Friday, August 31, 2012

నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి రాజీనామా

న్యూఢిల్లీ,ఆగస్ట్ 31: లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి తెలిపారు. కర్నూలు, కడప జిల్లాల రైతుల పంటలు ఎండిపోతున్నందున శ్రీశైలం నీటిని దిగువకు వదలొద్దంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి విన్నవించినా.. అదేం పట్టనట్టు  శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్‌కు  నీటిని విడుదల చేయడాన్ని నిరసిస్తూ  ఆయన  రాజీనామా చేశారు.  పార్టీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, శిల్పా మోహన్‌రెడ్డి తదితరులతో కలిసి గతంలో ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి మూడుసార్లు విజ్ఞప్తి చేశానని, సీఎం తమ విన్నపాలను పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సాగర్‌కు నీటిని వదలడం వల్ల కర్నూలు జిల్లాలో సాగునీటితోపాటు తాగునీటి సమస్య కూడా తీవ్రమవుతుంది’అని చెప్పారు. విద్యుత్ కోసమే నీటిని విడుదల చేయదల్చుకుంటే రోజుకు 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తే ఇబ్బంది లేకుండా ఉండేదన్నారు. ఒకేసారి 25 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం సబబు కాదన్నారు. శ్రీశైలం నీటి విడుదలపై ఆవేదనతోనే రాజీనామా ప్రకటిస్తున్నారా లేక ఇతర రాజకీయ కారణాలేమైనా ఉన్నాయా అని అడగ్గా... తన మనసులో రాజకీయ కారణాలేవీ లేవని, రైతులకు అన్యాయం జరుగుతుంటే మనసు కలత చెంది తప్పనిసరై రాజీనామా చేస్తున్నానన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు నలుగురు కూడా ఇదే అంశంపై రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపా రు. తదుపరి కార్యాచరణపై ప్రశ్నించగా... తాను హైదరాబాద్ వెళ్తున్నానని, ఎమ్మెల్యేలతో కలిసి సీఎంను కలుస్తామని చెప్పారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...