Saturday, July 30, 2011

ఆర్థికసంక్షోభం అంచున అమెరికా...!

వాషింగ్టన్,జులై 30: అగ్రరాజ్యంగా వెలుగొందుతున్న అమెరికా అప్పుల ఊబిలో విలవిల్లాడుతోంది. అప్పులు చేయడంలో గరిష్ట పరిమితిని ఈ ఏడాది మే 16నే చేరుకున్న అమెరికా ఆర్థిక శాఖ... ఖజానాలో డబ్బులేక, పరిమితిని మించి మరిన్ని అప్పులు చేసేందుకు ఉన్న చట్టాన్ని మార్చుకోలేక నానా అగచాట్లూ పడుతోంది. సబ్‌ప్రైమ్ సంక్షోభాన్ని ఎలాగోలా దాటినా ఇప్పుడు కొత్త సంక్షోభం దానిని ఊపిరిసలుపుకోనీయడం లేదు.  ప్రస్తుతం అమెరికా గరిష్ట రుణ పరిమితి 14.3 లక్షల కోట్ల డాలర్లు. దానిని దాటి మరిన్ని అప్పులు చేయాలంటే అమెరికా చట్ట సభ కాంగ్రెస్ ఆమోద ముద్ర అవసరం. రుణ గరిష్ట పరిమితిని ఈ ఏడాది మేలోనే చేరుకున్నా ప్రస్తుతం ఖజానాలో ఉన్న డబ్బు ఆగస్టు 2వరకూ వివిధ ఖర్చులకు సరిపోతుందని అంచనా. అందుకే ఆగస్టు 2 తర్వాత సంక్షోభం ముంచుకొస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వివిధ పన్నులు, ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయం ఖర్చులకే సరిపోవడం లేదు. 40 శాతం ఖర్చులకు అప్పులపై ఆధారపడాల్సి వస్తోంది. రుణ గరిష్ట పరిమితిని పెంచుకోకపోతే 40 శాతం ఖర్చులకు డబ్బు లేనట్లే. అందులోనూ సామాజిక భద్రతా పథకాలు, ఆరోగ్య పరిరక్షణ, సైనికుల జీతాలు, రుణాలపై వడ్డీ వంటివి అస్సలు తప్పించుకోలేనివి. అవికాకుండా ఇక ఇతర ఖర్చులు తగ్గించినా లోటు పూడ్చే అవకాశం లేదని విశ్లేషకులంటున్నారు. ఆగస్టు 2 కల్లా రుణ గరిష్ట పరిమితి చట్టాన్ని సవరించితేనే క్యాపిటల్ మార్కెట్‌ల నుంచి అమెరికా మరిన్ని అప్పులు తీసుకోగలుగుతుంది. రిపబ్లికన్లు వ్యతిరేకిస్తుండడంతో ఈసారి చట్ట సవరణపై అనుమానాలు నెలకొన్నాయి. అమెరికా రుణ గరిష్ట పరిమితిని చేరుకోవడం ఇది కొత్త కాదు. ఈ చట్టాన్ని 1961 నుంచి ఇప్పటికి 74 సార్లు మార్చారు. రీగన్ అధ్యక్షుడిగా ఉండగా 18సార్లు, క్లింటన్ 8సార్లు, జూనియర్ బుష్ 7సార్లు మార్చారు. ఇక ప్రస్తుత అధ్యక్షుడు ఒబామా కూడా దీన్ని మూడేళ్లుగా పెంచుకుంటూ వస్తున్నారు. అయితే ఇక పెంపు ప్రమాదకరమని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తుండటమే ప్రస్తుత భయాలకు కారణం. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...