Monday, August 13, 2012

జగన్ కేసు: నాల్గవ చార్జిషీట్‌లో నిందితుడిగా మంత్రి ధర్మాన

హైదరాబాద్, ఆగస్ట్ 13:  వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో సిబిఐ సోమవారం నాలుగో చార్జిషీట్‌ను నాంపల్లి కోర్టులో దాఖలు చేసింది. ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన వాన్‌పిక్ ప్రాజెక్టు పై సిబిఐ ఈ చార్జిషీట్‌ను దాఖలు చేసింది. మంత్రి ధర్మాన ప్రసాద రావును ఈ చార్జిషీట్‌లో చేర్చింది. ఆయనను ఈ చార్జిషీట్‌లో సిబిఐ ఐదో నిందితుడిగా చేర్చింది. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో రెవెన్యూ మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాద రావు వాన్‌పిక్ ప్రాజెక్టుకు మేలు చేసేలా జీవోలు జారీ చేశారని, ఆ రకంగా ఆయన కుట్ర చేశారని సిబిఐ అభియోగాలు మోపింది. వాన్‌పిక్ ప్రాజెక్టుపై దాఖలు చేసిన చార్జిషీట్‌లో సిబిఐ 14 మంది నిందితులను చేర్చింది. సిబిఐ 117 పేజీలతో 284 డాక్యుమెంట్లతో ఈ చార్జిషీట్‌ను దాఖలు చేసింది. ఈ చార్జిషీట్‌లో వైయస్ జగన్ తొల ముద్దాయి కాగా, జగతి పబ్లికేషన్ వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డి రెండో నిందితుడిగా ఉన్నారు. మిగతా నిందితులు వరుసగా ఇలా ఉన్నారు - నిమ్మగడ్డ ప్రసాద్ (3), మోపిదేవి వెంకటరమణ (4), ధర్మాన ప్రసాద రావు (5), బ్రహ్మానంద రెడ్డి (6), ఐఎఎస్ అధికారి మన్మోహన్ సింగ్ (7), మరో ఐఎఎస్ అధికారి శామ్యూల్ (8), నిమ్మగడ్డ ప్రకాష్ (9), వాన్‌పిక్ ప్రాజెక్టు (10), జగతి పబ్లికేషన్స్ (11), రఘురామ్ సిమెంట్స్ (12), కార్మిలేషియా (13), సిలికాన్ బిల్డర్స్ (14). జీవోల విడుదల సమయంలో ప్రకాశం, గుంటూరు జిల్లాల కలెక్టర్లుగా పనిచేసినవారిపై కూడా సిబిఐ అభియోగాలు మోపింది. వాన్‌పిక్ ప్రాజెక్టు కోసం ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో 15 వేల ఎకరాలకు పైగా భూములు పొందిన నిమ్మగడ్డ ప్రసాద్ ముడుపులుగానే జగన్‌కు చెందిన నాలుగు కంపెనీల్లో 854 కోట్ల రూపాయలు పెట్టుబడులుగా పెట్టారని సిబిఐ ఆరోపించింది. ఇందుకు రెవన్యూ మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాద రావు 9 జీవోలు చేశారని, ప్రిన్సిపల్ సెక్రటరీలుగా మన్మోహన్ సింగ్, శామ్యూలు జీవోలపై సంతకాలు చేశారని సిబిఐ ఆరోపించింది. వీరు కుట్రకు పాల్పడ్డారని సిబిఐ అభియోగం మోపింది.
ధర్మాన ప్రసాద రావు 2007, 2008, 2009ల్లో దురుద్దేశ్యవూర్వకంగానే నిమ్మగడ్డ ప్రసాద్‌కు మేలు చేస్తూ జీవోలు జారీ చేశారని సిబిఐ అభియోగం మోపింది. ఈ కేసులో ఇప్పటి వరకు సిబిఐ ఐదుగురిని అరెస్టు చేసింది. వీరిలో నలుగురు ప్రస్తుతం చంచల్‌గుడా జైలులో ఉండగా, విజయసాయి రెడ్డి బెయిల్‌పై బయటు ఉన్నారు. మే 15వ తేదీన నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డిలను సిబిఐ అరెస్టు చేసింది. మే 22వ తేదీన అప్పుడు మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణను సిబిఐ అరెస్టు చేసింది. మే 27వ తేదీన వైయస్ జగన్‌ను అరెస్టు చేసింది. ధర్మాన ప్రసాద రావును సిబిఐ ఇప్పటికే మూడు సార్లు విచారించింది.
రాజీనామా యోచనలో ధర్మాన? 
ఇలావుండగా, వైయస్ జగన్ ఆస్తుల కేసులో వాన్‌పిక్‌పై చార్జిషీట్ దాఖలు చేసిన సిబిఐ తనను  ఐదో నిందితుడిగా చేర్చడం పట్ల  తీవ్ర విస్మయానికి గురైన ధర్మాన ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో ఆయన కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌ను, సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌ను కలిశారు.  మంగళవారం ఆయన కేంద్ర మంత్రి పల్లంరాజును కలుస్తారు. ఆ తర్వాత హైదరాబాద్ తిరిగి వచ్చి  తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, గవర్నర్ నర్సింహన్‌కు సమర్పిస్తారని భావిస్తున్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...