Sunday, July 31, 2011

గోబీ ఎడారిని విజయవంతంగా దాటిన పుణె మహిళ


న్యూఢిల్లీ,జులై 31:  సాహసానికి మారుపేరైన భారతనారి మరో అరుదైన ఖ్యాతిని సొంతం చేసుకుంది. నిప్పులు చెరిగే ఎండ,  వెన్ను  వణికించే చలి, ఇసుక తుపాన్లతో నిండిన   ఆసియాలో అతిపెద్దదైన గోబీ ఎడారిని పుణెకు చెందిన సుచేతా కడేత్కర్ (33) విజయవంతంగా దాటారు. 1,623 కిలోమీటర్ల దూరాన్ని నిర్ణీత 60 రోజులకంటే ముందుగానే.. 51 రోజుల్లో (జూలై 15న) దిగ్విజయంగా పూర్తిచేసుకుని సుచేత బృందం రికార్డు సృష్టించింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా ఆమె రికార్డు పుటల్లోకి ఎక్కారు. రిప్లే డెవన్‌పోర్ట్ నేతృత్వంలోని 13 మంది బృందం గోబీ సాహసయాత్రకు మే 25న శ్రీకారం చుట్టింది. ఇందులో సుచేత కూడా సభ్యురాలు. ఆరోగ్య సమస్యలు, గాయాల బారినపడడంతో బృందంలోని ఆరుగురు సభ్యులు యాత్ర మధ్యలోనే వైదొలిగారు. గోబీ యాత్రను విజయవంతంగా పూర్తిచేసుకుని పుణేకు వచ్చిన సుచేత శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘గోబీ ఎడారి యాత్ర అత్యంత సాహసంతో కూడుకున్నది. మే 25న మంగోలియాలోని కొంగోరీన్ ఉత్తర ప్రాంతం నుంచి మా యాత్రను ప్రారంభించాం. రోజుకు సగటున 25 నుంచి 32 కిలోమీటర్ల దూరం నడిచాం. ఉదయం భరించలేని ఎండ, రాత్రిపూట భీకర చలిగాలులు, ఇక ఇసుక తుపాన్ల సంగతి సరేసరి. యాత్రలో ఎన్నో అడ్డంకులు. మధ్యలో అనారోగ్యానికి గురైనా త్వరలోనే తేరుకున్నా’’ అని యాత్రానుభవాల్ని ఆమె వివరించారు. గోబీ సాహసయాత్రకు ముందే ప్రతి రోజు తన ఇంటినుంచి ఆఫీసుకు సుమారు 24 కిలోమీటర్ల మేర నడిచి వెళ్లేదాన్నని తెలిపారు. ఆ విధంగా నడకను అలవర్చుకున్నానని వెల్లడించారు. ఐర్లాండ్‌కు చెందిన రిప్లే డెవన్‌పోర్ట్ వద్ద ప్రత్యేకంగా శిక్షణ పొందినట్లు చెప్పారు. భూటాన్ నుంచి పాకిస్థాన్ వరకు విస్తరించి ఉన్న హిమాలయాలను దాటడమే తన తదుపరి లక్ష్యమని ఆమె చెప్పారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...