తనదైన శైలిలో చక్రం తిప్పారు. ఆయా కేబినెట్‌లలో కీలక వ్యక్తిగా మారారు. ప్రదానంగా  వైయస్ హయాంలో రెవెన్యూ మంత్రిగా  ఒక వెలుగు వెలిగారు. ధర్మాన పై ఇటీవల కాలంలోనే ఆరోపణలు చుట్టుముట్టాయి. స్థానికంగా వివిధ అంశాలపై ఆయన నిర్ణయాలు వివాదస్పదమయ్యాయి. అయితే వీటిని ఆయన తన రాజకీయ లౌక్యం, చతురత, వాగ్దాటితో తిప్పికొడుతూ వచ్చారు. జగన్ అక్రమాస్తుల కేసులో జారీ అయిన 26 జీవోల విషయంలో తొలిసారిగా ఆయన తీవ్ర ఆరోపణలకు గురయ్యారు. సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసినపుడు కూడా ధర్మాన గంభీరంగా వ్యవహరించారు. జీవోలు జారీచేసినవారు నిందితులు కారని, ఆ జీవోల వలన లబ్ధి పొందినవారే దోషులుగా వుంటారని ఆయన తనపై వచ్చిన ఆరోపణలను తిప్పి కొట్టే ప్రయత్నాలు చేశారు. చివరకు సీబీఐ చార్జిషీటులో  నిందితునిగా చేర్చడంతో దాదాపు మూడు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో తొలిసారిగా దర్మానకు  పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టయింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...