Tuesday, July 12, 2011

జగన్ ఆస్తులపై సిబిఐ ప్రాథమిక విచారణకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్ ,జులై 12:  వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర హైకోర్టు  షాక్ ఇచ్చింది.  జగన్ ఆస్తులపై సిబిఐ ప్రాథమిక విచారణకు ఆదేశించింది. రెండు వారాలలో తమకు సీల్డ్ కవర్‌లో ప్రాథమిక నివేదిక ఇవ్వాలని కూడా కోర్టు ఆదేశించింది. ఈ కేసులో ప్రభుత్వ శాఖలన్నీ విధిగా సిబిఐకి సమాచారం అందించాలని, ప్రతివాదులు సహకరించాలని ఆదేశించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని  జగన్ నిర్ణయించుకున్నారు. జగన్ ఆస్తులు అక్రమ ఆర్జనంటూ మంత్రి శంకరరావు రాసిన లేఖను హైకోర్టు తనంత తానుగా విచారణకు స్వీకరించింది. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎర్రంనాయుడు, యనమల రామకృష్ణుడు, బైరెడ్డి రాజశేఖర రెడ్డి, కడప జిల్లాకు చెందిన న్యాయవాది షేర్వాణీ ఇంప్లీడ్ అయ్యారు.

సిబిఐ విచారణను వ్యతిరేకించిన జగన్ తరపు న్యాయవాదులు ఈ విచారణ వల్ల సందూర్ పవర్, జగతి పబ్లికేషన్స్, భారత సిమెంట్స్ వంటి కంపెనీలపై దుష్ప్రభావం చూపే ప్రమాదం ఉందని, స్టాక్ మార్కెట్‌పై దీని ప్రభావం ఉండవచ్చునని వాదించారు. అయితే ఆ వాదనలను కోర్టు త్రోసిపుచ్చింది. పిటిషన్ వేసిన శంకరరావు మంత్రి కాబట్టి జగన్ కంపెనీలు ఏమైనా ఉల్లంఘించినట్టు భావిస్తే ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవచ్చుగాని, మంత్రి స్థాయి వ్యక్తి ఒక సాధారణ వ్యక్గిగా హై కోర్టుకు లేఖ రాశారని వారు వాదన వినిపించారు. ఆయన పిటిషన్ వేయడంతో రాజకీయ ప్రత్యర్థులు కూడా రాజకీయ దురుద్దేశంతో పిటిషన్‌లు దాఖలు చేశారని వారు వాదించారు. అయితే ఈ వాదనలను కోర్టు త్రోసిపుచ్చుతూ సిబిఐ విచారణ జరిపితే తప్పేమిటని ప్రశ్నించింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...