విలాస్‌రావు దేశ్‌ముఖ్ ఆరోగ్యం విషమం
చెన్నై,ఆగస్ట్ 7: కేంద్రమంత్రి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్ మృత్యువుతో పోరాడుతున్నారు. కిడ్నీ, కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న విలాస్‌రావు చెన్నైలోని గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వెంటిలెటర్ పైన ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. విలాస్‌రావు ఏడాది క్రితం చేయించుకున్న హెల్త్ చెకప్‌లో వ్యాధి విషయం బయటడింది. దీంతో రెండుమూడుసార్లు ఆయన విదేశాలలో చికిత్స చేయించుకున్నారు. ముంబైలోని బీచ్ క్యాండీ ఆసుపత్రిలో కూడా విలాస్‌రావుకు మూడు రోజులు డయాలసిస్ చేశారు. అయినా పరిస్థితి మెరుగు కాకపోవడంతో ఆయనను చెన్నైలోని గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు. విలాస్‌రావుకు కాలేయ మార్పిడికి కూడా ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. విలాస్‌రావు దేశ్‌ముఖ్ 26 మే 1945లో జన్మించారు. మొదటి నుండి కాంగ్రెసు పార్టీలోనే ఉన్నారు. ఆయనకు ముగ్గురు పిల్లలు. ప్రముఖ సినీ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ ఆయన తనయుడే. ఆయన మహారాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1999 నుండి 2003 వరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆ తర్వాత 2004 నుండి 2008 వరకు మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన ఈ రెండుసార్లు లాతూర్ నుండి గెలుపొందారు. ఆ తర్వాత కేంద్రమంత్రివర్గంలో మన్మోహన్ సింగ్ మంత్రి వర్గంలో భారీ పరిశ్రమల శాఖను, పంచాయతీరాజ్ శాఖను, గ్రామీణాభివృద్ధి శాఖను, ఎర్త్ సైన్స్ శాఖను, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖను చేపట్టారు. ముంబయి క్రికెట్ అసోసియేషన్ మెంబర్‌గా ఉన్నారు.

Comments