కర్ణాటకలో మళ్లీ సంక్షోభం

బెంగళూరు,మే 16:కర్ణాటకలో మళ్లీ సంక్షోభం నెలకొంది.. అసమ్మతి ఎమ్మెల్యేల వ్యవహారానికి శుభం కార్డు పడిందన్న ఆనందంలో ఉన్న కమలనాథులకు తీరా క్లైమాక్స్ ‌లో కర్ణాటక గవర్నర్ గట్టి షాకు ఇచ్చారు. ఐదుగురు స్వతంత్రులతోపాటు 11 మంది బీజేపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటును సుప్రీం కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో యడ్యూరప్ప సర్కారును రద్దు చేసి, కర్ణాటకలో రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ హెచ్.ఆర్.భరద్వాజ్ కేంద్రానికి సిఫార్సు చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఆయన ప్రత్యేక నివేదిక పంపారు. తాము యడ్యూరప్పకు బేషరతుగా మద్దతిస్తున్నట్లు 10 మంది బీజేపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఢిల్లీలో ప్రకటించిన కొన్ని గంటలకే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. పైగా.. తనను కలవడానికి వచ్చిన సదరు ఎమ్మెల్యేలకు అపాయింట్‌మెంట్ లేదంటూ రాజ్‌భవన్‌లోకి గవర్నర్ అనుమతించకపోవడం విశేషం.మరోవైపు గవర్నర్ చర్యను తీవ్రంగా నిరసించిన బీజేపీ వెంటనే ప్రతిచర్యకు దిగింది. తన బలాన్ని నిరూపించుకునేందుకు సోమవారం రాష్ట్రపతి భవన్‌లో ఎమ్మెల్యేలతో పరేడ్ చేయించాలని నిర్ణయించింది. శాసనసభాపక్ష సమావేశం ముగిసిన వెంటనే పార్టీ ఎమ్మెల్యేలంతా ఢిల్లీకి వెళ్లి.. ప్రతిభాపాటిల్ ముందు బల ప్రదర్శన చేస్తామని బీజేపీ నేతలు తెలిపారు. గవర్నర్ తీరును నిరసిస్తూ కర్ణాటక సీఎం యడ్యూరప్ప కూడా రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రిలకు లేఖలు రాశారు. తన ప్రభుత్వానికి తగు మెజారిటీ ఉన్నందున.. రాజ్యాంగపరమైన సంక్షోభం సృష్టించే ప్రయత్నాలు చేయరాదని చెప్పారు.


Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు