Sunday, July 24, 2011

తెలంగాణా రాజీనామాలు బుట్టదాఖలు...

హైదరాబాద్, జులై 24:  తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐకి చెందిన వంద మంది శాసనసభ్యులు తమ పదవులకు సమర్పించిన రాజీనామాలను శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. భావోద్వేగం తో సమర్పించిన రాజీనామాలు అయినందున వాటన్నింటినీ తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ పేర్కొన్నారు. ఆయన శనివారం విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లటానికి ముందు ఈ నిర్ణయం ప్రకటించారు. ఎమ్మెల్యేలందరూ తమ రాజీనామాలను ఉద్వేగపూరిత వాతావరణంలో చేసినట్లుగా నిర్ధారణకు వచ్చినందున వీటిని ఆమోదించలేదని పేర్కొన్నారు.  ‘ఆంధ్రప్రదేశ్ శాసనసభకు చెందిన పలువురు సభ్యులు తమ పదవులకు రాజీనామాలు చేస్తూ డిప్యూటీ స్పీకర్‌కు లేఖలు సమర్పించారు. భారత రాజ్యాంగంలోని 190 (3)వ ఆర్టికల్ ప్రకారం ఏ సభ్యుడైనా రాజీనామాను సమర్పించినపుడు దానిని స్పీకర్ ఆమోదిస్తే, సదరు సభ్యుడు ప్రాతినిధ్యం వహించే స్థానం ఖాళీ అవుతుంది. అయితే అదే ఆర్టికల్‌లో సదరు సభ్యుడు రాజీనామా స్వచ్ఛందంగా చేయలేదనీ, అది సరైనది కాదనీ, స్పీకర్ తాను సంతృప్తికరమైనదనుకునే ఏ విచారణ ద్వారానైనా తెలుసుకున్నపుడు.. అలాంటి రాజీనామాను తిరస్కరించవచ్చు. శాసనసభ నియమావళిలోని 186వ నిబంధన ప్రకారం కూడా రాజీనామాలపై స్పీకర్ తాను సరైనదనుకునే ఏ రకమైన విచారణనైనా చేయించవచ్చు. అది శాసనసభ కార్యదర్శి కార్యాలయం ద్వారా కావచ్చు, లేదా ఇంకేదైనా ఏజెన్సీ ద్వారా కావచ్చు. గౌరవనీయులైన స్పీకర్ ఇటీవల సభ్యులు సమర్పించిన రాజీనామాలన్నింటినీ అన్ని కోణాల్లో నుంచి కూలంకషంగా పరిశీలించారు. ఇలా మూకుమ్మడిగా రాజీనామాలు చేయటానికి దారితీసిన పరిస్థితులపై విచారించిన తరువాత.. ఎమ్మెల్యేలు ఉద్వేగపూరిత వాతావరణంలో చేసిన రాజీనామలేనన్న అభిప్రాయానికి వచ్చారు. అందుకే వాటిని తిరస్కరించారు’ అని అసెంబ్లీ కార్యదర్శి విడుదల చేసిన  ప్రకటనలో వివరించారు. ఇలా మూకుమ్మడిగా ఎమ్మెల్యేల రాజీనామాలు తిరస్కరించటం రాష్ట్ర శాసనసభ చరిత్రలో ఇది రెండోసారి. 2009 డిసెంబర్ నెలలో ఒకసారి ఇలాగే తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు 220 మందికి పైగా మూకుమ్మడిగా రాజీనామాలు సమర్పించారు. అప్పట్లో స్పీకర్ స్థానంలో ఉన్న నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి వాటన్నింటినీ తిరస్కరించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...