ఎన్డీటివీ సర్వే పై కస్సుమన్న బాబు...
హైదరాబాద్, ఆగస్ట్ 28: రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ హవా నడుస్తోందని వెల్లడించిన ఎన్డిటివీ సర్వేపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కస్సుమన్నారు. వైయస్ జగన్‌కు అనుకూలంగా టీవీ చానెల్ సర్వే నిర్వహించిందని ఆయన అన్నారు. సర్వే చేసిన చానెల్ జగన్ మీడియాకు కన్సల్టెన్సీ అని వింటున్నామని ఆయన అన్నారు. తెలంగాణపై త్వరలో స్పష్టత ఇస్తానని ఆయన చెప్పారు. విభజనపై పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత అందరూ దానికి కట్టుబడి ఉంటారని ఆయన చెప్పారు. తన విదేశీ పర్యటనను రాజకీయం చేయడం దారుణమని ఆయన అన్నారు. పార్లమెంటు ఆవరణలో తమ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు విగ్రహ స్థాపనలో కేంద్ర మంత్రి, ఎన్టీఆర్ కూతురు దగ్గుబాటి పురంధేశ్వరి వల్లనే జాప్యం జరుగుతోందని ఆయన విమర్శించారు. విగ్రహ స్థాపనపై తమ పార్టీ ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదని ఆయన చెప్పారు. కాగ్ నివేదికను ప్రధానమంత్రి తప్పు పట్టడం సరికాదన్నారు. ఈ నివేదికను పిఏసిలో సవాల్ చేస్తానని మన్మోహన్ చెప్పడం హాస్యాస్పదమని, కేంద్ర ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే హక్కు లేదని బాబు మండిపడ్డారు. అడ్డంగా దోచుకునేందుకు ఖనిజ సంపద, సెజ్‌లను అక్రమార్కులు మార్గాలుగా ఎంచుకుంటున్నారని విమర్శించారు. దేశ సంపదను కొందరు వ్యక్తులు కొల్లగొడుతుంటే ప్రధాని అచేతనంగా ఉండటం విడ్డూరమన్నారు.

Comments