Sunday, July 31, 2011

రుణసంక్షోభం నుంచి అమెరికా గట్టెక్కేనా...?

వాషింగ్టన్,జులై 31: దివాళా పరిస్థితి నుంచి అమెరికాను తప్పించడానికి అధ్యక్షుడు బరాక్ ఒబామా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.  ఏకైక మార్గమైన గరిష్ట రుణపరిమితి పెంపు బిల్లును ఎగువసభ (సెనేట్)లో ఆమోదింపజేసుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరంచేశారు. సెనేట్ ముందుకు రానున్న ఆ బిల్లును అడ్డుకోవద్దంటూ విపక్ష రిపబ్లికన్ సభ్యులను బుజ్జగించే చర్యలు ప్రారంభించారు. అయితే, అప్పుల విషయంలో అమెరికా డీఫాల్ట్ కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యల విషయంలో డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య తీవ్రస్థాయిలో భేదాభిప్రాయాలు నెలకొని ఉన్నాయి. సమయం మించిపోతుండటంతో.. సెనెట్‌లో బిల్లు ఆమోదం కోసం అవసరమైన రాజీ ఫార్మూలా రూపొందించాలని ఒబామా  ఆ రెండు పార్టీలకు విజ్ఞప్తి చేశారు. అయితే, సెనేట్‌లో మెజారిటీ డెమోక్రాట్లదే కాబట్టి ఆ బిల్లు సెనెట్‌లో ఆమోదం పొందడం దాదాపు అసాధ్యం. రిపబ్లికన్లు రూపొందించిన బిల్లు వల్ల కొన్ని నెలల్లోనే మరోసారి రుణపరిమితి సంక్షోభం తలెత్తుతుందని వైట్‌హౌజ్ మీడియా కార్యదర్శి జే కేర్నీ వ్యాఖ్యానించారు. ఆ బిల్లు సెనేట్‌కు రావడమే ‘డెడ్ బిల్’ గా వచ్చిందన్నారు. ప్రస్తుత రుణపరిమితికి ఆగస్టు 2 తుదిగడువు. అందువల్ల దివాళా పరిస్థితిని తప్పించుకోవాలంటే ఆ లోపే పరిమితిని పెంచుకునేలా చట్ట సవరణ జరపాల్సి ఉంది. అలా జరగని పక్షంలో నిధుల లేమితో ప్రభుత్వ చెల్లింపులు ఆగిపోయి, అమెరికా సంక్షోభంలో కూరుకుపోతుంది. క్రెడిట్ రేటింగ్‌లు దిగజారుతాయి. అంతర్జాతీయంగా అమెరికా ప్రతిష్ట దారుణంగా పడిపోతుంది. ఆ పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు అమెరికా అధికార యంత్రాంగం తీవ్రంగా యత్నిస్తోంది.  మరో వైపు సెనేట్‌లో హ్యారీ రీడ్ నేతృత్వంలోని డెమోక్రాట్ల బృందం రుణపరిమితికి సంబంధించిన సొంత ప్రణాళిక ఆమోదం కోసం ప్రయత్నిస్తోంది.
ప్రపంచ మార్కెట్లపై ప్రభావం
అమెరికా రుణసంక్షోభం వల్ల ఏం ప్రమాదాలు ముంచుకొస్తాయోనని ప్రపంచదేశాలు కలవర  పడుతున్నాయి.   రుణ పరిమితి గరిష్ట స్థాయికి చేరుకోవడంతో ఇంకా పెంచడం ప్రమాదకరమని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు.  అయితే రుణ సమీకరణ పరిమితిని పెంచకపోతే 40శాతం ఖర్చులకు అప్పులపై ఆధారపడిన అమెరికా ఆగస్టు 2 తర్వాత దివాలా తీసినట్లు ప్రకటించాల్సి వస్తుంది. ఇప్పటికిప్పుడు ఆదాయం పెంచే మార్గం లేకపోవడంతో ఖర్చులు తగ్గించడం కోసం సామాజిక పథకాలకు కోత విధించాల్సి ఉంటుంది. ఉన్న నిధులను అత్యవసర ఖర్చులకు మాత్రమే సర్దుబాటు చేస్తారు. ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్‌కి వడ్డీ చెల్లింపులో డిఫాల్ట్ కాక తప్పని పరిస్థితి వస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల సొమ్ము అమెరికా బాండ్లలో ఉంది. అందుకే అమెరికా డిఫాల్ట్ అయితే దాని ప్రభావం అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలపైనా ఉంటుంది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...