Saturday, July 9, 2011

తెలంగాణ పై జగన్ కప్పదాటు

కడప,జులై 9: తెలంగాణ సెంటిమెంట్‌ను గౌరవిస్తున్నామని వైఎస్సార్ కాంగ్రె స్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఇచ్చే శక్తి గానీ, ఆపేశక్తి గానీ తమకు లేదని ఆయన చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ-ప్రజాప్రస్థానంలో మాట్లాడుతూ తెలంగాణపై తమ వైఖరి చెప్పమని ఎవరూ అడగకపోయినప్పటికీ బాధ్యత గల రాజకీయ పార్టీగా తమ అభిప్రాయం చెబుతున్నామన్నారు. తెలంగాణపై రాజకీయ నేతల విన్యాసాలను చూస్తే బాధనిపిస్తోందన్నారు. కాంగ్రెస్, టీడీపీ రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నాయని విమర్శించారు.
రాష్ట్రం రావణకాష్టంగా మారడానికి, వందల మంది చనిపోవడానికి కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. రాష్ట్రం ఏర్పాటుచేసే పూర్తి హక్కు కేంద్రానికి మాత్రమే ఉందన్నారు. తెలంగాణ సమస్యకు పరిష్కారం చూపకుండా ప్రజల జీవితాలతో కేంద్ర చెలగాటమాడుతోందని విమర్శించారు. అందరి మనోభావాలను పరిగణనలోకి తీసుకుని ఎవరి ప్రయోజనాలు దెబ్బతినకుండా పరిష్కారం చూపాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని జగన్ అభిప్రాయపడ్డారు.  
అడిగే శక్తి ఉంది కదా: కోదండరామ్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ ఇచ్చే శక్తీ తెచ్చే శక్తీ లేకపోవచ్చు గానీ అడిగే శక్తి ఉంది కదా అని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ అన్నారు. తెలంగాణ సెంటిమెంటును గౌరవిస్తామని జగన్ చేసిన ప్రకటనపై స్పందిస్తూ, తెలంగాణ ఇవ్వాలని డిమాండ్ చేసే శక్తి ఉందని, దాన్ని ఉపయోగించాలని తాము అంటున్నామని ఆయన అన్నారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...