
సిన్సినాటీ ,ఆగస్ట్ 25: చంద్రుని పై కాలు మోపిన తొలి మానవునిగా చరిత్రకెక్కిన అమెరికా వ్యోమగామి నీల్ ఆల్డెన్ ఆర్మ్ స్ట్రాంగ్ (82) దీర్ఘకాలిక అస్వస్థతతో శనివారం కన్నుమూశారు. ఆగస్టు 5 న జరిగిన బైపాస్ సర్జరీ అనంతరం తలెత్తిన సమస్యలే మరణానికి దారితీసినట్టు స్ట్రాంగ్ కుటుంబీకులు తెలిపారు. 1969 జూలై 20న చంద్రునిపై దిగిన అపోలో 11 అంతరిక్ష నౌకకు ఆర్మ్ స్ట్రాంగ్ కమాండర్‌గా వ్యవహరించారు. చంద్రునిపై పాదం మోపీ మోపగానే, ‘‘ఒక మనిషిగా ఇది చాలా చిన్న అడుగే గానీ మానవాళికి మాత్రం గొప్ప ముందడుగు’’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయాయి. అనంతరం సహచరుడు ఎడ్విన్ ఆల్డ్రిన్‌తో కలిసి చంద్రుని ఉపరితలంపై స్ట్రాంగ్ మూడు గంటల పాటు గడిపారు. పరిశోధనలు చేయడం, నమూనాలు సేకరించడం, ఫొటోలు దిగడంతో పాటు గోల్ఫ్ కూడా ఆడారు. 1930 ఆగస్టు 5న ఒహాయోలో జన్మించిన స్ట్రాంగ్ తన ఆరో ఏటో తొలిసారిగా విమానయానం చేశారు! అప్పటి నుంచే విమానాలన్నా, అంతరిక్షమన్నా విపరీతమైన ఆసక్తి పెంచుకున్నారు. తన 16వ ఏటే పైలట్ లెసైన్స్ పొందారు.
Comments