Friday, May 27, 2011

తెలంగాణా పై మార్పు లేని బాబు మాట

పరిష్కార బాధ్యత కాంగ్రెస్ దే...
మాకు రెండు ప్రాంతాలు ముఖ్యం... 

హైదరాబాద్,మే 27: తెలంగాణ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కాంగ్రెసు పార్టీదేనని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కాంగ్రెసు అధికారంలో ఉన్నది కాంగ్రెసు పార్టీయేనని, సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కూడా కాంగ్రెసుదేనని ఆయన అన్నారు. పార్టీ మహానాడులో శుక్రవారం చేసిన అధ్యక్షోపన్యాసంలో ఆయన తెలంగాణపై విస్తృతంగా మాట్లాడారు. కానీ కొత్త విధానాన్ని ప్రకటించలేదు. బిజెపి, కాంగ్రెసు పార్టీలు జెండా పెట్టుకుని తెలంగాణ ఉద్యమాలు చేస్తే తమ పార్టీ మాత్రం జెండా పెట్టుకుని ఆందోళన చేయవద్దని అంటున్నారని ఆయన అన్నారు. తమ పార్టీని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెసుకు గానీ ఇతర పార్టీలకు గానీ లేదని ఆయన అన్నారు. రెండు ప్రాంతాల్లో పార్టీని కాపాడుకోవడానికి తాము ప్రయత్నిస్తున్నామని, అది తమ తప్పు ఎలా అవుతుందని, సమాధానం చెప్పాలని కాంగ్రెసు పార్టీని అడుగుతున్నానని ఆయన అన్నారు.  రెండు ప్రాంతాల్లో పార్టీని కాపాడుకోవడానికి తాను ఏం చేయాలన్నా చేస్తానని ఆయన చెప్పారు.తెలుగు ప్రజలతో కాంగ్రెసు పార్టీ ఆడుకుంటోందని ఆయన అన్నారు. కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. టిడిపిని నామరూపాలు లేకుండా చేస్తామని తెరాస నాయకులు అంటున్నారని, ఆ పని తెరాస వల్ల కాదని ఆయన అన్నారు. లాలూచీ పడి తెరాసను కాంగ్రెసులో కలిపేస్తారని ఆయన అన్నారు. తెలంగాణపై రాజకీయ పార్టీలు అభిప్రాయాలు చెప్పాయని,  నిర్ణయం చేయాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని ఆయన అన్నారు. జెండా అండలో పెరిగి, ఈ పార్టీలో ఉండి పార్టీకి నాగం జనార్దన్ రెడ్డి అన్యాయం చేశారని ఆయన అన్నారు. కాంగ్రెసుకు రాజకీయాలు మాత్రమే ముఖ్యమయ్యాయని, ప్రజారాజ్యం పార్టీని కలుపుకున్నారని, తెరాసను కలుపుకుంటారని ఆయన అన్నారు.
 జగన్‌ కు  సవాల్
ప్రభుత్వాన్ని పడగొట్టడానికి దుమ్ముంటే ముందుకు రావాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను సవాల్ చేశారు. ప్రభుత్వం తన దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉందని, తన కనుసన్నల్లో ప్రభుత్వం నడుస్తోందని, తాను కన్నెర్ర చేస్తే ప్రభుత్వం కూలిపోతుందని జగన్ అన్నారని, కన్నెర్ర చేయాలని తాను జగన్‌ను అడుగుతున్నానని, ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రతిపాదించే విషయంలో తాము వెనక్కి తగ్గడం లేదని ఆయన అన్నారు. తనకు మద్దతు ఇస్తున్న శాసనసభ్యుల సంతకాలతో గవర్నర్‌కు జగన్ లేఖ సమర్పించాలని, అలా లేఖ ఇచ్చినప్పుడు గవర్నర్ బలపరీక్ష చేసుకోవాలని ముఖ్యమంత్రికి సూచిస్తారని, అటువంటి సందర్భం వచ్చినప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ శాసనసభ్యులు కచ్చితంగా ఓటేస్తారని ఆయన అన్నారు. ధైర్యం ఉంటే జగన్ తనకు మద్దతిస్తున్న శాసనసభ్యులతో గవర్నర్ వద్దకు వెళ్లాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో తామే ప్రధాన ప్రతిపక్ష పాత్ర వహిస్తున్నామని చెప్పిన వైయస్ జగన్ వ్యాఖ్యను ఆయన తప్పు పట్టారు. కాంగ్రెసు పార్టీ విషవృక్షమని, ఆ విషవృక్షం కొమ్మనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అని ఆయన అన్నారు. ఓదార్పు యాత్ర పేరుతో వైయస్ జగన్ ప్రజలను మభ్య పెడుతున్నారని ఆయన అన్నారు. కాంగ్రెసు గుండెల్లో నిద్రపోయిన ఏకైక పార్టీ తెలుగుదేశం మాత్రమేనని ఆయన అన్నారు. సామాజిక మార్పు తెస్తానని రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేసి ఏ సామాజిక మార్పు తెచ్చారో చెప్పాలని ఆయన అన్నారు. పలు పార్టీలు వచ్చాయని, అవేవి నిలబడలేకపోయాయని, తెలుగదేశం పార్టీ మాత్రమే నిలబడిందని, తెలుగుదేశం మాత్రమే నిలబడుతుందని ఆయన అన్నారు.
ఆసంతృప్తి లేదన్న హరి
తనకు ఏ విధమైన ఆసంతృప్తి లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు  చంద్రబాబు  బావమరిది, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ అన్నారు. గత కొద్ది రోజులుగా ఆయన చంద్రబాబు నాయుడి తీరు పట్ల అసంతృప్తిగా ఉన్నారని, వారసత్వపోరులో ఆయన చంద్రబాబుకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ,    చంద్రబాబు  ప్రసంగం  పూర్తయ్యే వరకు తాను మహానాడులోనే ఉన్నానని ఆయన చెప్పారు. ఇదిలా వుంటే, తెలంగాణకు చెందిన శాసనసభ్యులు రావుల చంద్రశేఖర రెడ్డి, జైపాల్ యాదవ్, జోగు రామన్న, హరీశ్వర్ రెడ్డి  మహానాడుకు హాజరు కాలేదు. హరీశ్వర్ రెడ్డి, జోగు రామన్న పార్టీ నుంచి సస్పెండ్ అయిన నాగం జనార్దన్ రెడ్డి కి మద్దతు తెలిపారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...