Thursday, May 19, 2011

యడ్యూరప్ప సేఫ్...?

బెంగళూరు,మే 19: కర్ణాటక లో  రాష్ర్టపతి పాలన విధించాలంటూ గవర్నర్ హెచ్‌ఆర్ భరద్వాజ్ పంపిన ప్రత్యేక నివేదికపై కేంద్రప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశం కనిపించడం లేదు. రాజ్యాంగ విరుద్ధ చర్యలుండవంటూ ఇప్పటికే ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ ఎన్‌డీఏ నేతలకు హామీ ఇచ్చారు. గవర్నర్ వైఖరిలో కూడా మార్పు కనిపిస్తోంది. బుధవారం ఒక సమావేశంలో మాట్లాడుతూ ఆయన ముఖ్యమంత్రి యడ్యూరప్పపై ప్రశంసలు కురిపించారు. రోజుకు 18 గంటలు కష్టపడే సీఎం అని పొగిడారు. అసెంబ్లీలో యడ్యూరప్పకు మంచి మెజారిటీ ఉందని ఒప్పుకున్నారు. మరోవైపు, రాష్ట్రపతి పాలనకు సంబంధించి తన వాదనలో మార్పులేదని స్పష్టంచేశారు. తన నివేదికపై కేంద్రం ఒకటి, రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోవచ్చన్నారు. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని, ఐదేళ్లూ కొనసాగుతానని ధీమా వ్యక్తంచేశారు. కాగా, గవర్నర్‌ను రీకాల్ చేయాల్సిందేనని ముఖ్యమంత్రి యడ్యూరప్ప స్పష్టంచేశారు. బీజేపీ డిమాండ్‌లో మార్పు లేదని, గవర్నర్‌పై ప్రధానికి, రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేశామన్నారు. యడ్యూరప్ప ఐదుగురు మంత్రులతో కలసి బుధవారం సాయంత్రం రాజ్ భవన్‌లో గవర్నర్‌ను కలుసుకున్నారు. వచ్చే నెల రెండో తేది నుంచి తలపెట్టిన శాసనసభ సమావేశాలకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరారు. దీనిపై ఇదివరకే మంత్రివర్గ తీర్మానాన్ని గవర్నర్‌కు పంపించారు. అయితే కేంద్రానికి తాను పంపిన నివేదికపై ఇంకా ఎలాంటి ప్రత్యుత్తరం రాలేదని గవర్నర్ ముఖ్యమంత్రికి తెలిపారు. ఒకటి, రెండు రోజులు ఆగితే సమావేశాలు నిర్వహించాలా, వద్దా అనే విషయాన్ని తెలియజేస్తానని హామీ ఇచ్చారు. కాగా, వర్నర్ సిఫారసు మేరకు రాష్ట్రపతి పాలన విధించడానికి కేంద్రం సుముఖంగా లేదని తెలుస్తోంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యాలయం గవర్నర్ నివేదికను నిర్ద్వంద్వంగా తిరస్కరించినట్లు తెలిసింది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...