Friday, May 6, 2011

పాక్ పిచ్చి ప్రేలాపన...!

ఇస్లామాబాద్, మే 6: లాడెన్ విషయంలో అంతర్జాతీయంగా ఎదురవుతున్న విమర్శల నుంచి తప్పుకోవడానికి, ఆ విధంగా పరువు దక్కించుకోవడానికి పాకిస్తాన్ శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇస్లామాబాద్‌కు కొద్ది దూరంలోనే ఉన్న అబోటాబాద్‌లో అమెరికా సైనిక దళాలు బిన్ లాడెన్‌ను హతమార్చడాన్ని పాకిస్తాన్ జీర్ణించుకోలేక పోతోంది. తమకేమాత్రం తెలియకుండా, తమ ప్రమేయమే లేకుండా అమెరికా దళాలు అల్‌ఖైదా అధినేతను మట్టుబెట్టడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న పాక్, అమెరికాపై తీవ్రస్థాయిలో విరుచుకు పడింది.  తమను సంప్రదించకుండా తమకు ఏరకమైన సంకేతాలు అందించకుండా 'ఆపరేషన్ లాడెణ్ ను  అమెరికా నిర్వహించటం ఎంతమాత్రం సమంజసం కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.  పాక్ విదేశాంగ కార్యదర్శి సల్మాన్ బషీర్ ఇందుకు సంబంధించి అమెరికాపై నిప్పులు చెరిగారు. మరోపక్క అమెరికాతోపాటు భారత్‌పై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. పాక్‌లో ఈరకమైన రహస్య కార్యకలాపాలు ఎంతమాత్రం నిర్వహించడానికి వీల్లేదంటూ అమెరికాను హెచ్చరించారు.ఇక పై  ఈ తరహా చర్యలకు అమెరికా పాల్పడితే దాని పరిణామాలు భయానకంగా ఉంటాయని హెచ్చరించారు. లాడెన్‌ను హతమార్చటం ద్వారా ఉగ్రవాద నిరోధానికి సంబంధించి అమెరికా గణనీయమైన పురోగతి సాధించిన మాట నిజమే అయినా, అన్ని విషయాల్లోనూ ఇదేరకమైన పద్ధతి పనికిరాదన్న అభిప్రాయాన్ని బషీర్ వ్యక్తం చేశారు. తమనుతాము రక్షించుకోగలిగే తమ ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోగలిగే శక్తియుక్తలు పాక్‌కు ఉన్నాయని, ఎట్టిపరిస్థితుల్లోనూ వీటి విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని ఉద్ఘాటించారు. అవసరమైతే అమెరికా తరహాలో భారత్ కూడా సైనిక చర్యకు పాల్పడగలదంటూ సైనిక, వైమానిక దళాల ప్రధానాధికారులు వ్యాఖ్యానించటంపై కూడా బషీర్ తీవ్ర విమర్శలు చేశారు. 26/11 ఘాతుకానికి పాల్పడిన ముష్కర మూకలను పట్టుకునేందుకు ‘ఆపరేషన్ ఒసామా’ తరహాలోనే భారత్‌కూడా కమెండో ఆపరేషన్ నిర్వహించగలదని భారత సైనికాధినేతలు చెప్పడం పాక్‌లో కలవరం రేకెత్తించింది. ‘ఏకపక్షంగా ఏదేశమైనా పాకిస్తాన్‌కు సంబంధించి ఎలాంటి దాడికైనా పాల్పడగలమని భావిస్తే అది  తప్పు చేయడమే అవుతుంది’ అని బషీర్ హెచ్చరించారు. పాకిస్తాన్ కూడా శక్తిలోనూ, యుక్తిలోనూ మరే దేశానికీ తీసిపోదని సైనిక, వైమానిక దళాలు అత్యంత శక్తివంతమైన రీతిలో పాటవాన్ని కలిగి ఉన్నాయని వెల్లడించారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...