Friday, July 15, 2011

జగన్ పై " రగడ 'పాటి...!

విజయవాడ,జులై 15:  వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ మాటలతో విరుచుకుపడ్డారు.  హైకోర్టు ఆదేశాలపై జగన్ సాక్షి మీడియాలో ఇష్టం వచ్చినట్లు వార్తాకథనాలు రాయిస్తున్నారని, అవి కోర్టు ధిక్కారం కిందికే వస్తాయని ఆయన అన్నారు. కోర్టు ఆదేశాలను కుట్రగా వైయస్ జగన్ వర్గం, మీడియా అభివర్ణిస్తోందని, దీనిపై ఎవరైనా కోర్టు ధిక్కారం కింద ఫిర్యాదు చేయవచ్చునని ఆయన అన్నారు. జగన్ అసలు రూపం త్వరలో బయటపడుతుందని ఆయన అన్నారు.

నా చేతుల్లో మీడియా ఉంది, సర్కస్ కంపెనీ వ్యక్తులున్నారని భావించి జగన్ విర్రవీగితే సహించబోమని ఆయన అన్నారు. జగన్ వర్గం అసందర్భ ప్రేలాపనలు, నీలాపనిందలకు పాల్పడుతున్నారని, ఇదేమి న్యాయమూ ధర్మమూ అంటే తనపై విరుచుకుపడుతున్నారని ఆయన అన్నారు. చేతిలో టీవీ, పత్రిక ఉంది కదా అని ఇష్టానుసారంగా జగన్ వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. తాను తలుచుకుంటే వంద మీడియా సంస్థలను పెట్టగలనని, రాజకీయాల్లో ఉన్నవారు మీడియా రంగంలోకి వెళ్లకూడదని భావించి తాను స్థాపించలేదని ఆయన అన్నారు. తన బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డిని జగన్ వేధించాడని ఆయన ఆరోపించారు. వైయస్సార్‌కు రాముడి వెంట తమ్ముడిలా నడిచిన వివేకా చేత తనకోసం వైయస్ జగన్ పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయించారని ఆయన అన్నారు.

తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వైయస్ రాజశేఖర రెడ్డితో మాట్లాడి వైయస్ వివేకానంద రెడ్డి రాజీనామాను వెనక్కి తీసుకునేలా చేశారని ఆయన చెప్పారు. భయంతో 2004 ఎన్నికల్లో జగన్ పోటీ చేయలేదని ఆయన చెప్పారు. వైయస్సార్ పాదయాత్ర చేస్తున్నప్పుడు జగన్ ఎక్కడున్నాడని ఆయన అడిగారు. వైయస్ రాజశేఖర రెడ్డిపై గౌరవంతోనే సోనియా జగన్‌కు పార్లమెంటు సీటు ఇచ్చారని ఆయన చెప్పారు. వైయస్సార్‌పై అభిమానంతో జగన్ ముఖ్యమంత్రి కావాలని తామంతా సంతకాలు చేశామని, కాంగ్రెసు గుండెల్లో గునపాలు దించడానికి కాదని ఆయన అన్నారు. బాబాయ్‌కి మంత్రి పదవిని ఇచ్చినప్పుడు కుటుంబాన్ని చీల్చారని అంటుంటే మహానేత కుమారుడు తెలిసీతెలియక మాట్లాడుతున్నాడని అనుకున్నామని, ఇక మీదట సహించబోమని ఆయన అన్నారు.

వైయస్సార్ ఇందిరమ్మ రాజ్యం తెస్తానని చెప్పారని, వైయస్ జగన్ రాజ్యం తెస్తానని అనలేదని ఆయన అన్నారు. వైయస్ జగన్ వర్గం ఆగడాలకు తాను బెదరబోనని ఆయన చెప్పారు. తనపై జగన్ వర్గం, సాక్షి మీడియా చేసిన ఆరోపణలపై లీగల్ నోటీసు ఇస్తానని ఆయన చెప్పారు. వైయస్సార్ పెట్టేవాడైతే, జగన్ కొట్టేవాడని ఆయన అన్నారు. తెలంగాణపై ఏకాభిప్రాయం, అసెంబ్లీ తీర్మానం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...