Friday, August 24, 2012

కిరణ్, బొత్స సేఫ్...?

న్యూఢిల్లీ,ఆగస్ట్ 24: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో ఇరుక్కున్న మంత్రి ధర్మాన ప్రసాద రావు రాజీనామాను ఆమోదించాలని కాంగ్రెసు అధిష్టానం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారంనాడు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతో గంటా 20 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్, కేంద్ర మంత్రి ఎకె ఆంటోనీ, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ కూడా పాల్గొన్నారు. అంతకు ముందు ముఖ్యమంత్రి - వాయలార్ రవిని కూడా కలిశారు. సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న మిగతా నలుగురు మంత్రులను కూడా తొల్గించేందుకు   అధిష్టానం పచ్చ జెండా ఊపిందంటున్నారు. సోనియాతో జరిగిన సమావేశానికి పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను ఆహ్వానించలేదు. ప్రస్తుతానికి నాయకత్వ మార్పు లేకుండా ధర్మాన ప్రసాద రావు రాజీనామాను ఆమోదించి, పొన్నాల లక్ష్మయ్య, కన్నా లక్ష్మినారాయణ, సబితా ఇంద్రా రెడ్డి, గీతా రెడ్డిలను మంత్రి వర్గం నుంచి తొలగించే అవకాశాలున్నాయి.  అయితే, నలుగురు మంత్రులకు ఇప్పుడే ఉద్వాసన పలికే అవకాశం లేనట్లు తెలుస్తోంది. వైయస్ జగన్ ఆస్తుల కేసులో వారి పేర్లు చార్జిషీట్‌లో వచ్చినప్పుడు వారు ఎలా ప్రతిస్పందిస్తారనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుని వేటు వేయాలని అధిష్టానం కిరణ్ కుమార్ రెడ్డికి సూచించినట్లు సమాచారం. అయితే, కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం అందరినీ తొలగించి కొత్త మంత్రులను తీసుకోవడానికి అవకాశం ఇవ్వాలని అడిగినట్లు చెబుతున్నారు. బొత్స సత్యనారాయణకు, కిరణ్ కుమార్ రెడ్డికి మధ్య పొసగడం లేదని భావించిన అధిష్టానం వారుద్దరినీ  మార్చాలని  తొలుత భావించినప్పటికీ ప్రస్తుతానికి రాష్ట్ర మంత్రి వర్గ ప్రక్షాళన, పార్టీ పునర్వ్యస్థీకరణ ద్వారా పరిస్థితిని చక్కదిద్దాలని నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...