Thursday, April 21, 2011

ప్రేమోన్మాదానికి ఉపాధ్యాయిని బలి

విశాఖపట్నం,ఏప్రిల్ 21:  ప్రేమోన్మాదానికి మరో యువతి బలైంది. విశాఖ జిల్లా అరకులోయ సమీపంలోని డుంబ్రిగూడ మండలం కొర్ర గ్రామానికి చెందిన గిరిజన ఉపాధ్యాయిని లొక్కోయి సుందరమ్మ (29) ఆర్.డుంబ్రిగూడలోని ప్రభుత్వ ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాల (జీపీఎస్) లో పని చేస్తున్నారు. అవివాహిత అయిన ఆమె ఉద్యోగరీత్యా అరకులోయలోని పోస్టల్ క్వార్టర్స్ లో ఉంటున్నారు. ఎప్పటిలాగే బుధవారం ఉదయం ఆమె పాఠశాలకు వెళ్లారు. ప్రేమిస్తున్నానంటూ గతంలో ఆమె వెంటపడి, తిరస్కరణకు గురైన అదే గ్రామానికి చెందిన తాంగుల సుబ్బారావు( 32) మధ్యాహ్నం 12 గంటల సమయంలో పాఠశాలకు చేరుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని సుందరమ్మను కోరాడు. అందుకు ఆమె తిరస్కరించి, తక్షణమే వెళ్లిపోవాలని హెచ్చరించారు. ముందుగానే పథకం ప్రకారం కత్తి పట్టుకుని పాఠశాలకు వచ్చిన సుబ్బారావు.. ఒక్కసారిగా ఉన్మాదిగా మారాడు. కత్తితో ఆమెపై దాడి చేసి, అనంతరం గొంతు కోయడంతో సుందరమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోరాన్ని కళ్లారా చూసిన పాఠశాల మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకురాలు కిల్లో మోనిమ అతడ్ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. ఆమెను కూడా చంపుతానని బెదిరించాడు. దీంతో మోనిమ కేకలు వేయడంతో సమీపంలోని గిరిజనులు పరుగున అక్కడకు చేరుకున్నారు. వారిని చూసిన హంతకుడు అక్కడి నుంచి పారిపోయి అరకులోయ పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. సుందరమ్మను సుబ్బారావు చాలా కాలంగా వేధిస్తున్నాడు. 2004లో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్టు చేసి సెంట్రల్ జైలుకు కూడా పంపారు. అక్కడ సత్ప్రవర్తనకు ఉత్తమ ఖైదీగా గుర్తింపు పొంది విడుదలయ్యాడు. గ్రామానికి వచ్చిన తర్వాత ఆమెను మళ్లీ వేధించడం మొదలెట్టాడు. చివరికి ఇంత ఘాతుకానికి తెగబడ్డాడు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...