కడప, పులివెందుల ఉప ఎన్నికలకు పటిష్ట భద్రత

హైదరాబాద్,మే 6:  కడప, పులివెందుల ఉప ఎన్నికలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు డిజిపి అరవింద రావు చెప్పారు. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఇసి) ప్రధానాధికారి భన్వర్ లాల్ తో ఆయన ఈరోజు సమావేశమయ్యారు. కడప, పులివెందుల ఉప ఎన్నికలలో భద్రత విషయమై వారు చర్చించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ,ఉప ఎన్నికల సందర్భంగా అక్రమంగా తరలిస్తున్న రెండు కోట్ల 73 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 316 వాహనాలను సీజ్ చేసినట్లు చెప్పారు. మొత్తం 1512 పోలింగ్ స్టేషన్ల వద్ద 11,100 మంది పోలీస్ లతో  బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు. 10,829పై బైండోవర్ కేసులు పెట్టినట్లు తెలిపారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చునన్నారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద వీడియో తీస్తామని చెప్పారు. కాగా, పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల  ప్రధానాధికారి భన్వర్ లాల్ చెప్పారు. పోలింగ్ సిబ్బంది, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసేందుకు ముందుకురావాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఓటరు నుంచి వేలిముద్ర, సంతకం తీసుకుంటామని చెప్పారు. ఎన్నిక ప్రచార సమయం శుక్రవారం  సాయంత్రం 5 గంటలతో ముగిసిందన్నారు. ఓటర్లను ప్రభావితం చేసే వార్తలను ఛానల్స్ ప్రసారం చేయకూడదన్నారు. కడప లోక్ సభ స్థానానికి, పులివెందుల శాసన సభ స్థానానికి ఈ నెల 8వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 13న ఓట్లను లెక్కిస్తారు. అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు