Friday, May 20, 2011

58వ జాతీయ చలనచిత్ర అవార్డులు

'ఆడుకాలం' లో ఒక దృశ్యం 
సలీంకుమార్
ధనుష్
న్యూఢిల్లీ,మే 20: 58వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించారు. మతం కోసం మనిషి అన్వేషణను అద్భుతంగా చిత్రీకరించిన మళయాళ సినిమా ‘అడమింటే మకాన్ అబు’ జాతీయ ఉత్తమ చిత్రంగా, కోడిపందేల ఇతివృత్తంతో రూపొందిన తమిళచిత్రం ‘ఆడుకాలం’ దర్శకుడు వెట్రిమారన్ ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. ఈ చిత్రాల్లో నటించిన సలీంకుమార్ (అడమింటే మకాన్ అబు), ధనుష్ (ఆడుకాలం) ఉత్తమ జాతీయ నటుడి అవార్డును సంయుక్తంగా సొంతం చేసుకున్నారు. జాతీయ ఉత్తమ నటి అవార్డుకు తమిళనటి శరణ్య పొణ్‌వాన్నన్ (తెన్‌మెర్కు పరువక్కట్రు), మరాఠీనటి మిథాలీ జగ్‌తప్ వరాద్కర్ (బాబూ బ్యాండ్ బాజా) సంయుక్తంగా ఎంపికయ్యారు. విశాల్ భరద్వాజ్ (ఇష్కియా), థామస్ కొట్టకపల్లి (అడమింటే మకాన్ అబు) సంయుక్తంగా ఉత్తమ సంగీత దర్శకులుగా నిలిచారు. టాలీవుడ్ సినిమా ‘అద్వైతం’ ఉత్తమ విద్యా విషయిక లఘు చిత్రంగా జాతీయ అవార్డు అందుకుంది. అత్యధిక చిత్రాలు నిర్మించే తెలుగు చిత్ర సీమకు ఈ ఒక్క అవార్డు మాత్రమే దక్కడం గమనార్హం. ఉత్తమ బాల నటుడి అవార్డును హర్ష మాయర్ (ఐ యామ్ కలాం), శంతను రంగనేకర్, మశ్చీంద్ర గడ్కర్ (చాంపియన్-మరాఠీ), వివేక్ చబుక్‌స్వార్ (బాబూ బ్యాండ్ బాజా) సంయుక్తంగా సొంతం చేసుకున్నారు. జాతీయ సమైక్యతా చిత్రానికి అందించే నర్గీస్ దత్ అవార్డును బెంగాలీ చిత్రం ‘మనేర్ మానుష్’ సొంతం చేసుకుంది. కొత్త దర్శకులకు అందించే ఇందిరాగాంధీ అవార్డును మరాఠీ చిత్రం ‘బాబూ బ్యాండ్ బాజా’ దక్కించుకుంది. కన్నడ చిత్రం ‘హెజ్జగళు’ ఉత్తమ బాలల చిత్రంగా ఎంపికైంది. ఉత్తమ గాయకుడిగా సురేష్ వాడ్కర్ (మీ సింధుతాయ్ సప్కాల్-మరాఠీ), ఉత్తమ గాయనిగా రేఖా భరద్వాజ్ (ఇష్కియా) ఎంపికయ్యారు. రజనీకాంత్ నటించిన ‘ఎంతిరన్’ (రోబో) ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ అవార్డును దక్కించుకుంది. సామాజిక వేత్త సింధుతాయ్ సప్కాల్ జీవితం ఆధారంగా తీసిన మరాఠీ చిత్రం ‘మీ సింధుతాయ్ సప్కాల్’ స్పెషల్ జ్యూరీ అవార్డును కైవసం చేసుకుంది. ప్రకాష్‌రాజ్ నిర్మించిన కన్నడ చిత్రం ‘పుట్టక్కన హైవే’ ప్రాంతీయ చిత్రాల విభాగంలో ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డుకు ఎంపికైంది. విజయ్ మూలే రాసిన ‘ఆజాస్ అండ్ యోగీస్ టూ గాంధీ అండ్ బియాండ్: ఇమేజ్ ఆఫ్ ఇండియా’ ఉత్తమ సినిమా పుస్తకంగా అవార్డు దక్కించుకుంది.జాతీయ అవార్డుల్లో బాలీవుడ్ వెనుకంజ వేసింది. సల్మాన్‌ఖాన్ నటించిన ‘దబాంగ్’, నజీరుద్దీన్‌షా, విద్యాబాలన్ నటించిన ‘ఇష్కియా’ మాత్రమే బాలీవుడ్‌నుంచి అవార్డులు దక్కించుకోవడం గమనార్హం. ‘దబాంగ్’ ఉత్తమ ప్రజారంజక చిత్రంగా అవార్డు సొంతం చేసుకుంది. ఇష్కియా చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా విశాల్ భరద్వాజ్, ఉత్తమ గాయనిగా ఆయన సతీమణి రేఖా భరద్వాజ్ అవార్డులు దక్కించుకున్నారు. రిషికపూర్ నటించిన ‘దో దునీ చార్’ ఉత్తమ హిందీ చిత్రంగా ఎంపికైంది.  




No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...