వైయస్సార్ కాంగ్రెసు లోకృష్ణ, విజయనిర్మల , నరేష్
హైదరాబాద్: తెలుగు సూపర్ స్టార్ కృష్ణ దంపతులు వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. కృష్ణ, విజయనిర్మలతో పాటు నటుడు, రాజకీయ నేత నరేష్ కూడా వైయస్ జగన్ పార్టీలోచేరనున్నారు. వీరు ముగ్గురు మంగళవారం వైయస్ జగన్‌తో గంటకు పైగా చర్చలు జరిపారు. పార్టీలో చేరడానికి త్వరలో ముహూర్తం ఖరారవుతుందని, తాము ముగ్గురం ఒకేసారి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతామని కృష్ణ సతీమణి, ప్రముఖ సినీ దర్శకురాలు విజయనిర్మల మీడియా ప్రతినిధులతో చెప్పారు.కొత్త రక్తాన్ని, యువతను ప్రోత్సహించడానికే తాము వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతున్నట్లు ఆమె తెలిపారు. యువతను ప్రోత్సహించాలనేది పెద్దలుగా తమ బాధ్యత అని ఆమె అన్నారు. మానసికంగా తాము వైయస్ జగన్మోహన్ రెడ్డితో ఉన్నామని ఆమె అన్నారు. తాను, కృష్ణ క్రియాశీలకంగా ఉండబోమని, నరేష్ మాత్రం క్రియాశీలకంగా రాజకీయాల్లో వ్యవహరిస్తారని ఆమె అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత కాంగ్రెసు పార్టీ పరిస్థితి ఏమిటో తేలిపోయిందని నరేష్ అన్నారు. గతంలో కృష్ణ పార్లమెంటు సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు. నరేష్ బిజెపిలో కొంత కాలం పనిచేశారు.

Comments