Wednesday, May 11, 2011

సర్వేలకు అందని తమిళ ఓటరు నాడి...!

చెన్నై,మే 11: తమిళనాడులో గత నెల 13న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ కూటమికి ఆధిక్యత లభిస్తుందన్న అంశంలో వివిధ ఎగ్జిట్ పోల్స్ వేర్వేరు అంచనాలు ప్రకటించాయి. అన్నా డీఎంకే అధినేత జయలలితకు తమిళనాడు ప్రజలు పట్టం కట్టబోతున్నారని ఎన్నికల ముందు మీడియా సంస్థలు బాకా ఊదయి. అయితే, అన్నా డీఎంకే కూటమికి 110 స్థానాలు,   అధికార డీఎంకే కూటమికి 124 స్థానాలు వస్తాయని స్టార్ న్యూస్ అంచనా వేసింది. అయితే, మరో చానెల్ సీఎన్‌ఎన్-ఐబీఎన్ మాత్రం అన్నాడీఎంకే కూటమికే అధికారం దక్కుతుందని చెబుతోంది. అన్నా డీఎంకేకు 120నుంచి 132 స్థానాల వరకూ రావొచ్చని ఆ చానెల్ సీఎస్‌డీఎస్‌తో కలిసి నిర్వహించిన ఎగ్జిట్‌పోల్స్ చెబుతున్నాయి. డీఎంకే కూటమికి 102 నుంచి 114 వరకూ వస్తాయని ఆ సర్వే పేర్కొంది. మరోపక్క రెండు కూటములూ పోటాపోటీగా ఉన్నాయని, సీ-ఓటర్ సర్వే మాత్రం అన్నా డీఎంకే కూటమికి తిరుగులేని ఆధిక్యత లభిస్తుందని జోస్యం చెబుతోంది. ఆ కూటమికి 168 నుంచి 176 స్థానాలు వస్తాయని, డీఎంకే కూటమి 54 నుంచి 62 వరకూ మాత్రమే లభించవచ్చని తెలిపింది. తమిళనాడు అసెంబ్లీలో 234 స్థానాలున్నాయి. ప్రస్తుతం రద్దవుతున్న అసెంబ్లీలో డీఎంకే కూటమికి 163, అన్నాడీఎంకే కూటమికి 70 స్థానాలూ ఉన్నాయి.
అస్సాంలో తరుణ్ గోగోయ్ హ్యాట్రిక్!
గువాహటి: అస్సాంలో ముఖ్యమంత్రి తరుణ్ గోగోయ్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వరసగా మూడోసారి కూడా అధికారాన్ని చేపట్టే అవకాశం ఉందని వివిధ ఎగ్జిట్ పోల్ సర్వేలు వెల్లడించాయి.  126 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 41 నుంచి 47 స్థానాలు వస్తాయని హెడ్‌లైన్స్ టుడే జోస్యం చెప్పింది. ఈసారి అధికార పీఠాన్ని అందుకోవాలని కలలు కంటున్న ఏజీపీకి 31-35 మధ్య రావొచ్చని పేర్కొంది.  ఒంటరిగా బరిలోకి దిగిన బీజేపీకి 16 నుంచి 18 స్థానాలు లభించవచ్చని తెలిపింది. సీఎన్‌ఎన్-ఐబీఎన్ ఎగ్జిట్ పోల్ ప్రకారం కాంగ్రెస్‌కు 64 నుంచి 72 వస్తాయి. ఏజీపీకి 16-22 మధ్య, ఏయూడీఎఫ్‌కు 11-17 మధ్య, బీజేపీకి 7నుంచి 11 మధ్య స్థానాలు లభిస్తాయని ఆ చానెల్ తెలిపింది. సీ-ఓటర్ సర్వే ప్రకారం కాంగ్రెస్‌కు 41-45 మధ్య వస్తాయి. ఏజీపీకి 31-35 మధ్య, బీజేపీకి 14-18 మధ్య, ఏయూడీఎఫ్‌కు 11-15 వస్తాయని ఆ సర్వే అంచనా. రద్దయిన అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 53, ఏజీపీకి 24, బీజేపీకి 10, ఏయూడీఎఫ్‌కు 10 స్థానాలున్నాయి.

 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...