కాంగ్రెస్ లో ఐరన్ లెగ్...!
న్యూఢిల్లీ,మే 13: ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ప్రచారం కాంగ్రెసు పార్టీకి ఏ మాత్రం కలిసి వచ్చినట్లు లేదు. ఆయన ప్రచారం వల్ల కాంగ్రెసు పార్టీకి ఒరిగిందేమీ లేదని కడప లోకసభ స్థానానికి, పులివెందుల శాసనసభా స్థానానికి జరిగిన ఉప ఎన్నికల ఫలితాలే కాకుండా తమిళనాడు శాసనసభా ఎన్నికల ఫలితాలు కూడా తెలియజేస్తున్నాయి. కడప లోకసభ స్థానంలో చిరంజీవి పెద్ద యెత్తున ప్రచారం చేశారు. పులివెందులలో కూడా ఆయన ప్రచారంలో పాల్గొని హంగామా సృష్టించారు. ఆయన ప్రచారం పులివెందులలో వైయస్ విజయమ్మ మెజారిటీని గానీ కడప లోకసభ స్థానంలో వైయస్ జగన్ మెజారిటీని గానీ ఏ మాత్రం తగ్గించలేకపోయింది. తమిళనాడులో కూడా చిరంజీవి మూడు రోజుల పాటు ప్రచారం సాగించారు. అక్కడ కూడా ఆయన ప్రచారం కాంగ్రెసుకు కలిసి రాలేదని అర్థమవుతోంది. తమిళనాడులో కాంగ్రెసు 65 స్థానాలకు పోటీ చేయగా నాలుగు స్థానాలు మాత్రమే దక్కాయి. కాంగ్రెసు ఎక్కువ సీట్లు తీసుకుని ఆ సీట్లను కోల్పోవడం ద్వారా డిఎంకెను కూడా దెబ్బ తీసింది.

Comments