తల్లీకొడుకులకు రికార్డ్ మెజారిటీ
కడప,మే 13: కడప లోక్ సభ ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి రాష్ట్ర స్థాయిలో రికార్డు మెజార్టీతో ఘనవిజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డిపై ఆయన 5,45,672 ఓట్ల మెజార్టీ తో గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డిఎల్ రవీంద్రా రెడ్డి, తెలుదేశం పార్టీ అభ్యర్థి మైసూరా రెడ్డి ధరావతు కోల్పోయారు. కాగా, పులివెందుల అసెంబ్లీ ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ ఘన విజయం సాధించారు. ఆమె తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డి పై 81,373 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పులివెందుల నియోజకవర్గానికి ఇంతవరకు 15 సార్లు జరిగిన ఎన్నికలలో ఇదే అత్యధిక మెజారిటీ. తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన బిటెక్ రవి (ఎం.రవీంద్రనాధ్ రెడ్డి) డిపాజిట్ కోల్పోయారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని జగన్మోహన రెడ్డి అన్నారు. ఫలితాలు వెలువడిన అనంతరం ఆయన మీడియా తో తో మాట్లాడుతూ, ఈ ఫలితాలు రాష్ట్రంలో జరుగబోవు మార్పులకు నాంది అని అన్నారు. ప్రతిపక్షంగా ఉండవసిన తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై ప్రజలను మోసం చేసిందన్నారు. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కు అలయన్స్ పార్టనర్ అయిపోయిందని, అందువల్ల ఈ ప్రభుత్వం పడిపోదని అన్నారు. .

Comments