చంద్రబాబు - హరికృష్ణ మధ్య ప్రచ్ఛన్నయుద్ధం...!
జగన్ కు సన్నిహితంగా జూనియర్ ఎన్ టీఆర్...జూనియర్ ఎన్టీఆర్ చేతిలోకి 'నార్నే' చానెల్...?
హైదరాబాద్ ,మే 10: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆయన బావమరిది ,రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణకు మధ్య ప్రచ్ఛన్నయుద్ధం కొనసాగుతూనే ఉన్నట్లు కనబడుతోంది. జూనియర్ ఎన్టీఆర్ వివాహంలో కూడా వీరిద్దరు ఎడమొహం, పెడమొహంగానే వ్యవహరించారు. 2014 శానససభ ఎన్నికల్లో చంద్రబాబు విజయం సాధించకుండా చూడడమే ప్రధాన ధ్యేయంగా హరికృష్ణ పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్‌తో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వైయస్ జగన్ మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరు తరుచుగా ఫోన్‌లో మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో వైయస్ జగన్‌కు అధికారం లభించేలా సహాయపడడం ద్వారా 2019 నాటికి తాను బలపడాలన్నది జూనియర్ ఎన్టీఆర్ ఉద్దేశమని చెబుతున్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో బిజీగా ఉన్నారు. వయస్సు కూడా చిన్నదే. ఇప్పుడు ఆయన వయస్సు 33 ఏళ్లు. అధికారం కోసం 2014 తర్వాత మరో ఐదేళ్లు ఆగాలని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు. 2014 ఎన్నికలను వైయస్ జగన్ టార్గెట్ చేసుకుంటే తాను 2019 ఎన్నికలను టార్గెట్ చేసుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. జగన్‌కు ఓ సామాజిక వర్గం మద్దతు బలంగా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ వల్ల మరో బలమైన సామాజిక వర్గం మద్దతు లభించే అవకాశాలున్నాయి. ముందస్తు ఆలోచనతో ఇద్దరు యువనేతలు ఒక్కటైనా ఆశ్చర్యం లేదని పరిశీలకులు భావిస్తున్నారు. బాబు చేజారనున్న స్టూడియో-ఎన్ ఛానల్ ?
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పెత్తనంలో ఉన్న స్టూడియో-ఎన్ ఛానల్ త్వరలో హరికృష్ణ చేతిలోకి మారనుందనే కథనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆ ఛానల్ చంద్రబాబు తనయుడు లోకేష్ కుమార్ ఆధ్వర్యంలో నడుస్తోంది. అయితే లోకేష్ ఆధ్వర్యంలో ఉన్న ఆ ఛానల్ త్వరలో జూ.ఎన్టీఆర్ చేతుల్లోకి వెళ్లడం ఖాయమని వినిపిస్తోంది. కారణం జూ.ఎన్టీఆర్ స్టూడియో-ఎన్ ఛానల్ అధినేత నార్నె శ్రీనివాసరావు అల్లుడూ కావడమేనని వేరే చెప్పక్కరలేదు. చంద్రబాబుతో ఎంత బాంధవ్యం ఉన్నప్పటికీ, ఎన్నేళ్ల అనుబంధం ఉన్నప్పటికీ నార్నెకు జూ.ఎన్టీఆర్ అల్లుడు అయినందున ఆయనకే ప్రాధాన్యత ఇవ్వడం ఖాయం. సో... జూ.ఎన్టీఆర్ చేతిలోకి ఛానల్ రాగానే ఇప్పటికే చంద్రబాబును ఢీకొడుతున్న హరికృష్ణ బాబు ఇమేజ్ తగ్గించే అంశానికే ప్రాధాన్యత ఇస్తాడనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో రాజకీయ సమీకరణాల కోసం బాలకృష్ణ కూతురును చంద్రబాబు తన కుమారుడు లోకేష్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. బాలకృష్ణ కూతురును కోడలుగా చేసుకొని బాలకృష్ణను ఆధిపత్య పోరు నుండి తొలగించాడు. అసలే గొడవలు అంటే పడని బాలకృష్ణ ఇప్పుడు మరింత మిన్నకుండి పోయారు. రాజకీయ సమీకరణాల కోసం బాబు ఏ ప్లాన్ అయితే వేశాడో ఇప్పుడు హరికృష్ణ కూడా చంద్రబాబు నుండి ఆధిపత్యాన్ని నందమూరి కుటుంబం వైపుకు తీసుకు రావడానికి నార్నె ఇంటికి తన తనయుడిని అల్లుడిగా చేసి చంద్రబాబును దెబ్బతీయాలని చూస్తున్నాడు. మొత్తానికి నందమూరి - నారా కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లను కలిచి వేస్తోంది.
Comments