Friday, August 17, 2012

తెలంగాణా పై రాజ్య సభలో వీగిన బి.జె.పి. తీర్మానం

న్యూఢిల్లీ,ఆగస్ట్ 17:  తెలంగాణ అంశంపై బిజెపి సభ్యుడు ప్రకాష్ జవదేకర్  ప్రతిపాదించిన ప్రైవైట్ తీర్మానాన్ని రాజ్యసభ  తిరస్కరించింది. తెలంగాణ ప్రజలకు కాంగ్రెసు ద్రోహం చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. యుపిఎ ప్రభుత్వానికి తెలంగాణ అంశం పట్ల చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు. తెలంగాణ అంశంపై జరిగిన చర్చకు హోం శాఖ సహాయ మంత్రి జైస్వాల్ సమాధానం ఇచ్చిన తర్వాత ప్రకాష్ జవదేకర్ మాట్లాడారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బిజెపి సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. యుపిఎ ప్రభుత్వం తెలంగాణ ఇవ్వడానికి సిద్ధంగా లేదని, అందుకే చర్చ సందర్భంగా సభకు హోం మంత్రి గానీ ప్రధాన మంత్రి గానీ రాలేదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలని, తెలంగాణకు రాజకీయ పరిష్కారం చూపించాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందని 2009 డిసెంబర్ 9వ తేదీన అప్పటి హోం మంత్రి పి. చిదంబరం ప్రకటించారని, ఇప్పటి వరకు ప్రక్రియ ప్రారంభం కాలేదని, కమిటీలు వేశామన్నారని, కాలయాపన కోసం కమిటీలు వేస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17వ తేదీన అయినా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పాత హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో ప్రభుత్వాలు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతుంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం నిర్వహించడం లేదని ఆయన అన్నారు. తెలంగాణకు అన్ని రంగాల్లోనూ అన్యాయం జరుగుతోందని ఆయన అన్నారు. మెడికల్ సీట్ల కేటాయింపుల్లో, ఉద్యోగాల్లో ఇటీవలి జరిగిన వ్యవహారాలను ఎత్తిచూపుతూ ప్రతి విషయంలో తెలంగాణవాళ్లు కోర్టులకు వెళ్లాల్సి వస్తోందని ఆయన అన్నారు. బీహార్ ముఖ్యమంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నప్పుడు తాము జార్ఖండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశామని, ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉన్నా కూడా తాము ఆ పనిచేశామని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో, కేంద్రంలో కాంగ్రెసు పార్టీయే అధికారంలో ఉందని, అలా ఉన్నా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం లేదని ఆయన అన్నారు. తెలంగాణపై అన్ని పార్టీల అభిప్రాయాలు అడుగుతారు గానీ తన వైఖరి ఏమిటో కాంగ్రెసు చెప్పడం లేదని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లు ప్రతిపాదిస్తే తాము బలపరుస్తామని ఆయన చెప్పారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...