Wednesday, May 11, 2011

కుప్పకూలనున్న ఎర్ర కోటలు...?

న్యూఢిల్లీ,మే 11: పశ్చిమబెంగాల్, కేరళ రాష్ట్రాలలో అధికార పగ్గాలు చేతులు మారబోతున్నాయని ఎగ్జిట్‌పోల్ సర్వేలు వెల్లడిస్తున్నాయి. బెంగాల్‌లో మూడు దశాబ్దాలకు పైగా పాలన సాగిస్తున్న వామపక్ష సంఘటన ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో పరాజయం తప్పదని స్టార్‌న్యూస్ చానెల్ నిర్వహించిన ఎగ్జిట్‌పోల్ సర్వేలో తేలింది. అక్కడ తృణమూల్ కాంగ్రెస్ - కాంగ్రెస్ కూటమి విజయం సాధించబోతున్నట్టు  సర్వే తెలిపిందు.  తృణమూల్ కాంగ్రెస్ 181 స్థానాలను, కాంగ్రెస్ 40 స్థానాలను గెలుచుకోవచ్చుట. గత ఎన్నికల్లో 294 స్థానాలకు గాను 227 స్థానాలలో విజయం సాధించిన వామపక్ష సంఘటన ఈ సారి 62 స్థానాలకు పరిమితం కాబోతున్నదని ఈ సర్వే తెలిపింది. కాగా తృణమూల్ కాంగ్రెస్ - కాంగ్రెస్ కూటమి 210 నుంచి 220 స్థానాలలో విజయం సాధిస్తుందని, లెఫ్ట్ ఫ్రంట్ 65 నుంచి 70 స్థానాలకు పరిమితమౌతుందని హెడ్‌లైన్స్ టుడే - ఓఆర్‌జీ సర్వే తెలిపింది. ఇక సీఎన్‌ఎన్ ఐబీఎన్ సర్వే తృణమూల్ కాంగ్రెస్- కాంగ్రెస్ కూటమికి 222 నుంచి 234 సీట్లు వస్తాయని తెలిపింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి లెఫ్ట్‌ఫ్రంట్ 60 నుంచి 72 స్థానాలకు పడిపోతుందని ఐబీఎన్ సర్వే అంచనా వేసింది.
. కేరళలోనూ వామపక్ష ప్రజాతంత్ర సంఘటన (ఎల్డీఎఫ్) పరాజయం పాలు కాబోతున్నదని స్టార్‌న్యూస్ సర్వే తెలిపింది. కాంగ్రెస్ నాయకత్వంలోని ఐక్య ప్రజాతంత్ర సంఘటన (యూడీఎఫ్) 88 స్థానాలలో విజయం సాధిస్తుందని, ఎల్డీఎఫ్ మాత్రం 49 స్థానాలతో సరిపుచ్చుకుంటుందని సర్వే వెల్లడించింది. అయితే కేరళలో స్వల్ప మెజారిటీతో ఎల్డీఎఫ్ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశముందని సీఎన్‌ఎన్ ఐబీఎన్ సర్వే వెల్లడించింది. సీట్ల సంఖ్యలోనూ, ఓటింగ్ శాతంలోనూ కొద్దిపాటి మెజారిటీతో తిరిగి ఎల్డీఎఫ్ పగ్గాలు దక్కించుకుంటుందని, అచ్యుతానందన్ తిరిగి ముఖ్యమంత్రి అవుతారని ఈ సర్వే తెలిపింది. 69 నుంచి 77 స్థానాలను ఎల్డీఎఫ్ సాధిస్తుందని, యూడీఎఫ్ 61 నుంచి 71 స్థానాలు గెలుచుకుంటుందని ఈ సర్వే వెల్లడించింది. ఎల్డీఎఫ్‌కు 46 శాతం, యూడీఎఫ్‌కు 45శాతం, బీజేపీకి 6శాతం ఓట్లు లభిస్తాయని ఈ సర్వే అంచనా వేసింది. కాగా హెడ్‌లైన్స్ టుడే మాత్రం యూడీఎఫ్‌కు 85 నుంచి 92 సీట్లు వస్తాయని, ఎల్డీఎఫ్‌కు 45 నుంచి 52 సీట్లు లభించవచ్చని అంచనా వేసింది. యూడీఎఫ్‌కు 83 నుంచి 91 సీట్లు లభిస్తాయని, ఎల్డీఎఫ్‌కు 49 నుంచి 57 సీట్లు లభించే అవకాశముందని సీ-ఓటర్ సర్వే అంచనా వేసింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...