ఉత్తరప్రదేశ్ లో రాహుల్ అరెస్టు

గ్రేటర్ నోయిడా,మే 12:  గ్రేటర్ నోయిడా రైతులకు మద్దతుగా బుధవారం ఆందోళనలో పాల్గొన్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీని ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతోపాటు మరో కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌సింగ్, ఫిరోజాబాద్ ఎంపీ రాజ్‌బబ్బర్‌లను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టుకు ముందు రైతుల ఆందోళనతో అట్టుడుకుతున్న భట్టాపర్సాల్ గ్రామంలో రాహుల్ ధర్నా చేశారు. రహదారి కోసం సేకరించిన తమ భూములకు మరింత పరిహారం కావాలని కోరుతూ ఈ గ్రామ రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. పోలీసుల కళ్లుగప్పి, రాహుల్ అత్యంత నాటకీయంగా ఒక కార్యకర్త వెంట బైక్‌పై వేకువ జామున 4 గంటలకు ఈ గ్రామానికి చేరుకున్నారు. ఉదయం గ్రామస్తులతో కలిసి ధర్నాకు కూర్చున్న తర్వాత కాని ఆయన రాక గురించి పోలీసులు తెలుసుకో లేకపోయారు. ఇటీవల ఆందోళనలో పోలీసుల కాల్పుల్లో రైతులు మరణించిన సంఘటనపై న్యాయవిచారణ జరిపించాలని ఈ సందర్భంగా రాహుల్ డిమాండ్ చేశారు. ఇక్కడ జరిగినది చూస్తుంటే భారతీయుడిగా చెప్పుకొనేందుకే సిగ్గు పడుతున్నానంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం తన సొంత ప్రజలపైనే అఘాయిత్యాలకు ఒడిగడుతోందని దుయ్యబట్టారు. సాయంత్రం వరకు సాగిన ఈ ధర్నాలో పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్ కూడా పాల్గొన్నారు. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు