పార్టీలదే భారం : చిదంబరం

న్యూఢిల్లీ,జులై 27:  తెలంగాణ అంశంపై కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం మరోసారి నోరు విప్పారు. ఏకాభిప్రాయంతోనే తెలంగాణ సమస్య పరిష్కారం సాధ్యమంటూ  పాడిన పాటనే మరోసారి పాడారు. ఏకాభిప్రాయంతోనే తెలంగాణ సాధ్యమవుతుందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. పార్టీలో ఏకాభిప్రాయ సాధన కోసం కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ పార్టీ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులతో చర్చలు జరుపుతున్నారని, ఇదే విధమైన అంతర్గత చర్చలు తెలుగుదేశం పార్టీలో కూడా జరగాలని ఆయన అన్నారు. పార్టీలు అంతర్గత చర్చలు ద్వారా వారి వారి పార్టీలలో ఏకాభిప్రాయ సాధన కోసం ప్రయత్నించాలని ఆయన సూచించారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పార్టీలపై, ప్రజలపై బలవంతంగా రుద్దలేమంటూ ఆయన చేతులెత్తేశారు. సమస్య పరిష్కారం ఎవరికి వారు అసాధ్యమంటే లాభం లేదని ఆయన అన్నారు. సమస్య పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్‌లోని పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. తెలంగాణ అంశంపై కాంగ్రెసు, తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం నిలువునా చీలిపోయాయని ఆయన అన్నారు. బిజెపి మాత్రమే తెలంగాణపై ఒకే మాటపై ఉందని ఆయన చెప్పారు.  తెలంగాణ ప్రక్రియ మొదలు పెడతామంటూ 2009 డిసెంబర్ 9న తాను చేసిన ప్రకటనపై వెనక్కు వెళ్లానన్న విమర్శలను చిదంబరం ఖండించారు. ‘‘ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయాన్ని హోం మంత్రిగా నేను ప్రకటించానంతే. కానీ దానివల్ల రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో నిరసనలు చెలరేగడంతో విషయాన్ని ప్రభుత్వం పునఃసమీక్షించి తన వైఖరిని మార్చుకుంది. ఆ మేరకు డిసెంబర్ 23న నేను రెండో ప్రకటన చేశాను. నేను ప్రభుత్వం తరఫున మాత్రమే మాట్లాడాను. హోం మంత్రి ఏకపక్షంగా అలాంటి నిర్ణయాలు ప్రకటించి, వెనక్కు తీసుకోగలరని ఎవరైనా అనుకుంటే అది వారి అమాయకత్వమే’’ అన్నారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు