Wednesday, August 15, 2012

ఎర్రకోట నుంచి ప్రధాని స్వాతంత్ర దినోత్సవ హామీలు...

కరవు ప్రాంతాల రైతులకు రాయితీలు
రెండేళ్లలో ప్రతి ఒక్కరికి బ్యాంకు అకౌంట్లు
పేదలకు ఐదు లక్షల వరకు వడ్డీ లేని రుణాలు
 ఐదేళ్లలో ప్రతి గ్రామానికి నిరంతర విద్యుత్ 

న్యూఢిల్లీ,ఆగస్ట్ 15:  భారత దేశాన్ని అభివృద్ధిలో నడిపించడానికి శాయశక్తులా కృషి చేస్తున్నామని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్  అన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా  ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ,  66 ఏళ్లలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఆర్థిక మాంద్యం ప్రపంచాన్ని కమ్మేస్తుందని, భారత్ పైన కూడా ఈ ప్రభావం తీవ్రంగా పడిందన్నారు.
కరవు ప్రాంతాలలో రైతులను  ఆదుకుంటామని, వారికి రాయితీలు కల్పిస్తామని చెప్పారు. ప్రభుత్వాసుపత్రులలో ఉచిత మందుల సరఫరాను  ఆధునికీకరిస్తామన్నారు. గిరిజన, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజ్ కేటాయిస్తామన్నారు. దేశంలో దారిద్ర్యం, పేదరికం తొలగిన రోజే నిజమైన స్వాతంత్రం అన్నారు. దేశంలోని ప్రతి గ్రామానికి నిరంతరం విద్యుత్ వచ్చే విధంగా ఐదేళ్లలో కృషి చేస్తామన్నారు.
 దేశ అంతర్గత సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పోలియో రహిత దేశంగా భారత్‌ను నిర్మిస్తామన్నారు. గడిచిన ఎనిమిదేళ్లలో ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి చర్యలు చేపట్టిందని చెప్పారు. నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని పక్కాగా అమలు చేస్తామని చెప్పారు. రాబోయే రెండేళ్లలో ప్రతి ఒక్కరికి బ్యాంకు అకౌంట్లు తెరుస్తామని చెప్పారు. అసోం ఘర్షణలు జాతికి కళంకమని, ఈ  తరహా ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. త్వరలో రాజీవ్ గృహ రుణ పథకం ద్వారా పేదలకు ఐదు లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు. లోక్ పాల్ బిల్లు తీసుకు రావడానికి యుపిఏ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇందుకోసం రాజకీయ పార్టీలన్నీ సహకరిస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...